badhrachalam
-
డ్రగ్ మాఫియా: వినూత్న మార్గాల్లో గంజాయి రవాణా..
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రగ్ మాఫియా వినూత్న మార్గాల్లో గంజాయి రవాణాకు పాల్పడుతోంది. బీరువాల తరలింపు మాటున గంజాయి తరలిస్తున్న ముఠాను భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీసులు అడ్డుకున్నారు. ఏపిలోని చింతూరు నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తుండగా గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ మాఫియాపై జిల్లా ఎస్పీ డా.వినీత్, ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. డ్రగ్ మాఫియా ముఠా.. ప్రత్యేకంగా రూపొందించిన బీరువాల్లో గంజాయి పేర్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని తెలిపారు. రూ. 30లక్షల విలువ చేసే 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారని అన్నారు. ఈ మఠాలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ కేసుపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట పట్టణంలో గంజాయిని అమ్ముతున్న ఏడుగురు యువకుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. యువకుల నుంచి 7 గంజాయి ప్యాకెట్లు, మూడు ఆటోలు,సెల్ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకుట్లు పోలీసులు తెలిపారు. యువకులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సదాశివపేట పోలీసులు పేర్కొన్నారు. నిజామాబాద్‌లో తొలిసారి కొకైన్ లభ్యం.. నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో తొలిసారి కొకైన్ ఇతర మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. డిచ్పల్లి మండలం నడిపల్లి వద్ద ఢిల్లీ నుంచి వచ్చిన స్కోడా కారులో కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇద్దరు యువకులు ఢిల్లీ వ్యక్తి రాహుల్ ద్వారా తెచ్చుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒక కారు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: బిర్యానీ గొడవ: కస్టమర్లపై దాడి.. ఎమ్మెల్యే రాజాసింగ్ సీరియస్ -
అదిగో..అదిగో...భద్రగిరి
-
మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/వీఆర్‌పుర : ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన కమ్యూనిస్టు యోధుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (62) కరోనా కాటుకు బలయ్యారు. ఏపీ రాష్ట్రం విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న రాజయ్య.. భద్రాచలంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలంలోని స్వగ్రామమైన సున్నంవారిగూడెంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల ఆయన కుటుంబంలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ సమయంలో రాజయ్యకు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చినప్పటికీ, ఆ మరుసటి రోజు నుంచి జ్వరం వస్తూనే ఉంది. చికిత్స చేయించుకున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో సోమవారం భద్రాచలంలో మరోసారి కోవిడ్ పరీక్ష చేయించారు. అక్కడ ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే చికిత్స కోసం విజయవాడ తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మంగళవారం రాజయ్య అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. రాజయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం అసెంబ్లీ స్థానానికి సీపీఎం తరఫున 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రం రంపచోడవరం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజయ్యకు తల్లి కన్నమ్మ, భార్య చుక్కమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివాసీలతో మమేకమై.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం సున్నంవారిగూడెం గ్రామానికి చెందిన రాజయ్య 1958 ఆగస్టు 8న జన్మించారు. 1979 నుంచి ఆయన సీపీఎంలో పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని లెభద్రాచలం డివిజన్ డీవైఎఫ్ఐ కార్యదర్శిగా సీపీఎంలో ప్రస్థానం ప్రారంభించిన రాజయ్య.. సాదాసీదా జీవితం గడుపుతూ, నిత్యం ఆదివాసీలతో మమేకమై నడిచారు. ఆదివాసీల హక్కుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన పోరాట యోధుడు. చివరి వరకు నిరాడంబర జీవితం గడిపిన ఆయన మృతి ఆదివాసీ గిరిజనుల్లో తీవ్ర విషాదం నింపింది. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు ఏపీలోకి వెళ్లడంతో అక్కడి గిరిజనుల సమస్యలపై గళం వినిపించేందుకు న్యాయస్థానంలో పోరాటం చేశారు. నిత్యం గిరిజన పల్లెల్లో తిరిగే రాజయ్యను కరోనా కాటు వేయడం ప్రతి ఒక్కరినీ విషాదంలో నింపింది. -
గ్రామాలను చుట్టుముట్టిన వరద
-
ఉధృతంగా గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి వస్తున్న వరద నీటితో ఇంకా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం భద్రాచలం వద్ద 51.2 అడుగులకు చేరిన నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 48.50 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉందని, అప్పటి వరకూ వరద పరిస్థితి కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నుంచి 14,81,674 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ గోదావరి జలాలు 2,479 టీఎంసీలు కడలి పాలయ్యాయి. సోమవారం 128 టీఎంసీలు సముద్రంలో కలసిపోయాయి. ముమ్మరంగా సహాయక చర్యలు తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం, కోనసీమ లంక గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుకునూరు, వీఆర్‌పురం మండలాలు వరద నీటిలో ఉన్నాయి. ఆ జిల్లాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. వీరవరంలో రెండు, చింతూరులో ఒకటి, రాజమహేంద్రవరంలో ఒకటి మొత్తం నాలుగు బృందాలతో ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది. రంపచోడవరం