2002లో పల్నాడు జిల్లా బండ్లమోటులో మూతపడిన హిందుస్థాన్ జింక్ ఫ్యాక్టరీ
ఒకప్పుడు మినీ విశాఖగా వెలుగొందిన ఈ ప్రాంతం
517 ఎకరాల్లో 480 మంది కార్మికులతో 1978లో తవ్వకాలు ప్రారంభం
20 ఏళ్లపాటు రోజుకు 240 టన్నుల సీసంను శుద్ధి చేసిన ఘనత
అంతర్జాతీయ మార్కెట్‌లో సీసం ధరలు పడిపోవడంతో మూసివేత
ప్రస్తుతం ‘సీసం’కు భారీ డిమాండ్
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలంటున్న ప్రజాసంఘాలు
సాక్షి, నరసరావుపేట: బండ్లమోటు.. రాష్ట్ర చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన ఈ ప్రాంతంలో దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధికంగా సీసం లభించే ప్రాంతంగా చరిత్రలోకెక్కింది. దీంతో హిందుస్థాన్ కంపెనీ జింక్ ఫ్యాక్టరీని నిర్మించింది. మినీ వైజాగ్‌గా గుర్తింపు పొంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. కాలక్రమేణా ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనమవడంతో 2002లో ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు తిరిగి జింక్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో శుద్ధిచేసిన జింక్ ధరలు రూ.1.3 నుంచి 1.5 లక్షల మధ్య ఉంటుండటంతో సీసం తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తిరిగి ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.
480 మందితో మొదలైన తవ్వకాలు...
బండ్లమోటులో సర్వే ఆఫ్ ఇండియా 1969లో సర్వే నిర్వహించి.. ఇక్కడ సీసం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా కేంద్రం హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1978లో 480 మంది కార్మికులతో పనులు ప్రారంభించింది. 1980 నాటికి రోజుకు 240 టన్నుల సీసం శుద్ధి చేసే స్థాయికి కంపెనీ చేరింది. 1993కి ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాక సీసం ధరలు పడిపోయాయి.
గనులు నిర్వహణతో లాభం లేకపోవడంతో ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు “గోల్డెన్‌షేక్ హ్యాండ్’ పేరిట 150 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పించింది. దీంతో 310 మంది ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 160కి పడిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులతో కొంతకాలం నెట్టుకొచ్చారు. 1998కి బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీను సొంతం చేసుకుంది. ఇక్కడి వెలికితీసిన సీసం శుద్ధి చేయడానికి రాజస్థాన్‌కు పంపడంతో రవాణా ఖర్చు తడిసిమోపెడు అవడంతో కంపెనీని మూసివేసింది. ఆ సమయంలో 125 మంది శాశ్వత, 150 మంది కాంట్రాక్టు సిబ్బంది ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వీరితోపాటు పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది రోడ్డునపడ్డారు.
అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో...
గత కొంత కాలంగా అంతర్జాతీయంగా సీసం ధరలు రూ.1.3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉంటోంది. దీంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తిరిగి తవ్వకాలు ప్రారంభించేందుకు కృషి చేసింది. 2022 డిసెంబర్‌లో ప్రైవేట్ కంపెనీలను టెండర్లు వేయాలని ప్రకటన జారీ చేసింది. కొంత సాంకేతిక సమస్యలతో బిడ్డింగ్ పనులు ఆలస్యం అవ్వడం, ఇంతలో ఎన్నికల సమీపించడంతో ఈ ప్రతిపాదన మరుగునపడింది.
తాజాగా బండ్లమోటు కార్మికల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసి తిరిగి తవ్వకాలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. పెరిగిన ధరలతో గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గనిలో ఇంకా మేలైన సీసం నిల్వలు ఉన్నాయి. గతంలో తవ్వి తీసి ధరలు పడిపోవడంతో వదిలేసిన ముడి ఖనిజం సైతం 15 లక్షల టన్నుల వరకు నిల్వ ఉంది. ఇప్పటికే తవ్వితీసిన గనులను పర్యాటక క్షేత్రంగా మలిస్తే ఈ ప్రాంతానికి ఆర్థికంగా బలం చేకూర్చినట్టు అవుతుంది.
తవ్వకాలు చేపట్టాలి
నేను బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా పనిచేశాను. గతంలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ మూతపడటంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. అప్పట్లో సీసం ధరలు తక్కువగా ఉండటం, తవ్వకం ఖర్చు పెరగడంతో మూతపడింది. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించి తవ్వకాలు ప్రారంభిస్తే మంచిది. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులు సైతం పునరుద్ధరించుకోవాల్సి ఉంది.
– జయకర్ రావు, కార్మిక సంఘం మాజీ వర్కింగ్ సెక్రటరీ, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్
జీవనశైలిలో మార్పు వస్తుంది
ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్‌లో సీసం ధరలతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి సానుకూలంగా ఉంది. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ఈప్రాంత ప్రజల జీవనశైలిలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దళిత, గిరిజన ప్రజలలో సాంఘిక పరమైన మార్పులు పెద్ద ఎత్తున రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి వీలైనంత త్వరగా తవ్వకాలు పునఃప్రారంభించాలి. గతంలో పనిచేసిన కార్మికులంతా కలిసి మాకు చేతనైనంతగా పోరాటాలు చేస్తున్నాం.
– ఎంహెచ్ ప్రసాద్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, కార్మిక సంఘం పూర్వ నేత
Comments
Please login to add a commentAdd a comment