12% పెరిగిన గోద్రెజ్ కన్సూమర్ నికర లాభం
- నికర అమ్మకాలు 8 శాతం అప్
- షేర్‌కు రూ.2.5 నాలుగో మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ: గోద్రెజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్(జీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.266 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నికర లాభం(రూ.236 కోట్లు)తో పోల్చితే 12 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.1,924 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.2,083 కోట్లకు పెరిగాయని గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్ చెప్పారు.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.760 కోట్ల నుంచి రూ.907 కోట్లకు, నికర అమ్మకాలు రూ.7,583 కోట్ల నుంచి రూ.8,242 కోట్లకు పెరిగాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి నాలుగో మధ్యంతర డివిడెండ్‌గా షేర్‌కు రూ.2.5 ఇవ్వనున్నామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కంటే తర్వాతి ఆరు నెలల్లో మంచి పనితీరు కనబరిచామని వివరించారు. భారత్‌లో ఎఫ్‌ఎంసీజీ వృద్ధి కారణంగా మంచి వ్యాపారం సాధించామని వివరించారు.
నవ కల్పనలకు, బ్రాండ్ బిల్డింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చామని, ఫలితంగా మంచి అమ్మకాలు సాధించామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేనున్నామని తెలిపారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం క్షీణించి రూ.1,098 వద్ద ముగిసింది.