హిందుస్తాన్ జింక్ స్పెషల్ డివిడెండ్ 13,985 కోట్లు
రికార్డు తేదీ ఈ నెల 30
⇒ ఈ ఏడాది మొత్తం 27,157 కోట్లు
⇒ ఏడాదిలో ఇంత భారీ డివిడెండ్ ఇచ్చిన కంపెనీ ఇదే
న్యూఢిల్లీ: వేదాంత గ్రూ ప్‌నకు చెందిన హిందుస్తాన్ జింక్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13,985 కోట్ల ప్రత్యేకమైన వన్ టైమ్ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.27.50 (1,375 శాతం) చొప్పున ఈ డివిడెండ్‌ను చెల్లించాలని బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్ సమావేశం నిర్ణయించిందని హిందుస్తాన్ జింక్ పేర్కొంది. ఈ డివిడెండ్‌కు రికార్డ్ తేదీగా ఈ నెల 30ని నిర్ణయించామని కంపెనీ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘‘గత ఏడాది ఏప్రిల్‌లో గోల్డెన్ జూబ్లీ డివిడెండ్‌ను చెల్లించాం. తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించాం.
ఇప్పుడు స్పెషల్ వన్ టైమ్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించాం. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మేం చెల్లించే మొత్తం డివిడెండ్ రూ.27,157 కోట్లకు (డీడీటీ–డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా కలుపుకొని) చేరుతుంది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఏ కంపెనీ కూడా ఈ స్థాయిలో డివిడెండ్ చెల్లించలేదు’’ అని వివరించారు. తమ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉన్నందున రూ.11,259 కోట్లు దక్కుతాయని పేర్కొన్నారు. 2002లో ఈ కంపెనీని ప్రభుత్వం విక్రయించిందని, అప్పటి నుంచి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను కూడా కలుపుకుంటే తాము రూ.37,517 కోట్ల డివిడెండ్‌ను చెల్లించామని తెలిపారు. ఈ కంపెనీ వెండి, జింక్, సీసం లోహాలను ఉత్పత్తి చేస్తోంది.