ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ సరికొత్త డిజిటల్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చింది. ‘స్మైల్ పే’ అనే ఫేషియల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు కేవలం కెమెరాను చూసి నవ్వుతూ చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవతో డబ్బు లావాదేవీల కోసం మీకు నగదు, కార్డ్ లేదా మొబైల్ అవసరం ఉండదు. రిలయన్స్ రిటైల్, అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ద్వారా కొన్ని ఎంపిక చేసిన శాఖలలో దీని వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది.
పైలట్ ప్రాజెక్టు
ప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ చెల్లింపు వ్యవస్థ 'భీమ్ ఆధార్ పే'పై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్మించిన అప్‌గ్రేడెడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇది ఉపయోగించుకుంటుంది. యూజర్లు తమ ఫేస్‌ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీంతో కార్డు లేదా మొబైల్ లేకుండా కూడా వ్యాపారులకు చెల్లింపులు చేయగలరు. మొత్తం లావాదేవీ ప్రక్రియ రెండు దశల్లో పూర్తవుతుంది.
స్మైల్‌పే ఫీచర్లు
స్మైల్‌పే ద్వారా నగదు, కార్డ్ లేదా ఫోన్‌ని తీసుకెళ్లకుండానే మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు. దీనితో పాటు, ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కౌంటర్ వద్ద రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. సురక్షితమైన ఆధార్ ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ ఆధారంగా చేసే లావాదేవీలతో భద్రత చింత ఉండదు. స్మైల్‌పే ఫీచర్ ఫెడరల్ బ్యాంక్ కస్టమర్‌లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. దీని కోసం వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ ఆ బ్యాంకులో ఖాతాలను కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరింత విస్తరించాలని ఫెడరల్ బ్యాంక్ యోచిస్తోంది.
ఎలా పనిచేస్తుందంటే..
స్మైల్‌పేను వినియోగించాంటే మొబైల్‌లో ఫెడ్ మర్చెంట్ (FED MERCHANT) అనే యాప్ ఉండాలి.ఫెడరల్ బ్యాంక్‌తో అనుసంధానమైన దుకాణాల్లో షాపింగ్ చేసి బిల్లు చెల్లింపు సమయంలో స్మైల్ పే ఎంచుకోవాలి. తర్వాత దుకాణదారు.. కస్టమర్ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి యాప్ ద్వారా చెల్లింపును ప్రారంభిస్తారు. దుకాణదారు మొబైల్ కెమెరా కస్టమర్ ఫేస్‌ను స్కాన్ చేస్తుంది. ఆధార్ సిస్టమ్ ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ డేటాతో సరిపోల్చుకుని చెల్లింపు పూర్తవుతుంది. కస్టమర్ ఖాతా నుండి డబ్బు దుకాణదారుడి ఖాతాలో జమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment