Ramadas
-
వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన
అది 2005, జూన్ 2. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో పశుసంవర్థక శాఖపై ఉన్నతస్థాయి సమావేశం. ఏపీ డెయిరీ ఉద్యోగి రామదాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు రెడీ చేసుకున్నాడు. నిర్ణీత సమయం కంటే ఓ రెండు నిమిషాల ముందే వైఎస్ హాల్లోకి వచ్చారు. అధికారులెవరూ అప్పటికి రాకపోవటంతో రామదాసు భయపడుతూనే వైఎస్ వద్దకు వెళ్లి నిలుచున్నాడు. ఆయన ఏంటీ అనగానే.. సర్ నాకో ఆవు కావాలి అన్నాడు. దీంతో.. ఏమయ్యా అందరూ ఏదో పదవి కావాలనో, పోస్టింగ్ కావాలనో అడుగుతారు..నువ్వేంటి ఆవు కావాలంటున్నావు? అంటూ పకపకా నవ్వారు వైఎస్. అయినా నాకు పుంగనూరు ఆవు, కోడె ఇప్పించండి అని రామదాసు ధైర్యంగా అడిగాడు. ఇంతలో అధికారులు రావడంతో రామదాసు ఆశ వదులుకున్నాడు. కానీ భేటీ ముగిసిన తర్వాత సీఎస్ మోహన్‌కందాను పిలిచిన సీఎం వైఎస్..ఇతనికి ఒక పుంగనూరు ఆవు, కోడె ఇవ్వండి అంటూ రామదాసును చూపించారు. అలా పుంగనూరు ఆవు, కోడె రామదాసుకు దక్కాయి. తొలుత హైదరాబాద్ ఉప్పల్‌లోని తన ఇంట్లోనే వాటిని పెంచాడు. ఇప్పుడు వాటి సంతానం నలభైకి చేరింది. రామదాసు గోశాల యాదాద్రి జిల్లా మర్యాలకు మారింది. ఈ విధంగా పుంగనూరు గోవును రేపటి తరానికి అందించే కార్యాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లు రామదాసు చెప్పాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం పుంగనూరు ఆవు పాలతో అభిషేకం జరుగుతున్న రీతిలో.. యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామికి కూడా పుంగనూరు పాలతో నిత్యాభిషేకం చేయాలన్నది తన ఆకాంక్ష అని తెలిపాడు. -
‘అమరావతి భూకంప జోన్లో ఉంది’
సాక్షి, హైదరాబాద్ : అమరావతి భూకంప జోన్లో ఉందని ఉస్మానియా విశ్వవిద్యాలయ జియోఫిజిక్స్ విభాగ రిటైర్డ్ అధిపతి రామదాస్ అన్నారు. అమరావతి భూకంపాల తీవ్రత విషయంలో జోన్-3లో ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తే రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.5 శాతం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ తెల్లవారుజామున కృష్ణ, గుంటూరు ప్రాంతాల్లో వచ్చిన భూకంపం.. అమరావతి ప్రాంతంలో వస్తే దాని వల్ల కలిగే నష్టం అధికంగా ఉంటుందన్నారు. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో భూఅంతర్భాగంలో గ్రానైట్ పొరలు ఉండటంతో ప్రకంపనల తీవ్రత అంతగా కనిపించలేదన్నారు. కానీ అమరావతిలో భూపొరలు అంత పటిష్టంగా లేకపోవడం వల్ల దాని ప్రభావం అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ రామదాసు వివరించారు. భూకంప ప్రమాదాల విషయంలో అమరావతితో పోల్చుకుంటే విశాఖ చాలా సురక్షితం అని రామదాసు తెలిపారు. అమరావతి ప్రాంతం భూకంపాల జోన్లో ఉందని గతంలో అనేక నివేదికలు అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి విన్నవించాయని తెలిపారు. అయినా అక్కడే రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టాలనుకున్నారో తెలియడం లేదన్నారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలంటే వాస్తవంగా అయ్యే ఖర్చు కంటే పది రెట్లు అధికమవుతుందని... దాని కారణంగా రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందని రామదాసు హెచ్చరించారు. -
శ్రీవిష్ణు సహస్రనామం దాచుకో!
ఎవరైనా ఒక స్వాములవారి దగ్గరికెళ్లి ‘ఈ గ్రంథాన్ని నిత్యం పారాయణ చేయదలచాన’ని చూపించి చెప్తే– ‘మంచిదే గాని దీనితో పాటు దాన్ని కూడా కలిపి పారాయణం చేస్తే విశేషఫల’మంటూ చెప్తారు. లేదా– ‘దీనికంటే ఫలానా గ్రంథమైతే నీకొచ్చిన కష్టానికి ఆ గ్రంథం నప్పుతుంద’ని అనొచ్చు. లేదా– ‘ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించి మననం చేసుకుంటూ ఉండు’ అని చెప్పొచ్చు. ఇలాగని స్వాముల వారిని తక్కువ చేస్తూ చెప్పడం దీని అభిప్రాయం కాదు గాని, లోకంలో జరిగే సాధారణ విధానాన్ని చెప్పడానికి మాత్రమే. ఈ నేపథ్యంతో చూస్తే– సాయి దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక గ్రంథాన్ని ఆయన చేతికిస్తూ పరిశీలించవలసిందనే ఆలోచనతో నమస్కరిస్తే– కొందరిచ్చిన పుస్తకాన్ని అలా స్పృశించి వెంటనే భక్తులకు ఇచ్చేస్తూండేవారు. మరికొందరిచ్చిన పుస్తకాన్ని తెరిచి, రెండుమూడు పుటలు తిరగేసి వెంటనే ఇచ్చేస్తూ ఉండేవారు. మరికొందరిచ్చిన పుస్తకాల్ని అలా చూస్తూనే శ్యామాని పిలిచి– ఈ పుస్తకాన్ని భద్రంగా దాచు అంటూ అతనికిస్తూ ఉండేవారు. అందుకని ఎక్కువమంది భక్తులు సాయికి గ్రంథాలను ఇవ్వదలిస్తే– రెండు ప్రతుల్ని తీసుకెళుతుండేవారు. సాయి ఒక ప్రతిని తీసేసుకున్నా, శ్యామాకో మరెవరికో దాచవలసిందని ఇచ్చేసినా తమ పారాయణానికి అడ్డు రానే రాదనే అభిప్రాయంతో. ఎందుకలా సాయి ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క తీరులో ప్రతిస్పందిస్తూ ఉండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. అయితే సాయి చేతి నుంచి ఆ పారాయణం చేద్దామనుకున్న గ్రంథాన్ని తీసుకున్న వాళ్లు మాత్రం దాదాపుగా మోక్షాన్ని పొందినంత ఆనందాన్ని అనుభవిస్తుండేవారు. ఇంతేకాదు, మంచిగ్రంథం అనుకున్న పుస్తకాన్ని కూడా భక్తులు సాయి చేతికిస్తూండేవారు. ‘కాకా’కి భాగవతమంటే ఇష్టం. దాన్ని సాయి చేతికీయగానే రెండు పుటలు తిరగేసి–‘శ్యామా! ఇది నీకు చాలా బాగా ముందు ముందు పనిచేస్తుంది. దాచుకో!’ అని శ్యామాకిచ్చేశారు. ‘బాబా! ఇది మీరు నాకు ఇచ్చేస్తున్నారేమిటి? ఈ పుస్తకం కాకాది’ అన్నాడు శ్యామా. ‘నాకు తెలియదా? అందుకే నీకిచ్చాను. నీకు పనిచేస్తుందని. దీన్ని బట్టలో కట్టి దాచిపెట్టుకో!’ అన్నాడు సాయి.అలాగే ఏకనాథ భాగవతం, పంచరత్న గీతాలు, వివేకసింధు, భక్తి లీలామృత్ వంటి అనేక గ్రంథాలను ఎవరెవరో ఇస్తూ ఉంటే, వాటిని శ్యామాకిచ్చి ‘భద్రంగా దాచు’ అని ఇచ్చేస్తుండేవాడు సాయి. గమనించాల్సిన విషయమేమిటంటే– ఏనాడూ ఆ పుస్తకాన్ని చూస్తూ గాని, చూశాక గాని– ఇది హిందూ ధర్మానికి సంబంధించినది అనే తీరు దృష్టి ఆయన ముఖంలో కనిపించేది కాదు. తానొక మహమ్మదీయుడనే భావాన్ని ఏనాడూ కనపరచేవారు కాదు. ఇప్పటికీ మన హిందూ ధర్మంలో కొందరు ‘ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాం. ఈ మీదట లలితా సహస్రనామాలను చదవద్దు. శివాలయాలకి వెళ్లద్దు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తీర్థాన్ని నంది వెనుక పారబోసెయ్యండి’ అని చెప్పేవాళ్లను చూస్తుంటాం. ఇలా హిందూ ధర్మాన్ని రెండు ముక్కలుగా చేసేవాళ్లని అక్కడక్కడా చూస్తుంటే, రెండు మతాలూ ఒక్కటిగా చూస్తూ, ఆ మత భేద దృష్టి ఉండరాదని చెప్పే సాయి ఎంత ఉన్నతుడు! ఇలా రోజులు జరుగుతూ ఉంటే ఒకసారి ఓ విచిత్రం జరిగింది. మసీదులో విష్ణుసహస్రనామాలు రామదాసు బువా అనే భక్తుడు ఉండేవాడు. ఆయన పరమ నిష్టాపరుడు. ఎప్పుడూ తన అనుష్ఠానాన్ని సక్రమంగా చేస్తుండేవాడు. ఓసారి ఆయన మసీదులో తన అనుష్ఠానాన్ని ప్రారంభించి, సంధ్యావందనం ముగించుకుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభించాడు. నుదుట విభూది రేఖలతో శరీరం నిండుగా శివనామాలతో కాషాయ వస్త్రాలను ధరించి శ్రావ్యంగా ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే ఆయనకి సమయమే తెలియలేదు. ఇవికాక ఆధ్యాత్మ రామాయణాన్నీ, ఇంకా కొన్ని పారాయణలనీ చేస్తూనే ఉన్నాడు. కాసేపటికి పారాయణలన్నీ ముగిశాయి. అంతలో సాయి రామదాసుని పిలిచి– ‘దాసూ! నా కడుపులో పోటుగా ఉంది. నొప్పి తగ్గేలా అనిపించడం లేదు. అంగడికి పోయి సునాముఖీ ఆకును తీసుకురావూ! అన్నాడు. కల్లాకపటం తెలియని వాడూ, అమాయకుడూ సాయి పట్ల చెప్పలేని భక్తిభావం ఉన్నవాడూ అయిన రామదాసు మరుక్షణం పరుగులాంటి నడకతో మందుల వీధి వైపు బయల్దేరాడు. రామదాసు అలా వెళ్లగానే సాయి ఆ పారాయణ పుస్తకాల వద్దకు వెళ్లాడు. ఇంకా మరొకటి పారాయణ చేయవలసి ఉందన్న గుర్తుగా పుస్తకం పుటల మధ్య బయటకి తొడిమ కనిపించేలా పెట్టిన మామిడాకును చూస్తూ రామదాసుకున్న ప్రాచీన ధోరణిని ప్రశంసించుకున్నాడు లోలోపల. అక్కడే విష్ణు సహస్రనామం పుస్తకం కనిపించింది. వెంటనే శ్యామాని పిలిచి– ‘శ్యామా! ఈ పుస్తకం ఏమిటో నీకు తెలుసా? ఒకప్పుడు నాకు గుండె దడదడలాడటం మొదలైంది. కంగారు పడిపోయాను. ఏమవుతుందో తెలియని స్థితికి వెళ్లిపోయాను. ఏమీ తోచక అక్కడే కనిపించిన ఈ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకున్నాను. కొంతసేపటికి నా గుండె చేసిన హడావుడి మొత్తం పోయింది. ప్రశాంతపడ్డాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితాన్ని రక్షించింది ఈ పుస్తకమే’ అంటూ ‘శ్యామా! ఈ పవిత్రగ్రంథాన్ని నువ్వు తీసుకెళ్లు’ అన్నాడు. వెంటనే శ్యామా ‘బాబా! ఈ పుస్తకం నాకొద్దు. అది రామదాసుది. ఆయనెంత అనుష్ఠానపరుడో అంత అనుమానమ్మనిషి. ఈ పుస్తకాన్ని నేను దొంగతనం చేశాననుకుంటూ ఇంకా ఏమైనా పుస్తకాలనీ వస్తువుల్నీ కూడా తానే ఎక్కడో దాచుకుని, అవిగాని పొరపాటున కనిపించకపోతే నన్ను దొంగగా ప్రచారం చేస్తూ పదిమందిలో నా పరువు తీసేస్తాడు. పైగా ఆయనకి కోపం వస్తే వీర చిందులు తొక్కేస్తాడు.నన్నెందుకు అతనికి బలి చేస్తావు? మన్నించు. నాకొద్దు!’ అన్నాడు శ్యామా.మళ్లీ సాయి శ్యామాని చూస్తూ ‘నా ప్రాణాల్నే రక్షించిన గ్రంథమంటూ చెప్పినా, నేనే తీసుకోవలసిందని చెప్తున్నా అలా అంటావేమిటి? నీ దగ్గరుంచుకో! దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో నీకు తెలియదు. దాచుకో!’ అన్నాడు. బిక్కముఖం వేస్తూ ‘సాయీ! నాకీ శ్లోకాలను చదవడం రాదు. నా నాలుక బండబారిపోయింది. నోరు తిరగదు కూడా. దాంట్లో ఏవో సంధులూ సమాసాలూ పదాలను విరగ్గొట్టి అర్థం చేసుకోడాలూ నాకు రావు. పైగా తప్పులు చదివితే ఏమవుతుందో? ఎందుకు నన్నిలా ఇబ్బందిపెడతావు? అన్నింటికీ మించి రామదాసుతో గొడవ మామూలుగా ఉండదు. దయచేసి..’ అంటుండగానే, శ్యామా వాక్యం పూర్తి కాకుండానే సాయి ‘శ్యామా! మారు మాటాడకు. ఈ పుస్తకాన్ని నీ వద్దే భద్రం చెయ్యి’ అన్నాడు. శ్యామాకి సాయి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలున్నా కూడా లోలోపల అనుకున్నాడు– ‘ఎందుకింత పట్టుపడుతున్నాడు సాయి? నాకూ రామదాసుకీ కలహం కలిగితే వినోదిద్దామనుకుంటున్నాడా? అయినా ‘వద్దు మొర్రో’ అనుకునే వాడికి అంటగడితే సన్యాసికి పెళ్లి చేసిన చందమే కదా!’ అని. అదే సమయంలో శ్యామా పట్ల ఎంతో వాత్సల్యం అనురాగం ఉన్న సాయి కూడా లోలోపల అనుకున్నాడు. ‘ఎందుకింతగా శ్యామా విరోధిస్తున్నాడు? వైద్యుడు రోగిని గమనించి తీపిమందునే ఇస్తాడా? ఔషధం చేదుగా ఉంటుందని రోగి తీసుకోనంటే వైద్యుడు ‘అలాగే’ అంటాడా? కొండలంతటి పరిమాణంలో పాపాలు ఉన్నా తెగ్గొట్టి వ్యక్తిని ఉద్ధరించేది విష్ణు సహస్రనామం కాదూ! వ్యక్తిగా వందమంది మధ్యలో ఉన్న భీష్ముణ్ణి అలా శ్రీహరిలోనికి అందరూ చూస్తుండగా లీనం అయ్యేలా చేసింది ఈ గ్రంథం కాదూ? సరే! ఈ గ్రంథంలో భక్తినీ శ్రద్ధనీ శ్యామాకి పుట్టించాల్సిందే! నమ్మినవాడికి తోవ చూపించని పక్షంలో గురువుండీ ప్రయోజనమేమిటి?’ అని. ఇలా ఇద్దరూ అనుకుంటూ ఉంటే సాయే స్వయంగా శ్యామా దగ్గరకొచ్చి ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని శ్యామా జేబులోకి నెట్టేసి– ‘శ్యామా! ఇతర కర్మకలాపాలన్నింటికీ నిష్టా నియమం, ఉపవాస విధి, మంచిరోజు, ఉపదేశం పొంది ఉండటం వంటి ఎన్నో విధానాలుంటాయి. ఉన్నాయి. దీనికి అక్కర్లేదు. భీష్ముడు శవాల గుట్టలున్న ప్రదేశంలో కదా దీన్ని చెప్పాడు. పరమ పవిత్రుడైన శ్రీహరి పరస్పర క్రోధావేశాలతో ఒకరినొకరు చంపుకున్న కురుక్షేత్ర ప్రదేశానిక్కదా వచ్చాడు! ఇంతకంటే నీక్కావలసిన సాక్ష్యం ఏమిటి? ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే చదువుకోగలిగిన పుస్తకం ఇది! నీకు తెలుసో తెలియదో! ఏకనాథ్ మహారాజు కూడా ఈ పుస్తకాన్నే పొరుగింట్లో ఉన్న బ్రాహ్మణుడికి అంటగట్టాడు బలవంతానా. ఆ పొరుగింటి బ్రాహ్మణుడు కులానికి మాత్రమే బ్రాహ్మణుడు తప్ప ఏకోశానా అతనిలో బ్రాహ్మణ ధోరణే కనిపించేది కాదు. ఒక నియమం నిష్ట, పూజ ధ్యానం ఆచారం.. ఇలా ఏదీ అతనిలో కనిపించకపోతుంటే నీలాగే ఆయనా ఎందుకిలా అంటగడతాడు? అనుకుంటేనే ఈ పుస్తకాన్నే బలవంతానా అతనికిచ్చాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని ఇంటికి ప్రతిరోజూ తానే వెళ్తూ శరీరంలోని రోగాలను నిరోధించడానికి పోట్లాడే తెల్ల కణాల్లాంటి జాతి అయిన బ్రాహ్మణులు ఇలా ఆచారం సంప్రదాయం లేకుండా ఉంటే అది సరికాదని భావించి, బ్రాహ్మణుడు చేసే పూజలు వ్రతాలు ధ్యానాల వల్ల లోకం రక్షింపబడుతుందని భావించి ఆ బ్రాహ్మణుని చేత రోజుకి ఒక శ్లోకాన్ని కంఠస్థం చేయించాడు. అర్థాన్నీ భావాన్నీ లో అర్థాన్నీ వివరించాడు. అలా చేయగానే ఆ బ్రాహ్మణుడు వత్తిని పైకి జరిపితే వెలిగే దీపంలా ఆచార సంప్రదాయ ధోరణిలోకి మారిపోయాడు’ అంటూ శ్యామాకి చెప్పాడు. ఏదో విషసర్పాన్ని రాత్రివేళ ఎవరైనా పడుకున్న గదిలోకి విడిచిపెడుతూ– దీనివల్ల మీ దగ్గరకు ఏ దొంగలూ రాలేరన్నట్టనిపించింది శ్యామాకి. అయిష్టంగానే ఆ పుస్తకంతో అలా తన గదికి వెళ్లిపోయాడు శ్యామా. ‘పుండుకి పుడక గుచ్చుకుంద‘న్న సామెతలా ఈ సంఘటన అంతటినీ చూస్తున్న అణ్ణా (చించణకర్) విషయాన్నంతటినీ ముందుకు ముందే అంగడి నుంచి వస్తున్న రామదాసుకి చేరవేశాడు. అణ్ణాది ఎవరైనా కలహించుకుంటే వినోదించే స్వభావం. అందుకే అక్కడిది ఇక్కడికీ, ఇక్కడిది అక్కడికీ చేరవేస్తూ తనదైన కలహభోజనాన్ని సకాలంలో ముగిస్తుండేవాడు.ఇంతలో రామదాసు వచ్చాడు. సునాముఖీ ఆకుని సాయికి ఇవ్వాలనే మాట మర్చిపోయి, శ్యామా గదికి వెళ్లి, ‘శ్యామా! నువ్వే సాయిని మోసం చేస్తూ ఆయనకి కడుపునొప్పి వచ్చిందని చెప్పించి నా పుస్తకాన్ని కాజేశావు! నేనెవరికీ భయపడేవాణ్ణి కాదు.బాబా దొంగతనం చేయవలసిందని ప్రోత్సహించేవాడు కానే కాదు. నువ్వే నీ దొంగబుద్ధికి బాబాని బలిచేస్తూ ఇలా చేశావు. నా పుస్తకాన్ని నాకివ్వకపోయావో ఇక్కడే నా తలని గోడకి కొట్టుకుంటాను– అంటూ శ్యామాని తెగ నిందించసాగాడు. శ్యామా ఏమి చెప్పబోయినా వినిపించుకునే స్థితిలో లేనేలేడు రామదాసు. పెద్ద తుఫానొచ్చాక కొంతసేపటికి ప్రశాంతత వచ్చేటట్టు రామదాసు కోపంతో ఊగిపోవడం తిట్టిపోయడం– అంతా ముగిశాక శ్యామా అతనితో ‘రామదాసూ! ఒకే ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పు. ఈ పుస్తకాన్ని వజ్రాలతో పొదిగావా? రత్నాలతో అక్షరాలని చెక్కించావా? ఇదేమైనా ప్రపంచంలోనే లభ్యంకాని పుస్తకమా? ఏ అంగడిలో చూసినా వంద ప్రతులు ఉండే పుస్తకం కదా! నేనెందుకు దొంగతనం చేశాననుకుంటున్నావు? పోనీ! నేను పిసినారినా? డబ్బుల్లేనివాడినా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? కాలు జారితే వెనక్కి తీసుకోగలం గాని నోరుజారితే వెనక్కి తీసుకోలేం! ఆలోచించు! నీలా వెర్రికోపంతో చిందులు తొక్కే స్వభావం కాదు నాది. ఇక ఆపై నీ ఇష్టం. శాంతిస్తావో– ఇంకాసేపు తిట్టుకుంటావో’ అన్నాడు. శ్యామా పలికిన ఈ మాటలు రామదాసులో ఆలోచన రేకెత్తించాయి. నిజమే కదా! అనిపించేలా అనిపించాయి ఆ మాటలు. రామదాసు కొద్దిగా మెత్తబడినట్లు అనిపించగానే– అంటే ఆలోచనలో పడి తాను చేసింది తప్పే అనే భావంతో ఉన్నాడనిపించగానే శ్యామా మళ్లీ అదే నిదానమైన కంఠస్వరంతో ‘రామదాసూ! నేను మోసగాణ్ణీ, అసత్యాలు పలికేవాణ్ణీ– దొంగతనాలు చేసేవాణ్ణీ అన్నావే! దానికి నేను ఏమాత్రమూ బాధపడను గాని, నువ్వే బాబాతో నాటకమాడించానన్నావే! అది మాత్రం వాడి బాణాన్ని గుండెలో గుచ్చినట్టుగా నన్ను బాధిస్తోంది. ఎందుకంటావా? బాబా ఎప్పుడూ నాటకాలాడేవాడు కాడు. పైగా ఎవరు నాటకాలాడిస్తారా అని చూసేవాడూ కాడు. ఎవరైనా నాటకాలాడుతుంటే సరిదిద్దేవాడు ఆయన! ఇంతకాలం బాబా దగ్గర ఉండి బాబా గురించి ఇలా మాట్లాడటమనేది ఔషధం దొరకని వ్యాధితో బాధపడుతున్న రోగిలా నన్ను కలచివేస్తోంది’ అని ముగించాడు. రామదాసు మరింత ఆలోచనలో పడిపోయి మౌనంగా నిలబడిపోయాడు. అందరికీ తంపులు పెట్టే లక్షణమున్న అణ్ణా చల్లగా జారుకున్నాడు తాను రగిల్చిన నిప్పు అంటుకోలేకపోయిందే అనుకుంటూ. ఇంతలో సాయి ఆ మందిరంలోకొచ్చాడు. నిదానమైన కంఠస్వరంతో రామదాసుని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ అతను దగ్గరకొచ్చాక ‘రామదాసూ! ఎందుకు అనవసరంగా అలా ఉద్రేకపడిపోతావు? శ్యామా ఎవరు? మన పిల్లాడులాంటివాడు కదా! అతణ్ణి అలా మసీదు మొత్తం దద్దరిల్లిపోయేలా అరిచెయ్యడం నీలాంటి నిష్టాపరునికీ సంప్రదాయపరునికీ తగునా? ప్రతి పవిత్రగ్రంథాన్నీ నువ్వలా నిష్టగా పారాయణం చేస్తుంటే నేనెంత ఆనందపడతానో తెలుసా? అయినా ప్రతి మంత్రం చివరా ‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః’ అంటుంటావే? అది నీలో ఎంత ఉందో ఎప్పుడైనా గమనించుకున్నావా? ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేస్తావుగా రోజూ! మనసుకొచ్చే వికారాలని పోగొట్టుకోవాలని కదా దాంట్లో కనిపిస్తుంది. విష్ణు సహస్రనామాలని చదువుతావు కదా శ్రావ్యంగా. చెవులకింపైన కంఠస్వరంతో పారాయణకాలంలో మమ్మల్ని కూడా కట్టిపడేస్తావుగా!అనేక యుద్ధాలను ధర్మబద్ధంగా మాత్రమే చేశాడు కాబట్టే భీష్ముడు ప్రశాంత స్థితిని పొందగలిగాడు. శ్రీహరిలో లీనం కాగలిగాడు. అహంకారాన్నీ మమకారాన్నీ విడిచిపెట్టాలని చెప్పే ఈ పారాయణాల్ని కేవలం చదివేసి పూజ అయిపోయిందనుకోవడం కాదుగా! ఆచరణలో కొద్దిగానైనా చూపించగలగాలిగా! ఒక చిన్న పుస్తకానికి– ఎక్కడైనా దొరికేదానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఏ చెట్టు తొర్రలో ఉన్న అగ్ని ఆ చెట్టునే దహించివేసేటట్లు నీలోని కోపం నిన్నే...’ అంటూ మౌనంగా ఉండిపోయాడు. రామదాసు తనది తప్పేనని మనఃపూర్వకంగా అంగీకరిస్తున్నట్లు తలాడించి మెల్లగా తలెత్తి నీరునిండిన కళ్లతో సాయికి నమస్కరించాడు. సాయి అన్నాడు– ‘నా కడుపునొప్పి అంతా నాటకమే. నేనే శ్యామాకి ఆ పుస్తకాన్ని ఇవ్వదలచి ఇచ్చాను.’ కొసమెరుపు: ఏ విషయాన్నైనా ఆవేశంతో కేకలతో అరిచేవాళ్లు ప్రశాంతతకి లొంగిపోతారు. శ్యామా అలాగే బాబా మాట్లాడిన సమయంలో రామదాసు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? లోకంలో అందరూ గమనించుకోగలగాలి. స్వభావమనేది ఒక్కసారిగా పోయేది కాదు. మెల్లగా మెల్లగా కదా పోతుంది. ఇంతా అయ్యాక రామదాసు శ్యామాని చూస్తూ ‘నా పుస్తకానికి బదులు పంచరత్నగీత పుస్తకాన్ని ఇవ్వు’ అని తీసుకున్నాడు. అనుకున్నాం కదా రామదాసు పిసినారి అని. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే– ఇంత గొడవకి కారణభూతమైనది విష్ణుసహస్రనామం కారణంగా కదా! కాబట్టి ఎంతో గొప్పదై ఉంటుందనే భావనతో పట్టుబట్టి శ్యామా విష్ణుసహస్రనామాల్ని చదివి కంఠస్థం చేయడమే కాకుండా, పూర్తి వ్యాఖ్యానాన్ని కూడా ఒక పండితుని ద్వారా తెలుసుకున్నాడు తర్వాతి కాలంలో. (సశేషం) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
దివ్యదృష్టి
చూపున్నవాళ్లమే లోకాన్ని ఈదుకుంటూ సాయంత్రానికి ఇంటì ఒడ్డుకి సరిగా కొట్టుకు రాలేకపోతున్నాం. ఇక నేహా తనెలా బతుకుతుంది? కూతుర్నెలా బతికిస్తుంది? దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తాడా? చెప్పగల విషయం కాదు. పెద్దాయన పైన ఉంటాడు. ఆయన లోపల ఏముంటుందో కింద ఉండేవాళ్లం మనకు ఎలా తెలుస్తుంది? అయినా, ఇవ్వడానికి తీసుకోవడం ఎందుకూ అనిపిస్తుంది! మనుషులం, మన భయం కొద్దీ దేవుణ్ని పాజిటివ్‌గా తీసుకుంటాం. ‘కులుకుతూ కూర్చున్నావ్, ఏం పట్టించుకోకుండా’ అని దేవుణ్ని పట్టుకుని రామదాసులా తిట్టేస్తే.. ఇంకోటేదైనా ఆయన మన నుంచి తీసేసుకుంటే మళ్లీ అదొక బాధ జీవితానికి. రెండేళ్ల క్రితం నేహా సూరి కి ఆ కాస్త కంటి చూపు కూడా పోయింది. ఒంటరి తల్లి. ఒక టీనేజ్ బిడ్డ. నైరాశ్యం. ఉండడం ఢిల్లీలో. చూపున్నవాళ్లమే లోకాన్ని ఈదుకుంటూ సాయంత్రానికి ఇంటì ఒడ్డుకి సరిగా కొట్టుకు రాలేకపోతున్నాం. ఇక నేహా తనెలా బతుకుతుంది? కూతుర్నెలా బతికిస్తుంది? ఏడాది పాటు ఎలాగో నెట్టుకొచ్చింది. తర్వాత ఆ చీకట్లోకి ఒక వెలుతురు రేఖ ప్రసరించింది. చూపు రాలేదు. చూపుతో పనిలేని ఉద్యోగం వచ్చింది. చేతివేళ్లతో తడిమి బ్రెస్ట్ కాన్సర్ రిస్క్‌ను కనిపెట్టే ఉద్యోగం అది. నేహా ఇప్పుడు ‘మెడికల్ టాకై్టల్ ఎగ్జామినర్’ (ఎం.ఇ.టి)! స్పర్శజ్ఞాని. గత మూడు నెలలుగా తన స్పర్శజ్ఞానంతో వట్టి చేతులతో వైద్య పరీక్షలు చేస్తున్నారు నేహా. వక్షోజాలలో, ఆ చుట్టుపక్కల బాహుమూలాల్లో అర సెంటీమీటరు కణితి ఉన్నా ఆమె వేళ్లు కనిపెట్టేస్తాయి. అయితే ఇది తనకై తను వృద్ధి చేసుకున్న జ్ఞానం కాదు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందే కనిపెట్టేందుకు వసంత్‌కుంజ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రి శిక్షణ ఇప్పించిన ఏడుగురు అంధ మహిళా ఎం.ఇ.టి.లలో నేహా ఒకరు. వీళ్లది మొదటి బ్యాచ్. వీళ్లతోనే ఎం.ఇ.టి. అనే ఒక కోర్సు మొదలైంది! గాంధీ జయంతి రోజు వీరు విధుల్లో చేరారు. ‘ఆప్టిమల్ సెన్సరీ టచ్’తో.. చెకప్ కోసం వచ్చిన మహిళల వక్షోజ భాగాలలోని చిన్నపాటి కణితులను సైతం వీరు గుర్తించగలుగుతారు. వేళ్లతో తగుమాత్రంగానే వక్షోజాలపై ఒత్తిyì కలిగిస్తూ లోపల ఏమైనా గడ్డల్లాంటివి ఉన్నాయేమో తడిమి చూస్తారు. అదే.. ఆప్టిమల్ సెన్సరీ టచ్. కనీసం 35 నుంచి 45 నిమిషాలపాటు వీరి వేళ్లు సునిశితంగా, సూక్ష్మంగా పరీక్ష జరుపుతాయి. మరి బ్రెస్ట్ సరిగ్గా ఎక్కడుందో వీళ్లకు లె లిసేదెలా? బ్రెయిలీ చుక్కలు ఉన్న టాకై్టల్ రేకులు ఛాతీని నాలుగు భాగాలుగా విభజిస్తూ వీరి వేళ్లకు దారి చూపుతాయి. ఒక్క బ్రెస్టు, ఆ చుట్టుపక్కలే కాకుండా.. వీపులో, మెడభాగంలో కూడా గడ్డలు, కణితుల కోసం వేళ్లు గాలిస్తాయి. శిక్షణలో భాగంగా నేహా, మిగతావాళ్లు గుర్గావ్లోని మేదంతా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక్కొక్కరూ 30 మంది మహిళలకు పైగా వేళ్లతో వక్షోజ పరీక్షలు జరిపారు. కచ్చితమైన ఫలితాలను రాబట్టారు. ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వసాధారణం అయింది. ప్రతి లక్ష మందిలో 24 మందిలో కనిపిస్తోంది. ముందుగా కనిపెట్టగలిగితే ఈ ఇరవై నాలుగు మంది ప్రాథమిక దశలోనే గట్టెక్కేయొచ్చు. అలా గట్టెక్కించేవారే ఈ ఎం.ఇ.టి.లు. దేవుడు ఒకటి తీసుకుని ఇంకొకటి ఇస్తాడన్న మాట నిజమే అయితే.. పది మందికి ఇవ్వడం కోసం దేవుడు నేహా దగ్గర్నుంచి, ఆమె బ్యాచ్‌మేట్స్ నుంచీ తీసుకున్నాడనుకోవాలి. నేçహా అయితే అలాగే అనుకుంటోంది. -
రామదాసుపై పోటీ చేస్తా
మైసూరు : మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఏ.రామదాస్‌పై వచ్చే శాసన సభ ఎన్నికల్లో మైసూరు నగరంలో ఉన్న కే.ఆర్.నగర నియోజకవర్గం నుంచి తాను కూడా పోటీ చేస్తానని ప్రేమకుమారి తెలిపారు. గతంలో ఆమె మాజీ మంత్రి రామదాసు ప్రియురాలిగా వార్తల్లోకి ఎక్కారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే ఉండటంతో ఇప్పటికే కే.ఆర్. నగర నియోజకవర్గంలో ఉన్న సమస్యలపైన మాజీ మంత్రి రామదాసు తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. ఇటీవలె నియోజకవర్గంలో చెత్త సమస్యపై ఆయన నిరాహార దీక్ష కూడా చేశారు. ఎన్నికల కోసం రామదాసు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ప్రస్తుతం తెరపైకి వచ్చిన ప్రేమకుమారి మరోసారి రామదాస్‌కు షాక్ ఇచ్చారు. వచ్చే శాసన సభ ఎన్నికల్లో ఏదైనా పార్టీ నుంచి అయినా లేదా స్వతంత్ర అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి కచ్చితంగా నిలబడతానని చెప్పారు. నటుడు ఉపేంద్ర పార్టీ లేదా అనుపమా శైనె పార్టీ నుంచి పోటీ చేయడానికి యత్నిస్తున్నానని చెప్పారు. -
బాయిలర్‌లో పడి కార్మికుడి మృతి
ముత్తుకూరు: బాయిలర్‌లో పడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో గురువారం వెలుగు చూసింది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన రామదాసు(40) నేలటూరులోని ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈ రోజు విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాయిలర్‌లో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
సమర్థ రామదాసు
యోగి కథ మహారాష్ట్రకు చెందిన ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు సమర్థ రామదాసు సాక్షాత్తు శ్రీరాముడి దర్శనం పొందిన యోగి పుంగవుడిగా ప్రసిద్ధి పొందారు. మహారాష్ట్రలోని గోదావరి తీరంలో జల్నా జిల్లా జాంబ్ గ్రామంలో 1608వ సంవత్సరం శ్రీరామ నవమి రోజున జన్మించారు. తండ్రి సూర్యజీ పంత్, తల్లి రాణూబాయ్. ఆయన అసలు పేరు నారాయణ సూర్యజీ తోషర్. ఎనిమిదో ఏటనే తండ్రి మరణించడంతో అంతర్ముఖుడిగా మారారు. ఎక్కువసేపు ధ్యానంలోనే గడిపేవారు. అలా ధ్యానంలో ఉన్నప్పుడే తన పన్నెండో ఏట శ్రీరాముడి సాక్షాత్కారం పొందారు. శ్రీరాముడే ఆయనకు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించినట్లు ప్రతీతి. అప్పటి నుంచే ఆయన సమర్థ రామదాసుగా ప్రఖ్యాతి పొందారు. బాల్యంలో ఆట పాటలపై యోగాసనాలు, శారీరక వ్యాయామ విన్యాసాలపై ఆసక్తి చూపే సమర్థ రామదాసు రామబంటు అయిన హనుమంతుడిని కూడా ఎంతో ప్రీతిగా ఆరాధించేవారు. వైవాహిక జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన 1632 నుంచి ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించారు. తన అనుభవ సారాంశాన్ని వివరిస్తూ ‘ఆస్మానీ సుల్తానీ’, ‘పరచక్ర నిరూపణ’ అనే ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు ప్రబోధాత్మక కవితలతో పలు గ్రంథాలు రాశారు. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరు సాగించిన అప్పటి మరాఠీ యోధుడు శివాజీకి అండగా నిలిచారు. పలుచోట్ల పర్యటిస్తూ సంచార జీవితం కొనసాగించిన సమర్థ రామదాసు ఆద్యచాఫల్ మఠం, రామ మందిరం, దాసాంజనేయ మందిరం, వీర మారుతి మందిరం స్థాపించారు. అవసాన దశలో ప్రాయోపవేశం చేసి, తన 73వ ఏట సజ్జన్గడ్లో తుదిశ్వాస విడిచారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
విశాఖపట్టణం జిల్లా హుకుంపేట మండలం కూట్నపల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ముందు వెళుతున్న బైక్ వెనుక వేగంగా వచ్చిన వ్యాను ఢీకొనడంతో బైక్ నడుపుతున్న రామదాసు(25) అనే యువకుడు మృతిచెందాడు. బైక్ వెనక సీట్ లో ఉన్న సీతయ్య(24) తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ సీతయ్యని పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అయోధ్య రాముడు! దక్కన్ రాముడు !!
అయోధ్య రాముడు వేరు ! దక్కన్ రాముళ్లు వేరు !! సీత కాళ్లపారాణి ఆరకముందే, నూనుగు మీసాల రాముడు అంతఃపుర కారణాలతో అడవిబాట పట్టాడు. ఒక మహాయుద్ధం చేసి సీతా సమేతుడై పట్టాభిషిక్తుడు అయ్యాడో లేదో వియోగ రాముడయ్యాడు ! రామాయణంలో భద్రాద్రి ప్రత్యేకమైనది. పద్నాలుగేళ్ల వనవాసకాలంలో పదేళ్లను పది నిమిషాలుగా సీతారాములు ఇక్కడ ఆహ్లాదంగా గడిపారు. ముత్యాల బాట.. ఇతిహాస కాలానంతరం, చారిత్రక భద్రాచలం తహసీల్దార్ గోపన్న (రామదాసు)కు ఇక్కడ గుడి కట్టాలనిపించింది. కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాకు జమకట్టాల్సిన పన్నులతో ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత జైలుపాలైన రామదాసు రాములోరిపై భక్తిపూర్వకంగా నిందాస్తుతి రాశాడు. రామలక్ష్మణులు గోల్కొండకు రాక తప్పలేదు. తానీషాను ‘నిద్ర’లేపి తమ దాసుడు కట్టాల్సిన డబ్బులను అణాపైసలతో సహా చెల్లించి రసీదు సైతం పొందారు. తానీషా పశ్చాత్తప్తుడై రామదాసును విడుదల చేశాడని గాథ ! ఏటా సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపుతానన్న తానీషా మాట నేటికీ అమలవుతోంది. కూచిపూడి భాగవతులకు తానీషా అగ్రహారాన్నివ్వడమూ మరొక సందర్భంలో స్మరణీయమే ! మరొక దక్కనీ రాముడికి సంబంధించిన చారిత్రక డాక్యుమెంట్లను తిప్పి చూద్దాం. అసఫ్జాహీలు-కాయస్థులు ఈ అపురూపమైన దక్కనీ చిత్రాన్ని తిలకించండి. 19వ శతాబ్దపు అజ్ఞాత చిత్రకారుడు కాగితంపై వాటర్ కలర్స్‌తో, బంగారుపూతతో చిత్రించాడు. ఇందులో ప్రస్తుత కథానాయకుడు మూడో నిజాం నవాబ్ సికిందర్ జా ఉద్యానవనంలో సుమసౌరభాన్ని ఆస్వాదిస్తూ విరాజమానుడై ఉన్నాడు. ఆయన ఎదురుగా నాలుగు సామాజిక సమూహాలకు ప్రతీకలైన నలుగురు ప్రధానులు.. ప్రభువు ఆనతిని ఆలకిస్తున్నారు. ఇంతకీ సికిందర్ జా ఎవరు ? ఔరంగజేబ్ పతనానంతరం అరాచకం తాండవించింది. కత్తి కింద ఒకటిగా మసలిన ప్రాంతీయ అస్తిత్వాలు తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నాయి. ఆ నేపథ్యంలో మహమ్మద్ షా (1719-48) ధోరణులు నచ్చక పాలకవర్గంలోని ప్రముఖుడు నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ వచ్చేశాడు. ఏడాదిలో (1724) పాత దక్కన్‌ను ఏకం చేశాడు. ఆయన ప్రత్యేకతను దక్కనీయులు, ఢిల్లీ పాలకులు సైతం గుర్తించి ‘అసఫ్ జాహీ’ బిరుదునిచ్చి గుర్తించారు ! ఆయన వెంట ఢిల్లీ నుంచి కాయస్థులు దక్కన్ వచ్చారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే ఢిల్లీ ఏలికల వైపరీత్యాలు చోటు చేసుకోకుండా ప్రజలకూ ప్రభుతకు వారధిగా వ్యవహరించారు. వివిధ పదవుల్లో, బాధ్యతల్లో రాజ ప్రముఖులుగా ఎదిగారు. ఆ క్రమంలో రాజపరివాపు జీతభత్యాలను చెల్లించే అధికారి భవానీ ప్రసాద్‌కు మూడో నిజాం ‘రాజా’ బిరుదునిచ్చారు. ఆ సందర్భంగా రామాలయం నిర్మించాలనుకున్నారు భవానీ ప్రసాద్. ప్రస్తుత నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాజేంద్రనగర్‌కు వెళ్లే దారిలో అత్తాపూర్ సమీపంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన రాముడి విగ్రహం వెనుక ఒక కథ ఉంది. గద్వాల తర్వాత హైదరాబాదే.. పాత హైదరాబాద్ స్టేట్‌లోని రాయచూర్ జిల్లాలో నిజాంలకు అనుబంధంగా గద్వాల సంస్థానం ఉండేది. 1384 చ.కి.మీ విస్తీర్ణంలో గద్వాల పట్టణమూ, 214 గ్రామాల సంస్థానానికి రాజా సోమభూపాలుడు పాలకుడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో భాగమైన ఈ సంస్థానం హైదరాబాద్ స్టేట్ కంటే ముందే అస్తిత్వంలో ఉండేది. రాజా సోమభూపాలుడు తన పరివారం కోసం ఒక రామాలయాన్ని నిర్మించాలనుకున్నాడు. రాముడి శిల్పం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు ఒక కల వచ్చింది. ‘సమీపంలోని బావిలో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయంలో ప్రతిష్ఠించవలసినది’ అని రాముడు చెప్పాడట. అదే సమయంలో ‘రాజా’ భవానీ ప్రసాద్‌కూ సోమభూపాలుడికి రాముడు కలలో చెప్పిన వైనం కలగా వచ్చిందట. బావిలోని విగ్రహాన్ని గద్వాలాధీశుడు ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో ముందుగా శిల్పులకు పురమాయించగా రూపొందిన రాముడి విగ్రహం తనకు బహుమతిగా ఇవ్వవలసిందిగా కోరాడట భవానీ ప్రసాద్. సోమభూపాలుడు సంతోషంగా అంగీకరించి బహూకరించాడట. ఫర్కుందా బునియాద్.. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక, సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా భవానీప్రసాద్ మూడో నిజాం సికిందర్ జాను ఆహ్వానించాడు. 1812లో ఈ అపురూప దృశ్యాన్ని ఆబాలగోపాలం వీక్షించింది ! ఆలయ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న సికిందర్ జా మడులూ-మాన్యాలు ఆలయానికి రాశాడు. అర్చకులకు, సిబ్బందికి జీతభత్యాలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వమన్నాడు. ఏటా రామనవమి రోజు ప్రభుత్వం తరఫున ‘యాత్ర’ నిర్వహించాలని ఆదేశాలిచ్చాడు. 1816వ సంవత్సరపు ‘దఫ్తర్-ఎ-ఇస్తిఫా’ రికార్డుల ప్రకారం అర్చకులకు రోజుకు రెండు రూపాయల గ్రాంట్ మంజూరైంది. మూడో నిజాం ఉత్తర్వుల్లో హైదరాబాద్ పేరును ‘ఫర్కుందా బునియాద్’ అని పేర్కొన్నారు. భాగ్యనగర్ అనే పేరుకు ఫర్షియా పదం ‘ఫర్కుందా బునియాద్’ సమానార్థకం కావడం విశేషం ! దక్కన్ ముస్లింలు విగ్రహ ప్రతిష్ఠాపకులు రామ్‌బాగ్ ఆలయంగా స్థానికులు వ్యవహరించే ఈ ఆలయం ప్రతిష్ఠాపనలో హిందూ-ముస్లింలు సాదరంగా పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనను స్వయంగా ముస్లిం పాలకుడు చేశాడు. ముస్లింలంటే విగ్రహ విధ్వంసుకులనే భావనలను పూర్వపక్షం చేశారు. మనవత్వాన్ని పరిమళించే ఈ మతసామరస్యానికి బీజాలు నగరానికి పునాదులు వేసిన కులీ కుతుబ్షాలో ఉన్నాయి. ఒక కవితలో అంటాడు.. కాఫిర్లు లేరు ముస్లింలు లేరు.. అన్ని మతాలు.. ప్రేమ కుదురులోనే పుష్పిస్తాయి.. హైదరాబాద్ తెహ్జీబ్ పరిమళాలను ఆస్వాదించేంతగా కాలుష్య ప్రపంచం ‘అభివృద్ధి’ చెందాలని ఆశిద్దాం! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
రామయ్యకు పట్టాభిషేకం
తిలకించి.. పులకించిన భక్తజనం భద్రాచలం, న్యూస్‌లైన్: వైకుంఠ రాముడికి మహాపట్టాభిషేక ఉత్సవాన్ని భద్రాచలంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆలయ అర్చకులు ఈ క్రతువును జరిపించారు. ఈ వేడుకలను కనులారా చూసిన భక్తులంతా పులకిం చిపోయారు. మహోత్సవానికి ముందు ఉదయం యాగశాలలో చతుస్థానార్చన హోమం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పల్లకిలో ఉత్సవ మూర్తులను వేంచేయింపజేసి గిరిప్రదక్షిణ చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వనాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఆరాధన జరిపి సకల విఘ్నాలు తొలిగిపోయేలా విష్వక్సేనపూజ చేశారు. అనంతరం పట్టాభిషేకంలో వినియోగించే ద్రవ్యాలకు పుణ్యాహవచనం నిర్వహించారు. రామదాసు చేయించిన బంగారు పాదుకలు, రాజదండం, రాజముద్రిక, క్షత్రం సమర్పించి స్వామివారికి కిరీటధారణ చేశారు. తరువాత ప్రధాన కలశంతో ప్రోక్షణ చేసి రామయ్యను పట్టాభిషక్తుడిని చేశారు. అనంతరం జరిగిన అభిషేకంతో పట్టాభిషేక తంతు ముగిసింది. కాగా, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.