కేంద్రంగా 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, 90 మంది సిబ్బందితో కూడిన అగ్నిమాపక శాఖ విభాగం వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సీజన్లో మూడోసారి వరదలతో ఉభయ గోదావరి జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా పోతోంది. పోలవరం కాఫర్ డ్యామ్ కారణంగా దేవీపట్నం పరిసర గ్రామాలను వరద ముంచేసింది. దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. నీట మునిగిన దేవీపట్నం దేవీపట్నం ప్రధాన రహదారి నీట మునిగింది. చినరమణయ్యపేట–దేవీపట్నం, దండంగి–పురుషోత్తపట్నం రోడ్లు ముంపులో ఉండటంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోసమ్మగండి వద్ద అమ్మవారి విగ్రహం నీట మునిగింది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో 22 పాఠశాలలు మూతపడ్డాయి. బాధితులకు ప్రభుత్వ సిబ్బంది భోజనాలు పంపిణీ చేశారు. మూలపాడు, అగ్రహారం, పెనికలపాడు, కచ్చులూరు, ఏనుగులగూడెం, గానుగులగొంది తదితర గ్రామాల గిరిజనులు కొండలపై తలదాచుకున్నారు. చింతూరు వద్ద శబరి నదికి గోదావరి బ్యాక్ వాటర్‌తో చింతూరు–వీఆర్ పురం, ఆంధ్రా–ఒడిశాల మధ్య రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 17 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. కూనవరం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం దిగువున కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2,500 ఎకరాల లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. వరద ఉధృతి పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉప నదులైన భీమా, తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.34 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 884.60 అడుగులకు చేరుకుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 2.17 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సోమవారం రాత్రి సాగర్ రెండు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 587.90 అడుగుల్లో 306.04 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 47 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో 20 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 308.71 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. మంగళవారానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. స్థిరంగా వంశధార.. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 30,975 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ గొట్టా బ్యారేజీ నుంచి 53.31 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది. -
నేడు భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం
-
కొంగొత్త ఆశలతో.. ఈ ఏడాదిలో
పాల్వంచరూరల్: కోటి ఆశలతో కొంగొత్త సంవత్సరం ప్రవేశించింది. జిల్లా ప్రజలు ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ కార్యాచరణ నిత్య నూతనం కావాలని కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆవిర్భవించిన తర్వాత జిల్లా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లా పరిశ్రమల్లో ద్వితీయస్థానంలో ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వైపు సింగరేణి బొగ్గు గనులు, మరో వైపు పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్), ఎన్ఎండీసీ, సారపాక ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలు జిల్లా సొంతం. ఇంకో వైపు పర్యాటక ప్రాంతాలూ ఉన్నాయి. కొత్త సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు సీతారామ, మిషన్ భగీరథ ఫలాలు దక్కనున్నాయి. వంద కోట్ల పెట్టుబడితో భారజల కర్మాగారంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, మణుగూరులో నిర్మిస్తున్న 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన భద్రాద్రి పవర్ ప్లాంట్ ఈ యేడాదిలో పూర్తికానున్నాయి. ఈ క్రమంలో దాదాపు 3వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. కొత్తగూడెంలో 1978లో ఏర్పాటైన మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని జిల్లా ప్రజలు ఆశ పడుతున్నారు. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో మైలారం, రేగళ్ల అటవీ ప్రాంతంలో 850 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించింది. విమానాశ్రయం నిర్మాణం జరిగితే జిల్లాకు మణిహారంగా మారనుంది. 30వ నంబర్ జాతీయ రహదారి సారపాకనుంచి రుద్రంపూర్ వరకు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలి 20శాతం పనులు కూడా నూతన సంవత్సరంలో పూర్తికానున్నాయి. గోదావరి జలాలతో మాగాణిని పావనం చేయాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో సాగునీటి ఢోకా ఉండదు. ఇంటింటికీ గోదావరి జలాలను అందించేందుకు రూ.2.242 కోట్ల వ్యయంతో చేపట్టిన మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రతి ఇంటికీ గోదావరి జలాలు అందనున్నాయి. దక్షిణ అయోధ్యగా కీర్తి గడించిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఈ నూతన సంవత్సరలోనైనా నిధులు మంజూరు కావాలని భక్తులు ఆశగా ఎదురుచుస్తున్నారు. పోడు సాగుచేసుకున్న వందలాది మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులు అప్పుల ఊబిలోనుంచి ఈ ఏడాది గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి శాఖ గణంకాల ప్రకారం జిల్లాలో లక్షమందికిపైగా నిరుద్యోగులు ఉన్నారు. నూతన సంవత్సరంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో అభివృద్ధిలో మరింత ముందుకు సాగాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
గం‘జాయ్’.. ఎంజాయ్..!
భద్రాచలం టౌన్: ఈ కథనాన్ని ప్రారంభించడానికి ముందుగా మీకు కొన్ని లెక్కలు, వాస్తవాలు చెప్పాలి. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులకు నిన్న (14వ తేదీన) 27 కేజీల గంజాయి పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో, పట్టణంలోని కూనవరం రోడ్డులో ఏర్పాటైన తనిఖీ కేంద్రం వద్ద అక్కడి అధికారులు... బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఒక్కసారిగా కాదు, అనేకసార్లు. మీకు గుర్తుందో లేదో... సరిగ్గా ఏడాది క్రితం ఇదే నెలలో.. రాచకొండ (హైదరాబాద్) పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఇలా ఓ ప్రకటన చేశారు– ‘‘మేం ఈ సంవత్సరం(2017)లో ఇప్పటివరకు దాదాపుగా 10,000 కేజీలకు పైగా గంజాయిని పట్టుకున్నాం. ఇదంతా, భద్రాచలం మీదుగా హైదరాబాద్ వచ్చింది’’. గత ఏడాది, డిసెంబర్ 19వ తేదీన, హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు భద్రాచలం వచ్చారు. బ్రిడ్జి వద్ద సాయంత్రం నుంచి రాత్రి వరకు హడావుడి చేశారు. దీనిపై, అప్పుడు ఆరా తీస్తే తెలిసిన విషయేమిటంటే... భద్రాచలం సమీపంలోగల ఎటపాకకు చెందిన ఒకడిని ఆ పోలీసులు పట్టుకున్నారట. అతడి వద్ద గంజాయి దొరికిందట. గట్టిగా అడిగితే.. ఎటపాక పోలీస్ స్టేషన్ సమీపంలోగల అటవీ శాఖాధికారికి చెందిన తోటలో పనిచేస్తున్నానని, గంజాయి పండిస్తున్నానని చెప్పాడట. గంజాయి స్మగ్లర్లకు సహకరిస్తూ, జాతీయ పరిశోధనాసంస్థ ఎస్సైనని చెప్పుకుంటూ ఏడాదిపాటు భద్రాచలంలో దందా సాగించిన మోసగాడిని గత ఏడాది ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇవన్నీ చూస్తుంటే... గంజాయి రవాణాకు భద్రాచలం అడ్డాగా మారిందని, మూడు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన దీనిని స్మగ్లర్లు సేఫ్ జోన్‌గా ఎంచుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కూడా... గత ఏడాది ఏం జరిగిందో చూచాయగా చెప్పుకున్నాం కదా..! ఇప్పుడు, వర్తమానంలోకి వద్దాం. భద్రాచలం మీదుగా గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. నిఘా నేత్రాల కళ్లుగప్పి కొత్త దారుల్లో స్మగ్లర్లు నిరాటంకంగా తరలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి స్మగ్లర్లు గంజాయిని వివిధ సైజుల్లో ప్యాక్ చేసి రాజధానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల నేఫథ్యంలో భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో ఎస్ఎస్టీ తనిఖీ కేంద్రం వద్ద పలుమార్లు గంజాయి పట్టుబడింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు ప్రయివేటు వాహనాలలో, ఆర్టీసీ బస్సుల్లో గంజాయి తరలుతోంది. గత ఏడాది కాలంగా భద్రాచలం పట్టణంలో అనేకసార్లు గంజాయి పట్టుబడింది. గంజాయి వ్యాపారం ఎంత జోరుగా సాగుతుందో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. భద్రాచలం మీదుగా.... గంజాయి వ్యాపారంలో ఆదాయం అపరిమితం. ఒడిశాలో పండించిన గంజాయిని అక్కడి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒడిశా నుంచి భద్రాచలం వచ్చే మార్గంలో ఏపీలోని లక్ష్మీపురం, నెల్లిపాక గ్రామాల్లో చెక్‌పోస్టులు ఉన్నాయి. స్మగ్లర్లు వాటిని ‘సేఫ్’గా దాటుకుని వస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరుకు వలస కూలీలు వెళుతుంటారు. వీరికి, స్మగ్లర్లు కొంత నగదును ఆశగా చూపించి, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోగల గంజాయిని తరలిస్తున్నారు. అరికట్టడమెలా...? మూడు రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని ఏపీలోని చెక్‌పోస్టుల వద్ద అడ్డుకోవచ్చు. ఈ పని జరగడం లేదు. దీంతో, ఆ చెక్‌పోస్టులను దాటి భద్రాచలంలోకి గంజాయి చేరుతోంది. ఇక్కడి తనిఖీ అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పుడు పట్టుబడుతోంది. వీళ్ల కళ్లుగప్పి తరలుతున్న గంజాయి ఎంత ఉంటుందో చెప్పలేం. ఇక్కడ కూడా పోలీసులు నిఘాను పెంచితే, నిరంతరం అప్రమత్తంగా–నిజాయితీగా ఉంటే... గంజాయికి అడ్డుకట్ట పడే అవకాశముంటుంది. ఇదొక్కటే కాదు, గంజాయితో పట్టుబడిన వారిని విచారిస్తే.. అసలు సూత్రధారులు–పాత్రధారులు ఎవరో తెలుస్తుంది. వారిని పట్టుకుని దర్యాప్తు సాగిస్తే... డొంకంతా కదులుతుంది. ఇప్పుడు మాత్రమే కాదు, గత ఏడాది మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. సరఫరాదారులు, స్మగ్లర్లు, సహకరిస్తున్న వారు పట్టుబడుతూనే ఉన్నారు. అయినప్పటికీ, గంజాయి రవాణా ఆగడం లేదు... కొనసాగుతూనే ఉంది. ఇదంతా చూస్తున్న, అడపాదడపా చదువుతున్న సామాన్యుల మదిలో ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు... -
లెఫ్ట్ డీలా
సాక్షి, కొత్తగూడెం: మొదటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉండేది. రాష్ట్ర శాసనసభలో ప్రతిసారి ఉమ్మడి జిల్లా నుంచి వామపక్ష పార్టీల ప్రాతినిధ్యం ఉండేది. అయితే ప్రస్తుత శాసనసభలో మాత్రం వాపపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రజాసమస్యలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కమ్యూనిస్టులకు దక్కలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ప్రాతినిధ్యం ఉన్నా, లేకున్నా ఉమ్మడి జిల్లాలో మాత్రం ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండేది. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీలు ప్రజాగొంతుక వినిపించేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు వామపక్ష పార్టీలకు ప్రాతినిధ్యమే దక్కలేదు. తెలంగాణ శాసనసభలో మాత్రం గత ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పొత్తుతో సీపీఎం ఒక్క భద్రాచలం శాసనసభ స్థానంలో మాత్రమే గెలుపొందింది. సీపీఐ నల్లగొండ జిల్లాలోని దేవరకొండ స్థానాన్ని గెలిచినప్పటికీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. ఈ నెల 11న వెల్లడయిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వామపక్షాలకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. సీపీఎం బీఎల్ఎఫ్ బ్యానర్‌తో, సీపీఐ కాంగ్రెస్ కూటమితో వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, అశ్వారావుపేట, పినపాకల్లో సీపీఎం నేరుగా బరిలోకి దిగగా, కొత్తగూడెంలో బీఎల్ఎఫ్ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇల్లెందులో న్యూడెమోక్రసీ(రాయల) అభ్యర్థికి సీపీఎం మద్దతు తెలిపింది. సీపీఐ మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కూటమి పొత్తుతో ఒక్క వైరా స్థానంలో మాత్రమే పోటీ చేసింది. కానీ వామపక్షాలు ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అన్ని చోట్లా సీపీఎం, బీఎల్ఎఫ్, సీపీఐ, ఎన్డీ(రాయల), ఎన్డీ(చంద్రన్న) పార్టీలకు ఓట్లు అనుకున్న స్థాయిలో కూడా రాలేదు. దీంతో ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం అవకాశం లేకపోవడంతో పాటు ప్రాబల్యం కూడా తగ్గిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ∙గతంలో ఉమ్మడి జిల్లాలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్న సీపీఐ పట్టు ఈసారి మరింత తగ్గిపోయింది. కాంగ్రెస్ కూటమితో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా స్థానంలో పోటీ చేయగా ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో సైతం ఖమ్మం లోక్‌సభకు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేసినప్పటికీ మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. శాసనసభ స్థానాలు సైతం ఎక్కడా గెలుచుకోలేకపోయింది. సీపీఐ 1989, 1996, 1998 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు భద్రాచలం లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. 1962లో అప్పటి పాల్వంచ నియోజకవర్గంలో గెలిచింది. తరువాత బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గంలో 5 సార్లు విజయం సాధించింది. అదేవిధంగా సుజాతనగర్ నియోజకవర్గంలో 5 సార్లు విజయం సాధించింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సుజాతనగర్ స్థానంలో కొత్తగా ఏర్పాటైన వైరా నియోజకవర్గంలో సైతం సీపీఐ 2009లో విజయం సాధించింది. 2009లో కొత్తగూడెంలోనూ గెలుపొందింది. ఇక 1952, 1962, 1994ల్లో ఇల్లెందులోనూ సీపీఐ విజయం సాధించింది. ఇంతటి ప్రాబల్యం కలిగి ఉన్న సీపీఐ ఈసారి మరింత దెబ్బతిన్నది. ∙గతంలో ఖమ్మం లోక్‌సభ స్థానంతో పాటు వివిధ శాసనసభ స్థానాల్లో ప్రాతినిధ్యం వహించిన సీపీఎం 2014లో ఒక్క భద్రాచలం శాసనసభ స్థానంలో మాత్రమే వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచింది. 2004లో భద్రాచలం లోక్‌సభ స్థానాన్ని సైతం సీపీఎం గెలుచుకుంది. 1978 నుంచి 2014 వరకు (2009 మినహా) సీపీఎం భద్రాచలంలో వరుసగా 8 సార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఇల్లెందు(ఎన్డీకి మద్దతు), కొత్తగూడెంలో బీఎల్ఎఫ్, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేటల్లో సీపీఎం నేరుగా పోటీ చేసింది. అయితే సీపీఎంకు గట్టి పట్టున్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోవడంతో సిట్టింగ్ స్థానం భద్రాచలం నియోజకవర్గంలోనూ మూడో స్థానానికి పడిపోయింది. ఇల్లెందులో ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలు విడివిడిగా.. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ విషయానికి వస్తే 1978 నుంచి 2004 వరకు (1994 మినహా) 6 సార్లు విజయం సాధించింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఎన్డీ 2009, 2014లో ఓటమిపాలైంది. ఎన్డీకి గట్టి పట్టున్న గుండాల మండలం పినపాకలోకి, కారేపల్లి మండలం వైరా నియోజకవర్గంలోకి వెళ్లాయి. దీంతో ఎన్డీకి గెలుపు దూరమైంది. కాగా 2013లో ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలుగా విడిపోయాయి. దీంతో 2014 ఎన్నికల్లో రాయల వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చంద్రన్న వర్గం నుంచి యదళ్లపల్లి సత్యం పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు అన్ని స్థానాల్లో విడివిడిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయాయి. -
పెద్దాసుపత్రికి... గర్భిణులు రావద్దట...!
భద్రాచలం ఏజెన్సీ ప్రజల ఆరోగ్యావసరాలకు ఇదే పెద్ద దిక్కు. గర్భిణులంతా వైద్య సేవలకు, కాన్పులకు ఇక్కడికే వస్తుంటారు. మణుగూరు, పాల్వంచ తదితర ప్రాంతాల్లోని వైద్యులు కూడా అత్యవసర కేసులను ఇక్కడికే పంపిస్తుంటారు. కాన్పులు చేయటంలో ఈ ఆస్పత్రికి మంచి రికార్డ్ ఉంది. జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందుకుంది. ఇదంతా గతం...! మరి, వర్తమానం..? ఈ ఆస్పత్రి గత కీర్తి గతించింది. రెండొందల పడకలున్న ఈ పెద్దాసుపత్రి పరిస్థితి.. ‘పేరు గొప్ప–ఊరు దిబ్బ’ సామెతను తల పిస్తోంది. ‘‘గర్భిణులారా...! దయచేసి, మా ఆస్పత్రికి రావద్దు. మేమిక్కడ కాన్పు లు చేయడం లేదు. మరేదైనా ఆస్పత్రికి వెళ్లండి’’ అని, ఇక్కడి వైద్యులు చేతులెత్తి (చేతులెత్తేసి) వేడుకుంటున్నారు. భద్రాచలం: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవ సేవలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్త్రీ వ్యాధి నిపుణులు (గైనకాలజిస్ట్) అందుబాటులో లేకపోవటంతో కాన్పులు చేయటం మా వల్ల కాదంటూ విధుల్లో ఉన్న వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులకు సకాలంలో సరైన వైద్యసేవలు అందటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల నుంచి ఇక్కడికి ప్రసవ సేవల కోసమని గర్భిణులు వస్తుంటారు. భూపాలపల్లి జిల్లాలోని వాజేడు, వెంకటాపురం నుంచి కూడా రోగులు వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులన్నింటికంటే అత్యధిక ప్రసవాలు చేయటం ద్వారా వరుసగా మూడుసార్లు రాష్ట్రస్థాయిలో అవార్డు సాధించిన భద్రాచలం ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కాన్పుల కోసమని వచ్చే గర్భిణులను వేరే ఆసుపత్రులకు వెళ్లిపొమ్మంటూ ఇక్కడ వైద్యులు సూచిస్తున్నారు. దీంతో, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర ఆందళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవ సేవలు పూర్తిగా బందయ్యే పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఉన్నతాధికారులెవ్వరూ దీనిపై తగిన దృష్టి సారించకపోవటంపై విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం ఏరియా వైద్యశాలకు మూడు రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసమని రోగులు వస్తుంటారు. జిల్లాలోని మణుగూరు, పాల్వంచ వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకే అత్యవసర కేసులను రిఫర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే, 100 పడకల సామర్థ్యంగల భద్రాచలం ఆసుపత్రిని ఇటీవలనే 200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవల అందిటమే లక్ష్యంగా నూతన భవనాలను నిర్మించటంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, సరిపడినంతమంది వైద్యులను, సిబ్బందిని నియమించకపోవటంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో సరైన వైద్యం అందటం లేదు. కాన్పులు చేయటం మా వల్లకాదు... భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కాన్పులు చేయటంలో మంచి రికార్డు ఉంది. డాక్టర్ కోటిరెడ్డి నాయకత్వంలోని ఇక్కడి వైద్యుల పనితీరుకు జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందాయి. కానీ, స్త్రీ వ్యాధి నిపుణులు(గైనకాలజిస్ట్) లేకపోవటంతో కాన్పుల కోసమని వచ్చే వారిని ఇక్కడ చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. కాన్పుల సంఖ్యనుబట్టి ఇక్కడ వాస్తవంగా ఐదుగురు గైనకాలజిస్టులు ఉండాలి. ఇటీవల నిపుణులైన వైద్యుల నియామకంలో భద్రాచలానికి ప్రాధాన్యమిచ్చి, ఐదుగురిని పంపించారు. ఆ తరువాత కొన్ని రోజులకే, ఇక్కడి పని భారాన్ని తట్టుకోలేక, ఇద్దరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరో ఇద్దరు వైద్యులు.. ఎటువంటి సమాచారం లేకుండా సెలవు తీసుకున్నారు. ఇక మిగిలింది.. ఒకే ఒక్క గైనకాలజిస్ట్. ఆమె కూడా ప్రసూతి సెలవులో ఉన్నారు. దీంతో, కాన్పులు చేసే వారు ఇక్కడ లేకుండాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాన్పులు చేసేందుకు ప్రైవేటు గైనకాలిజిస్టులను రప్పిస్తున్నారు. వారికి ఒక్కో కాన్పుకు రూ.2500లు చెల్లిస్తున్నారు. వారు కూడా.. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. గతంలో 500 నుంచి 600 వరకు కాన్పులు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గత నెలలో 435 కాన్పులు చేయగా, ఈ నెలలో ఇప్పటివరకూ 100 చేశారు. ప్రస్తుతం కాన్పులకు వచ్చే వారిని చేర్చుకోవటం లేదు. ఈ ఉద్యోగం.. మాకొద్దు... భద్రాచలం ఏరియా ఆసుపత్రి సామర్ధ్యం మేరకు 66 మంది వైద్యులు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఇక్కడ 16 మంది మాత్రమే ఉన్నారు. ఇటీవలి నియామకాల్లో 19 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను ఇక్కడకి పంపించారు. ఇందులో ఎనిమిది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఏరియా ఆసుపత్రికి రోజుకు 600 వరకూ రోగులు వస్తుండం, ఇందులో 160 వరకూ ఇన్పేషంట్స్గా ఉంటుండటంతో వైద్యులపై తీవ్రమైన పని భారం పడుతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కూడా ఒకరిద్దరు మరికొన్ని రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో, సాధారణ వైద్య సేవలను కూడా స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అందిస్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వంటి చోట్ల నుంచి వచ్చి క్షణం తీరిక లేని ఉద్యోగం చేయటం తమ వల్లకాదని ఓ వైద్యుడు ‘సాక్షి’తో అన్నారు. నిబంధనలు కూడా మరీ కఠినతరంగా ఉండటంతో ఇక్కడ పనిచేయలేమన్నారు. వీరికి సహాయకారులుగా నర్సింగ్ సిబ్బంది కూడా లేరు. 64 మంది నర్సింగ్ సిబ్బంది ఉండాలి. కానీ ఇందులో 15 మంది మాత్రమే ఉన్నారు. నర్సింగ్ శిక్షణ కోసమని వచ్చే విద్యార్థుల సహకారంతో ఓపీ విభాగాన్ని నెట్టుకొస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు దీనిపై దృష్టి సారించటం లేదనేది అంతుపట్టని ప్ర«శ్నగా మిగిలింది. -
ఖమ్మంలో 22.. భద్రాదిలో 22
► ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి సమానంగా మండలాలు ► కొత్త జిల్లాలోకి నూతనంగా ఆరు మండలాలు ► ‘ఆచార్య జయశంకర్’లోకి వాజేడు, వెంకటాపురం ► భద్రాద్రి జిల్లా, రెవెన్యూ డివిజన్‌లోకి జూలూరుపాడు ► వైరా కాదు.. కల్లూరు రెవెన్యూ డివిజనే ఫైనల్ కానుంది.. ► ఏడు మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు ► ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోకి మధిర, ఎర్రుపాలెం ► కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం ► రాజధానిలో జరిగిన ప్రజా ప్రతినిధుల భేటీలో ► ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ప్రాథమిక అంగీకారం సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పునర్విభజనకు తుది రూపు వచ్చింది. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెంగా నామకరణం చేశారు. ఈ జిల్లాలోకి కొత్తగా ఆరు మండలాలు రానున్నాయి. ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలోకి వాజేడు, వెంకటాపురం మండలాలు వెళ్లనున్నాయి. భద్రాద్రి జిల్లా, రెవెన్యూ డివిజన్లో జూలూరుపాడు మండలం కొనసాగుతుంది. వైరాకు బదులుగా ఏడు మండలాలతో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోకి మధిర, ఎర్రుపాలెం మండలాలు వెళ్లనున్నాయి. ఈ మేరకు రాజధానిలో సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన మంత్రితోపాటు ప్రజాప్రతినిధులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అభ్యంతరాలు పరిగణనలోకి.. గతంలో జిల్లా పునర్విభజనపై విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా కొత్త మండలాల ఏర్పాటు.. రెవెన్యూ డివిజన్లపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలతోపాటు ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని గుర్తుకు తెచ్చేలా కొత్త జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో కొత్తగూడెం జిల్లాలో 18 మండలాలను పేర్కొన్నారు. వాజేడు, వెంకటాపురం మండలాలు జిల్లా కేంద్రం కొత్తగూడెంకు దూరంగా ఉన్నాయి.. తమకు భూపాలపల్లి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలో కలపాలని స్థానికులు ఆందోళనలు చేశారు. వారి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఆ రెండు మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపనుంది. కొత్తగా గుండాల మండలంలోని ఆళ్లపల్లి, పినపాక మండలంలోని కరకగూడెం, కొత్తగూడెం మండలంలోని లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ మండలంలోని అన్నపురెడ్డిపల్లిలను మండలాలుగా ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. మొత్తంగా కొత్తగూడెం జిల్లాలో 22 మండలాలు కానున్నాయి. కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో వైరా కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసిందని స్థానికులు ఆందోళనలు చేశారు. కల్లూరు రెవెన్యూ డివిజన్ చేస్తే ఇటు వైరాతోపాటు.. అటు సత్తుపల్లికి కూడా సౌకర్యంగా ఉంటుందని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికల ఆధారంగా కల్లూరు కేంద్రంగానే రెవెన్యూ డివిజన్ చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ రెవెన్యూ డివిజన్‌లోకి తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, వైరా, ఏన్కూరు మండలాలు రానున్నాయి. మధిర, ఎర్రుపాలెం మండలాలు ఖమ్మం రెవెన్యూ డివిజన్లో కొనసాగనున్నాయి. జూలూరుపాడు ‘కొత్త’జిల్లాలోకే... జూలూరుపాడు మండల ప్రజల అభీష్టాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలని నిర్ణయించింది. ఈ మండలాన్ని ఖమ్మంలో కలపడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్ష చేశారు. ఖమ్మంలో ప్రదర్శన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వివిధ రూపాల్లో మండల ప్రజలు తన ఆకాంక్షను వెలిబుచ్చారు. అధికారుల నివేదికతోపాటు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ మండలాన్ని కూడా కొత్తగూడెం జిల్లాలో కలపాలని సీఎం ఈ సమావేశంలో పేర్కొన్నారు. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోనే జూలూరుపాడు మండలం ఉండనుంది. ఈ అన్ని మార్పులపై జిల్లా అధికారులు నివేదికలు తయారు చేసిన అనంతరం వీటిని ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్లో పేర్కొనే అవకాశం ఉంది. ఖమ్మంలో 22.. భద్రాదిలో 22 ఖమ్మం జిల్లాలో మొత్తంగా 46 మండలాలు కాగా.. రాష్ట్ర పునర్విభజనతో ఐదు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇక మిగిలిన 41 మండలాలతో జల్లా పునర్విభజన చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలుపుతున్నారు. మిగిలిన 39 మండలాల్లో తొలివిడత విడుదల చేసిన నోటిఫికేషన్ రఘునాథపాలెం కొత్త మండలంగా పేర్కొంటూ మొత్తం 40 జిల్లాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ఖమ్మంజిల్లాలో 22, కొత్తగూడెం జిల్లాకు 18 మండలాలను కేటాయించారు. రెండు మండలాలు ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలో కలవడం.. కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు కానుండటంతో ఖమ్మం జిల్లాలో 22 మండలాలు, కొత్తగూడెం జిల్లాలో కూడా 22 మండలాలు అవుతున్నాయి. జిల్లా పునర్విభజన తర్వాత రెండు జిల్లాలకు సమానంగా మండలాలు రావడం ఇదే ప్రథమం కావచ్చు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ,శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, జలగం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
భద్రాచలంలో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్
ఖమ్మం(భద్రాచలం): ఊహించని రీతిలో 5 లక్షల మంది భక్తులు భద్రాచలంలో పుష్కరాలకు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. సెలవురోజులు కావడంతో గోదావరి పుష్కర స్నానం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తజనం లక్షలాదిగా తరలివచ్చారు. జిల్లాలోని 8 పుష్కరఘాట్లలో 6 లక్షలకు పైగా భక్తులు స్నానమాచరించగా ఇందులో 5 లక్షల మంది భద్రాచలానికి వచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భక్తుల రాకడ శనివారం సైతం కొనసాగింది. స్నానాలు పూర్తిచేసుకుని దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళ్లేక్రమంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో అనేకమంది భక్తులు భద్రాచలంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. భద్రాచలం పట్టణంలోని ఏ వీధిలో చూసినా జనసందోహమే కన్పించింది. రాత్రివేళ సైతం గోదావరి నదిలో లక్ష మందికిపైగా పుష్కరస్నానం ఆచరించారు. పోలీసులు నిలువరించినప్పటికీ తిరిగి ఇంటిదారి పట్టాలనే ఆత్రుతతో చీకట్లోనే అనేకమంది స్నానం చేశారు.గోదావరి కరకట్టపైనే అనేకమంది నిద్రించారు. శనివారం రాత్రి తరలివచ్చిన భక్తులు నిద్రించేందుకు గదులు లేకపోవడంతో రోడ్లపైనే జాగారం చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో సకాలంలో పట్టణాన్ని విడిచివెళ్లలేని పరిస్థితి. ఒకవైపు స్నానాలు పూర్తిచేసుకున్న భక్తులు తిరిగి వెళ్లడానికి దారిలేక రోడ్లపైనే ఉండటం, ఆదివారంనాటి స్నానం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో భద్రగిరి కిటకిటలాడింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రాత్రి వేళలో కూడా కొత్తగూడెం, పాల్వంచ, ఇతర ప్రాంతాల్లో భద్రాద్రికి వచ్చే వాహనాలను నిలిపివేశారు. -
ముక్కోటి ఆదాయం 41.42 లక్షలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి ఈ నెల 1న జరిగిన వైకుంఠ ఏకాదశి(ఉత్తర ద్వారదర్శనం) సందర్భంగా రూ.41,42,925 ఆదాయం వచ్చినట్లు ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. టికెట్ల ద్వారా రూ.21,56,500, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.4,33,400, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.15,53,025 వచ్చాయని వివరించారు. -
గోదావరికి పెరుగుతున్న వరద
భద్రాచలం: గోదావరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు 31.4 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారానికి ఇది 35 అడుగులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ 43 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఖమ్మం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా, వాజేడు మండలంలోని చీకుపల్లి వాగు పోటెత్తి వాజేడు-పేరూరు రహదారిపై ఆరడుగుల మేర నీరు నిలిచింది. దీంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు నాటుపడవలు ఏర్పాటు చేసి అత్యవసర ప్రయాణికులను అవతలి ఒడ్డుకు దాటిస్తున్నారు. అలాగే, వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం గోదావరి నీటి మట్టం 6.59 మీటర్లకు చేరింది. ఇక్కడ నీటి మట్టం 8.50 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. తెలంగాణలో లోటు వర్షపాతం: వ్యవసాయ శాఖ సాక్షి, హైదరాబాద్: వర్షాలు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. నదుల పరీవాహక ప్రాంతాల్లో నీటి బొట్టు కరువైపోయింది. ఈ సీజన్లో రెండు నెలలు గడుస్తున్నా ప్రధాన ప్రాజెక్టుల్లోకి ఇంకా వరద నీరు ఏమాత్రం చేరడం లేదు. ఈసారి నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితికి అద్దంపట్టేలా.. ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలపై రాష్ర్ట వ్యవసాయ శాఖ తాజాగా ఓ నివేదిక రూపొందించింది. బుధవారం(జూలై 23) నాటికి ఉన్న నీటి నిల్వలను, గత ఏడాది సరిగ్గా ఈ సమయానికి ఉన్న నిల్వలతో పోల్చి చూపింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైనట్లు కూడా పేర్కొంది. రాష్ర్టవ్యాప్తంగా తేలికపాటి వర్షాలే తప్ప ఇప్పటివరకు భారీ వర్షాలు పడలేదు. దీంతో 10 జిల్లాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈ సీజన్ జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి సాధారణంగా 298.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 140.7 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇంకా 53 శాతం కొరత ఉంది. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం ఉండగా.. నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో 60 నుంచి 99 శాతం లోటు నమోదైంది. సాగునీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే వరి నాట్లు మొదలయ్యాయి. సాగర్, సింగూర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లలో నీటిమట్టం నిరాశాజనకంగా ఉంది. -
165 గంటల పాటు హరినామ సంకీర్తన
భద్రాచలం, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్త బృందం నిరంతర హరినామ సంకీర్తన చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన భక్త బృందం సప్తాహం పేరిట ఈ భజన కార్యక్రమాన్ని చేపట్టింది. 165 గంటలపాటు నిరంతరాయంగా సాగే ఈ కార్యక్రమంలో 130 మంది భక్తులు బృందాలుగా పాల్గొన్నారు. ఈ సంకీర్తన 26వతేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు. -
రామయ్యకు పట్టాభిషేకం
తిలకించి.. పులకించిన భక్తజనం భద్రాచలం, న్యూస్‌లైన్: వైకుంఠ రాముడికి మహాపట్టాభిషేక ఉత్సవాన్ని భద్రాచలంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆలయ అర్చకులు ఈ క్రతువును జరిపించారు. ఈ వేడుకలను కనులారా చూసిన భక్తులంతా పులకిం చిపోయారు. మహోత్సవానికి ముందు ఉదయం యాగశాలలో చతుస్థానార్చన హోమం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పల్లకిలో ఉత్సవ మూర్తులను వేంచేయింపజేసి గిరిప్రదక్షిణ చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వనాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఆరాధన జరిపి సకల విఘ్నాలు తొలిగిపోయేలా విష్వక్సేనపూజ చేశారు. అనంతరం పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యాహవచనం నిర్వహించారు. రామదాసు చేయించిన బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి స్వామివారికి కిరీటధారణ చేశారు. తరువాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషక్తుడిని చేశారు. అనంతరం జరిగిన అభిషేకంతో పట్టాభిషేక తంతు ముగిసింది. కాగా, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
పసిపాపకు వాతలు
భద్రాచలం, న్యూస్‌లైన్: రెండు నెలల పసిపాప అనారోగ్యం పాలైతే చికిత్స చేయించకుండా కడ్డీతో ఉదరంపై కాల్చి ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చాడో గిరిజన తండ్రి. ఖమ్మం జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రా మానికి చెందిన పూసం ప్రసాద్, అంజలి దంపతులకు రెండు నెలల చిన్నారి ఉంది. వారం క్రితం పాపకు ఆయాసం వస్తుండటంతో అదే గ్రామంలోని తన సమీప బంధువుచే బొడ్డు చుట్టూ ఇనుప కడ్డీతో వాతలు పెట్టించాడు. అవి చిన్నారి శరీరంపై బాగా ప్రభావం చూపటంతో మంగళవారం రాత్రి నుంచి ఏడవటం ప్రారంభించింది. దీంతో తల్లిదండ్రులు బుధవారం చింతూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాప ఆక్సిజన్ తీసుకోవటం కష్టంగా ఉందని, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ వచ్చిందని, పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయారావు చెప్పారు. -
ఖమ్మం జిల్లా బంద్ సంపూర్ణం
