
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టొరెంట్ పవర్ 2022–23 చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 484 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 487 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం సైతం భారీగా ఎగసి రూ. 6,134 కోట్లను తాకింది.
అంతక్రితం క్యూ4లో రూ. 3,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,165 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో కేవలం రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,493 కోట్ల నుంచి రూ. 26,076 కోట్లకు ఎగసింది. ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది.
టొరెంట్ పవర్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.6 శాతం బలపడి రూ. 556 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment