ఆగంతకుడు ఇచ్చిన నకిలీ నోట్లు
ఒంగోలు: నగరంలో నకిలీ కరెన్సీ ముఠా హల్‌చల్ చేస్తోందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చిల్లర కావాలంటూ ఆగంతకుడు ఏకంగా రూ.31 వేలకు ఓ డెయిరీ నిర్వాహకుడిని మోసం చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో రాజా వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి దొడ్ల డెయిరీ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి ఓ వ్యక్తి అతని వద్దకు వచ్చి తన వద్ద పెద్ద నోట్లు ఉన్నాయని, తనకు చిల్లర అవసరం ఉందని చెప్పాడు. చిల్లర నోట్లు ఇస్తే పెద్ద నోట్లు ఇస్తానని నమ్మబలికాడు. తన వద్ద రూ.500 నోట్లు 68 ఉన్నాయని చెప్పాడు. డెయిరీ నిర్వాహకుడు తన వద్ద చిన్న నోట్లు ఎక్కువగా ఉండటంతో అతనికి పెద్ద నోట్లు ఇస్తే పోయేదేముందనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న వంద రూపాయల నోట్లు 340 ఇచ్చాడు. అతను తన వద్ద ఉన్న రూ.500 నోట్లు 68 ఇచ్చి వంద నోట్లు తీసుకెళ్తుంటే డెయిరీ యజమాని ఒకసారి లెక్క పెట్టుకోమన్నాడు.
తాను మెషీన్‌పై లెక్క పెట్టుకుంటానులే అంటూ వెళ్లిపోయాడు. అతను వెళ్లిన తర్వాత పరిశీలించుకుంటే ఆ నోట్లలో అన్నింటిపై ఒకే నెంబర్ ఉంది. ఆరు నోట్లపై మాత్రం వేర్వేరు నంబర్లు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే పైన ఉన్న ఆరు నోట్లు మాత్రమే మంచివి. మిగితావన్నీ కలర్ జిరాక్స్ పేపర్లుగా స్పష్టమైంది. ఆవేదన చెందిన సుబ్బారెడ్డి హుటాహుటిన ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయాన్ని వివరించి కలర్ జిరాక్స్ నోట్లు 62 సీఐ భీమానాయక్‌కు అందజేశాడు. మొత్తం రూ.31 వేలకు ఆగంతకుడు మోసం చేసినట్లు స్పష్టమైంది. సీఐ వెంటనే అప్రమత్తమై ఘటన జరిగిన సమయానికి గంట అటూ ఇటుగా సీసీ కెమెరాల ఫీడ్ బ్యాక్ తీసుకురావాలంటూ సిబ్బందిని పురమాయించాడు. షాపు యజమాని చెప్పిన గుర్తుల ఆధారంగా ఆగంతకుడిని గుర్తించేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసిన కెమెరాలే కాకుండా ఆ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ఉన్నా పేటేజీలు తీసుకునేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. కలర్ జిరాక్స్ మెషీన్‌ల ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెల్లడైంది. ఇటీవల స్థానిక కేబీ రెస్టారెంట్ వద్ద విదేశీయుల మాదిరిగా ఉన్న రెండు జంటలు ఒక వ్యక్తిని ఆపి అతని వద్ద ఉన్న నగదును చెక్ చేసినట్లు నటిస్తూ రూ.6 వేలు చోరీ చే శారు.
Comments
Please login to add a commentAdd a comment