dividends
-
ఎల్ఐసీ, ఐవోసీ భారీ డివిడెండ్లు
కేంద్రానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డివిడెండ్లను అందించాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ఎండీ సిద్ధార్థ మొహంతి రూ.3,662.17 కోట్ల డివిడెండ్ చెక్కును అందించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఎంపీ తంగిరాల కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చి 1వ తేదీన ఎల్ఐసీ రూ.2,441.45 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను అందించింది. తాజాగా అందజేసిన డివిడెండ్‌తో కలిసి 2023–24లో సంస్థ మొత్తం రూ.6,103.62 కోట్ల డివిడెండ్‌ను అందించినట్లైంది. ఇక ఐవోసీ రూ.5,091 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి సమరి్పంచింది. 2024–25లో ఇప్పటి వరకూ కేంద్రానికి రూ.10,604.74 కోట్ల డివిడెండ్ అందింది. 2023–24లో డివిడెండ్లు రూ.50,000 కోట్లుకాగా, 2024–25లో ఈ విలువ అంచనాలు రూ.56,260 కోట్లు. -
ఖజానాకు అంచనాలను మించి డివిడెండ్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, పవర్‌గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు. -
ఆర్బీఐ, బ్యాంకింగ్ నుంచి డివిడెండ్ల ధమాకా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), బ్యాంకింగ్‌సహా ఇతర ప్రభుత్వ రంగ ఫైనాన్షియల్ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.02 లక్షల కోట్ల డివిడెండ్లు వస్తాయన్నది తాజా బడ్జెట్ అంచనా. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023–24 బడ్జెట్ అంచనా రూ.48,000 కోట్లయితే, ఊహించని రీతిలో రూ.1.04 లక్షల కోట్ల ఒనగూరుతాయన్నది తాజా బడ్జెట్ సవరిత అంచనా. ఆర్బీఐ ఒక్కటే గత ఏడాది మేలో రూ.87,416 కోట్ల డివిడెండ్ చెల్లించడంతో డివిడెండ్ రాబడులకు ఊతం లభించినట్లయ్యింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లభించిన డివిడెండ్లు రూ.39,961 కోట్లు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్ఈ) నుంచి ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ చెల్లింపులు రూ.43,000 కోట్లని బడ్జెట్ అంచనా. మొత్తంగా డివిడెండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,54,407 కోట్లు ఉంటే, 2024–25లో విలువ స్వల్పంగా రూ.1.50 లక్షల కోట్లకు తగ్గుతుందని తాజా బడ్జెట్ అంచనావేసింది. -
లాభాల్లోకి టొరెంట్ పవర్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టొరెంట్ పవర్ 2022–23 చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. రూ. 484 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 487 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 4 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం సైతం భారీగా ఎగసి రూ. 6,134 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 2,165 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో కేవలం రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,493 కోట్ల నుంచి రూ. 26,076 కోట్లకు ఎగసింది. ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్ల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. టొరెంట్ పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 556 వద్ద ముగిసింది. -
కార్పొరేట్ ఇండియా... డివిడెండ్ బొనాంజా!
ఇటీవల నగదు నిల్వలు అధికంగా గల(క్యాష్ రిచ్) కంపెనీలు వాటాదారులకు డివిడెండ్లు, బైబ్యాక్‌ల రూపంలో లాభాలను పంచేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు విస్తరణ ప్రాజెక్టుల వ్యయాలు తగ్గడం, వ్యాపార నిర్వహణ ద్వారా మెరుగుపడుతున్న క్యాష్‌ఫ్లో తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వార్షిక లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండుగా అందించనున్నట్లు ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ప్రకటించడాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు. వెరసి ఇకపై మరిన్ని కంపెనీలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇతర వివరాలు చూద్దాం.. ముంబై: కొద్ది రోజులుగా దేశీ బ్లూచిప్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యాంకులు, బీమా, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను మినహాయిస్తే.. పలు లిస్టెడ్ కంపెనీల వద్ద నగదు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఒక అంచనా ప్రకారం 2020 మార్చికల్లా టాప్ లిస్టెడ్ కంపెనీల వద్ద రూ. 11 లక్షల కోట్లకుపైగా నగదు, తత్సమాన నిల్వలున్నాయి. ఇవి ఆయా కంపెనీల మొత్తం నెట్‌వర్త్‌లో 30 శాతానికి సమానమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో తాజాగా లాభాల్లో 90 శాతం వరకూ డివిడెండ్లకు కేటాయించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇటీవల కాలంలో చెల్లించిన డివిడెండ్లతో పోలిస్తే ఇది రెట్టింపుకాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21)లో వాటాదారులకు భారీ నగదు అందనున్నట్లు నిపుణులు తెలియజేశారు. బజాజ్ ఆటో కొత్త డివిడెండ్ పాలసీ నేపథ్యం లో ఇకపై మరిన్ని కార్పొరేట్స్ ఈ బాటలో నడిచే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు గత వారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ డివిడెండ్ పంపిణీ పాలసీని సమీక్షించింది. దీనిలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా డివిడెండ్ పాలసీలోకి వచ్చే టాప్–500 కంపెనీల జాబితాను టాప్–1,000కు సవరించింది. ఇది డివిడెండ్ చెల్లింపు విధానాలలో మార్పులకు కారణంకానున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బజాజ్ దూకుడు... గత మూడేళ్లలో బజాజ్ ఆటో వాటాదారులకు లాభాల్లో 47 శాతం వాటాను డివిడెండ్లుగా పంచింది. ఈ బాటలో గతేడాది డివిడెండ్ చెల్లింపులకు రూ. 3,472 కోట్లను వెచ్చించింది. తద్వారా అధిక చెల్లింపుల జాబితాలో 10వ ర్యాంకులో నిలిచింది. రూ. 16,000 కోట్లవరకూ మిగులు ఉన్నదని, దీనికితోడు వార్షికంగా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు బజాజ్ ఆటో తెలియజేసింది. దీంతో అధిక డివిడెండ్ పాలసీకి తెరతీసినట్లు వెల్లడించింది. కాగా.. దేశీ కార్పొరేట్ల వద్ద గతేడాదికల్లా నగదు నిల్వలు 13.8%కి చేరాయి. ఇందుకు ఐటీ కంపెనీల ఆర్జనల మెరుగుదలతోపాటు.. రిలయన్స్, ఎయిర్టెల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల నిధుల సమీకరణ కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిమాండ్ ఎఫెక్ట్ ఇటీవల డిమాండ్ మందగించడంతో ఆటో, ఎఫ్ఎంసీజీ, విద్యుత్ తదితర రంగాలలో భారీ విస్తరణ ప్రణాళికలు తగ్గినట్లు ఈక్వినామిక్స్ అండ్ రీసెర్చ్ అడ్వయిజరీ పేర్కొంది. దీంతో మరిన్ని కంపెనీలు డివిడెండ్ చెల్లింపులను పెంచడం, షేర్ల బైబ్యాక్‌లు వంటివి చేపట్టవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే అధిక డివిడెండ్లను చెల్లిస్తున్న కొన్ని కంపెనీలు తమ లాభాల్లో మరింతగా ఇన్వెస్టర్లకు అందించే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ నేపథ్యంలోనూ గతేడాది(2019–20) ఫైనాన్షియల్‌యేతర రంగ కంపెనీలు 12.8% అధికంగా రూ.1.7 లక్షల కోట్లను వాటాదారులకు అందించినట్లు తెలిపారు. వెరసి 2019–20లో మొత్తం కంపెనీలు తమ నికర లాభాల్లో 78% వాటాను డివిడెండ్లకు కేటాయించాయి. అంతక్రితం ఏడాది ఇది 55% శాతమే. బైబ్యాక్‌లతో... 2019 జనవరి నుంచి చూస్తే పలు కంపెనీలు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లను చేపట్టాయి. తద్వారా దాదాపు రూ. 64,000 కోట్లను వెచ్చించాయి. ఈ జాబితాలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రాతోపాటు.. పీఎస్‌యూలు ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ప్రైవేట్ రంగ కంపెనీ అదానీ పోర్ట్స్ తదితరాలున్నాయి. పటిష్ట నిర్వహణ లాభాలు, నీరసించిన ట్రెజరీ ఈల్డ్స్, విస్తరణ ప్రణాళికల్లో మందగమనం వంటి అంశాలు పలు కంపెనీలను బైబ్యాక్, డివిడెండ్లవైపు ప్రోత్సాహిస్తున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేట్ వర్గాలు తెలియజేశాయి. -
అధిక డివిడెండ్లపై సర్కారు ఆశలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన ప్రతికూల పరిణామాలతో ఖజానా ఆదాయానికి గండి పడే అవకాశాలున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) చెల్లించే డివిడెండ్లపై కేంద్రం ఆశలు పెట్టుకుంది. వీలైనంత అధికంగా, సాధ్యమైనంత త్వరగా డివిడెండ్లు చెల్లించాలంటూ పీఎస్‌యూలకు సూచించింది. త్రైమాసికాలవారీగా చెల్లించేయాలంటూ కాస్త పటిష్టంగా ఉన్న సంస్థలను ఆదేశించింది. కనీస పరిమాణం చెల్లించాలన్న నిబంధనలను పట్టుకుని కూర్చోకుండా సాధ్యమైనంత ఎక్కువగా చెల్లించేందుకు కృషి చేయాలని పేర్కొంది. దీనివల్ల విడతలవారీగా వచ్చే డివిడెండుపై కాస్త అంచనాకు వచ్చేందుకు, తగు ప్రణాళికలు వేసుకునేందుకు వీలవుతుందని తెలిపింది. పెట్టుబడులు, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు అన్ని పీఎస్‌యూల అధిపతులకు లేఖలు పంపింది. ‘‘మిగతావాటితో పోలిస్తే కాస్త ఎక్కువగా డివిడెండ్లు చెల్లించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ).. త్రైమాసిక ఫలితాల తర్వాత ప్రతీ త్రైమాసికంలో మధ్యంతర డివిడెండ్ చెల్లించే అంశాలను పరిశీలించాలి. మిగతా సీపీఎస్ఈలు అర్ధ సంవత్సరానికోసారి మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించవచ్చు. ఇక డివిడెండ్ చెల్లింపునకు పెద్దగా అవకాశం లేని సంస్థలు .. వార్షికంగా కట్టే అంశం పరిశీలించవచ్చు. రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన తర్వాత తమ తమ అంచనాల ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్‌లో కట్టవచ్చు’’ అని పేర్కొంది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక అంచనాల్లో కనీసం 90 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా విడతలవారీగా మధ్యంతర డివిడెండ్ కింద కట్టడంపై దృష్టి పెట్టాలని దీపం సూచించింది. ప్రస్తుతం ఆఖర్లో చెల్లింపులు .. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత నిబంధనల ప్రకారం తమ లాభాల్లో 30 శాతం లేదా నికర విలువలో 5 శాతం మేర కనీస డివిడెండ్‌ను చెల్లిస్తున్నాయి. చాలా మటుకు కంపెనీలు సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో మధ్యంతర డివిడెండ్ చెల్లిస్తుంటాయి. అయితే, ఇలా ఆర్థిక సంవత్సరం ఆఖర్లో చెల్లించేటప్పుడు ... ఇతరత్రా సరఫరాదారులకు, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు మొదలైన వాటికి కూడా చేతిలో ఉన్న నిధులనే సర్దుబాటు చేయాల్సి వస్తుండటం .. కంపెనీలకు సమస్యాత్మకంగా మారుతోందని దీపం అభిప్రాయపడింది. చివర్లో కాకుండా ముందు నుంచీ కొంత కొంతగా చెల్లించడం వల్ల ఇలాంటి సమస్య ఉండదని పేర్కొంది. ఇక స్థిరమైన డివిడెండ్ విధానమంటూ ఉంటే ఇన్వెస్టర్లకు కూడా సీపీఎస్ఈ షేర్లపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొంది. ‘‘తరచుగా లేదా మూణ్నెల్లకోసారి డివిడెండ్లు చెల్లిస్తున్న పక్షంలో నాణ్యమైన ఇన్వెస్టర్లు.. ఆయా సంస్థల స్టాక్స్‌పై ఆసక్తి చూపవచ్చు. భవిష్యత్ డివిడెండ్లపై ఆశతో వాటిని అట్టే పెట్టుకుని కూడా ఉండవచ్చు’’ అని దీపం తెలిపింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల వల్లే తాజా ఆదేశాలు తెరపైకి వచ్చి ఉంటాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధానంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులే దీనికి కారణం. పీఎస్‌యూలు ఒకేసారి గాకుండా రెండు లేదా నాలుగు విడతల్లో గానీ చెల్లిస్తే అవి నగదును మెరుగ్గా నిర్వహించుకోగలవు. అలాగే, ప్రభుత్వం తన రుణ అవసరాలను బేరీజు వేసుకునేందుకు వీలుంటుంది. రుణ సమీకరణ ప్రణాళికలను అర్ధాంతరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బాండ్ మార్కెట్‌పైనా పెద్ద ప్రతికూల ప్రభావం ఉండదు’’ అని పేర్కొన్నారు. పీఎస్‌యూలకు ఆర్థికంగా ప్రతికూలం.. మరింత ఎక్కువగా డివిడెండ్ చెల్లించేలా ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి పెంచితే వాటి ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అధిక డివిడెండ్ చెల్లింపుల కారణంగా అవి తమ పెట్టుబడి వ్యయాల కోసం మరింతగా రుణాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి మరింత ఎక్కువ డివిడెండ్ చెల్లించే పరిస్థితిలో కూడా పీఎస్‌యూలు లేవని తెలిపారు. గడిచిన అయిదేళ్లలో ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, వంటి దిగ్గజాలు తమ లాభదాయకత తగ్గుతూ, రుణభారం పెరుగుతూ ఉన్నప్పటికీ డివిడెండ్లను అదే స్థాయిలోనో లేదా అంతకు మించే చెల్లిస్తూ వస్తున్నాయని పేర్కొన్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో 55 లిస్టెడ్ పీఎస్‌యూలు రూ. 82,750 కోట్ల లాభాలపై రూ. 47,000 కోట్ల మేర డివిడెండ్ చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో నమోదైన 70% పోలిస్తే ఇది కాస్త తగ్గి 57 శాతానికే పరిమితమైనప్పటికీ.. మిగతా కార్పొరేట్లతో పోలిస్తే మాత్రం ఎక్కువే. నిఫ్టీ50 సూచీలోని టాప్ సంస్థలు తమ లాభాల్లో సగటున 45% మాత్రమే చెల్లించాయి. అదే అయిదేళ్ల వ్యవధిలో చూస్తే ఈ 55 సంస్థలు సుమారు రూ. 3.85 లక్షల కోట్ల లాభాలపై మొత్తం రూ. 2.75 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించాయి. అంటే రికార్డు స్థాయిలో లాభాల్లో ఏకంగా 71.5% చెల్లించాయి. నిఫ్టీ 50 సంస్థలు చెల్లించిన దానికి (32 శాతం) ఇది రెట్టింపు. ఇవి కాకుండా షేర్ల బైబ్యాక్‌ల రూపంలోనూ ప్రభుత్వానికి పీఎస్‌యూలు గణనీయంగా చెల్లించాయి. -
రెండేళ్లు.. రూ.లక్ష కోట్లు..!
న్యూఢిల్లీ: దేశీ టాప్ 5 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజాలు షేర్హోల్డర్లకు గత రెండేళ్లలో సుమారు రూ. 1.17 లక్షల కోట్లు తిరిగి చెల్లించాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో షేర్ల బైబ్యాక్, డివిడెండ్స్ రూపంలో ఈ నిధులను చెల్లించాయి. సగటున డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 67గా లెక్కిస్తే దాదాపు 17.5 బిలియన్ డాలర్లు చెల్లించినట్లవుతుంది. ఇందులో అయిదింట నాలుగొంతుల వాటా టాప్ రెండు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్దే ఉంది. అయిదు టాప్ కంపెనీల్లో మూడు కంపెనీలు బోనస్‌లు కూడా ఇచ్చాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో ఈ ఐదు ఐటీ సంస్థల షేర్లు సుమారు 16–68 శాతం మేర పెరిగాయి. ఇలా షేర్హోల్డర్లకు తిరిగిచ్చిన మొత్తం నిధుల్లో దాదాపు 61 శాతం షేర్ల బైబ్యాక్ రూపంలోనే జరిగింది. టీసీఎస్ రూ. 32,000 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 21,200 కోట్ల మేర బైబ్యాక్స్ జరిపాయి. అటు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా అదే బాటలో నడవగా.. టెక్ మహీంద్రా ఒక్కటి మాత్రమే బైబ్యాక్ చేపట్టలేదు. మరోవైపు, టాప్ 4 కంపెనీలు చేసిన చెల్లింపుల్లో మొత్తం షేర్ల బైబ్యాక్ వాటా 54 శాతం నుంచి 89 శాతం దాకా ఉంది. బైబ్యాక్స్కే ఎందుకు ప్రాధాన్యం.. డివిడెండ్ల కన్నా షేర్ల బైబ్యాక్ వైపే కంపెనీలు ఎక్కువగా మొగ్గు చూపుతుండటానికి 2016 కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలే ప్రధాన కారణం. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్స్‌లు గట్రా కట్టేసిన తర్వాత వచ్చే నికర లాభం నుంచే డివిడెండ్ల చెల్లింపు ఉంటుంది. కానీ 2016 బడ్జెట్లో రూ. 10 లక్షల పైగా డివిడెండ్ అందుకునే హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్లు ఆ మొత్తంపై పది శాతం ట్యాక్స్ కట్టాల్సి వచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఇక కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తే.. దానిపై దాదాపు 20% దాకా (అసలు 15%, సర్‌చార్జి, సెస్సు మొదలైనవన్నీ కలిపి) డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) కట్టాల్సి వస్తుంది. ఈ కారణాలతో డివిడెండ్లకు ఆకర్షణీయత తగ్గింది. మరోవైపు, బైబ్యాక్ మార్గంలో షేర్లను తిరిగి కంపెనీకే విక్రయించినప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. దీనిపై పది శాతం మేర లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించినా.. డివిడెండ్లతో పోలిస్తే తక్కువే ఉంటుంది. అందుకే డివిడెండ్ల కన్నా బైబ్యాక్లవైపే కాస్త ఎక్కువ మొగ్గు ఉంటోందని నిపుణులు తెలిపారు. ఈపీఎస్ ప్రయోజనాలు కూడా.. డివిడెండ్ చెల్లించడం కన్నా షేర్లను బైబ్యాక్ చేయడం వల్ల కంపెనీలకు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డివిడెండును కంపెనీ నికర లాభం నుంచి నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. దీంతో.. కంపెనీ నికర విలువ, ఫలితంగా మార్కెట్ విలువ కూడా ఆ మేరకు కాస్త తగ్గుతుంది. అయితే, షేర్లను బైబ్యాక్ చేసినప్పుడు చలామణీలో ఉన్న మొత్తం షేర్ల సంఖ్య తగ్గడం వల్ల షేరువారీ ఆర్జన (ఈపీఎస్) పెరిగి, వేల్యుయేషన్ కూడా ఆ మేరకు పెరుగుతుంది. అంతే కాకుండా నిర్దిష్ట రేటు ప్రకారం కొనుగోలు ఉంటుంది కాబట్టి.. ఆ స్థాయిలో సంస్థ షేరు స్థిరపడేందుకు కూడా చాలా సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. బైబ్యాక్ ప్రకటించినా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించకుండా దూరంగా ఉంటే.. కంపెనీలో తమ వాటాలను మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. బోనస్‌లు కూడా.... షేర్ల బైబ్యాక్, డివిడెండ్లతో పాటు ఈ కంపెనీలు బోనస్ షేర్లు కూడా ప్రకటించాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు షేరు ఒక్కింటికి ఒక షేరు ఇచ్చాయి. విప్రో మాత్రం రెండు సార్లు బోనస్ ఇష్యూలు ప్రకటించింది. 2017లో షేరు ఒక్కింటికి ఒకటి చొప్పున ఇవ్వగా.. తాజాగా జనవరిలో మరో బోనస్ ఇష్యూకి బోర్డు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రతి 3 షేర్లకు ఒక్క షేరు చొప్పున బోనస్‌గా ఇవ్వనుంది. -
గ్రాన్యూల్స్ మధ్యంతర డివిడెండు 25 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై 25 శాతం మూడవ మధ్యంతర డివిడెండు చెల్లించాలని గ్రాన్యూల్స్ బోర్డు నిర్ణయించింది. డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 71 శాతం అధికమై రూ.60 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.411 కోట్ల నుంచి రూ.637 కోట్లకు చేరింది. ఏప్రిల్–డిసెంబరులో రూ.1,690 కోట్ల టర్నోవరుపై రూ.172 కోట్ల నికరలాభం పొందింది. బీఎస్ఈలో మంగళవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.73 శాతం తగ్గి రూ.88.40 వద్ద స్థిరపడింది. -
ఆయిల్ ఇండియా షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియా షేర్లను బైబ్యాక్ చేయనున్నది. 4.45 శాతం వాటాకు సమానమైన మొత్తం 5.04 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఆయిల్ ఇండియా పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ.215 ధరకు బైబ్యాక్ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్ విలువ రూ.1,085 కోట్ల వరకూ ఉండొచ్చని వివరించింది. షేర్ల బైబ్యాక్ ద్వారా రూ.5,000 కోట్లు ! ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ప్రభుత్వం నగదు నిల్వలు భారీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసింది. అధిక డివిడెండ్లు చెల్లించాలని, లేదా షేర్ల బైబ్యాక్ చేయాలని ఆయా సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఈ సంస్థల్లో సహజంగానే ప్రభుత్వానికి అధిక వాటా ఉండటంతో డివిడెండ్లు చెల్లించినా, షేర్ల బైబ్యాక్ జరిపినా, కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు రా -
హిందుస్తాన్ జింక్ స్పెషల్ డివిడెండ్ 13,985 కోట్లు
రికార్డు తేదీ ఈ నెల 30 ⇒ ఈ ఏడాది మొత్తం 27,157 కోట్లు ⇒ ఏడాదిలో ఇంత భారీ డివిడెండ్ ఇచ్చిన కంపెనీ ఇదే న్యూఢిల్లీ: వేదాంత గ్రూ ప్నకు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13,985 కోట్ల ప్రత్యేకమైన వన్ టైమ్ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.27.50 (1,375 శాతం) చొప్పున ఈ డివిడెండ్‌ను చెల్లించాలని బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ సమావేశం నిర్ణయించిందని హిందుస్తాన్ జింక్ పేర్కొంది. ఈ డివిడెండ్‌కు రికార్డ్ తేదీగా ఈ నెల 30ని నిర్ణయించామని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది ఏప్రిల్‌లో గోల్డెన్ జూబ్లీ డివిడెండ్‌ను చెల్లించాం. తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించాం. ఇప్పుడు స్పెషల్ వన్ టైమ్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించాం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మేం చెల్లించే మొత్తం డివిడెండ్ రూ.27,157 కోట్లకు (డీడీటీ–డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా కలుపుకొని) చేరుతుంది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏ కంపెనీ కూడా ఈ స్థాయిలో డివిడెండ్ చెల్లించలేదు’’ అని వివరించారు. తమ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉన్నందున రూ.11,259 కోట్లు దక్కుతాయని పేర్కొన్నారు. 2002లో ఈ కంపెనీని ప్రభుత్వం విక్రయించిందని, అప్పటి నుంచి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా కలుపుకుంటే తాము రూ.37,517 కోట్ల డివిడెండ్‌ను చెల్లించామని తెలిపారు. ఈ కంపెనీ వెండి, జింక్, సీసం లోహాలను ఉత్పత్తి చేస్తోంది. -
ప్రభుత్వానికి పవన్ హాన్స్ రూ.5.5 కోట్ల డివిడెండ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ పవన్ హాన్స్ సంస్థ రూ.5.5 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.ఈ చెక్కును న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు అందించామని పవన్ హాన్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమం లో రీ డిజైన్ చేసిన తమ కంపెనీ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారని కంపెనీ సీఎండీ బి.పి. శర్మ పేర్కొన్నారు. వినియోగదారులు సులభంగా తమ హెలికాప్టర్ల సర్వీసులను బుక్ చేసుకునేందుకు గాను రూపొందించిన మొబైల్ యాప్‌నుకూడా మంత్రి ఆవిష్కరించారని వివరించారు. ప్రస్తుతం 46 హెలికాప్టర్లతో సర్వీసులందజేస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరానికి రూ.36కోట్ల నికర లాభం సాధించామన్నారు. -
ఈక్విటీ ఫండ్స్‌లో డివిడెండ్ ఆప్షన్ ఓకేనా?
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు కాబట్టి... ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనదా లేకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయమంటారా? –సురేశ్, విశాఖపట్టణం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. పన్ను ప్రయోజనాలతో పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులను కూడా పొందవచ్చు. ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో లాగానే ఈఎల్ఎస్ఎస్ల్లో కూడా సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం సముచితం. ఒకవేళ మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులుంటే వాటిని నెలకి కొంత మొత్తంగా విభజించి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉండి, . ఆ తర్వాత పతనమైనప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత భాగం హరించుకుపోతుంది. ఈ రిస్క్ ఉండకూడదనుకుంటే మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిప్ విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. సాధారణంగా చాలా మంది పన్ను ఆదా నిమిత్తం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంపద సృష్టించుకోవచ్చు కూడా. కనీసం 5 నుంచి ఏడేళ్ల పాటు ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్లపై ఎలాంటి పన్ను లేనందున డివిడెండ్ ఆప్షన్ ను ఎంచుకోవాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? – స్పందన, హైదరాబాద్ మీ నిర్ణయం సరైనది కాదు. కేవలం పన్ను అంశాలు ఆధారంగా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం అర్థం లేనిది. మీకు క్రమానుగతంగా డబ్బులు అవసరమైతేనే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు, రిటైరైన తర్వాత మీకు వైద్య, ఇతర ఖర్చుల కోసం నెలా నెలా కొంత మొత్తం డబ్బులు అవసరమవుతాయి. ఇలాంటి సందర్బాల్లోనే డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే మీరు గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే డివిడెండ్ చెల్లింపు మొత్తాన్ని కూడా మళ్లీ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి, చక్రగతి వృద్ధితో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులు వస్తాయి. అలా కాకుండా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారనుకోండి. వచ్చే డివిడెండ్లు స్వల్పంగా ఉంటాయి. వీటిని ఖర్చు చేయడమో, లేకుంటే స్వల్పరాబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. ఇవి అలా వృ«థా అయిపోతాయి. ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్లపై ఎలాంటి పన్నులు లేవు. ఏడాది తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ను విక్రయిస్తే, ఎలాంటి మూలధన లాభాల పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకని కేవలం పన్ను అంశాలు ఆధారంగా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం అర్థం లేనిది. నా ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్) ఖాతాను రెండు దఫాలుగా పదేళ్లపాటు పొడిగించాను. ఇలా పొడిగించిన తర్వాత పీపీఎఫ్ ఖాతాపై వచ్చే రాబడులపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉందా? – రాజేశ్, బెంగళూరు రెండు దఫాలుగా పొడిగించిన తర్వాత కూడా మీ పీపీఎఫ్ ఖాతా రాబడులపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను పరంగా పీపీఎఫ్‌ను 3ఈ ఎగ్జెంప్ట్(మినహాయింపు)–ఎగ్జెంప్ట్–ఎగ్జెంప్ట్)గా వ్యవహరిస్తారు. అంటే మూడు దశల్లో(ఇన్వెస్ట్ చేసేటప్పుడు–మీ ఇన్వెస్ట్మెంట్స్ వృద్ధి చెందేటప్పుడు–ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునేటప్పుడు) పన్ను మినహాయింపులుంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే దశలో పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే వడ్డీపై కూడా ఎలాంటి పన్ను భారం ఉండదు. ఇక మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకునేటప్పుడు కూడా మీపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మెచ్యురిటీ తీరిన తర్వాత పొడిగించిన పీపీఎఫ్ ఖాతాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుతం నా వయస్సు 52 సంవత్సరాలు. ఎల్ఐసీ జీవన్ అక్షయ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. వడ్డీరేట్లు పడిపోతున్న నేపథ్యంలో దీర్ఘకాలానికి ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా? – జాన్సన్, విజయవాడ ఎల్ఐసీ జీవన్ అక్షయ్ సిక్స్ అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్. మీరు వన్‌టైమ్ ప్రీమియమ్ చెల్లించారనుకోండి. మీరు బతికున్నంత కాలం మీకు నెలవారీ లేదా సంవత్సరానికొకసారి కొంత మొత్తం చెల్లిస్తారు. మీరు చెల్లించిన ప్రీమియమ్‌ను తిరిగి పొందే ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీకు నెలవారీ వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనే దానిపై గరిష్ట పరిమితి లేదు. చెల్లింపులు ఎలా కావాలనుకుంటే అలా (నెలవారీ, మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి, ఏడాదికొకసారి) ఎంచుకోవచ్చు. ఇలాంటి సంప్రదాయ పెన్షన్ ప్లాన్లకు దూరంగా ఉండడమే మంచిది. ఇవి ఖరీదైనవి. ఈ తరహా ప్లాన్‌ల్లో పారదర్శకత ఉండదు. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, లేదా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లతో పోల్చితే ఈ స్కీమ్‌లో వచ్చే రాబడి తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. -
మ్యూచువల్ ఫండ్‌లో డివిడెండ్ ఖరారు ఎలా...?
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వృద్ధికి మాత్రమే కాదు, అడపా దడపా అవసరాలకు మధ్యంతరంగా నగదు అందుకునేందుకూ అక్కరకు వస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్లు ఉంటాయనే విషయం తెలిసిందే. డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మధ్య మధ్యలో డివిడెండ్ రూపంలో ఆదాయం పొందవచ్చు. మరి ఈ డివిడెండ్ ఖరారు ఎలా చేస్తారంటే... ఓ మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభం నుంచే డివిడెండ్ పంపిణీ ఉంటుంది. ఫండ్ మేనేజర్ లాభాలను నమోదు చేసినా, కంపెనీల నుంచి డివిడెండ్ రూపంలో ఆదాయం అందుకున్నా... ఒకవేళ డెట్ ఫండ్స్ అయితే వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం నుంచి ఈ డివిడెండ్ పంపిణీ ఉంటుంది. డివిడెండ్ ఎప్పుడెప్పుడు..? నెలకోసారి, త్రైమాసికంలో ఓ సారి లేదా వార్షికంగా ఒక సారి డివిడెండ్‌ను ప్రకటించే పథకాలు ఉంటాయి. మంత్లీ ఇన్కమ్ ప్లాన్లు, హైబ్రిడ్ ఫండ్స్‌లో చాలా వరకు క్రమం తప్పకుండా నెలనెలా డివిడెండ్‌ను జారీ చేస్తుంటాయి. ఎంత మొత్తం అంటే... నిర్దిష్టంగా ఇంత అని చెప్పడానికి ఉండదు. ముఖ్యంగా డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న మ్యూచువల్ఫండ్ పథకంలో యూనిట్ ఎన్ఏవీ... గ్రోత్ ఆప్షన్ యూనిట్ ఎన్ఏవీతో పోల్చి చూస్తే వృద్ధి చెందదు. ఎన్ఏవీ కొంచెం పెరిగిన వెంటనే ఆ మేరకు ఫండ్ మేనేజర్ డివిడెండ్‌ను పంపిణీ చేసేస్తుంటారు. ఉదాహరణకు ఓ ఫండ్ యూనిట్ రూ.10కి కొనుగోలు చేశారు. ఓ నెల తర్వాత అది రూ.12 అయిందనుకోండి. రూ.2ను డివిడెండ్‌గా ప్రకటించవచ్చు. పన్ను ఉంటుందా...? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జారీ చేసే డివిడెండ్ ఆదాయంపై పన్ను ఉండదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం ఫండ్ నిర్వహణ సంస్థ 28.84 శాతాన్ని డివిడెండ్ పంపిణీ పన్నుగా చెల్లిస్తుంది. డివిడెండ్ ఆప్షన్ సరైనదేనా...? రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడని ఇన్వెస్టర్లకు డివిడెండ్ ఆప్షనే సరైనది. అలాగే క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా ఇదే తగినది. దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవాలని కోరుకునే వారు మాత్రం గ్రోత్ ఆప్షన్ ఎంచుకుని సిప్ విధానంలో పెట్టుబడి పెడుతూ వెళ్లడం ఉత్తమమని నిపుణులు సూచిస్తుంటారు. డివిడెండ్ విధానంలో కాంపౌండింగ్ వడ్డీ ప్రయోజనం కోల్పోవడం వల్ల సంపద వృద్ధి సాధ్యం కాదు. -
ఇతర ఆదాయాలతో జాగ్రత్త!
• డివిడెండ్లుగుర్రపు పందేలు/లాటరీ మీది ఆదాయం • వడ్డీ బహుమతులు ఇంటి మినహా • ఇతరమార్గాల్లో వచ్చే అద్దె ఆదాయం నాలుగు రకాలు. ఇదేంటనుకుంటున్నారా? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మనం సంపాదించే డబ్బుని నాలుగు రకాల ఆదాయాలుగా విభజిస్తారు. అవే.. జీతం, ఇంటి మీద ఆదాయం, వృత్తి/వ్యాపార ఆదాయం, మూలధన లాభాలు. ఇవి కాక మనం చాలా మార్గాల్లో డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాం. అప్పుడు ఆ సంపాదనను ఇతర ఆదాయాల కింద పేర్కొంటాం. అవేంటో ఒకసారి చూద్దాం.. ఈ మార్గాల్లో వచ్చే డబ్బుని ఇతర ఆదాయంగా పరిగణిస్తాం. డివిడెండ్ల మీద వచ్చే ఆదాయానికి పూర్తిగా మినహాయింపు ఉంది. కుటుంబ పెన్షన్ విషయంలో కొంత మినహాయింపు పొందొచ్చు. ఫర్నీచర్ అద్దెకిస్తే వచ్చే ఆదాయంలోంచి వాటి మీది తరుగుదల మినహాయిస్తారు. బహుమతుల మీద పరిమితులు ఉన్నాయి. సంవత్సర కాలంలో రూ.50,000 లోపు బహుమతులకు పన్ను భారం లేదు. పెళ్లి కానుకలకు మినహాయింపు ఉంది. వీలునామా ద్వారా సంక్రమించే ఆస్తులకు పన్ను లేదు. రక్తసంబంధీకులిచ్చిన బహుమతులకు కూడా పన్నుభారం ఉండదు. ఈ బహుమతుల స్టోరీ చదవండి.. సుబ్బారావు, పార్వతమ్మ ఒకేసారి స్వర్గస్తుల య్యారు. సుబ్బారావు రాసిన వీలునామా ప్రకారం.. కొడుకు సత్యానికి ఒక భవంతి సంక్రమించింది. దీనికి పన్ను లేదు. తల్లి నుంచి పెద్ద కూతురు అన్నపూర్ణకి వంద తులాలు బం గారం, చిన్నకూతురు కృష్ణవేణికి రూ.5,00,000ల నగదు వచ్చింది. ఇద్దరికీ పన్ను భారం ఉండదు. స్వంత వ్యాపారం కోసం సత్యానికి ఆయన మామ, అత్త, మేనత్త, మేనమామ తలా రెండు లక్షల చొప్పున ఇచ్చారు. దీనికీ పన్ను భారం లేదు. అలాగే సత్యానికి తన చిన్నప్పటి స్నేహితుడు ప్రసాద్ రూ.2,00,000లు బహుమతిగా ఇచ్చాడు. దీన్ని మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు. సత్యం వ్యాపారం ‘మూడు పూలు.. ఆరు కాయలు’ లాగా అభివృద్ధి చెందింది. విపరీతమైన లాభాలు వచ్చాయి. ఈయనకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి లావ ణ్య పెళ్లి ఘనంగా చేశాడు. పెళ్లికి నగదు, ఆభరణాలు కానుకగా వచ్చాయి. దీని మీద పన్ను భారం లావణ్యకి లేదు. లావణ్యకు ఆమె మామ పెద్ద ఫ్లాటు రాసిచ్చారు. దీనికీ పన్ను భారం లేదు. అలాగే సత్యం కొడుకు చైతన్య, చిన్న కూతురు అరుణ ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. చైతన్య అక్క లావణ్యకి ఎన్నో సార్లు అక్కడి నుంచి డబ్బు బదిలీ చేశాడు. దీనికి సంబంధించి లావణ్యకి పన్ను భారం లేదు. అలాగే లావణ్య కూడా అరుణకి కొన్ని బహుమతులు పంపించేది. ఇక్కడ ఇరువురికీ పన్ను భారం లేదు. అంటే రక్తసంబంధీకులు ఇచ్చిపుచ్చుకునే వాటికి పన్ను భారం ఉండదు. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాత నిజంగా ఉండాలి. అతనికి ఇచ్చే సామర్థ్యముండాలి. అన్ని కల్పితాలైతే మాత్రం బహుమతులన్నీ ఆదాయం కిందకు వచ్చేస్తాయి. -
రిలయన్స్ క్యాపిటల్ డివిడెండ్ రూ.10
♦ క్యూ4లో 10% పెరిగిన నికర లాభం ♦ 12% వృద్ధితో రూ.2,828 కోట్లకు ఆదాయం ముంబై: రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.415 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే కాలానికి సాధించిన నికర లాభం(రూ.407 కోట్లు)తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,542 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.2,828 కోట్లకు పెరిగిందని వివరించింది.ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.1,001 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధితో రూ.1,101 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,929 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.9,998 కోట్లకు వృద్ధి చెందిందని వివరించింది. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ. 10 (వంద శాతం)డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ నెట్‌వర్త్ రూ.15,390 కోట్లుగా ఉంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ స్వల్పంగా పెరిగి రూ.384 వద్ద ముగిసింది. -
ప్రభుత్వానికి హిందుస్తాన్ జింక్
♦ పన్నులు రూపేణా మరో రూ.2,000 కోట్లు ♦ స్పెషల్ డివిడెండ్ రూ.3,000 కోట్లు న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ప్రభుత్వం బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి ఈ డివిడెండ్ తోడ్పడుతుందని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి హిందుస్తాన్ జింక్ కంపెనీ 1200% గోల్డెన్ జూబిలీ డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.24 డివిడెండ్‌ను ఇస్తామని పేర్కొంది. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది. రూ.2,995 కోట్ల డివిడెండ్ చెక్‌ను కంపెనీ సీఈఓ టామ్ అల్బనీజ్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేశారు. ఈ రూ.3,000 కోట్ల డివిడెండ్ మాత్రమే కాకుండా, ప్రభుత్వానికి పన్నుల రూపేణా మరో రూ.2,000 కోట్లు. మొత్తం మీద రూ.5,000 కోట్లు వస్తాయని ఈ వారం ప్రారంభంలో పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. -
హిందుస్తాన్ జింక్ డివిడెండ్ రూ.10,141 కోట్లు
♦ అత్యధిక డివిడెండ్ చెల్లిస్తున్న ప్రైవేట్ కంపెనీ ♦ 1200 శాతం స్పెషల్ గోల్డెన్ జూబ్లీ డివిడెండ్ న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.10,141 కోట్లు డివిడెండ్ చెల్లించనున్నది. ఈ స్థాయిలో డివిడెండ్‌ను చెల్లిస్తున్న తొలి ప్రైవేట్ రంగ కంపెనీ ఇదే. డివిడెండ్ ట్యాక్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తం రూ.12,205 కోట్లకు చేరుతుందని హిందుస్తాన్ జింక్ తెలిపింది. ఈ డివిడెండ్‌లో ప్రభుత్వానికి రూ.3,000 కోట్లు చెల్లిస్తున్నామని హిందుస్తాన్ జింక్ సీఈఓ సునీల్ దుగ్గల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకమైన స్వర్ణోత్సవ డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని వివరించారు. రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌పై 1200 శాతం(రూ.24) డివిడెండ్‌ను ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. 2002-03లో ప్రభుత్వం ఈ కంపెనీలో నియంత్రిత వాటాను అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్‌కు విక్రయించింది. 29.54 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. వాటా విక్రయం తర్వాత 2002 నుంచి రాయల్టీలు, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, డివిడెండ్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్.. తదితరాల రూపేణా ప్రభుత్వానికి రూ. 32,500 కోట్లు చెల్లించామని దుగ్గల్ వివరించారు. వేదాంత అనుబంధ కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ వెండి, జింక్, లెడ్ లోహాలను ఉత్పత్తి చేస్తోంది. కాగా బీఎస్ఈలో ఈ షేర్ 3.1 శాతం లాభంతో రూ.175 వద్ద ముగిసింది. -
సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్
రూ.5 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు రూ.4 హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ ఉన్న ఒకో షేర్‌కు రూ.4 మధ్యంతర డివిడెండ్(80 శాతం)ను ఇస్తామని కంపెనీ పేర్కొంది. గురువారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కాగా తొలి మధ్యంతర డివిడెండ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో ఒక్కో షేర్‌కు రూ.3 చొప్పున ప్రకటించింది. గురువారం బీఎస్ఈలో సైయంట్ షేర్ 1.8 శాతం లాభంతో రూ.421 వద్ద ముగిసింది. -
కార్పొరేట్ల డివిడెండ్ల జోరు...
