కింది కోర్టుల్లో నిర్దిష్ట
కాలపరిమితిలోపు విచారణ కష్టం
హైకోర్టు ఆదేశాలను కొట్టేస్తూ వ్యక్తికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ట్రయల్ కోర్టుల పరిధిలో కేసుల విచారణకు కాలపరిమితిని విధిస్తూ ఆదేశాలిచ్చే సంస్కృతిని హైకోర్టులు విడనాడాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు ఒక వ్యక్తికి బెయిల్‌ను నిరాకరిస్తూ, కాలపరిమితిలోపు విచారణ పూర్తిచేయాలంటూ ట్రయల్ కోర్టుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది. గత సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శనివారం వెలుగులోకి వచ్చాయి.
నకిలీ నోట్ల కేసులో రెండున్నరేళ్లుగా విచారణ ఖైదీగా జైలులో మగ్గిపోతున్న ఒక వ్యక్తికి బెయిల్ మంజూరుచేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ‘‘కాల పరిమితిలోపు కేసు విచారణ పూర్తికాని పక్షంలో బెయిల్ కోసం నిందితుడు చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చట్టప్రకారం వీలైతే ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వడానికే మొగ్గుచూపాలి.
మరో అవకాశంలేని పక్షంలో మాత్రమే అతడిని విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయాలి. బెయిల్ అనేది నియమం, జైలు అనేది ఒక మినహాయింపు అనే సూత్రం ఇక్కడా వర్తిస్తుందని హైకోర్టులు గుర్తుంచుకోవాలి’’అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రతి కోర్టులోనూ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేసు విచారణను కాలపరిమితిలోపు ముగించాలని ట్రయల్ కోర్టులను హైకోర్టులు ఆదేశిస్తే ఆయా కిందికోర్టుల పనితీరుపై తీవ్ర ఒత్తిడి, ప్రభావం పడుతుంది.
ఇలాంటి ఆదేశాలను కచ్చితంగా అమలుచేయడం ట్రయల్ కోర్టుకు కష్టమవుతుంది. బెయిల్‌ను నిరాకరిస్తూ నిందితులకు కంటితుడుపు చర్యగా ఆ కేసు విచారణను త్వరగా పూర్తిచేయిస్తామని హైకోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి ఆదేశాలతో సంబంధిత వ్యక్తులకు అనవసరంగా ఆశ కలి్పంచినవారమవుతాం. ఇది ఒకరకంగా వాళ్లకు తప్పుడు సందేశం పంపినట్లే’’అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment