ప్రభుత్వానికి హిందుస్తాన్ జింక్
♦ పన్నులు రూపేణా మరో రూ.2,000 కోట్లు
♦ స్పెషల్ డివిడెండ్ రూ.3,000 కోట్లు
న్యూఢిల్లీ: అనిల్ అగర్వాల్‌కు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించింది. ప్రభుత్వం బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి ఈ డివిడెండ్ తోడ్పడుతుందని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరానికి హిందుస్తాన్ జింక్ కంపెనీ 1200% గోల్డెన్ జూబిలీ డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.24 డివిడెండ్‌ను ఇస్తామని పేర్కొంది. హిందుస్తాన్ జింక్‌లో ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది. రూ.2,995 కోట్ల డివిడెండ్ చెక్‌ను కంపెనీ సీఈఓ టామ్ అల్బనీజ్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేశారు. ఈ రూ.3,000 కోట్ల డివిడెండ్ మాత్రమే కాకుండా, ప్రభుత్వానికి పన్నుల రూపేణా మరో రూ.2,000 కోట్లు. మొత్తం మీద రూ.5,000 కోట్లు వస్తాయని ఈ వారం ప్రారంభంలో పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు.