భద్రాచలం టౌన్: ఈ కథనాన్ని ప్రారంభించడానికి ముందుగా మీకు కొన్ని లెక్కలు, వాస్తవాలు చెప్పాలి. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులకు నిన్న (14వ తేదీన) 27 కేజీల గంజాయి పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో, పట్టణంలోని కూనవరం రోడ్డులో ఏర్పాటైన తనిఖీ కేంద్రం వద్ద అక్కడి అధికారులు... బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఒక్కసారిగా కాదు, అనేకసార్లు. మీకు గుర్తుందో లేదో... సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో.. రాచకొండ (హైదరాబాద్) పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఇలా ఓ ప్రకటన చేశారు– ‘‘మేం ఈ సంవత్సరం(2017)లో ఇప్పటివరకు దాదాపుగా 10,000 కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నాం. ఇదంతా, భద్రాచలం మీదుగా హైదరాబాద్ వచ్చింది’’.
గత ఏడాది, డిసెంబర్ 19వ తేదీన, హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు భద్రాచలం వచ్చారు. బ్రిడ్జి వద్ద సాయంత్రం నుంచి రాత్రి వరకు హడావుడి చేశారు. దీనిపై, అప్పుడు ఆరా తీస్తే తెలిసిన విషయేమిటంటే... భద్రాచలం సమీపంలోగల ఎటపాకకు చెందిన ఒకడిని ఆ పోలీసులు పట్టుకున్నారట. అతడి వద్ద గంజాయి దొరికిందట. గట్టిగా అడిగితే.. ఎటపాక పోలీస్ స్టేషన్ సమీపంలోగల అటవీ శాఖాధికారికి చెందిన తోటలో పనిచేస్తున్నానని, గంజాయి పండిస్తున్నానని చెప్పాడట. గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తూ, జాతీయ పరిశోధనాసంస్థ ఎస్సైనని చెప్పుకుంటూ ఏడాదిపాటు భద్రాచలంలో దందా సాగించిన మోసగాడిని గత ఏడాది ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇవన్నీ చూస్తుంటే... గంజాయి రవాణాకు భద్రాచలం అడ్డాగా మారిందని, మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన దీనిని స్మగ్లర్లు సేఫ్ జోన్‌గా ఎంచుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇప్పుడు కూడా...
గత ఏడాది ఏం జరిగిందో చూచాయగా చెప్పుకున్నాం కదా..! ఇప్పుడు, వర్తమానంలోకి వద్దాం. భద్రాచలం మీదుగా గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. నిఘా నేత్రాల కళ్లుగప్పి కొత్త దారుల్లో స్మగ్లర్లు నిరాటంకంగా తరలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి స్మగ్లర్లు గంజాయిని వివిధ సైజుల్లో ప్యాక్ చేసి రాజధానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల నేఫథ్యంలో భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఎస్‌ఎస్‌టీ తనిఖీ కేంద్రం వద్ద పలుమార్లు గంజాయి పట్టుబడింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు ప్రయివేటు వాహనాలలో, ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలుతోంది. గత ఏడాది కాలంగా భద్రాచలం పట్టణంలో అనేకసార్లు గంజాయి పట్టుబడింది. గంజాయి వ్యాపారం ఎంత జోరుగా సాగుతుందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు.
భద్రాచలం మీదుగా....
గంజాయి వ్యాపారంలో ఆదాయం అపరిమితం. ఒడిశాలో పండించిన గంజాయిని అక్కడి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశా నుంచి భద్రాచలం వచ్చే మార్గంలో ఏపీలోని లక్ష్మీపురం, నెల్లిపాక గ్రామాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. స్మగ్లర్లు వాటిని ‘సేఫ్’గా దాటుకుని వస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరుకు వలస కూలీలు వెళుతుంటారు. వీరికి, స్మగ్లర్లు కొంత నగదును ఆశగా చూపించి, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోగల గంజాయిని తరలిస్తున్నారు.
అరికట్టడమెలా...?
మూడు రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని ఏపీలోని చెక్‌పోస్టుల వద్ద అడ్డుకోవచ్చు. ఈ పని జరగడం లేదు. దీంతో, ఆ చెక్‌పోస్టులను దాటి భద్రాచలంలోకి గంజాయి చేరుతోంది. ఇక్కడి తనిఖీ అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పుడు పట్టుబడుతోంది. వీళ్ల కళ్లుగప్పి తరలుతున్న గంజాయి ఎంత ఉంటుందో చెప్పలేం. ఇక్కడ కూడా పోలీసులు నిఘాను పెంచితే, నిరంతరం అప్రమత్తంగా–నిజాయితీగా ఉంటే... గంజాయికి అడ్డుకట్ట పడే అవకాశముంటుంది.
ఇదొక్కటే కాదు, గంజాయితో పట్టుబడిన వారిని విచారిస్తే.. అసలు సూత్రధారులు–పాత్రధారులు ఎవరో తెలుస్తుంది. వారిని పట్టుకుని దర్యాప్తు సాగిస్తే... డొంకంతా కదులుతుంది. ఇప్పుడు మాత్రమే కాదు, గత ఏడాది మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. సరఫరాదారులు, స్మగ్లర్లు, సహకరిస్తున్న వారు పట్టుబడుతూనే ఉన్నారు. అయినప్పటికీ, గంజాయి రవాణా ఆగడం లేదు... కొనసాగుతూనే ఉంది. ఇదంతా చూస్తున్న, అడపాదడపా చదువుతున్న సామాన్యుల మదిలో ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు...
గం‘జాయ్’.. ఎంజాయ్..!
Published Sat, Dec 15 2018 8:44 AM | Last Updated on Sat, Dec 15 2018 8:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment