green houses
-
అలాంటి ఇళ్లు కొనేవారికి ఎస్బీఐ ఆఫర్.. తక్కువ వడ్డీ రేటుకు లోన్
సాక్షి, సిటీబ్యూరో: హరిత భవనాలను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒకడుగు ముందుకేసింది. సాధారణ గృహ రుణ గ్రహీతలతో పోలిస్తే హరిత గృహ కొనుగోలుదారులు 5 బేసిస్ పాయింట్ల తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందుకోవచ్చని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ జీఎం, బ్రాంచ్ హెడ్ రాజేష్ కుమార్ తెలిపారు. అంటే ప్రస్తుతం ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేటు 8.50 శాతంగా ఉండగా.. హరిత గృహ రుణాలకు వడ్డీ రేటు 0.05 శాతం తక్కువగా ఉంటుందన్నమాట. అంటే వడ్డీ రేటు 8.45 శాతంగా పడుతుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ ప్రాపర్టీ షోను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 527 ప్రాజెక్ట్ డెవలపర్లతో ఎస్బీఐ గృహ రుణ ఒప్పందం చేసుకుందని.. ఇందులో 75 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ ధ్రువీకరణ పొందిన ప్రాజెక్ట్లేనని తెలిపారు. అపర్ణా, రాజపుష్ప, మైహోం, గిరిధారి, వాసవి, పౌలోమి, ప్రణవ వంటి నిర్మాణ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్ దేశవ్యాప్తంగా ఎస్బీఐ పోర్ట్‌ఫోలియో రూ.6.5 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో హైదరాబాద్ వాటా రూ.55 వేల కోట్లని చెప్పారు. 2022–23 ఆర్ధిక సంవత్సరంలో నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున రూ.12 వేల కోట్ల గృహ రుణాలు అందించామని.. ప్రస్తుతం నెలకు రూ.1,500 కోట్ల రుణాల చొప్పున రూ.16–18 వేల కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. -
ఫెడరల్ బ్యాంక్‌లో ఐఎఫ్‌సీకి 5 శాతం వాటాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంకులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) సుమారు అయిదు శాతం వాటాలు దక్కించుకుంది. ఇందుకోసం రూ. 916 కోట్లు వెచ్చింది. దీంతో ఫెడరల్ బ్యాంక్‌లో ఐఎఫ్‌సీ కీలక వాటాదారుగా మారింది. షేరు ఒక్కింటికి రూ. 87.39 రేటు చొప్పున ఐఎఫ్‌సీ, ఐఎఫ్‌సీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రోత్ ఫండ్, ఎల్పీ (ఎఫ్ఐజీ), ఐఎఫ్‌సీ ఎమర్జింగ్ ఏషియా ఫండ్, ఎల్పీ (ఈఏఎఫ్)లకు 10.48 కోట్ల షేర్లను (4.99 శాతం వాటా) కేటాయించే ప్రతిపాదనకు ఫెడరల్ బ్యాంక్ బోర్డు గత నెలలో ఆమోదముద్ర వేసింది. తాజాగా సమీకరించిన నిధులను పర్యావరణ అనుకూల ప్రాజెక్టులతో (ఈఎస్జీ) పాటు ఇతరత్రా కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు బ్యాంక్ తెలిపింది. గ్రీన్హౌస్ గ్యాస్ (జీహెచ్జీ) ఉద్గారాలకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్ మూడో స్థానంలో ఉంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం 2030 నాటికి జీహెచ్జీ ఉద్గారాలను తగ్గించుకోవడానికి భారత్‌కు గణనీయంగా పెట్టుబడులు అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2030 నాటికి పర్యావరణ అనుకూల పెట్టుబడులకు సంబంధించి భారత్‌లో 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు ఉన్నాయని ఐఎఫ్‌సీ అంచనా వేస్తోంది. -
పచ్చని ప్రపంచం
నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. పల్లెలు బోసిపోతున్నాయి. ఇదీ నయాట్రెండ్. ఇకపై కూడా ఇంతే. ఎక్కడుంటే ఏముందిలే... బాగుంటే చాలు అనుకుందామా అంటే అదీ వీలుకాదు. ఎందుకంటే కాంక్రీట్ జనారణ్యాలను కాలుష్యం కాటేస్తోంది. ఇంతేనా? పరిస్థితి మారనే మారదా? మళ్లీ పచ్చదనం విరియదా? గుండెల నిండా నిండైన గాలిని పీల్చుకోలేమా? అసాధ్యం కాదుగానీ.. కొంచెం కష్టసాధ్యమన్నది మాత్రం నిజం. ఈ ఆశకు సాక్ష్యాలు ఇక్కడి ఫొటోలే. రేపటి నగరాలు ఎలా ఉండాలన్న ప్రశ్నకు ఆర్కిటెక్టులు కొందరు ఇస్తున్న నిర్వచనం ఇది. ఒకటేమో సముద్రపు అడుగున మహా నగరాన్ని కట్టేయాలని సంకల్పిస్తూంటే.. ఇంకోటి.. ఉన్న కాంక్రీట్ భవనాలను పచ్చగా మార్చేయడంతోపాటు గాలి, నీరు, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడనవసరం లేని ఇళ్లను డిజైన్ చేసే పనిలో ఉంది. జపనీస్ సంస్థ షిమిజు... దాదాపు అరకిలోమీటరు సైజున్న గోళాన్ని సముద్రంలో పెట్టేసి.. దాని అడుగున.. 15 కిలోమీటర్ల పొడవైన ఇంకో స్ప్రింగ్ లాంటి నిర్మాణాన్ని కట్టేద్దామని ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం కనీసం లక్షా 50 వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుందని అంచనా కడుతోంది షిమిజు. పైనున్న గోళంలో ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు ఉంటే.. స్ప్రింగ్ లాంటి నిర్మాణం ద్వారా సముద్రపు అడుగు భాగం, గర్భం నుంచి అన్ని అవసరాలను తీర్చుకోవాలని ఆలోచన చేస్తోంది. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేసుకుని తాగునీటి అవసరాలు... నీటి ఉష్ణోగ్రతల్లోని తేడాలతో విద్యుత్తు.. చేపలు, సముద్రపు మొక్కల పెంపకంతో ఆహార అవసరాలు తీర్చుకోవచ్చునని సూచిస్తోంది. ఇక ‘ఒయాసిస్’ సంగతేమిటో చూద్దాం. కాంక్రీట్ భవనాలన్నింటిపై పచ్చటి మొక్కలు పెరుగుతూంటే... అవి గాల్లోని విషవాయువులను తొలగిస్తూ... లోపల ఉన్నవారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తే... ఎలా ఉంటుంది? నెదర్లాండ్స్ సంస్థ ఒయాసిస్ ఆలోచన అచ్చంగా ఇదే. ఈ సంస్థ ఇప్పటికే ఈ దిశగా కొన్ని అడుగులేసింది కూడా. కెనడాలోని ఒంటారియాలో దాదాపు రెండు వేల ఎకరాల అడవిలో ఈ సంస్థ 300 పచ్చటి భవనాలతో కూడిన రిసార్ట్‌ను నిర్మిస్తోంది. మరిన్ని కట్టేందుకు సిద్ధమవుతోంది కూడా! - సాక్షి నాలెడ్జ్ సెంటర్