న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14 శాతంపైగా వృద్ధితో రూ. 4,566 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 34 శాతం జంప్‌చేసి రూ. 3,496 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ. 8,573 కోట్ల నుంచి రూ. 10,939 కోట్లకు ఎగసింది.
కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం బలపడి రూ. 6,103 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.75 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం 30 శాతం పుంజుకుని రూ. 2,186 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.34 శాతం నుంచి 1.78 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 21.80 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో అనుబంధ సంస్థలలో కొటక్ ప్రైమ్ నికర లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు వెనకడుగు వేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. అకౌంటింగ్ విధానాలలో మార్పు ఇందుకు కారణమైనట్లు పేర్కొంది. ఆటుపోట్ల మార్కెట్ కారణంగా క్యాపిటల్ మార్కెట్ ఆధారిత అనుబంధ సంస్థ అసెట్ మేనేజ్‌మెంట్ లాభం మాత్రం రూ. 192 కోట్లకు మెరుగుపడినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment