స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లు
మార్టూరు: జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం అధికారులు వలపన్ని అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒక మహిళ సహ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ తిరుపతయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారం అందుకున్న అధికారులు తమ సిబ్బందితో బుధవారం వేకువజామున బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద నిఘా ఉంచి వాహనాలు తనిఖీ నిర్వహించసాగారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి నెల్లూరు వెళ్లే రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు తనిఖీ చేసి అనుమానస్పదంగా ఉన్న 9 మంది ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దింపి పరిశీలించారు. వాసన రాకుండా సీలు వేసిన 23 గంజాయి ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను విచారించగా వారిలో 5 గురు చీమకుర్తి ప్రాంతానికి చెందిన వారిగా ఒక వ్యక్తి, మధురైకి చెందిన వ్యక్తిగానూ మహిళ సహ మిగిలిన ముగ్గురు కందుకూరు ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరు విశాఖ, విజయవాడ వైపు నుంచి గంజాయిని వారివారి ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన గంజాయి 70 కేజీలు ఉన్నట్లు బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.5 నుంచి రూ.6 లక్షల ఉండవచ్చని సీఐ తిరుపతయ్య తెలిపారు. అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment