GANJAI TRANSPORT
-
కూరగాయల లోడ్‌లో తరలిపోతున్న గంజాయి
నల్లగొండక్రైం, నాగార్జునసాగర్: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.84లక్షల విలువైన 336 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను సోమవారం నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్ల డించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ నుంచి డీసీఎంలో గంజాయి తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు నాగార్జునసాగర్‌లోని విజయపురి నార్త్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంపత్ తన సిబ్బందితో కలిసి రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా కూరగాయల లోడ్‌తో వెళ్తున్న డీసీఎంను ఆపారు. ఆ డీసీఎంలోని కూరగాయల ట్రేల అడుగున 168 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో డీసీఎంలోని నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ముఠాగా ఏర్పడి.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన జ్ఞానోబా అమోల్ ఘెరే, సంగమేశ్వర సదా శివ జంగనే, ఖయ్యూమ్ ఇషాకే, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకు చెందిన గణపతి బసవరాజు సోనాల్ ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేయడం మొదలుపెట్టారు. జ్ఞానోబా అమోల్ ఘెరే డ్రైవర్‌గా పని చేస్తుండగా.. అతడికి నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన జయపాల్ పరిచయమయ్యాడు. వీరంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలించాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ మీదుగా వెళ్తే పట్టుబడతామని గుంటూరు, మాచర్ల మీదుగా డీసీఎంలో కూరగాయల లోడు మధ్యలో గంజాయి పెట్టుకొని తరలిస్తుండగా.. పోలీసులకు సమాచారం అందడంతో పట్టుబడినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల్లో నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన జయపాల్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. గంజాయి రవాణాపై మరింత నిఘా పెట్టి కట్టడి చేస్తామని ఎస్పీ తెలిపారు. -
అక్రమ రవాణాను అడ్డుకున్న ‘ప్రమాదం’
కారేపల్లి: చేసేది గంజాయి రవాణా.. పైకి కనిపించేది కొబ్బరిబొండాల తరలింపు.. అక్రమార్కుల దొంగ తెలివితేటలు ఎంతలా ఉన్నాయంటే వింటే ఆశ్యర్యం కలగక మానదు. ఎంత దొంగ తెలివి ప్రదర్శించినా విధి వారి గుట్టును రట్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కారేపల్లి మండలం గాంధీపురం రైల్వేస్టేషన్‌కు సమీపంలో కొబ్బరిబొండాల రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో అందు లోని గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఒడిశా రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల నుంచి (ఏపీ 28వై 4823) బొలెరో ట్రాలీలో ఇల్లందు మీదు గా ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్ ప్రాంతాలకు గంజాయి తరలిస్తుం డగా శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోనో, లేదా మద్యం మత్తులో నో రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ఉంటా డని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను వాహనాన్ని, గంజాయి ప్యాకెట్లను వదిలేసి అక్కడి నుంచి ఉడాయించాడు. తెల్లవారు జామున కొంత మంది వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన స్థాలానికి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ పొదిల వెంకన్న, తహశీల్దార్ సీహెచ్ స్వామి చేరుకుని పంచనామా నిర్వహించారు. 137 గంజాయి పాకెట్లు–2.46 క్వింటాళ్లు.. అనంతరం సీఐ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక(ఆర్సీ ప్రకారం) కు చెందిన బొలెరో వాహనం ఒడిశా రాష్ట్రం నుంచి హైదారాబాద్ వైపు ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు తెలుస్తుందని, 137 గంజాయి ప్యాకెట్లను గుర్తించామని, ఒక్కో ప్యాకెట్ 1.8 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.7.38 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. మండలంలో రెండోసారి.. కారేపల్లి మండలంలో సింగరేణి ఓసీ–2 వద్ద ఖమ్మం–ఇల్లందు ప్రధాన రహదారిపై 2017 డిసెంబర్ 4వ అర్ధరాత్రి కారేపల్లి పోలీసులు, టాస్క్ఫోర్సు సంయుక్తంగా గంజాయితో వెళ్లుతున్న డీసీఎం వాహనాన్ని పట్టుకున్నారు. అందులో సుమారు 5 క్వింటాళ్ల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
