సమర్థ రామదాసు
యోగి కథ
మహారాష్ట్రకు చెందిన ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు సమర్థ రామదాసు సాక్షాత్తు శ్రీరాముడి దర్శనం పొందిన యోగి పుంగవుడిగా ప్రసిద్ధి పొందారు. మహారాష్ట్రలోని గోదావరి తీరంలో జల్నా జిల్లా జాంబ్ గ్రామంలో 1608వ సంవత్సరం శ్రీరామ నవమి రోజున జన్మించారు. తండ్రి సూర్యజీ పంత్, తల్లి రాణూబాయ్. ఆయన అసలు పేరు నారాయణ సూర్యజీ తోషర్. ఎనిమిదో ఏటనే తండ్రి మరణించడంతో అంతర్ముఖుడిగా మారారు. ఎక్కువసేపు ధ్యానంలోనే గడిపేవారు. అలా ధ్యానంలో ఉన్నప్పుడే తన పన్నెండో ఏట శ్రీరాముడి సాక్షాత్కారం పొందారు. శ్రీరాముడే ఆయనకు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించినట్లు ప్రతీతి. అప్పటి నుంచే ఆయన సమర్థ రామదాసుగా ప్రఖ్యాతి పొందారు. బాల్యంలో ఆట పాటలపై యోగాసనాలు, శారీరక వ్యాయామ విన్యాసాలపై ఆసక్తి చూపే సమర్థ రామదాసు రామబంటు అయిన హనుమంతుడిని కూడా ఎంతో ప్రీతిగా ఆరాధించేవారు.
వైవాహిక జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన 1632 నుంచి ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించారు. తన అనుభవ సారాంశాన్ని వివరిస్తూ ‘ఆస్మానీ సుల్తానీ’, ‘పరచక్ర నిరూపణ’ అనే ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు ప్రబోధాత్మక కవితలతో పలు గ్రంథాలు రాశారు. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరు సాగించిన అప్పటి మరాఠీ యోధుడు శివాజీకి అండగా నిలిచారు. పలుచోట్ల పర్యటిస్తూ సంచార జీవితం కొనసాగించిన సమర్థ రామదాసు ఆద్యచాఫల్ మఠం, రామ మందిరం, దాసాంజనేయ మందిరం, వీర మారుతి మందిరం స్థాపించారు. అవసాన దశలో ప్రాయోపవేశం చేసి, తన 73వ ఏట సజ్జన్‌గడ్‌లో తుదిశ్వాస విడిచారు.