క్యూ4లో రూ. 906 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 906 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 903 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెన్షన్ ప్రొవిజన్లు కారణమయ్యాయి. నికర వడ్డీ ఆదాయం 15 శాతం ఎగసి రూ. 2,195 కోట్లను తాకింది.
20 శాతం రుణ వృద్ధి ఇందుకు సహకరించగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.36 శాతం నుంచి 3.21 శాతానికి నీరసించాయి. పెన్షన్లకు రూ. 162 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. ఇక పూర్తి ఏడాదికి బ్యాంక్ రూ. 3,720 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2022–23లో రూ. 3,010 కోట్లు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది(2024–25) 18 శాతం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా స్లిప్పేజీలు రూ. 436 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు 2.13 శాతానికి చేరగా.. కనీస మూలధన నిష్పత్తి 16.13 శాతంగా నమోదైంది. ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ సెప్టెంబర్‌లో బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అభ్యర్ధుల జాబితాలను కొద్ది వారాలలో సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫెడరల్ బ్యాంక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.2 శాతం బలపడి రూ. 168 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment