bollapalli
-
సాగర్‌కు ‘బొల్లపల్లి’ గండి!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని తాజాగా ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీ.ల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే తమ వ్యతిరేకతను తెలపడంతోపాటు ఈ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖలు రాయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గోదావరి బోర్డుకు ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలింపు నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు 9 స్లూయిస్ గేట్లు ఉండగా, గేట్లన్నింటినీ 520 అడుగుల మేర పైకి లేపితే గరిష్టంగా 33,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం కుడి కాల్వ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండానే కుడికాల్వ సామర్థ్యాన్ని 33 వేల క్యూసెక్కులకు పెంచుకున్నా, 11 వేల క్యూసెక్కులను యథాతథంగా ఆయకట్టుకు సరఫరా చేసి మిగిలిన 22 వేల క్యూసెక్కులను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు గడిచిన ఆరేళ్లలో ఏకంగా ఐదేళ్లు కృష్ణానదిలో మిగులు జలాల లభ్యత ఉందని, ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి నీరు వృథాగా పోయిందని కేంద్రానికి తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపుతో పోల్చితే నాగార్జునసాగర్ నుంచి తరలిస్తేనే తక్కువ వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. నీటి లభ్యత బాగా ఉన్న సమయాల్లో సాగర్ నుంచి (తమ వాటా) జలాలను తరలించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసుకుంటే వర్షాభావ సీజన్లలో క్యారీ ఓవర్ జలాలుగా వాడుకోగలమని తెలిపింది. కృష్ణా, గోదావరి పరీవాహకంలో చిట్టచివరి రాష్ట్రం కావడంతో తమకు రెండింటి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. రెండు నదుల మిగులు జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని తెలియజేసింది. నికర జలాల తరలింపునకే ! వరదల సమయంలో నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఏపీ పేర్కొంటున్నా, నికర జలాలను సైతం తరలించుకుంటుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్‌లో సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ పరిధిలో ఉండగా, ఏడాది కింద ఏపీ సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామని కేంద్రం ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. మళ్లీ తాజాగా సాగర్‌ను బొల్లపల్లి రిజర్వాయర్‌తో అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదించడంతో భవిష్యత్‌లో సాగర్ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 8.1 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి ఏకకాలంలో తరలింపు గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును మూడు విభాగాల్లో (సెగ్మెంట్స్) వి భజించి ఏపీ ప్రతిపాదించింది. తొలి విభా గం కింద పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిçపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ తెలిపింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణాన ది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. భవిష్యత్ అవసరాల ను తీర్చడానికి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచే వీలుందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా నా గార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని మరో లింక్‌ను ప్రతిపాదించింది. ఇక మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని పేర్కొంది.ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లురోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను తరలించడానికి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40,500 ఎకరాల భూసేకరణ, 17,000 ఎకరాల అటవీ భూములు కావాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు కాగా, లిఫ్టుల నిర్వహణకు 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
మూతపడిన బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ తెరవాలి
సాక్షి, నరసరావుపేట: బండ్లమోటు.. రాష్ట్ర చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన ఈ ప్రాంతంలో దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధికంగా సీసం లభించే ప్రాంతంగా చరిత్రలోకెక్కింది. దీంతో హిందుస్థాన్ కంపెనీ జింక్ ఫ్యాక్టరీని నిర్మించింది. మినీ వైజాగ్‌గా గుర్తింపు పొంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. కాలక్రమేణా ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమవడంతో 2002లో ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు తిరిగి జింక్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్లో శుద్ధిచేసిన జింక్ ధరలు రూ.1.3 నుంచి 1.5 లక్షల మధ్య ఉంటుండటంతో సీసం తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తిరిగి ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.480 మందితో మొదలైన తవ్వకాలు...బండ్లమోటులో సర్వే ఆఫ్ ఇండియా 1969లో సర్వే నిర్వహించి.. ఇక్కడ సీసం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా కేంద్రం హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1978లో 480 మంది కార్మికులతో పనులు ప్రారంభించింది. 1980 నాటికి రోజుకు 240 టన్నుల సీసం శుద్ధి చేసే స్థాయికి కంపెనీ చేరింది. 1993కి ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాక సీసం ధరలు పడిపోయాయి. గనులు నిర్వహణతో లాభం లేకపోవడంతో ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు “గోల్డెన్‌షేక్ హ్యాండ్’ పేరిట 150 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పించింది. దీంతో 310 మంది ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 160కి పడిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులతో కొంతకాలం నెట్టుకొచ్చారు. 1998కి బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీను సొంతం చేసుకుంది. ఇక్కడి వెలికితీసిన సీసం శుద్ధి చేయడానికి రాజస్థాన్‌కు పంపడంతో రవాణా ఖర్చు తడిసిమోపెడు అవడంతో కంపెనీని మూసివేసింది. ఆ సమయంలో 125 మంది శాశ్వత, 150 మంది కాంట్రాక్టు సిబ్బంది ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వీరితోపాటు పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది రోడ్డునపడ్డారు.అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో...గత కొంత కాలంగా అంతర్జాతీయంగా సీసం ధరలు రూ.1.3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉంటోంది. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తవ్వకాలు ప్రారంభించేందుకు కృషి చేసింది. 2022 డిసెంబర్లో ప్రైవేట్ కంపెనీలను టెండర్లు వేయాలని ప్రకటన జారీ చేసింది. కొంత సాంకేతిక సమస్యలతో బిడ్డింగ్ పనులు ఆలస్యం అవ్వడం, ఇంతలో ఎన్నికల సమీపించడంతో ఈ ప్రతిపాదన మరుగునపడింది.తాజాగా బండ్లమోటు కార్మికల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసి తిరిగి తవ్వకాలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. పెరిగిన ధరలతో గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గనిలో ఇంకా మేలైన సీసం నిల్వలు ఉన్నాయి. గతంలో తవ్వి తీసి ధరలు పడిపోవడంతో వదిలేసిన ముడి ఖనిజం సైతం 15 లక్షల టన్నుల వరకు నిల్వ ఉంది. ఇప్పటికే తవ్వితీసిన గనులను పర్యాటక క్షేత్రంగా మలిస్తే ఈ ప్రాంతానికి ఆర్థికంగా బలం చేకూర్చినట్టు అవుతుంది.తవ్వకాలు చేపట్టాలి నేను బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా పనిచేశాను. గతంలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ మూతపడటంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. అప్పట్లో సీసం ధరలు తక్కువగా ఉండటం, తవ్వకం ఖర్చు పెరగడంతో మూతపడింది. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించి తవ్వకాలు ప్రారంభిస్తే మంచిది. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులు సైతం పునరుద్ధరించుకోవాల్సి ఉంది. – జయకర్ రావు, కార్మిక సంఘం మాజీ వర్కింగ్ సెక్రటరీ, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్జీవనశైలిలో మార్పు వస్తుందిప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో సీసం ధరలతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి సానుకూలంగా ఉంది. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ఈప్రాంత ప్రజల జీవనశైలిలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దళిత, గిరిజన ప్రజలలో సాంఘిక పరమైన మార్పులు పెద్ద ఎత్తున రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి వీలైనంత త్వరగా తవ్వకాలు పునఃప్రారంభించాలి. గతంలో పనిచేసిన కార్మికులంతా కలిసి మాకు చేతనైనంతగా పోరాటాలు చేస్తున్నాం. – ఎంహెచ్ ప్రసాద్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, కార్మిక సంఘం పూర్వ నేత -
టోల్‌ప్లాజా వద్ద 70 కేజీల గంజాయి పట్టివేత
మార్టూరు: జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం అధికారులు వలపన్ని అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒక మహిళ సహ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారం అందుకున్న అధికారులు తమ సిబ్బందితో బుధవారం వేకువజామున బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద నిఘా ఉంచి వాహనాలు తనిఖీ నిర్వహించసాగారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి నెల్లూరు వెళ్లే రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు తనిఖీ చేసి అనుమానస్పదంగా ఉన్న 9 మంది ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దింపి పరిశీలించారు. వాసన రాకుండా సీలు వేసిన 23 గంజాయి ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను విచారించగా వారిలో 5 గురు చీమకుర్తి ప్రాంతానికి చెందిన వారిగా ఒక వ్యక్తి, మధురైకి చెందిన వ్యక్తిగానూ మహిళ సహ మిగిలిన ముగ్గురు కందుకూరు ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరు విశాఖ, విజయవాడ వైపు నుంచి గంజాయిని వారివారి ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన గంజాయి 70 కేజీలు ఉన్నట్లు బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ.5 నుంచి రూ.6 లక్షల ఉండవచ్చని సీఐ తిరుపతయ్య తెలిపారు. అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చెట్టుకు వేళ్లాడుతున్న మహిళ శవం
బొల్లాపల్లి: గుంటూరుజిల్లా బొల్లాపల్లి మండలం వెంకటాపురం అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం చెట్టుకు వేళ్లాడుతున్నది. మృతురాలిని దేచవరానికి చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. రెండు నెలల క్రితం ఈమె అదృశ్యం కాగా దీనిపై బొల్లాపల్లి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. కాగా, శ్రీలక్ష్మి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అక్రమార్కులకు అడ్డుకట్ట
* ముడి ఖనిజం పరిశీలన * అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్న అటవీ శాఖాధికారులు బొల్లాపల్లి : మండలంలోని బండ్లమోటు మైనింగ్ ప్రదేశాన్ని అటవీ శాఖ మాచర్ల ఏసీఎఫ్ పి.సునీత సోమవారం సందర్శించారు. బండ్లమోటు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ నుంచి అక్రమార్కులు తరలించిన ముడి ఖనిజంను తిరిగి ఫారెస్ట్ శాఖాధికారులు స్వాధీనపరుచుకొని అటవీ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు చేరవేశారు. ఆ శాఖ ఆధీనంలో ఉన్న ముడి ఖనిజాన్ని ఆమె పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం బండ్లమోటు నర్సరీ వద్ద ఈ విషయంపై అదే పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్ ఎస్కే హబీబ్‌బాషా, మరి కొందరు యువకులు కలిసి మైనింగ్‌కు సంబంధించి ముడి ఖనిజాన్ని అక్రమంగా తరలిస్తుండగా అడ్డగించి పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించినా ఎలాంటి చర్యలు లేవని ఏసీఎఫ్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక అధికారులు ముడి ఖనిజం తరలించే యంత్రాలను వదలివేశారని, దీని ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కేసు నమోదు చేశామని సమస్యను దాటవేస్తున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తరలించిన ముడి ఖనిజంలో 30 టన్నులు తేడా ఉందని కూడా గనులు, భూగర్భ శాఖ అధికారులు నిర్థారించారని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరారు. దీనిపై ఏసీఎఫ్ సునీత మాట్లాడుతూ గనులు, భూగర్భ శాఖ అధికారుల నుంచి ముడి ఖనిజం వివరాలు రావాల్సి ఉందని, సమాచారం రాగానే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అక్రమార్కులను ఉపేక్షేంచిలేదని చెప్పారు. ఆమె వెంట వినుకొండ ఫారెస్ట్ రేంజర్ ఎస్. హరి, ఆ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
వ్యవసాయబావిలో పడి యువరైతు మృతి
బొల్లాపల్లి (నెల్లూరు): బొల్లాపల్లి మండలం పాత వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి బ్రహ్మయ్య(23) అనే యువరైతు గురువారం మృతిచెందాడు. నిమ్మతోటకు నీరు తోడుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. ఆ సమయంలో వ్యవసాయబావి వద్ద ఎవరూ లేకపోవడంతో కాసేపటికే ప్రాణాలొదిలాడు. -
స్కూల్లో ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం
-
ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం
గుంటూరు : తోటి ఉద్యోగుల వేధింపులతో గిరిజన ఉపాధ్యాయురాలు శనివారం ఉదయం స్కూల్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. బొల్లాపల్లిలోని కస్తూర్భా స్కూల్లో జ్యోతి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెపై తోటి ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఈ విషయంపై ఆమె పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు కూడా చేసింది. ఆ విషయంపై ప్రధాన ఉపాధ్యాయుడు మిన్నకుండటంతో తోటి ఉద్యోగుల వేధింపులు మరింత అధికమైనాయి. ఈ నేపథ్యంలో ఆమె పాఠశాలలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరంతా షాక్
ఊరంతా షాక్ వేలేరుపాడు, మండలంలోని బోళ్లపల్లి గ్రామంలో విద్యుత్ పరికరాలు ఏవి పట్టుకున్నా షాక్ కొడుతుండడంతో జనం భయంతో వణుకుతున్నారు. ఈ గ్రామంలో మొత్తం 120 కుటుంబాలు ఉన్నాయి. వేలేరుపాడు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. ఊరికి దగ్గర్లోని 15 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. అయితే గత మూడేళ్లుగా తరచూ లోఓల్టేజీ సరఫరా కొనసాగుతున్నా విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. లోఓల్టేజీ ఉన్న సమయంలో అంతా ఫేస్ సరఫరా అవుతోంది. దీంతో టీవీలు, సెల్‌ఫోన్ చార్జర్లు, స్విచ్‌బోర్డులు, కరెంట్ ద్వారా పనిచేసే ఏ వస్తువును ముట్టుకున్నా....షాక్ కొడుతోందని స్థానికులు అంటున్నారు. అయితే లోఓల్టేజీ వల్ల కరెంట్ షాక్ రాదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. కరెంట్ వస్తువులు ఏది ముట్టుకున్నా....షాక్ కొడుతోందని విద్యుత్ సిబ్బంది తమ గోడును పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. లోఓల్టేజీ రావడానికి ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న న్యూట్రల్ వైరే కారణమని గామస్తులు ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ ద్వారా తెలుసుకున్నారు. ఈ విషయమై అనేక సార్లు విద్యుత్ శాఖ వారికి మొరపెట్టుకున్నా..వారు స్పందించలేదని చెబుతున్నారు. చివరకు ఎలక్ట్రిషన్ సలహా మేరకు న్యూట్రల్ వైర్ ఉన్న ప్రదేశంలో గ్రామస్తులే గొయ్యి తవ్వి అందులో నీళ్లు, బొగ్గులు, ఉప్పు వేస్తున్నారు. వేసిన కొద్దిరోజులు లోఓల్టేజీ సమస్య లేకుండా విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ తర్వాత పాతసమస్యే పునరావృతం అవుతోంది. ఇకనైనా సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు -
ఆ ఇద్దరే దిక్కు..!
సాక్షి, నరసరావుపేట :గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి గ్రామానికి ఓ కార్యదర్శిని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం బొల్లాపల్లి మండలంలో మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించింది. నల్లమల అటవీ ప్రాంతం అధికంగా ఉండే బొల్లాపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీలు, మరో 30 వరకు శివారు తండాలు ఉన్నాయి. మారుమూల ప్రాంత ప్రజలకు సేవలందించేందుకు ఇక్కడ గ్రామ కార్యదర్శులను నియమించడంలో ఉన్నతాధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. మండలంలోని గరికపాడు, బొల్లాపల్లి గ్రామాలకు మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన 21 పంచాయతీలకు కూడా వీరిద్దరే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. తండాల్లో ప్రజలకు ఏఅవసరం వచ్చినా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే మండల కేంద్రానికి వచ్చి గ్రామ కార్యదర్శితో చెప్పుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్యం, వీధిలైట్లు, మంచినీరు వంటి సమస్యలను సైతం పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. బొల్లాపల్లి మండలంలో రూ. 4,77,520 పన్ను వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ. 22,023 మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిని బట్టి గ్రామపంచాయతీ పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండలంలో ఒక్క వెల్లటూరు గ్రామ పంచాయతీ మినహా మిగతా ఏ పంచాయతీలోనూ పన్ను వసూలు రిజిస్టర్లు కూడా లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆడిట్లో సైతం కేవలం రశీదులు మాత్రమే చూపుతూ రిజిస్టర్లు చూపడంలేదు. పన్ను రిజిస్టర్లు చూపలేదంటూ ఆడిటర్లు రాసుకొని వెళ్లిపోతున్నారు. గత ఏడాది భారీ సంఖ్యలో వీఏఓ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం బొల్లాపల్లి మండలాన్ని మాత్రం మరిచింది. పంచాయతీల్లో యథేచ్ఛగా నిధుల గోల్మాల్ బొల్లాపల్లి మండలంలోని అనేక పంచాయతీల్లో గ్రామ కార్యదర్శులు లేకపోవడంతో సర్పంచ్, పంచాయతీ, మండలస్థాయి అధికారులు కుమ్మక్కై లక్షల రూపాయల నిధులను మింగేస్తున్నారు. పేరూరిపాడు పంచాయతీలో 2010లో రూ. 1.75లక్షల నిధులను కాజేసి చెక్‌బుక్‌లు, రికార్డులు సైతం మాయం చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి రికార్డులు పంపాల్సిందిగా ఆదేశించారు. ఇది జరిగి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటికీ రికార్డులు చూపలేదు. దీంతో ఈ గ్రామ పంచాయతీలో వున్న రూ. 9లక్షల నిధులను ఖర్చు చేసే వీలు లేకపోవడంతో గ్రామాభివృద్థి కుంటుపడింది. ఇటీవల ఆ గ్రామ మాజీ సర్పంచ్‌పై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం మండలంలో ఈఓపీఆర్డిగా పనిచేసిన అధికారి ఒకరు అన్ని గ్రామ పంచాయతీల్లో సుమారు రూ. 3 లక్షల ఇంటి పన్నులు అక్రమంగా కాజేశారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అధికారులు వీటిపై దృష్టిసారించకుండా సిబ్బంది కొరత అనే సాకు చూపుతూ చేతులు దులుపుకుంటున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం పేరూరిపాడు గ్రామంలో పెద్ద మొత్తంలో నిధులు కాజేసిన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇద్దరే కార్యదర్శులు ఉండటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తాం. - డీఎల్పీఓ భాస్కరరెడ్డి -
ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు
బొల్లాపల్లి, న్యూస్‌లైన్ : మండలంలోని మూగచింతలపాలెం సమీపంలోని సాగర్ కుడికాలువలో ఆదివారం ఈతకు వె ళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. బొల్లాపల్లి గ్రామానికి చెందిన షేక్ సుభానీ(22) స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు షేక్ ఖాశింసాహెబ్, ఖాసింబీ, కుటుంబసభ్యులు, బంధువులు కాలువ వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఎ.సురేంద్రబాబు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి తల్లి ఖాసింబీ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలుపొందారు. మరణవార్త తెలుసుకున్న గ్రామస్తులు, స్నేహితులు కాలువ వద్దకు చేరుకున్నారు. మృతుడు వైజాగ్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎన్నికల సమయంలో ఇంటికి వచ్చి గ్రామంలో ఉంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుభానీ మృతదేహం కోసం గ్రామస్తులు, బంధువులు గాలిస్తున్నారు.