గంజాయి స్మగ్లర్లకు పదేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా
Published Sat, Jul 15 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 PM
రాజమహేంద్రవరం క్రైం :
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2016 సెప్టెంబర్ 11న డొంకరాయి వైపు నుంచి మోతుగూడెం వైపు వస్తున్న టాటా ఏస్ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. వరంగల్‌కు చెందిన బొంతు అశోక్ కుమార్, దారవాడ ప్రసాద్, మల్కన్ గిరి జిల్లాకు చెందిన మోర్సు నూకరాజు, విశాఖ జిల్లా సీలేరు గ్రామానికి చెందిన మహ్మద్ ఆలీ, కొత్తూరుకు చెందిన జ్యోతుల వెంకన్న పండులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయి తరలిస్తున్న కారును, 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి డొంకరాయి ఎస్సై ఎం. పండుదొర, చింతూరు సీఐ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసును రాజమహేంద్రవరం 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిపారు. నిందితులపై నేరం రుజువు కావడంతో సెషన్స్ జడ్జి ఏవీ రవీంద్రబాబు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష తోపాటు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. శేషయ్య వాదనలు వినిపించారు.
Advertisement
Advertisement