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని తెలంగాణలోనే కొనసాగించాలంటూ సోమవారం టీజేఏసీ నాయకులు చేపట్టిన డివిజన్ బంద్ విజయవంతం అయింది. ఈసందర్భంగా భద్రాచలంతో పాటు, డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల్లో మోటార్‌సైకిళ్ల ర్యాలీలను నిర్వహించారు. భద్రాచలాన్ని కలుపుకొని తెలంగాణ వనరులను దోచుకోవాలని సీమాంధ్ర నాయకులు పన్నుతున్న కుట్రలను అడ్డుకుంటామనిటీజేఏసీ నాయకులు హెచ్చరించారు. భద్రాచలంలో తెల్లవారుజామునుంచే ఆర్టీసి బస్సులను డిపో నుంచి బయటికి రాకుండా నాయకులు అడ్డుకున్నారు. భద్రాచలానికి వచ్చే అన్ని రహదారులను నాయకులు మూసివేసి ఆటోలను, బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలోని అన్ని దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయం, పాఠశాలలను నాయకులు బంద్ చేయించారు. దీంతో పట్టణంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బస్సులను పూర్తిగా ఆపివేయటంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు సారపాక వరకు వెళ్లి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు టీజేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘా లు మద్దతు ప్రకటించాయి. చర్ల మండలంలో బంద్ సంపూర్ణంగా సాగింది. జేఏసీ నాయకులు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. రాజకీయ జేఏసీ, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు తీశారు. వెంకటాపురం మండలంలో బంద్ విజయవంతమైంది. వ్యాపారస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయించారు. మండల కేంద్రానికి వచ్చిన బస్సులను తెలంగాణ వాదులు నిలిపివేశారు. వాజేడు మండలంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తెలంగాణ వాదులు మూయించారు. తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు తెలంగాణ వాదులు తాళాలు వేశారు. చింతూరు మండలంలోలో బంద్‌ను పురస్కరించుకొని విద్యాలయాలతో పాటు వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మెయిన్‌రోడ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. దుమ్ముగూడెం మండలంలో బంద్ విజయవంతంగా ముగిసింది. దుకాణాలు, హోటళ్లు మూసివేశారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలను మూసివేశారు. వీఆర్‌పురం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. కూనవరం మండల కేంద్రంలో బంద్ విజయవంతం అయింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్దఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కూనవరం నుంచి కోతులగుట్ట వరకు మోటారుసైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. -
నేడు భద్రాచలం డివిజన్ బంద్
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ నుంచి విడదీయొద్దంటూ అఖిలపక్షం, టీజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. డివిజన్ బంద్‌కు పిలుపునిచ్చారు. డివిజన్ వ్యాప్తంగా ప్రధాన రహదారులన్నీ దిగ్బంధం చేయనున్నారు. కొందరు సీమాంధ్ర పెట్టుబడిదారుల స్వప్రయోజనాల కోసమే భద్రాద్రిని ఆంధ్రలో విలీనం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చిందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు ‘న్యూస్‌లైన్’తో అన్నారు. బంద్ సందర్భంగా డివిజన్ ప్రధాన రహదారులన్నీ మూసివేసి వాహనాలు రాకుండా అడ్డుకుంటామని, వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. ఆటో డ్రైవర్లకు కూడా తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు భద్రాచలం డివిజన్ బంద్‌కు పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. బీఎస్పీ, టీఆర్ఎస్వీ, మాలమహానాడు, నాయీబ్రాహ్మణ సంఘం, బీసీ సంఘం, రజక సంఘం, గిరిజన సంఘం, నంగారాభేరి తమ మద్దతును ప్రకటించాయి. -
రామాలయంలో నేటినుంచి పవిత్రోత్సవాలు
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భం గా శుక్రవారం నుంచి ఈనెల 21 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎం రఘునాద్, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు తెలి పారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంట లకు పవిత్ర గోదావరి నుంచి నదీ జలాలను తీసుకొచ్చి పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు యాగశాలలో విశ్వక్సేణపూజ, పుణ్యాహవచ నం, మృతంగహణం, రక్షాబంధన తదితర పూజలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీతారామచంద్రలు ఉత్సవ మూర్తులకు. నిత్యసుదర్శన పెరుమాళ్లకు, ఆండాళ్ తల్లికి, అర్చకులకు దీక్షా ధారణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 17న ఉదయం బేడా మండపంలో పారాయణ దారులకు దీక్షా కంకణధారణ, సాయంత్రం 108 కలశాలతో అష్టోత్తర శతకలశావాహన, రాత్రికి తిరువీధి సేవ జరపనున్నారు. 18వ తేదీన స్వామి మూలవరులకు మహా కుంభప్రోక్షణ, పవిత్రారోహణం, రాత్రికి చుట్టూసేవ, 19న బింబం, కుంభం, మండలం, అగ్ని, చతుస్థానార్చన, 20న హోమాలు, 21న శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, హో మం, మహాపూర్ణాహుతి, తిరువీదిసేవ, పవిత్రోత్సవాల ఉద్వాసన ఉంటాయని వివరించారు. 21వ తేదీన హయగ్రీవ జయంతి సందర్భంగా ఉపాలయంలో వేంచేసి ఉన్నహయగ్రీవ స్వామికి ప్రత్యేక అభిషేకం చేస్తామన్నారు. చిన్నారులకు ఉచితంగా పలకలు, నోటుపుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు. నేడు వరలక్ష్మీ వ్రతం... శ్రావణ శుక్రవారం సందర్భంగా రామాలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో శుక్రవారం ఉదయం 7 గంటలకు పంచామృతాభి షేకం చేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం నిర్వహించటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శ్రావణ శుక్రవా రం సందర్భంగా ‘మనగుడి’ కార్యక్రమాలలో భాగంగా ఆర్టీసి ఇన్‌గేట్ వద్ద నున్న శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక వరలక్ష్మీ వ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి టి.రత్నప్రభ తెలిపారు.