Q4 results
-
అనిల్ అంబానీకి మరో దెబ్బ.. రూ.397 కోట్లు నష్టం
నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీకి మరో దెబ్బ తగిలింది. తన నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్ మార్చి త్రైమాసికంలో రూ.397.66 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.321.79 కోట్ల లాభాన్ని ఆర్జించిన కంపెనీ ఇప్పుడు దానిని మించి నష్టాన్ని చవిచూసింది.ఇంధన వ్యయాలు పెరగడం వల్లే ఈ నష్టం వాటిల్లినట్లు కంపెనీ తెలిపింది. నష్టాలు ఉన్నప్పటికీ కంపెనీ మొత్తం ఆదాయం రూ.2,193.85 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది రూ.1,853.32 కోట్లతో పోలిస్తే ఇది అధికం. అయితే ఈ త్రైమాసికంలో వినియోగించిన ఇంధన వ్యయం రూ.953.67 కోట్లకు పెరిగింది. 2022-23 జనవరి-మార్చి కాలంలో ఇది రూ.823.47 కోట్లు.పూర్తి ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే రిలయన్స్ పవర్ నష్టాలు గణనీయంగా ఎగిసి రూ.470.77 కోట్ల నుంచి రూ.2,068.38 కోట్లకు పెరిగాయి. ఇక క్యూ4లో రిలయన్స్ పవర్ దాదాపు 6,000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. కాగా సెబీ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా విదేశీ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్లు (ఎఫ్‌సీసీబీలు), సెక్యూరిటీల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. -
పేటీఎంకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ క్యూ4లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 168 కోట్ల నుంచి రూ. 550 కోట్లకు చేరింది. పేటీఎం బ్రాండ్ కంపెనీ మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లకు పరిమితమైంది. యూపీఐ లావాదేవీలు తదితరాలలో తాత్కాలిక అవరోధాలు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్(పీపీబీఎల్)కు శాశ్వత అంతరాయం కారణంగా పనితీరు దెబ్బతిన్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంక్ భవిష్యత్ బిజినెస్‌పై అనిశ్చితి కొనసాగనున్న నేపథ్యంలో పీపీబీఎల్‌లో 39 శాతం వాటాకుగాను క్యూ4లో రూ. 227 కోట్ల పెట్టుబడులను రద్దు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక మొత్తం ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 2,267 కోట్లను తాకినట్లు తెలియజేశారు. 2022–23లో రూ. 2,465 కోట్ల టర్నోవర్ సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక గతేడాది నికర నష్టం రూ. 1,422 కోట్లకు చేరగా.. 2022–23లో రూ. 1,777 కోట్ల నష్టం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో పేటీఎం షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 369 వద్ద ముగిసింది. -
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 906 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 903 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెన్షన్ ప్రొవిజన్లు కారణమయ్యాయి. నికర వడ్డీ ఆదాయం 15 శాతం ఎగసి రూ. 2,195 కోట్లను తాకింది. 20 శాతం రుణ వృద్ధి ఇందుకు సహకరించగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.36 శాతం నుంచి 3.21 శాతానికి నీరసించాయి. పెన్షన్లకు రూ. 162 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. ఇక పూర్తి ఏడాదికి బ్యాంక్ రూ. 3,720 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2022–23లో రూ. 3,010 కోట్లు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది(2024–25) 18 శాతం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా స్లిప్పేజీలు రూ. 436 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు 2.13 శాతానికి చేరగా.. కనీస మూలధన నిష్పత్తి 16.13 శాతంగా నమోదైంది. ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ సెప్టెంబర్‌లో బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అభ్యర్ధుల జాబితాలను కొద్ది వారాలలో సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం బలపడి రూ. 168 వద్ద ముగిసింది. -
భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. 23 ఏళ్లలో ఇదే మొదటిసారి!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 25,994 మంది ఉద్యోగులను తొలగించింది. 2001 తరువాత కంపెనీ ఒక సంవత్సర కాలంలో ఇంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. సుమారు 23 సంవత్సరాలలో కంపెనీ ఇంత మంది ఉద్యోగులను ఎప్పుడూ తొలగించలేదని తెలుస్తోంది.ప్రస్తుతం కంపెనీలో 3,17,240 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈ సంఖ్య 7 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే జనవరి నుంచి మార్చి వరకు కంపెనీ కేవలం 5,423 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది వరుసగా ఐదవ త్రైమాసికంలో కంపెనీ లాభాల తగ్గుదల వల్ల జరిగినట్లు తెలుస్తోంది. గత పన్నెండు నెలల ప్రాతిపదికన Q4 అట్రిషన్ రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి తగ్గిందని స్పష్టమవుతోంది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా గత వారం దాని Q4 ఫలితాలను వెల్లడించింది. ఇందులో కూడా ఉద్యోగుల సంఖ్య 13,249 మంది తగ్గినట్లు తెలిసింది. 2004 తరువాత ఇంతమంది తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జనవరి-మార్చి త్రైమాసికం నాటికి కంపెనీ 1,759 మంది ఉద్యోగులను తగ్గించింది.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!కరోనా మహమ్మారి దేశంలో అధిక సంఖ్యలో ప్రబలిన తరువాత ఐటీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఎంతోమంది ఉద్యోగులు తమ ఉద్యోగులను కోల్పోవాల్సి వచ్చింది. ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించడం మాత్రమే కాకుండా.. కొత్త వారిని చేర్చుకోవడానికి కూడా సంస్థలు వెనుకడుగు వేసాయి.ఇక ఇన్ఫోసిస్ కంపెనీ క్యూ4 ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించినట్లు తెలుస్తోంది. కంపెనీ లాభాలు అంతకు ముందు త్రైమాసికం కంటే 30 శాతం వృద్ధి చెంది రూ. 7969 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. -
అదానీ పోర్ట్స్ లాభం ఫ్లాట్.. 30 శాతం పెరిగిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్) గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,141 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,112 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం మరింత అధికంగా 30 శాతం వృద్ధితో రూ. 6,179 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 4,739 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,497 కోట్ల నుంచి రూ. 3,994 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదికి సైతం మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఏపీసెజ్ దాదాపు 9 శాతం అధికంగా రూ. 5,393 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2021–22లో రూ. 4,953 కోట్ల లాభం నమోదైంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 734 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్మిషన్ లాభం జూమ్ అదానీ ట్రాన్స్మిషన్ చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 85 శాతం దూసుకెళ్లి రూ. 440 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 237 కోట్లు ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 3,165 కోట్ల నుంచి రూ. 3,495 కోట్లకు ఎగసింది. నికర లాభాల్లో ట్రాన్స్మిషన్ విభాగం నుంచి 11 శాతం వృద్ధితో రూ. 221 కోట్లు లభించగా.. పంపిణీ విభాగం వాటా 478 శాతం జంప్‌చేసి రూ. 218 కోట్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అదానీ ట్రాన్స్మిషన్ నికర లాభం రూ. 1,281 కోట్లకు స్వల్పంగా బలపడింది. 2021–22లో రూ. 1,236 కోట్ల లాభం ప్రకటించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 11,861 కోట్ల నుంచి రూ. 13,840 కోట్లకు జంప్ చేసింది. ఫలితాల నేపథ్యంలో అదానీ ట్రాన్స్మిషన్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం పతనమై రూ. 810 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి టొరెంట్ పవర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టొరెంట్ పవర్ 2022–23 చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 484 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 487 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం సైతం భారీగా ఎగసి రూ. 6,134 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,165 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో కేవలం రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,493 కోట్ల నుంచి రూ. 26,076 కోట్లకు ఎగసింది. ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. టొరెంట్ పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 556 వద్ద ముగిసింది. -
మహీంద్రా సూపర్.. రూ. 2,637 కోట్ల లాభం
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,637 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021–22) క్యూ4లో నమోదైన రూ. 2,237 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. ఆదాయం రూ. 25,934 కోట్ల నుంచి రూ. 32,366 కోట్లకు చేరింది. ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 6,577 కోట్ల నుంచి 56 శాతం ఎగిసి రికార్డు స్థాయిలో రూ. 10,282 కోట్లకు చేరిందని సంస్థ తెలిపింది. ఆదాయం రూ. 90,171 కోట్ల నుంచి 34 శాతం పెరిగి రూ. 1,21,269 కోట్లకు చేరింది. రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 16.25 (325 శాతం) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. ఫలితాల నేపథ్యంలో మహీంద్రా షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,282 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: ఎఫ్డీ రేట్ల పెంపు.. అత్యధికంగా 7.65 శాతం వడ్డీ -
భారీ నష్టాల్లో స్పార్క్ - ఏకంగా..
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ సంస్థ సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్(స్పార్క్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం పెరిగి రూ. 82 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 71 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 25 కోట్ల నుంచి రూ. 48 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 97 కోట్ల నుంచి రూ. 140 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ రూ. 223 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2021–22లో రూ. 203 కోట్ల నష్టం నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ. 137 కోట్ల నుంచి రూ. 239 కోట్లకు జంప్ చేసింది. -
ఫెడరల్ బ్యాంక్ లాభం హైజంప్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 954 కోట్ల నికర లాభం ఆర్జించింది. 62 శాతం ఎగసింది. ఇది ఒక త్రైమాసికానికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధికం కాగా.. ఇందుకు పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదపడినట్లు బ్యాంక్ పేర్కొంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 61 శాతం ఎగసి రూ. 3,165 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021–22) రూ. 1,970 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 25 శాతం పుంజుకుని రూ. 1,909 కోట్లను అధిగమించింది. ఇతర ఆదాయం 58 శాతం ఎగసి రూ. 734 కోట్లను తాకింది. దీంతో రికార్డ్ లాభం ఆర్జించినట్లు బ్యాంక్ వెల్లడించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి. -
అదానీ ఎంటర్ప్రైజెస్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 722 కోట్లను దాటింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 304 కోట్లు ఆర్జించింది. ప్రధానంగా విమానాశ్రయాలు, రహదారుల బిజినెస్‌లు లాభాల్లో వృద్ధికి దోహదం చేశాయి. మొత్తం ఆదాయం సైతం రూ. 25,142 కోట్ల నుంచి రూ. 31,716 కోట్లకు జంప్ చేసింది. 7 ఎయిర్‌పోర్టులలో ప్రయాణికుల సంఖ్య 74 శాతం ఎగసి 21.4 మిలియన్లను తాకగా.. కార్గో 14 శాతం బలపడింది. ఈ బాటలో రహదారులు, మైనింగ్ బిజినెస్‌లు లాభదాయకతకు సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. దేశీయంగానేకాకుండా, ప్రపంచ స్థాయిలో విజయవంతమైన వ్యాపారాభివృద్ధికి కంపెనీ ప్రతీకగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. నిర్వహణ, ఆర్థిక పటిష్టతకు గతేడాది ఫలితాలు కొలమానమని విశ్లేషించారు. పాలన, నిబంధనల అమలు, పనితీరు, నగదు ఆర్జనలపై ప్రత్యేక దృష్టి కొనసాగుతుందని తెలియజేశారు. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం అదానీ ఎంటర్ప్రైజెస్ నికర లాభం 218 శాతం దూసుకెళ్లి రూ. 2,473 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 96 శాతం జంప్‌చేసి రూ. 1,38,175 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) రెట్టింపునకుపైగా వృద్ధితో రూ. 10,025 కోట్లయ్యింది. ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రయాణికుల సంఖ్య 74.8 మిలియన్లకు చేరింది. 2023 మార్చికల్లా కంపెనీ స్థూల రుణభారం రూ. 41,024 కోట్ల నుంచి తగ్గి రూ. 38,320 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 4.7 శాతం జంప్‌చేసి రూ. 1,925 వద్ద ముగిసింది. -
లాభాలతో అదరగొట్టిన పంజాబ్ సింద్ బ్యాంక్
ముంబై: పీఎస్‌యూ సంస్థ పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) గత ఆర్థిక సంవత్సరం(2022– 23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 32 శాతం ఎగసి రూ. 457 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 346 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇదీ చదవండి: లాభాలు అదుర్స్! అదానీ కంపెనీల ఆదాయాలు వృద్ధి ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభం సాధించింది. రూ. 1,313 కోట్లు ఆర్జించింది. 2021–22లో రూ. 1,039 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. ఇది 26 శాతంపైగా వృద్ధికాగా.. క్యూ4లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 12.17 శాతం నుంచి 6.97 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 2.74 శాతం నుంచి 1.84 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో పీఎస్బీ షేరు బీఎస్ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 37.35 వద్ద ముగిసింది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
కొటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 14 శాతంపైగా వృద్ధితో రూ. 4,566 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత అధికంగా 34 శాతం జంప్‌చేసి రూ. 3,496 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం రూ. 8,573 కోట్ల నుంచి రూ. 10,939 కోట్లకు ఎగసింది. కాగా.. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 35 శాతం బలపడి రూ. 6,103 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 5.75 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం 30 శాతం పుంజుకుని రూ. 2,186 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.34 శాతం నుంచి 1.78 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 21.80 శాతంగా నమోదైంది. గతేడాది క్యూ4లో అనుబంధ సంస్థలలో కొటక్ ప్రైమ్ నికర లాభం రూ. 313 కోట్ల నుంచి రూ. 224 కోట్లకు వెనకడుగు వేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. అకౌంటింగ్ విధానాలలో మార్పు ఇందుకు కారణమైనట్లు పేర్కొంది. ఆటుపోట్ల మార్కెట్ కారణంగా క్యాపిటల్ మార్కెట్ ఆధారిత అనుబంధ సంస్థ అసెట్ మేనేజ్మెంట్ లాభం మాత్రం రూ. 192 కోట్లకు మెరుగుపడినట్లు తెలియజేసింది. -
స్మార్ట్ఫోన్ల మార్కెట్ డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు (తయారీ సంస్థల నుంచి రిటైలర్లకు సరఫరా) 3.1 కోట్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 19 శాతం తగ్గాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం.. రూ. 30,000 లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు గణనీయంగా పడిపోగా, ప్రీమియం.. అల్ట్రా ప్రీమియం కేటగిరీ ఫోన్లు 60–66 శాతం ఎగిశాయి. డిమాండ్ తగ్గుదల, 2022 నుంచి నిల్వ లు పెరిగిపోవడం, వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతుండటం, మార్కెట్ నిరాశావహంగా కనిపిస్తుండటం తదితర అంశాలు క్యూ1లో విక్రయాలు మందగించడానికి కారణమైనట్లు కౌంటర్‌పాయింట్ తెలిపింది. దీనితో షిప్మెంట్ల తగ్గుదల వరుసగా మూడో త్రైమాసికంలోనూ కొనసాగగా, క్యూ1లో అత్యధికంగా క్షీణత నమోదైనట్లు వివరించింది. మొత్తం స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లలో 5జీ ఫోన్ల వాటా ఏకంగా 43 శాతానికి చేరింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 20 శాతం వాటాతో వరుసగా రెండో త్రైమాసికంలోనూ శాంసంగ్ అగ్రస్థానంలో నిల్చింది. టాప్ 5జీ బ్రాండ్‌గా కూడా కొనసాగుతోంది. ఏ సిరీస్ 5జీ ఫోన్లు ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాయి. మొత్తం షిప్మెంట్లలో వీటి వాటా 50 శాతం దాకా నమోదైంది. ఎస్23 సిరీస్ ఆవిష్కరణతో మార్చి క్వార్టర్లో శాంసంగ్ అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్ (ధర రూ. 45,000 పైగా) 247 శాతం వృద్ధి చెందింది. ► యాపిల్ షిప్మెంట్లు 50 శాతం పెరగ్గా మార్కెట్ వాటా 6 శాతంగా నమోదైంది. మొత్తం ప్రీమియం సెగ్మెంట్లో (రూ. 30,000 స్థాయి) 36 శాతం, అల్ట్రా–ప్రీమియం సెగ్మెంట్లో 62 శాతం వాటా దక్కించుకుంది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కలిసి కొత్తగా ఫైనాన్స్ స్కీమును ప్రారంభించడం, లేటెస్ట్ ఐఫోన్ 14 సిరీస్‌ను ఆఫ్‌లైన్‌లోను గణనీయంగా ప్రమోట్ చేస్తుండటం ఇందుకు దోహదపడింది. ► మార్చి త్రైమాసికంలో షిప్మెంట్లు 3 శాతం క్షీణించినప్పటికీ 17 శాతం మార్కెట్ వాటాతో వివో రెండో స్థానంలో కొనసాగుతోంది. షావో మీ షిప్ మెంట్లు 44 శాతం పడిపోగా, 16 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. ► వన్‌ప్లస్ అత్యంత వేగంగా ఎదుగుతోంది. క్యూ1లో 72 శాతం వృద్ధి చెందింది. ► స్థానిక బ్రాండ్లలో రూ. 10,000 లోపు ఫోన్ల సెగ్మెంట్లో లావా మెరుగ్గా రాణించింది. 29 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న మూడో బ్రాండ్‌గా నిల్చింది. ► రూ. 20,000 – 30,000 ధర పలికే మొబైల్ ఫోన్ల షిప్మెంట్లు 33 శాతం క్షీణించగా, రూ. 10,000 – 20,000 సెగ్మెంట్ 34 శాతం తగ్గింది. ఇక రూ. 10,000 లోపు ఫోన్లు 9 శాతం క్షీణత నమోదు చేశాయి. ► వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రమోషనల్ ఆఫర్లు నడిచే సమయంలో డిమాండ్ గణనీయంగా ఉంటోంది. రిపబ్లిక్ డే సమయంలో డిమాండ్ బాగా కనిపించింది. అయి తే సేల్స్ వ్యవధి ముగిసిపోగానే భారీగా పడిపోయింది. విక్రేతలు ప్రస్తుతం కొత్త మోడల్స్‌ను తెచ్చిపెట్టుకోవడం కంటే ఉన్న నిల్వలను వదిలించుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ► 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే విషయం. వినియోగదారులు అప్‌గ్రేడ్ అవుతుండటంతో 5జీ ఫోన్ల అమ్మకాలు వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్లో 43 శాతం వాటాను దక్కించుకున్నాయి. ► రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. 5జీకి అప్‌గ్రేడేషన్ వేగవంతం అవుతుండటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, పండుగల సీజన్ మొదలైన వాటి కారణంగా ఈ ఏడాది ద్వితీయార్థంలో అమ్మకాలు పుంజుకుంటాయని అంచనా. -
నష్టాల్లోకి యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. జనవరి–మార్చి (క్యూ4)లో రూ. 5,728 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2021– 2022 ఇదే కాలంలో రూ.4,118 కోట్ల నికర లాభం ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ.22,000 కోట్ల నుంచి రూ.28,865 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 17,776 కోట్ల నుంచి రూ.23,970 కోట్లకు బలపడింది. బ్యాంకు బోర్డు వాటాదారులకు షేరుకి రూ.1 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4లో రూ. 5,361 కోట్ల నికర నష్టం నమోదైంది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,417 కోట్ల నికర లాభం ఆర్జించింది. సిటీఇండియా రిటైల్ బిజినెస్ కొనుగోలు నేపథ్యంలో నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ ప్రభావాన్ని (రూ. 12,490 కోట్లు) మినహాయిస్తే నికర లాభం 61% వృద్ధి సాధించినట్లని బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరీ చెప్పారు. ఎన్పీఏలు డౌన్ క్యూ4లో యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.82 శాతం నుంచి 2.02 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు సైతం 0.73 శాతం నుంచి 0.39 శాతానికి దిగివచ్చాయి. మొండిరుణాలు తగ్గడంతో ప్రొవిజన్లు, కంటిజెన్సీలు రూ. 987 కోట్ల నుంచి తగ్గి రూ. 306 కోట్లకు పరిమితమయ్యాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.73 శాతం మెరుగై 4.22 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 0.8 శాతం క్షీణించి రూ. 881 వద్ద ముగిసింది. -
హెచ్‌యూఎల్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 13% బలపడి రూ. 2,601 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,307 కోట్లు ఆర్జించింది. అమ్మకాల పరిమాణం, మార్జిన్లు మెరుగుపడటం లాభాల వృద్ధికి దోహదపడింది. నికర అమ్మకాలు 11 శాతం పుంజుకుని రూ. 14,926 కోట్లకు చేరాయి. అంతక్రితం క్యూ4లో రూ. 13,468 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సర్వీసులతో కలిపి మొత్తం రూ. 15,375 కోట్ల నిర్వహణ ఆదాయం సాధించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 10,782 కోట్ల నుంచి రూ. 11,961 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. విభాగాలవారీగా: క్యూ4లో హెచ్‌యూఎల్ హోమ్ కేర్ విభాగం ఆదాయం 19% వృద్ధితో రూ. 5,637 కోట్లను తాకింది. సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ ఆదాయం 11% పుంజుకుని రూ. 5,257 కోట్లకు చేరింది. ఇక ఫుడ్స్, రిఫ్రెష్మెంట్ నుంచి 3 శాతం అధికంగా రూ. 3,794 కోట్లు నమోదైంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌యూఎల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 14% ఎగసి రూ.10,143 కోట్లను తాకింది. 2021–22లో రూ. 8,892 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 15%పైగా జంప్‌చేసి రూ.59,443 కోట్లయ్యింది. అంతక్రితం రూ.51,472 కోట్ల టర్నోవర్ సాధించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు 1.7 శాతం క్షీణించి రూ. 2,469 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన నికర లాభం 43శాతం పెరిగి రూ. 2,623.6 కోట్లకు చేరింది. ఆదాయం రూ.32,365 కోట్ల అంచనాతో పోలిస్తే 20శాతం పెరిగి రూ.32,048 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 38శాతం పెరిగి రూ.3,350.3 కోట్లకు చేరుకుంది. ఈమేరకు సంస్థ బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలు అందించింది. ఇదీ చదవండి: వినియోగదారులకు మరో షాక్: వీటి ధరలు త్వరలోనే పెరగనున్నాయ్! సెమీకండక్టర్ల కొరత ఈ త్రైమాసికం, గత సంవత్సరం పోల్చదగిన కాలం రెండింటిలోనూ కంపెనీ ఉత్పత్తిని ప్రభావితం చేసింది.త్రైమాసికంలో ఎగుమతులు 5.5శాతం క్షీణించి 64,000 యూనిట్లకు పైగా ఉన్నప్పటికీ, అప్‌గ్రేడ్ చేసిన బ్రెజ్జాగ్రాండ్ విటారా వంటి కొత్త మోడల్ లాంచ్‌లు, కార్‌మేకర్ అమ్మకాల వృద్ధిని సంవత్సరానికి 5.3శాతం నుండి 5.15 లక్షల యూనిట్లకు నమోదు చేయడంలోసహాయపడ్డాయి. అలాగే తన 40వ వార్షికోత్సవ సంవత్సరంలో, ఎలక్ట్రానిక్ భాగాల కొరత ఉన్నప్పటికీ, కంపెనీ అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసిందనీ కంపెనీ వార్షిక టర్నోవర్ లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ డివిడెండ్ కంపెనీ ఎక్సేంజ్ ఫైలింగ్ ప్రకారం ఒక్కో షేరుకు రూ.90 అత్యధిక డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 2,718.7 కోట్ల రూపాయలకు తుది డివిడెండ్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి FY23లో ఒక్కో షేరుకు 5 నామమాత్రపు విలువ కలిగిన ఈక్విటీ షేరు చెల్లిస్తామని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు తేదీ సెప్టెంబర్ 6, 2023న షెడ్యూల్ చేసింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించబడిన హోల్-టైమ్ డైరెక్టర్ పదవికి షిగెటోషి టోరీ రాజీనామా చేసినట్లు కార్ల తయారీదారు ప్రకటించారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) 10 లక్షల యూనిట్ల సామర్థ్యం విస్తరణ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్ల వరకు విస్తరించే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. ఇన్వెస్ట్మెంట్ కోసం అంతర్గత నిల్వలను ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం, మారుతీ సుజుకి సామర్థ్యం మనేసర్ , గురుగ్రామ్‌లలో దాదాపు 13 లక్షల యూనిట్లుగా ఉంది. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న వీడియో) -
టాటా కమ్యూనికేషన్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ టాటా కమ్యూనికేషన్స్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 326 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 365 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం స్వల్ప వృద్ధితో రూ. 4,587 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 4,263 కోట్ల ఆదాయం నమోదైంది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 21% ఎగసి రూ. 1,796 కోట్లను తాకింది. 2021– 22లో రూ. 1,482 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 17,838 కోట్లను అధిగమించింది. 2021–22లో రూ. 16,725 కోట్ల ఆదాయం మాత్రమే నమోదైంది. ఫలితాల నేపథ్యంలో టాటా కమ్యూనికేషన్స్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 1,226 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్.. ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో అంచనాలకంటే దిగువన ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 8 శాతం ఎగసింది. రూ. 6,128 కోట్లను తాకింది. త్రైమాసికవారీ(క్యూ3)గా చూస్తే ఇది 7 శాతం తక్కువకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 5,686 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 37,441 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఆదాయం 4–7 శాతం స్థాయిలో పుంజుకోగలదని తాజా అంచనాలు(గైడెన్స్) ప్రకటించింది. వెరసి ఐటీ సేవలకు నంబర్ టూ ర్యాంకులో ఉన్న కంపెనీ 2019 తదుపరి మళ్లీ నెమ్మదించిన గైడెన్స్‌ను వెలువరించింది. ఈ ఏడాది 20–22 శాతం స్థాయిలో నిర్వహణ లాభ మార్జిన్లు సాధించే వీలున్నట్లు పేర్కొంది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన గతేడాదికి ఇన్ఫోసిస్ నికర లాభం 9 శాతం బలపడి రూ. 24,095 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 21 శాతం జంప్‌చేసి రూ. 1,46,767 కోట్లకు చేరింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ గతేడాది ఆదాయంలో 16–16.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. వెరసి అంతక్రితం ప్రకటించిన 15–16 శాతం గైడెన్స్‌ను మెరుగుపరచింది. క్యూ4లో ఉత్తర అమెరికా నుంచి 61 శాతం ఆదాయం లభించగా.. యూరోపియన్ ప్రాంతం నుంచి 27 శాతం సమకూరింది. కాగా.. క్యూ4లో ఆర్జించిన పటిష్ట ఫ్రీక్యాష్ ఫ్లో నేపథ్యంలో తుది డివిడెండును ప్రకటించినట్లు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ వెల్లడించారు. పూర్తి ఏడాదికి అంతక్రితం డివిడెండుతో పోలిస్తే 10 శాతం అధికంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. మూలధన కేటాయింపుల పాలసీకి అనుగుణంగా మరోసారి షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. ఫలితాల్లో హైలైట్స్... ► వాటాదారులకు షేరుకి రూ. 17.50 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీంతో గతేడాదికి మొత్తం రూ. 34 డివిడెండ్ చెల్లించినట్లయ్యింది. ► క్యూ4లో 2.1 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. క్యూ3లో 3.3 బిలియన్ డాలర్లు, క్యూ2లో 2.7 బిలియన్ డాలర్ల చొప్పున పొందింది. ► గతేడాది మొత్తం 9.8 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు సంపాదించింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు క్యూ3తో పో లిస్తే 24.3% నుంచి 20.9 శాతానికి దిగివచ్చింది. ► మొత్తం సిబ్బంది సంఖ్య 3,43,234కు చేరింది. గత త్రైమాసికంతో పోలిస్తే నికరంగా 3,611 మంది ఉద్యోగులు తగ్గారు. క్లయింట్ల ఆసక్తి... ‘డిజిటల్, క్లౌడ్, ఆటోమేషన్ సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టితో 2022–23లో పటిష్ట పనితీరును చూపాం. పరిస్థితులు మారినప్పటికీ కంపెనీ సామర్థ్యం, చౌక వ్యయాలు, సమీకృత అవకాశాలు వంటివి క్లయింట్లను ఆకట్టు కుంటున్నాయి. ఇది భారీ డీల్స్‌కు దారి చూపుతోంది’ అని ఇన్ఫోసిస్ సీఈఓ ఎండీ సలీల్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతంపైగా క్షీణించి రూ. 1,389 వద్ద ముగిసింది. అక్షతకు రూ. 68 కోట్లు ఇన్ఫోసిస్ తాజాగా షేరుకి రూ. 17.5 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీంతో కంపెనీలో 3.89 కోట్ల షేర్లుగల బ్రిటిష్ ప్రధాని రిషీ సునక్ భార్య అక్షత రూ. 68.17 కోట్లు అందుకోనున్నారు. ఇందుకు జూన్ 2 రికార్డ్ డేట్. కంపెనీ ఇప్పటికే రూ. 16.5 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. దీంతో అక్షత మొత్తం రూ. 132 కోట్లకుపైగా డివిడెండ్ అందుకోనున్నారు. గురువారం షేరు ధర రూ. 1,389(బీఎస్ఈ)తో చూస్తే ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతకు గల వాటా విలువ రూ. 5,400 కోట్లు. కాగా.. 2021–22 ఏడాదిలోనూ డివిడెండ్ రూపేణా అక్షత ఇన్ఫోసిస్ నుంచి దాదాపు రూ. 121 కోట్లు అందుకోవడం గమనార్హం! -
ఎస్బీఐ లాభం జూమ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో స్టాండెలోన్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 9,114 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 6,451 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయంలో వృద్ధి, మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం పుంజుకుని రూ. 31,198 కోట్లయ్యింది. అంతక్రితం క్యూ4లో రూ. 27,067 కోట్ల వడ్డీ ఆదాయం ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 82,613 కోట్లకు చేరింది. ఇక క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం 56 శాతం దూసుకెళ్లి రూ. 9,549 కోట్లను తాకింది. ఒక్కో షేరుకు రూ. 7.10 చొప్పున డివిడెండును ప్రకటించింది. ఎన్పీఏలు తగ్గాయ్... క్యూ4లో ఎస్బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.98 శాతం నుంచి 3.97 శాతానికి ఉపశమించాయి. ఈ బాటలో నికర ఎన్పీఏలు 1.5% నుంచి 1.02%కి తగ్గాయి. నికర వడ్డీ మార్జిన్లు 0.29 శాతం బలపడి 3.4 శాతానికి చేరాయి. క్యూ4లో మొండిరుణాలకు కేటాయింపు లు రూ. 9,914 కోట్ల నుంచి భారీగా తగ్గి రూ. 3,262 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ప్రొవిజన్లు 20 శాతం తగ్గి రూ. 10,603 కోట్లకు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం 55 శాతం ఎగసి రూ. 31,676 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 20,410 కోట్లు మాత్రమే ఆర్జించింది. చదవండి: పీఎన్బీ రుణ రేట్లు పెంపు..జూన్ 1 నుంచి అమల్లోకి! -
టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త.. వేతనాల పెంపు ఎంతంటే?
ముంబై: టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఈ కంపెనీ సీఈవో సీపీ గుర్నానీ. త్రైమాసిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్ మహీంద్రా ఉద్యోగులకు 10 శాతం వేతనాలు పెంచుతున్నాట్టు ప్రకటించారు. ‘‘సరఫరా వైపు ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చాం. సగటున ఒక్కో ఉద్యోగికి వేతన పెంపు 10 శాతం మేర ఉంటుంది’’అని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. టెక్ మహీంద్రా లాభం భేష్ ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా మార్చి త్రైమాసికానికి పనితీరు పరంగా అంచనాలకు అందుకుంది. కన్సాలిడేటెడ్ నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 39 శాతం పెరిగి రూ.1,506 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా (క్రితం త్రైమాసికం నుంచి) చూసినా నికర లాభం 10 శాతం వృద్ధిని చూపించింది. విశ్లేషకుల అంచనా రూ.1,411 కోట్ల కంటే ఇది ఎక్కువగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 25 శాతం వృద్ధితో రూ.12,116 కోట్లకు చేరింది. అంతక్రితం త్రైమాసికం (డిసెంబర్ క్వార్టర్)తో పోల్చి చూసినా ఆదాయంలో 5.8 శాతం వృద్ధి కనిపిస్తోంది. మార్చి త్రైమాసికంలో ఎస్ఈజెడ్ సంబంధిత కేటాయింపులు తిరిగి రావడం కూడా లాభాల్లో వృద్ధికి సాయపడిన అంశాల్లో ఒకటి. 2021–22 ఏడాదికి ఒక్కో షేరుకు తుది డివిడెండ్‌గా రూ.15 ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ‘‘ఆవిష్కరణలపై దృష్టి సారించడం, బలమైన కస్టమర్, భాగస్వామ్య ఎకోసిస్టమ్ ఏర్పాటులో మాకున్న సామర్థ్యాలు పటిష్ట వృద్ధికి దోహదపడినట్టు టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. విభాగాల వారీగా.. - ఎంటర్ప్రైజ్ వెర్టికల్ ఆదాయం 5.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. కమ్యూనికేషన్ విభాగం స్థిరమైన కరెన్సీ పరంగా 4.8 శాతం వృద్ధి చూపించింది. - బీఎఫ్ఎస్ఐ విభాగం మొత్తం ఆదాయం 15.4 శాతం మేర క్రితం త్రైమాసికంలో ఉంటే, అది మార్చి చివరికి 17.4 శాతానికి విస్తరించింది. - బ్రెడ్ అండ్ బటర్ కమ్యూనికేషన్స్, తయారీ విభాగాల ఆదాయం సీక్వెన్షియల్‌గా క్షీణతను చూశాయి. డీల్స్ జోరు... మార్చి త్రైమాసికంలో బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అతిపెద్ద డీల్‌ను టెక్ మహీంద్రా గెలుచుకుంది. 2021–22 మొత్తం మీద 3 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్‌ను సొంతం చేసుకుంది. యూరోప్‌లో ఒక 5జీ ఆపరేటర్ నుంచి, రిటైల్, హెల్త్‌కేర్ విభాగాల నుంచి డీల్స్ వచ్చాయి. ‘‘సుస్థిర డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, నూతనతరం టెక్నాలజీపై పెట్టుబడులు కలసి గణనీయమైన వృద్ధికి తోడ్పడడమే కాకుండా.. గత ఏడేళ్లలోనే అతిపెద్ద డీల్ గెలుచుకోవడం సాధ్యపడింది’’అని గుర్నానీ తెలిపారు. కార్పొరేట్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. కమ్యూనికేషన్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్, మెటావర్స్ విభాగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి వృద్ధిని చూపిస్తాయన్నారు. నిర్వహణ మార్జిన్ డౌన్ ఆపరేటింగ్ మార్జిన్ 2021 డిసెంబర్ త్రైమాసికంలో 14.8% ఉంటే, మార్చి త్రైమాసికంలో 13.2 శాతానికి తగ్గిపోయింది. అధిక వేతనాలు, ఉద్యోగులను కాపాడుకునేందుకు చేసిన వ్యయాలు మార్జిన్లపై ప్రభాం చూపించినట్టు కంపెనీ తెలిపింది. 2021–22 సంవత్సరానికి.. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి టెక్ మహీంద్రా కన్సాలిడేటెడ్ ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.44,646 కోట్లకు చేరింది. నికర లాభం కూడా 26 శాతం పుంజుకుని రూ.5,566 కోట్లుగా నమోదైంది. చదవండి: సీఐఐ ప్రెసిడెంట్‌గా సంజీవ్ బజాజ్ -
‘పంజాబ్’ మెప్పించేది ఎప్పుడు?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు మెప్పించే పనితీరును మార్చి త్రైమాసికంలో ప్రదర్శించలేకపోయింది. సంస్థ స్టాండలోన్ నికర లాభం 66 శాతం క్షీణించి రూ.202 కోట్లకు పరిమితం అయింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు చేయాల్సి రావడం లాభాలకు చిల్లు పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకు రూ.586 కోట్లను నమోదు చేయడం గమనార్హం. ఇక స్టాండలోన్ ఆదాయం సైతం రూ.21,386 కోట్ల నుంచి రూ.21,095 కోట్లకు తగ్గింది. వసూలు కాని మొండి రుణాలకు (ఎన్పీఏలకు), కంటింజెన్సీల పేరుతో రూ.4,851 కోట్లను మార్చి త్రైమాసికంలో పక్కన పెట్టింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.3,540 కోట్లతో పోలిస్తే 35 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2021–22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి పీఎన్బీ నికర లాభం రూ.3,457 కోట్లకు దూసుకుపోయింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,021 కోట్లుగానే ఉంది. స్థూల ఎన్పీఏలు 14.12 శాతం నుంచి 11.78 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 5.73 శాతం నుంచి 4.8 శాతానికి దిగొచ్చాయి. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.0.64 చొప్పున డివిడెండ్‌ను బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త! -
క్యూ4లో వేదాంత దూకుడు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,500 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 5,105 కోట్ల లాభం ఆర్జించింది. ఇందుకు అమ్మకాల పరిమాణం, కమోడిటీల ధరలు, నిర్వహణా సామర్థ్యం సహకరించాయి. గత త్రైమాసికంలో రూ. 336 కోట్ల అనుకోని పద్దు నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ప్రధానంగా చమురు, గ్యాస్ విభాగంలో రూ. 2,697 కోట్ల ఇంపెయిర్మెంట్ రివర్సల్ ఆర్జనను కెయిర్న్ ఇంధన వెలికితీత వ్యయాల రైటాఫ్ కొంతమేర ప్రభావితం చేసినట్లు వివరించింది. వాటాదారులకు షేరుకి రూ. 31.5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఇందుకు మే 9 రికార్డ్ డేట్‌కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం రూ. 27,874 కోట్ల నుంచి రూ. 39,342 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో వ్యయాలు రూ. 22,549 కోట్ల నుంచి రూ. 29,901 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 51 శాతం వృద్ధితో రూ. 13,768 కోట్ల నిర్వహణా లాభం(ఇబిటా) సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేసింది. పటిష్ట క్యాష్ ఫ్లో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వేదాంత నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 24,299 కోట్లను తాకింది. 2020–21లో రూ. 12,446 కోట్లు ఆర్జించింది. గతేడాది అత్యుత్తమ నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 45,319 కోట్లు ఆర్జించింది. ఇక అనుకోని పద్దులు, పన్ను ఆర్జనకు ముందు నికర లాభం రూ. 24,299 కోట్లకు చేరింది. అమ్మకాల పరిమాణం, నిర్వహణా సామర్థ్యం, వ్యవస్థాగత ఇంటిగ్రేషన్, టెక్నాలజీ వినియోగం తదితరాలపై తాము పెట్టిన ప్రత్యేక దృష్టికి తాజా ఫలితాలు నిదర్శనమని వేదాంత సీఈవో సునీల్ దుగ్గల్ పేర్కొన్నారు. వెరసి రూ. 27,154 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. తద్వారా వృద్ధి అవకాశాలపై తిరిగి ఇన్వెస్ట్ చేయడం, బ్యాలెన్స్ షీట్‌ను మరింత పటిష్టపరచుకోవడం, వాటాదారులకు అధిక డివిడెండ్ల చెల్లింపు వంటివి చేపట్టేందుకు మరింత వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో వేదాంత షేరు ఎన్ఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 411 వద్ద ముగిసింది. -
Adani Ports: క్యూ4లో అదానీ పోర్ట్స్ లాభం రూ. 1,321 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 288 శాతం దూసుకెళ్లి రూ. 1,321 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 340 కోట్లు మాత్రమే ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 3,360 కోట్ల నుంచి రూ. 4,072 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు మాత్రం రూ. 3,099 కోట్ల నుంచి రూ. 2,527 కోట్లకు క్షీణించాయి. 2020–21ను ట్రాన్స్ఫార్మేషన్ ఏడాదిగా అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. కంపెనీ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు రానున్న దశాబ్దానికి పునాదిగా నిలవనున్నట్లు వ్యాఖ్యానించారు. కస్టమర్లకు అధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా దేశవ్యాప్తంగా మార్కెట్ వాటాను 4 శాతంమేర పెంచుకున్నట్లు తెలియజేశారు. ముంద్రా పోర్ట్ దేశంలోనే అతిపెద్ద వాణిజ్య కంటెయినర్ పోర్టుగా మరోసారి ఆవిర్భవించినట్లు వెల్లడించారు. తద్వారా జేఎన్‌పీటీని వెనక్కినెట్టినట్లు పేర్కొన్నారు. సమీకృత రవాణా, లాజిస్టిక్స్ యుటిలిటీగా అదానీ పోర్ట్స్.. 2025కల్లా 500 ఎంటీ కార్గోను హ్యాండిల్ చేసేలక్ష్యంలో సాగుతున్నట్లు వివరించారు. పూర్తి ఏడాదికి..: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి అదానీ పోర్ట్స్ టర్నోవర్ 6 శాతం పుంజుకుని రూ. 12,550 కోట్లయ్యింది. పోర్ట్ ఆదాయం 12 శాతం ఎగసి రూ. 