రామయ్యకు పట్టాభిషేకం
తిలకించి.. పులకించిన భక్తజనం
భద్రాచలం, న్యూస్‌లైన్: వైకుంఠ రాముడికి మహాపట్టాభిషేక ఉత్సవాన్ని భద్రాచలంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆలయ అర్చకులు ఈ క్రతువును జరిపించారు. ఈ వేడుకలను కనులారా చూసిన భక్తులంతా పులకిం చిపోయారు. మహోత్సవానికి ముందు ఉదయం యాగశాలలో చతుస్థానార్చన హోమం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పల్లకిలో ఉత్సవ మూర్తులను వేంచేయింపజేసి గిరిప్రదక్షిణ చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వనాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు.
ఆరాధన జరిపి సకల విఘ్నాలు తొలిగిపోయేలా విష్వక్సేనపూజ చేశారు. అనంతరం పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యాహవచనం నిర్వహించారు. రామదాసు చేయించిన బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి స్వామివారికి కిరీటధారణ చేశారు. తరువాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషక్తుడిని చేశారు. అనంతరం జరిగిన అభిషేకంతో పట్టాభిషేక తంతు ముగిసింది. కాగా, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.