
తెలంగాణలోని న్యాయస్థానాల ఘనత
న్యాయవ్యవస్థ పనితీరులో రెండోస్థానం
మహిళా జడ్జీల్లో రాష్ట్రమే నంబర్ వన్
ఇండియా జస్టిస్ రిపోర్ట్–2025లో వెల్లడి
సాక్షి, స్పెషల్ డెస్క్: నూటికి నూరు శాతం కేసులను పరిష్కరిస్తూ న్యాయవ్యవస్థ పనితీరులో తెలంగాణ ద్వితీయస్థానం సాధించింది. గతంలో 5 స్థానంలో ఉండగా ఆ స్థానాన్ని మెరుగుపర్చుకుంది. వరు సగా మూడేళ్లుగా 100% కేసు క్లియరెన్స్ రేట్‌ను సాధిస్తోంది. ఈ వివరాలను ఇండియన్ జస్టిస్ రిపోర్ట్– 2025 తాజా నివేదికలో వెల్లడించింది. 2025 జన వరి నాటికి దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య 5.1 కోట్లు దాటిందని.. జడ్జీల నియామకంలో జాప్యం, జనాభాకు సరిపడా న్యాయమూర్తులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలని అభిప్రాయపడింది.
ఆన్‌లైన్ విచారణతో.. కరోనాతో వచ్చిన వర్చువల్ విచార ణలు.. ఆ తర్వాత వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల కారణంగా కేసుల విచారణ వేగం పుంజుకుంది. ఏటా నమోదవుతున్న కేసుల సంఖ్య ను మించి పిటిషన్లు పరిష్కరిస్తూ ముందుకెళ్తోంది. దీంతో హైకోర్టుతో పాటు సబార్డినేట్ కోర్టుల్లో కేసుల పరిష్కార రేటు మెరుగుపడింది.
అధ్యయనం జరిగిందిలా...
కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, టీఎస్–ప్రయాస్, హౌ ఇండియా లీవ్స్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ లాంటి సంస్థల సహకారంతో టాటా ట్రస్టు ఈ అధ్యయనం నిర్వహించింది. 2019 నుంచి ఈ అధ్యయనం చేస్తోంది.
జడ్జీలపై పనిభారం..
దేశవ్యాప్తంగా 2025లో హైకోర్టుల్లో మొత్తం మంజూరు చేసిన పోస్టుల్లో 33 శాతం జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నా యి. అత్యధికంగా అలహాబాద్, మధ్య ప్రదేశ్ హైకోర్టులో ఒక్కో న్యాయ మూర్తిపై 15 వేల కేసుల పని భారం ఉంది. తెలంగా ణలో 42 మంది (32 శాశ్వత, 10 అద నపు) జడ్జీలకుగాను 30 మందే ఉన్నారు. సుమారు 30 శాతం (12 పోస్టులు) ఖాళీలున్నాయి. రాష్ట్ర జనాభా సుమారు 3.7 కోట్లుకాగా మంజూరు చేసిన పోస్టుల ప్రకారం ప్రతి 8.8 లక్షల మందికి ఒక హైకోర్టు జడ్జి ఉండాలి.
కానీ ప్రస్తుతం ప్రతి 12.3 లక్షల మందికి ఒక జడ్జీ ఉన్నారు. తెలంగాణలో ఒక్కో న్యాయ మూర్తిపై 4,000 కేసుల పనిభారం పడు తోంది. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో 21 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో న్యాయమూర్తిపై 2,200 కేసుల పనిభారం ఉంది. తెలంగాణలో 655 మంది జడ్జీలు ఉండాల్సి ఉండగా 440 మందే ఉన్నారు. సుమారు 215 పోస్టులు ఖాళీలున్నాయి.
మనమే నంబర్ వన్..
దేశంలోని జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం పెరిగింది. 2017లో వారి సంఖ్య 30 శాతం ఉండగా 2025లో 38.3 శాతానికి పెరిగింది. 55.3 శాతంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. హైకోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతి నిధ్యం దేశవ్యాప్తంగా 14 శాతం ఉండగా తెలంగాణలో అత్యధికంగా 33.3 శాతంగా ఉంది. దేశంలోని హైకోర్టులన్నింటిలోనూ ఒకే ఒక్క మహిళా ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు.
జనవరి 2025 నాటికి..
సుప్రీంకోర్టు జడ్జీలు సహా సిట్టింగ్ జడ్జీల సంఖ్య: 21,285
మొత్తంగా ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య: 26,927
మంజూరు చేసిన సంఖ్యతో పోలిస్తే ఖాళీల శాతం: 15
2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రతి 10 లక్షల మందికి రాజ్యసభ సూచించిన జడ్జీల సంఖ్య: 21
1987లో ఏర్పాటైన న్యాయ కమిషన్ ప్రతి 10 లక్షల జనాభాకు ఉండాలని సూచించిన జడ్జీల సంఖ్య: 50
ప్రస్తుతం దేశంలో ప్రతి 10 లక్షల మందికి ఉన్న జడ్జీల సంఖ్య: 15
అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి ఉన్న జడ్జీల సంఖ్య: 150
యూరప్‌లో ఇదే సంఖ్య: 220
కోర్టు స్థాయిలో విచారణ ప్రక్రియలను క్రమ బద్ధీకరించాల్సిన అవసరాన్ని 1958లోనే 14వ లా కమిషన్ నివేదిక నొక్కిచెప్పింది. 1987లో న్యాయ మూర్తుల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. 2009లో అన్ని స్థాయిల్లో కోర్టు సెలవులను తగ్గించాలని, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను వినియోగించుకోవాలని సిఫార్సు చేసింది.
2016లో కేంద్ర, సుప్రీంకోర్టు పరిశోధ నలో 2040లో జిల్లా కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్య 80,000 వరకు పెరుగుతుందని, అయి నా పెండింగ్ కేసుల భారం తప్పదని తేలింది. 2025 జనవరిలో హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5.1 కోట్లు దాటింది. పదేళ్లకుపైగా పెండింగ్ కేసులు 12%, 5–10 ఏళ్ల కేసులు 22% ఉన్నాయి. హైకోర్టుల్లో 61%, దిగువ కోర్టుల్లో 46% మూడేళ్ల కంటే ఎక్కువ ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులున్నాయి.
సుప్రీంకోర్లులో పెండింగ్‌లో ఉన్న కేసులు: 82,000
దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో కేసు క్లియరెన్స్ రేటు (సీసీఆర్): 94%
100% సీసీఆర్ నమోదు చేసుకున్న రాష్ట్రాలు: 7
(తెలంగాణ, జార్ఖండ్, త్రిపుర, మద్రాస్, పంజాబ్–హరియాణా, ఒడిశా, పశ్చిమ బెంగాల్. వరుసగా ఇది మూడోసారి)