10,739 కోట్లను తాకింది. ఇందుకు కార్గో 11 శాతం వృద్ధి చూపడం సహకరించింది. ఇబిటా 15 శాతం బలపడి రూ. 7560 కోట్లకు చేరింది. కృష్ణపట్నం పోర్టులో మిగిలిన 25 శాతం వాటా కొనుగోలుకి ఈ ఏప్రిల్‌లో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయాన్ని కంపెనీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. జూన్‌కల్లా ఈ లావాదేవీ పూర్తికాగలదని తెలియజేసింది. కాగా.. గంగవరం పోర్టులో 100 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సైతం మార్చిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కొనుగోలు ప్రక్రియలు పూర్తయ్యాక ఈ రెండు పోర్టులూ పూర్తి అనుబంధ సంస్థలుగా ఆవిర్భవించనున్నట్లు అదానీ పోర్ట్స్ పేర్కొంది. కృష్ణపట్నం, గంగవరం పోర్టులతోపాటు.. డిఘీ పోర్ట్, సర్గూజా రైల్ లైన్ ద్వారా మొత్తం 13 పోర్టుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. కొలంబోలో కంటెయినర్ టెర్మినల్ పోర్ట్ ద్వారా అంతర్జాతీయ కార్యకలాపాలలో మరో మైలురాయిని అందుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది(2021–22) 310–320 ఎంఎంటీ కార్గో పరిమాణాన్ని సాధించగలమని అంచనా వేసింది. ఇందుకు క్యూ4(జనవరి–మార్చి)లో గంగవరం పోర్టు నుంచి 10 ఎంఎంటీ కార్గో దోహద పడనున్నట్లు అభిప్రాయపడింది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1% బలపడి రూ. 768 వద్ద ముగిసింది. -
క్యూ4లో ఐటీ దిగ్గజాల స్పీడ్!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ వారంలో క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. సోమవారం(12న) టీసీఎస్, మంగళవారం సమావేశంకానున్న ఇన్ఫోసిస్ బుధవారం(14న) ఫలితాలు వెల్లడించనుండగా, గురువారం(15న) విప్రో చివరి త్రైమాసిక పనితీరును ప్రకటించనుంది. ఈ బాటలో ఐటీ దిగ్గజాలు మార్చితో ముగిసిన పూర్తి ఏడాది(2020–21) ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇక ఇన్ఫోసిస్ అయితే ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనతోపాటు.. వచ్చే ఏడాది(2021–22)కి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను సైతం ప్రకటించనుంది. కోవిడ్–19 నేపథ్యంలోనూ క్యూ4లో ఐటీ బ్లూచిప్స్ పటిష్ట పనితీరును చూపే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు డిజిటైజేషన్, భారీ డీల్స్, ఆర్డర్ పైప్‌లైన్ తదితరాలు దోహదపడనున్నాయి. బీఎఫ్ఎస్ఐ, రిటైల్, లైఫ్‌సైన్సెస్, తయారీ రంగాల నుంచి డిమాండ్ వీటికి జత కలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి ఐటీ కంపెనీల ఫలితాలు అటు మార్కెట్లకు, ఇటు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లపై మార్కెట్ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయంటే.. వివరాలు చూద్దాం.. టీసీఎస్.. టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ క్యూ4లోనూ ప్రోత్సాహకర పనితీరును ప్రదర్శించే వీలుంది. ఐటీ పరిశ్రమలో లీడర్‌గా ఆదాయం, మార్జిన్ల విషయంలో మెరుగైన ఫలితాలు సాధించనుంది. ఇందుకు పోస్ట్‌బ్యాంక్, ప్రుడెన్షియల్ ఫైనాన్షియల్తో కుదుర్చుకున్న భారీ డీల్స్ సహకరించనున్నాయి. ఇటీవల 5–10 కోట్ల డాలర్ల డీల్స్‌ను పెంచుకుంది. క్లౌడ్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ విభాగాల నుంచి డిమాండ్‌ను సాధిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 9 శాతం, డాలర్ల రూపేణా 5 శాతం చొప్పున పుంజుకోవచ్చు. అయితే 2021–22కుగాను ప్రత్యేకంగా ఎలాంటి గైడెన్స్నూ ప్రకటించనప్పటికీ రెండంకెల వృద్ధిని ఆశించే వీలుంది. ప్రస్తుత స్థాయిలో లాభాలను కొనసాగించే అవకాశముంది. వాటాదారులకు తుది డివిడెండ్‌ను ప్రకటించడం, తయారీ, కమ్యూనికేషన్స్ విభాగాలపై యాజమాన్య స్పందన వంటి అంశాలను పరిశీలించవలసి ఉంది. శుక్రవారం ఎన్ఎస్ఈలో టీసీఎస్ షేరు ఇంట్రాడేలో రూ. 3,354ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. 0.25 శాతం లాభంతో రూ. 3,325 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ గత కొద్ది త్రైమాసికాలుగా చూపుతున్న వృద్ధి బాటలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ క్యూ4 ఫలితాలు వెలువడే వీలుంది. చివరి త్రైమాసికంలోనూ పటిష్ట పనితీరును చూపవచ్చు. కోవిడ్–19 కారణంగా డిజిటల్ టెక్నాలజీస్, క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయి. క్యూ4లో త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 2–5 శాతం మధ్య పుంజుకునే వీలుంది. వార్షిక ప్రాతిపదికన మాత్రం రెండంకెల వృద్ధి సాధించనుంది. ప్రధానంగా వచ్చే ఏడాది(2021–22)కి ఆదాయంలో 13–15 శాతం పెరుగుదలను అంచనా వేయవచ్చు. క్యూ4లో వేతనాల పెంపు కారణంగా మార్జిన్లు త్రైమాసిక ప్రాతిపదికన 0.5 శాతం క్షీణించవచ్చు. కాగా.. 14న ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించనుంది. ఇన్ఫోసిస్ ఇంతక్రితం 2019 ఆగస్ట్‌లో 11.05 కోట్ల షేర్లను బైబ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 8,260 కోట్లను వెచ్చించింది. వారాంతాన ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు ఇంట్రాడేలో రూ. 1,455ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. నామమాత్ర లాభంతో రూ. 1,441 వద్ద ముగిసింది. విప్రో డైవర్సిఫైడ్ దిగ్గజం విప్రో లిమిటెడ్ ఐటీ సేవల ఆదాయం క్యూ4లో డాలర్ల రూపేణా 4 శాతం స్థాయిలో ఎగసే వీలుంది. త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ 1.5–3.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అంటే 210–214 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆశించింది. కాగా.. క్యూ4లో వేతన పెంపు, యుటిలైజేషన్ తగ్గడం, ట్రావెల్ తదితర వ్యయాలు పెరగడం వంటి కారణాలతో మార్జిన్లు కొంతమేర మందగించవచ్చు. క్యూ3లో త్రైమాసిక ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ ఆదాయం దాదాపు 4 శాతం పుంజుకుని రూ. 15,670 కోట్లను తాకింది. నికర లాభం మాత్రం రూ. 20 శాతంపైగా జంప్‌చేసి రూ. 2,968 కోట్లకు చేరింది. శుక్రవారం ఎన్ఎస్ఈలో విప్రో షేరు 2 శాతం ఎగసి రూ. 451 వద్ద ముగిసింది. తద్వారా ఈ జనవరిలో నమోదైన ఏడాది గరిష్టం రూ. 467కు చేరువైంది. -
క్యూ4 ఫలితాలు బాగుంటాయ్!
