
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంకులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) సుమారు అయిదు శాతం వాటాలు దక్కించుకుంది. ఇందుకోసం రూ. 916 కోట్లు వెచ్చింది. దీంతో ఫెడరల్ బ్యాంక్‌లో ఐఎఫ్‌సీ కీలక వాటాదారుగా మారింది. షేరు ఒక్కింటికి రూ. 87.39 రేటు చొప్పున ఐఎఫ్‌సీ, ఐఎఫ్‌సీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గ్రోత్ ఫండ్, ఎల్‌పీ (ఎఫ్‌ఐజీ), ఐఎఫ్‌సీ ఎమర్జింగ్ ఏషియా ఫండ్, ఎల్‌పీ (ఈఏఎఫ్)లకు 10.48 కోట్ల షేర్లను (4.99 శాతం వాటా) కేటాయించే ప్రతిపాదనకు ఫెడరల్ బ్యాంక్ బోర్డు గత నెలలో ఆమోదముద్ర వేసింది.
తాజాగా సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టులతో (ఈఎస్‌జీ) పాటు ఇతరత్రా కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. గ్రీన్‌హౌస్ గ్యాస్ (జీహెచ్‌జీ) ఉద్గారాలకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం 2030 నాటికి జీహెచ్‌జీ ఉద్గారాలను తగ్గించుకోవడానికి భారత్‌కు గణనీయంగా పెట్టుబడులు అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి పర్యావరణ అనుకూల పెట్టుబడులకు సంబంధించి భారత్‌లో 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు ఉన్నాయని ఐఎఫ్‌సీ అంచనా వేస్తోంది.