టోల్‌ప్లాజా వద్ద 70 కేజీల గంజాయి పట్టివేత
మార్టూరు: జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం అధికారులు వలపన్ని అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒక మహిళ సహ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారం అందుకున్న అధికారులు తమ సిబ్బందితో బుధవారం వేకువజామున బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద నిఘా ఉంచి వాహనాలు తనిఖీ నిర్వహించసాగారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి తిరుపతి, విజయవాడ నుంచి నెల్లూరు వెళ్లే రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు తనిఖీ చేసి అనుమానస్పదంగా ఉన్న 9 మంది ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దింపి పరిశీలించారు. వాసన రాకుండా సీలు వేసిన 23 గంజాయి ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను విచారించగా వారిలో 5 గురు చీమకుర్తి ప్రాంతానికి చెందిన వారిగా ఒక వ్యక్తి, మధురైకి చెందిన వ్యక్తిగానూ మహిళ సహ మిగిలిన ముగ్గురు కందుకూరు ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. వీరు విశాఖ, విజయవాడ వైపు నుంచి గంజాయిని వారివారి ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన గంజాయి 70 కేజీలు ఉన్నట్లు బహిరంగ మార్కెట్లో దాని విలువ రూ.5 నుంచి రూ.6 లక్షల ఉండవచ్చని సీఐ తిరుపతయ్య తెలిపారు. అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
గం‘జాయ్’.. ఎంజాయ్..!
భద్రాచలం టౌన్: ఈ కథనాన్ని ప్రారంభించడానికి ముందుగా మీకు కొన్ని లెక్కలు, వాస్తవాలు చెప్పాలి. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులకు నిన్న (14వ తేదీన) 27 కేజీల గంజాయి పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో, పట్టణంలోని కూనవరం రోడ్డులో ఏర్పాటైన తనిఖీ కేంద్రం వద్ద అక్కడి అధికారులు... బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఒక్కసారిగా కాదు, అనేకసార్లు. మీకు గుర్తుందో లేదో... సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో.. రాచకొండ (హైదరాబాద్) పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఇలా ఓ ప్రకటన చేశారు– ‘‘మేం ఈ సంవత్సరం(2017)లో ఇప్పటివరకు దాదాపుగా 10,000 కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నాం. ఇదంతా, భద్రాచలం మీదుగా హైదరాబాద్ వచ్చింది’’. గత ఏడాది, డిసెంబర్ 19వ తేదీన, హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు భద్రాచలం వచ్చారు. బ్రిడ్జి వద్ద సాయంత్రం నుంచి రాత్రి వరకు హడావుడి చేశారు. దీనిపై, అప్పుడు ఆరా తీస్తే తెలిసిన విషయేమిటంటే... భద్రాచలం సమీపంలోగల ఎటపాకకు చెందిన ఒకడిని ఆ పోలీసులు పట్టుకున్నారట. అతడి వద్ద గంజాయి దొరికిందట. గట్టిగా అడిగితే.. ఎటపాక పోలీస్ స్టేషన్ సమీపంలోగల అటవీ శాఖాధికారికి చెందిన తోటలో పనిచేస్తున్నానని, గంజాయి పండిస్తున్నానని చెప్పాడట. గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తూ, జాతీయ పరిశోధనాసంస్థ ఎస్సైనని చెప్పుకుంటూ ఏడాదిపాటు భద్రాచలంలో దందా సాగించిన మోసగాడిని గత ఏడాది ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇవన్నీ చూస్తుంటే... గంజాయి రవాణాకు భద్రాచలం అడ్డాగా మారిందని, మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన దీనిని స్మగ్లర్లు సేఫ్ జోన్‌గా ఎంచుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కూడా... గత ఏడాది ఏం జరిగిందో చూచాయగా చెప్పుకున్నాం కదా..! ఇప్పుడు, వర్తమానంలోకి వద్దాం. భద్రాచలం మీదుగా గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. నిఘా నేత్రాల కళ్లుగప్పి కొత్త దారుల్లో స్మగ్లర్లు నిరాటంకంగా తరలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి స్మగ్లర్లు గంజాయిని వివిధ సైజుల్లో ప్యాక్ చేసి రాజధానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల నేఫథ్యంలో భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఎస్ఎస్టీ తనిఖీ కేంద్రం వద్ద పలుమార్లు గంజాయి పట్టుబడింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు ప్రయివేటు వాహనాలలో, ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలుతోంది. గత ఏడాది కాలంగా భద్రాచలం పట్టణంలో అనేకసార్లు గంజాయి పట్టుబడింది. గంజాయి వ్యాపారం ఎంత జోరుగా సాగుతుందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. భద్రాచలం మీదుగా.... గంజాయి వ్యాపారంలో ఆదాయం అపరిమితం. ఒడిశాలో పండించిన గంజాయిని అక్కడి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశా నుంచి భద్రాచలం వచ్చే మార్గంలో ఏపీలోని లక్ష్మీపురం, నెల్లిపాక గ్రామాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. స్మగ్లర్లు వాటిని ‘సేఫ్’గా దాటుకుని వస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరుకు వలస కూలీలు వెళుతుంటారు. వీరికి, స్మగ్లర్లు కొంత నగదును ఆశగా చూపించి, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోగల గంజాయిని తరలిస్తున్నారు. అరికట్టడమెలా...? మూడు రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని ఏపీలోని చెక్‌పోస్టుల వద్ద అడ్డుకోవచ్చు. ఈ పని జరగడం లేదు. దీంతో, ఆ చెక్‌పోస్టులను దాటి భద్రాచలంలోకి గంజాయి చేరుతోంది. ఇక్కడి తనిఖీ అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పుడు పట్టుబడుతోంది. వీళ్ల కళ్లుగప్పి తరలుతున్న గంజాయి ఎంత ఉంటుందో చెప్పలేం. ఇక్కడ కూడా పోలీసులు నిఘాను పెంచితే, నిరంతరం అప్రమత్తంగా–నిజాయితీగా ఉంటే... గంజాయికి అడ్డుకట్ట పడే అవకాశముంటుంది. ఇదొక్కటే కాదు, గంజాయితో పట్టుబడిన వారిని విచారిస్తే.. అసలు సూత్రధారులు–పాత్రధారులు ఎవరో తెలుస్తుంది. వారిని పట్టుకుని దర్యాప్తు సాగిస్తే... డొంకంతా కదులుతుంది. ఇప్పుడు మాత్రమే కాదు, గత ఏడాది మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. సరఫరాదారులు, స్మగ్లర్లు, సహకరిస్తున్న వారు పట్టుబడుతూనే ఉన్నారు. అయినప్పటికీ, గంజాయి రవాణా ఆగడం లేదు... కొనసాగుతూనే ఉంది. ఇదంతా చూస్తున్న, అడపాదడపా చదువుతున్న సామాన్యుల మదిలో ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు... -
గంజాయి స్మగ్లర్లకు పదేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా
రాజమహేంద్రవరం క్రైం : గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2016 సెప్టెంబర్ 11న డొంకరాయి వైపు నుంచి మోతుగూడెం వైపు వస్తున్న టాటా ఏస్ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. వరంగల్‌కు చెందిన బొంతు అశోక్ కుమార్, దారవాడ ప్రసాద్, మల్కన్ గిరి జిల్లాకు చెందిన మోర్సు నూకరాజు, విశాఖ జిల్లా సీలేరు గ్రామానికి చెందిన మహ్మద్ ఆలీ, కొత్తూరుకు చెందిన జ్యోతుల వెంకన్న పండులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి తరలిస్తున్న కారును, 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి డొంకరాయి ఎస్సై ఎం. పండుదొర, చింతూరు సీఐ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసును రాజమహేంద్రవరం 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిపారు. నిందితులపై నేరం రుజువు కావడంతో సెషన్స్ జడ్జి ఏవీ రవీంద్రబాబు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష తోపాటు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. శేషయ్య వాదనలు వినిపించారు. -
రూ 1.50 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
పద్నాలుగేళ్లు శిక్ష పడినా గంజాయి వ్యాపారమే ఈ కేసులో ఆరుగురి అరెస్టు పరారీలో ఇద్దరు నిందితులు రాజమహేంద్రవరం క్రైం : గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుపడి ... యావజ్జీవ కారాగార శిక్ష పడినా మారని నిందితుడు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలై అదే వ్యాపారం చేస్తూ మళ్లీ పోలీసులకు చిక్కిన స్మగ్లర్‌ను రాజమహేంద్రవరం అర్భన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.50 కోట్లు విలువైన గంజాయిని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజ కుమారి తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఈ నెల 24 వ తేదీన కడియం మండలం జేగురుపాడు గ్రామం వద్ద అక్రమంగా గాజాయిని, పుచ్చకాయలు, తవుడు బస్తాల మాటున తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ పోలీసులు, ఎజీఎస్ పార్టీ, లోకల్ పోలీసులు, వి.ఆర్.ఓ, ఎం.ఆర్.ఓ ఆద్వర్యంలో దాడి చేసి రెండు ఐషర్ వ్యాన్లు, ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వాహనాలలో రెండు కేజీల ప్యాకెట్లు చొప్పున 158 పాలిధీన్ ప్యాకెట్లులో 4 టన్నుల గంజాయిని తరలిస్తున్నారన్నారు. ఈ లారీలు విశాఖ జిల్లా కొయ్యూరు గ్రామంలోని చిట్టిబాబు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి అనపర్తి గ్రామానికి చెందిన గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి తన రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్లు నుంచి మధ్యవర్తి గుంటూరు జిల్లా నర్సరావు పేట మండలం, రామిరెడ్డి పేట గ్రామానికి చెందిన పాములపర్తి శ్రీనివాసరావు ద్వారా హైదరాబాద్‌లోని చౌహాన్ ఆనే వ్యక్తి వద్దకు తరలిస్తున్నట్లు తెలిపారు. కేసులో నర్సారావుపేటకు చెందిన షేక్ సుభాని, రాజమహేంద్రవరం బొమ్మురు కాలనీకి చెందిన చోడవరపు రాజేష్... మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి, ఐదు వాహనాలు సీజ్ చేసిట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.12,760, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పది సంవత్సరాలకు పైగా గంజాయి వ్యాపారం... ఈ కేసులో ప్రధాన నిందితుడు గొలుగూరి సత్యనారాయణ రెడ్డి 2008 సంవత్సరం నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని, ఇతని పై 2008లో జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడని తెలిపారు. ఈ కేసులో 14 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని వివరించారు. ఇతనిపై సొంత బావమర్ధిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు అని తెలిపారు. 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన సత్యనారాయణ రెడ్డి ఇదే వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడని తెలిపారు. ఇతనిపై రౌడీ షీటు తెరుస్తామన్నారు. హైదరాబాద్‌లో చౌహాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పాడడంతో అప్పటి నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని పేర్కొన్నారు. గత నెల రోజుల్లో నాలుగు కేసులు పట్టుకున్నట్లు తెలిపారు. గోకవరం మండలంలో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. ఈ కేసులో చౌహాన్, చిట్టిబాబులు పరారీలో ఉన్నారని వారిని అరెస్ట్ చేస్తే ఈ గంజాయి ఎక్కడకు తరలిస్తున్నారనేది తెలుస్తోందన్నారు. గంజాయి పట్టుకోవడంలో సహకరించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి రివార్డులు ఇస్తామని తెలిపారు. అడిషినల్ ఎస్పీ ఆర్. గంగాధర్, స్పెషల్ పార్టీ డీఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ నారాయణ రావు, ఎజీఎస్ ఎస్సై వెంకటేశ్వరరావు, ఎం. సురేష్, ఎజీఎస్ పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.