బడ్జెట్లో 10 శాతం డీడీటీ ఎఫెక్ట్ న్యూఢిల్లీ: కంపెనీలు డివిడెండ్ల మీద డివిడెండ్లు ప్రకటిస్తున్నాయి. ఒక్క గురువారం రోజే 47 కంపెనీలు డివిడెండ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హీరో మోటొకార్ప్, శ్రీ సిమెంట్, టొరంట్ తదితర కంపెనీలు డివిడెండ్లను ప్రకటించాయి. అరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్లో రూ.10 లక్షలకు మించిన కంపెనీల డివిడెండ్లపై 10% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీటీటీ) విధించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదన వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తున్నందున, ఈ లోపే డివిడెండ్లు ప్రకటించి, చెల్లింపులు జరిపితే ప్రమోటర్లు పన్ను పోటు నుంచి తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులంటున్నారు. దాదాపు 253 కంపెనీలు మధ్యంతర డివిడెండ్ల ప్రకటనల కోసం బోర్డ్ మీటింగ్‌లను నిర్వహిస్తున్నట్లు బీఎస్ఈకి వెల్లడించాయి. ఇప్పటికే 60 కంపెనీలు డివిడెండ్లను ప్రకటించాయి. ఇక గురువారం నాడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కో షేర్‌కు రూ.10.50 మధ్యంతర డివిడెండ్లను ప్రకటించింది. కంపెనీ డివిడెండ్‌గా చెల్లించే రూ.3,300 కోట్ల మొత్తంలో 46 శాతం అంబానీ కుటుంబానికే వెళుతుందని అంచనా. దీనికి రికార్డ్ డేట్‌గా ఈ నెల 18ని నిర్ణయించింది. ఇక టూ వీలర్ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఒక్కో షేర్‌పై రూ.40 మధ్యంతర డివిడెండ్లను ప్రకటించింది. ఇక మరో టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో ఒక్కో షేర్‌కు రూ.50 చొప్పున డివిడెండ్లను బుధవారమే ప్రకటించింది. -
మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లపై పన్ను ఉంటుందా?
దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయా ? లేకుంటే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)లు ఎక్కువ రాబడులనిస్తాయా? రెండింటిలో ఏవి ఉత్తమం? - ఉత్తమ్, విజయవాడ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో ట్రేడవుతాయి. ఇన్వెస్టర్లు వీటిని బ్రోకర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. అమ్మవచ్చు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి బాగా పాపులర్. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇప్పటివరకైతే, దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్స్ విషయమై, ఈటీఎఫ్‌ల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులనిస్తున్నాయి. అందుకని మంచి రేటింగ్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ఫండ్ను ఎంచుకొని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మ్యూచువల్ ఫండ్స్ చెల్లించే డివిడెండ్లపై పన్ను ఉంటుందా? ఒక వేళ ఉంటే ఎంత రేటు చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.? మ్యూచువల్ ఫండ్ కంపెనీయే పన్ను మినహాయించుకొని మిగిలింది ఇన్వెస్టర్లకు చెల్లిస్తాయా? - నిరంజన్, కరీంనగర్ ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రకటించే డివిడెండ్లపై మ్యూచువల్ ఫండ్ కంపెనీలు 28.84 శాతం చొప్పున డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)ని చెల్లిస్తాయి. ఈ పన్ను మొత్తం పోగా మిగిలిన రాబడిని ఇన్వెస్టర్లకు చెల్లిస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్లపై ఎలాంటి డీడీటీ ఉండదు. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. నేను పాత పెన్షన్ స్కీమ్ కిందకు వస్తాను. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సీసీడీ(1బీ) కింద అదనంగా రూ.50,000 పన్ను మినహాయింపు పొందడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చా? - ప్రకాశ్, సికింద్రాబాద్ మీరు నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో చేరి అదనంగా రూ.50,000 పన్ను రాయితీని సెక్షన్80సీసీడీ(1బీ)కింద పొందవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే ఇతర పెన్షన్, ప్రావిడెండ్ ఫండ్ల పెట్టుబడులతో పోల్చితే ఎన్‌పీఎస్‌లో పెట్టే పెట్టుబడులు స్వతంత్రంగా ఉంటాయి. ఏడాది వయస్సున్న నా కొడుకుకు వాడి అమ్మమ్మ రూ.10,000 బహుమతిగా ఇచ్చింది. ఈ డబ్బులు మరో పదేళ్ల దాకా నాకు అవసరం ఉండదు.ఈ సొమ్ములను వాడి భవిష్యత్ చదువుల కోసం వినియోగిద్దామనుకుంటున్నాను. ఈ డబ్బులను బ్యాలెన్స్డ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? లేకుంటే హైబ్రిడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా ? - విజయ్, నెల్లూరు మీ పెట్టుబడి కాలపరిమితి పదేళ్లు కాబట్టి. మీరు నిరభ్యంతరంగా ఈక్విటీ ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలంలో మరే ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనం కన్నా ఈక్విటీలే మంచి రాబడులను ఇస్తాయి. కాబట్టి సంపద సృష్టికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడమే సరైనది. స్టాక్ మార్కెట్లో తొలిసారిగా ఇన్వెస్ట్ చేసేవారికి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇస్తుంటాం. ఈ ఫండ్స్‌లో ఈక్విటీలో కనీసం 65%, మిగిలినది డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి కేటాయింపుల కారణంగా పూర్తి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఇవి తక్కువ ఒడిదుడుకులకు గురవుతాయి. స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులుగా ఉన్నప్పుడు డెట్ విభాగం కుషన్‌గా పనిచేస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేయడానికి కింది బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించచవచ్చు. .. ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా ప్రుడెన్స్ ఫండ్, ఎస్బీఐ మ్యాగ్నమ్ బ్యాలెన్స్డ్ ఫండ్, టాటా బ్యాలెన్స్డ్ ఫండ్, టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్, నా పుట్టింటి వారి నుంచి స్త్రీ ధనం కింద రూ. 2 లక్షల వరకూ వచ్చాయి. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నేను మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త. అందుకని ముందుగా ఏదైనా ఒక లిక్విడ్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. ఈ లిక్విడ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని సూచించాడు. ఆ తర్వాత ఇదే మ్యూచువల్ ఫండ్ సంస్థకు సంబంధించి వేరే ఫండ్‌ను ఎంచుకొని, ఈ కొత్త ఫండ్‌లోకి లిక్విడ్ ఫండ్ పెట్టుబడులను బదిలీ చేయమని సలహా ఇచ్చాడు, ఇది పెట్టుబడులకు సంబంధించి ఇది సరైన వ్యూహామేనా? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? వివరించండి? - ప్రణవి, విశాఖపట్టణం మీ మిత్రుడు చెప్పింది. బహుశా సిస్టమాటిక్ టాన్స్‌ఫర్ ప్లాన్(సీటీపీ) గురించి అయి ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే. మీ దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నాయనుకోండి. వీటిని దశలవారీగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. దీనికి రెండు రకాల పద్ధతులున్నాయి. మొదటిది... ముందుగా ఈ మొత్తాన్ని ఏదైనా ఒక బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. ఈ ఖాతా నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఏదైనా ఈక్విటీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. రెండో విధానం..., మీ దగ్గరున్న పెద్ద మొత్తాన్ని ముందుగా ఏదైనా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)ద్వారా ఈ లిక్విడ్ ఫండ్ నుంచి ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకోవాలి. మీ దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్నప్పుడు ఈ విధానం అనుసరిస్తే ఒకింత అధిక రాబడులు పొందవచ్చు. అయితే ఎస్టీపీ విధానాన్ని అనుసరిస్తే మీరు కొంత పన్ను భారాన్ని భరించక తప్పదు. ఒక లిక్విడ్ ఫండ్ నుంచి కొంత నిర్ణీత మొత్తంలో ఈక్విటీ ఫండ్‌కు బదిలీ చేసినప్పుడు.. లిక్విడ్ ఫండ్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకొని, ఈక్విటీ ఫండ్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టినట్లుగా భావిస్తారు. లిక్విడ్ ఫండ్‌లోని యూనిట్లను మూడేళ్లకు ముందే బదిలీ చేస్తే, వీటిపై వచ్చిన లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. మూడేళ్ల తర్వాత ఈ యూనిట్లను విక్రయిస్తే, వాటిపై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుగా పరిగణిస్తారు. 20% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఇండెక్సేషన్ బెనిఫిట్)తో చెల్లించాల్సి ఉంటుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
హెచ్‌యూఎల్ లాభం జూమ్
క్యూ4లో 17 శాతం అప్; రూ. 1,018 కోట్లు... ⇒ ఆదాయం రూ.7,555 కోట్లు; 9% వృద్ధి ⇒ షేరుకి రూ. 9 తుది డివిడెండ్ న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) నికర లాభం దాదాపు 17 శాతం పెరిగి రూ. 1,018 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 872 కోట్లు. తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయం రూ. 6,936 కోట్ల నుంచి 9 శాతం వృద్ధి చెంది రూ. 7,555 కోట్లకు పెరిగింది. కొన్ని ప్రాపర్టీల విక్రయం ద్వారా రూ. 170 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు సంస్థ తెలిపింది. మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ పోటీ సంస్థలను మించి మెరుగైన లాభాలు ఆర్జించే దిశగా తాము నిలకడైన వ్యూహాన్ని అనుసరిస్తున్నామని హెచ్‌యూఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని తెలిపారు. మార్జిన్లను మెరుగుపర్చుకుంటూ, మరోసారి మార్కెట్‌ను మించిన పనితీరును కనపర్చగలిగామన్నారు. మరోవైపు, పట్టణ మార్కెట్లను మించి గ్రామీణ ప్రాంత మార్కెట్లు ఎదుగుతూ వచ్చినప్పటికీ.. గత 2-3 ఏళ్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్లలో అమ్మకాలు కాస్త మందగించాయని సంస్థ సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలిపారు. షేరు ఒక్కింటికి రూ. 9 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. రెండంకెల వృద్ధి..: సోప్స్, డిటర్జెంట్లతో పాటు శిశు సంరక్షణ ఉత్పత్తులు లాంటివి కొన్నింటిని మినహాయిస్తే మిగతా ఉత్పత్తుల అమ్మకాలు రెండంకెల స్థాయి వృద్ధిని నమోదు చేశాయి. సోప్స్, డిటర్జెంట్స్ విభాగం అమ్మకాల ఆదాయం 5 శాతం పెరిగి రూ. 3,674 కోట్లు, బేవరేజెస్ ఆదాయం 12 శాతం పెరిగి రూ. 976 కోట్లు, పర్సనల్ కేర్ విక్రయాలు 13 శాతం పెరిగి రూ.2,250 కోట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాలు 14 శాతం పెరిగి రూ. 477 కోట్లు వచ్చాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్‌యూఎల్ నికర లాభం రూ.3,867 కోట్ల నుంచి రూ. 4,315 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.27,048 కోట్ల నుంచి రూ. 30,170 కోట్లకు ఎగిసింది. శుక్రవారం బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు 3.34% పెరిగి రూ. 894.60 వద్ద ముగిసింది. -
కోటక్ బ్యాంక్ 1:1 బోనస్ షేర్లు
⇒ క్యూ4లో నికర లాభం 38 శాతం అప్ ⇒ ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్ ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. జనవరి-మార్చి క్వార్టర్‌కు రూ.913 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించామని బ్యాంక్ తెలిపింది. అంతక్రితం ఏడాది క్యూ4 లాభం(రూ.663 కోట్లు)తో పోల్చితే 38% వృద్ధి సాధించామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఎండీ ఉదయ్ కోటక్ వెల్లడించారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఒక్కో బోనస్ షేర్‌ను ఇవ్వాలన్న ప్రతిపాదనను, రూ.5 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు 90 పైసలు డివిడెండ్ ఇవ్వడానికీ డెరైక్టర్ బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించారు. మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధి: వడ్డీయేతర ఆదాయం రెట్టింపు కావడంతో ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని ఉదయ్ కోటక్ వెల్లడించారు. మొత్తం ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 4,782 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.6,172 కోట్లకు ఎగసిందని తెలిపారు. నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.1,123 కోట్లకు, ఇతర ఆదాయం 94% వృద్ధితో రూ.1,018 కోట్లకు పెరిగాయని వివరించారు. స్టాండోలోన్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం రూ.407 కోట్ల నుంచి 29% వృద్ధితో రూ.527 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.2,553 కోట్ల నుంచి రూ.3,249 కోట్లకు పెరిగాయన్నారు. ఐఎన్జీ వైశ్యా విలీన ప్రభావంతో కూడిన ఆర్థిక ఫలితాలు జూన్ క్వార్టర్ నుంచి ఉంటాయని ఉదయ్ కోటక్ తెలిపారు. ఎన్ఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 6.3 శాతం వృద్ధితో రూ.1,423కు చేరింది. -
12% పెరిగిన గోద్రెజ్ కన్సూమర్ నికర లాభం
- నికర అమ్మకాలు 8 శాతం అప్ - షేర్‌కు రూ.2.5 నాలుగో మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ: గోద్రెజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్(జీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.266 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.236 కోట్లు)తో పోల్చితే 12 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.1,924 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,083 కోట్లకు పెరిగాయని గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.760 కోట్ల నుంచి రూ.907 కోట్లకు, నికర అమ్మకాలు రూ.7,583 కోట్ల నుంచి రూ.8,242 కోట్లకు పెరిగాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్‌గా షేర్‌కు రూ.2.5 ఇవ్వనున్నామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కంటే తర్వాతి ఆరు నెలల్లో మంచి పనితీరు కనబరిచామని వివరించారు. భారత్‌లో ఎఫ్ఎంసీజీ వృద్ధి కారణంగా మంచి వ్యాపారం సాధించామని వివరించారు. నవ కల్పనలకు, బ్రాండ్ బిల్డింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చామని, ఫలితంగా మంచి అమ్మకాలు సాధించామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ.1,098 వద్ద ముగిసింది.