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో దేశీ కార్పొరేట్లు ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలవని రేటింగ్ దిగ్గజం క్రిసిల్ రూపొందించిన నివేదిక అంచనా వేసింది. క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15–17 శాతం స్థాయిలో పుంజుకోగలదని పేర్కొంది. ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో 55–60 శాతం వాటాను ఆక్రమిస్తున్న ప్రధాన కంపెనీలపై క్రిసిల్ నివేదికను రూపొందించింది. క్యూ4లో వీటి ఆదాయం రూ. 6.9 లక్షల కోట్లకు చేరవచ్చని తెలియజేసింది. గత 8 త్రైమాసికాలుగా క్షీణత లేదా స్వల్ప పురోగతి చూపుతున్న కంపెనీలు తిరిగి రెండంకెల వృద్ధిని అందుకునే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఇందుకు ప్రధానంగా అంతక్రితం(2019–20) క్యూ4లో తక్కువ వృద్ధి(లో బేస్) నమోదుకావడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ప్రొడక్టులకు మెరుగైన ధరలు లభించడం కూడా దోహదం చేయనున్నట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్ సర్వీసులు, చమురు కంపెనీలను మినహాయించి ఎన్ఎస్ఈలోని టాప్– 300 కంపెనీల క్యూ4 ఫలితాలపై రేటింగ్ దిగ్గజం క్రిసిల్ రూపొందించిన నివేదికలోని ఇతర అంశాలు.. రికవరీ దన్ను..: గతేడాది ద్వితీయార్థంలో కనిపించిన రికవరీ కారణంగా అంతక్రితం ఏడాది(2020)లో నమోదైన ఆదాయంతో పోలిస్తే 2021లో 300 కంపెనీల టర్నోవర్ 0.5 శాతం మాత్రమే తక్కువగా నమోదయ్యే వీలుంది. అయితే నిర్వహణ లాభం 28–30 స్థాయిలో జంప్ చేయనుంది. 2020 క్యూ4లో మందగమనం కారణంగా లాభాల్లో అధిక వృద్ధికి అవకాశముంది. 2021 చివరి త్రైమాసికంలో కమోడిటీల ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ వ్యయాలు, ధరలు మెరుగుపడటం కంపెనీలకు లాభించనుంది. రికవరీలో ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసులు, నిర్మాణ రంగం 50 శాతం వాటాను ఆక్రమించనున్నట్లు క్రిసిల్ నివేదికను రూపొందించిన టీమ్ లీడ్ హెటల్ గాంధీ పేర్కొన్నారు. 2020–21లో 300 కంపెనీల ఆదాయం రూ. 23.8 లక్షల కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. స్టీల్, సిమెంట్ జోరు నివేదిక ప్రకారం గతేడాది 17–18 శాతం ఆదాయ వృద్ధిలో నిర్మాణ రంగ సంబంధ స్టీల్, సిమెంట్ తదితరాలు 45–50 శాతం పురోగతిని సాధించనున్నాయి. అమ్మకాల పరిమాణం, ధరలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. దేశీయంగా ఫ్లాట్ స్టీల్, సిమెంట్ ధరలు వరుసగా 32 శాతం, 2 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే అన్ని విభాగాలలోనూ ఇదే తరహా జోరుకు ఆస్కారంలేదు. విచక్షణ ఆధార వినియోగ విభాగాలైన ఎయిర్‌లైన్స్ తదితర రంగాలు 30 శాతం క్షీణతను చవిచూడనున్నాయి. కోవిడ్–19తో సామాజిక దూరం, ప్రయాణాల రద్దు వంటి అంశాలు దెబ్బతీయనున్నాయి. ఆటో స్పీడ్... లో బేస్ కారణంగా ఆటోమొబైల్ అమ్మకాలు 45–47 శాతం జంప్చేయనున్నాయి. భారత్–6 నిబంధల అమలుతో ధరలు మెరుగుపడ్డాయి. దీంతో ఆటో విడిభాగాల కంపెనీల ఆదాయం 26–28 శాతం స్థాయిలో పుంజుకోనుంది. ఐటీ సర్వీసులు, ఫార్మా 6 శాతం పురోగతిని సాధించనుండగా.. నిర్మాణ రంగం 10 శాతం క్షీణతను చవిచూడనుంది. ప్రభుత్వ వ్యయాలు పెరిగినప్పటికీ తొలి అర్ధభాగంలో నమోదైన క్షీణత దెబ్బతీయనుంది. స్వచ్ఛంద వినియోగ ఆధారిత ప్రొడక్టులు, సర్వీసుల విభాగాలు సైతం 10–12 శాతం తిరోగమించనున్నాయి. టెలికం సర్వీసులు స్వల్పంగా 2 శాతం వెనకడుగు వేయవచ్చు. ముడిచమురు పెరుగుదలతో పెట్రోకెమికల్ కంపెనీల ఆదాయం 40–45 శాతం జంప్చేయనుంది. అల్యూమినియం రంగం 15 శాతం వృద్ధిని సాధించనుంది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, విద్యుదుత్పాదన 7–5 శాతం మధ్య బలపడే అవకాశముంది. అయితే కమోడిటీల ధరలు పెరగడంతో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని కిసిల్ అసోసియేట్ డైరెక్టర్ మయూర్ పాటిల్ తెలియజేశారు. స్టీల్, సహజరబ్బర్, ముడిచమురు తదితరాల ధరలు 2020 మార్చితో పోలిస్తే రెండంకెల్లో పెరిగాయి.