పచ్చని ప్రపంచం
నగరాలు కిక్కిరిసిపోతున్నాయి. పల్లెలు బోసిపోతున్నాయి. ఇదీ నయాట్రెండ్. ఇకపై కూడా ఇంతే. ఎక్కడుంటే ఏముందిలే... బాగుంటే చాలు అనుకుందామా అంటే అదీ వీలుకాదు. ఎందుకంటే కాంక్రీట్ జనారణ్యాలను కాలుష్యం కాటేస్తోంది. ఇంతేనా? పరిస్థితి మారనే మారదా? మళ్లీ పచ్చదనం విరియదా? గుండెల నిండా నిండైన గాలిని పీల్చుకోలేమా? అసాధ్యం కాదుగానీ.. కొంచెం కష్టసాధ్యమన్నది మాత్రం నిజం. ఈ ఆశకు సాక్ష్యాలు ఇక్కడి ఫొటోలే. రేపటి నగరాలు ఎలా ఉండాలన్న ప్రశ్నకు ఆర్కిటెక్టులు కొందరు ఇస్తున్న నిర్వచనం ఇది. ఒకటేమో సముద్రపు అడుగున మహా నగరాన్ని కట్టేయాలని సంకల్పిస్తూంటే.. ఇంకోటి.. ఉన్న కాంక్రీట్ భవనాలను పచ్చగా మార్చేయడంతోపాటు గాలి, నీరు, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడనవసరం లేని ఇళ్లను డిజైన్ చేసే పనిలో ఉంది.
జపనీస్ సంస్థ షిమిజు... దాదాపు అరకిలోమీటరు సైజున్న గోళాన్ని సముద్రంలో పెట్టేసి.. దాని అడుగున.. 15 కిలోమీటర్ల పొడవైన ఇంకో స్ప్రింగ్ లాంటి నిర్మాణాన్ని కట్టేద్దామని ప్రతిపాదిస్తోంది. ఇందుకోసం కనీసం లక్షా 50 వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుందని అంచనా కడుతోంది షిమిజు. పైనున్న గోళంలో ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు ఉంటే.. స్ప్రింగ్ లాంటి నిర్మాణం ద్వారా సముద్రపు అడుగు భాగం, గర్భం నుంచి అన్ని అవసరాలను తీర్చుకోవాలని ఆలోచన చేస్తోంది. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేసుకుని తాగునీటి అవసరాలు... నీటి ఉష్ణోగ్రతల్లోని తేడాలతో విద్యుత్తు.. చేపలు, సముద్రపు మొక్కల పెంపకంతో ఆహార అవసరాలు తీర్చుకోవచ్చునని సూచిస్తోంది.
ఇక ‘ఒయాసిస్’ సంగతేమిటో చూద్దాం. కాంక్రీట్ భవనాలన్నింటిపై పచ్చటి మొక్కలు పెరుగుతూంటే... అవి గాల్లోని విషవాయువులను తొలగిస్తూ... లోపల ఉన్నవారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తే... ఎలా ఉంటుంది? నెదర్లాండ్స్ సంస్థ ఒయాసిస్ ఆలోచన అచ్చంగా ఇదే. ఈ సంస్థ ఇప్పటికే ఈ దిశగా కొన్ని అడుగులేసింది కూడా. కెనడాలోని ఒంటారియాలో దాదాపు రెండు వేల ఎకరాల అడవిలో ఈ సంస్థ 300 పచ్చటి భవనాలతో కూడిన రిసార్ట్‌ను నిర్మిస్తోంది. మరిన్ని కట్టేందుకు సిద్ధమవుతోంది కూడా!
- సాక్షి నాలెడ్జ్ సెంటర్