
హిందీతో పాటు విభిన్న భాషల్లో ఇటీవల విడుదలైన పాన్ ఇండియా సినిమా ఛావా తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని ప్రముఖ థియేటర్లతోపాటు మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ సినిమాస్‌లోనూ విడుదల చేయడంతో కంపెనీకి లాభాల పంట పండినట్లయిందని స్టాక్ రేటింగ్ బ్రేకరేజ్ సంస్థ నువామా ఇన్ స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో మార్కెట్ అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ షేర్లు గరిష్ఠం నుంచి 32 శాతం పతనమైనప్పటికీ రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో ఛావా సినిమా కలెక్షన్లు ఊపందుకోవడంతో పీవీఆర్ ఐనాక్స్ మంచి లాభాలు పోస్ట్ చేస్తుందని నువామా తన నివేదికలో అంచనా వేసింది. ఇటీవల కంపెనీ ప్రమోటర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు గుర్తు చేసింది. ఫిబ్రవరిలో ఛావా బాక్సాఫీస్ వసూళ్లతోపాటు ఇతర సినిమాల సహకారంతో స్టాక్ ధర ఏడాది ప్రాతిపదికన 39 శాతం పెరుగుదలతో ఆదాయాన్ని రూ.2,264 కోట్లకు పెంచిందని పేర్కొంది. కరోనా తర్వాత ఫిబ్రవరి నెలలో రూ.1,245 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో పరిశ్రమకు అత్యధిక వసూళ్లు సాధించడంలో ఛావా తోడ్పడింది.
ఇదీ చదవండి: భారత్‌తో వాణిజ్యంపై యూఎస్ స్పై చీఫ్ స్పందన
కొత్తగా 100 స్క్రీన్లు..
పీవీఆర్ ఐనాక్స్ అసెట్-లైట్ గ్రోత్ స్ట్రాటజీని పాటిస్తోంది. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో 30-40 కొత్త స్క్రీన్లను జోడించాలని భావిస్తున్నారు. సంస్థ క్యాపిటల్-లైట్ గ్రోత్ మోడల్ కింద 100 స్క్రీన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నువామా పేర్కొంది. ఇందులో 31 స్క్రీన్లు మేనేజ్‌మెంట్ కాంట్రాక్ట్ మోడల్ కింద, 69 అసెట్-లైట్ మోడల్ కింద ఉండనున్నాయి. ఇందులో 42 శాతం నుంచి 80 శాతం వరకు మూలధన వ్యయాన్ని డెవలపర్ భరిస్తారని పేర్కొంది. కొత్తగా ప్లాన్ చేసిన ఈ స్క్రీన్లు రెండు మూడేళ్లలో అందుబాటులోకి వస్తాయని నువామా నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment