Physical exercise
-
హూలా హూప్.. ఇక మీ సోకు నాజూకు
అందంగా తయారవడానికి పార్లర్లో ఐబ్రోస్, ఫేషియల్, వ్యాక్సింగ్ ఇలా చాలానే చేయించుకోవచ్చు కానీ.. సన్నగా అవ్వాలంటే మాత్రం వ్యాయామం ఒక్కటే మార్గం. నాజూకు నడుము ఇచ్చే లుక్కే వేరు. ఎన్ని డైటింగ్ చిట్కాలు పాటించినా తగ్గని నడుము, పొట్ట భాగాలు.. ‘హూలా హూప్ గేమ్’ ఆడితే వేగంగా తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. ‘హూలా హూప్’.. గుండ్రటి పెద్ద రింగ్‌ని నడుము భాగంలో ఉంచి.. మనిషి కదలకుండా నడుముని మాత్రమే తిప్పుతూ.. రింగ్ కిందపడకుండా ఆడే ఆట. గుర్తొచ్చిందా? చిన్నప్పుడు మీరూ ఆడే ఉంటారు ఈ ఆట. అమ్మో చాలా కష్టం అంటారా? అందుకే దీనికి టెక్నాలజీని జోడించి.. కింద పడిపోకుండా నడుముకి పట్టి ఉండే ‘వెయిటెడ్ హూలా స్మార్ట్ హూప్’ అనే డివైజ్‌ని మార్కెట్లోకి తెచ్చాయి పలు కంపెనీలు. ఈ స్మార్ట్ రింగ్ 47.2 ఇంచులు ఉంటుంది. మొత్తం 16 మసాజ్ హెడ్స్‌తో ఈ రింగ్‌ని రెడీ చేసుకోవచ్చు. ఒక్కో హెడ్ 2.95 ఇంచులు ఉంటుంది. శరీరతత్వాన్ని బట్టి, నడుము సైజుని బట్టి.. ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ రింగ్ మాదిరి మార్చుకోవచ్చు. అంటే 10 మసాజ్ హెడ్స్ కలిపితే 24.7 ఇంచులు, 12 మసాజ్ హెడ్స్ కలిపితే 32.1 ఇంచులు, 14 మసాజ్ హెడ్స్ కలిపితే 39.6 ఇంచులు, 16 మసాజ్ హెడ్స్ కలిపితే 47.2 ఇంచులు లూజ్ ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. అయితే ఈ రింగ్‌కి పొడవుగా వేలాడే వెయిట్ బాల్ ఒకటి అటాచ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ డివైజ్‌ని నడుముకి సరిగ్గా బిగించుకుని, గిర్రున తిరుగుతున్నంత సేపు.. వెయిట్ బాల్ 360 డిగ్రీస్ తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతున్న సమయంలో ఒక్కో మసాజ్ హెడ్‌ని ప్రెస్ చేస్తూ వెళ్తుంది. దాంతో వేగంగా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అయితే అనుభవం మీద.. కొన్ని మసాజ్ హెడ్స్ తగ్గించి ఈ రింగ్‌ని తొడ, చేతులు వంటి భాగాల్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. -
గర్భవతి సాహసం.. 400 మీటర్లు పరిగెత్తి
బెంగళూరు: పోలీసు ఉద్యోగం అంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకోసం ఎప్పటి నుంచో దీక్షగా చదువుతుంది. మరి కొద్ది రోజుల్లో పోలీసు ఫిజికల్ ఈవెంట్స్ ఉండగా తాను గర్భవతని తెలిసింది. వైద్యులు ఆమెను ఇలాంటి సాహసాలు చేయవద్దని సూచించారు. కానీ ఆమె ధైర్యం చేసి ఈవెంట్స్‌కి అటెండ్ అయ్యింది. క్వాలిఫై అయ్యింది. ఆ తరువాత విషయం తెలియడంతో ఉన్నతాధికారులు ఆమె సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. కర్ణాటక కలబురాగికి చెందిన అశ్విని సంతోష్ కోరే(24)కు పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. దానికోసం శ్రద్ధగా చదువుతోంది. ఇక డిపార్ట్మెంట్ జాబ్ అంటే రన్నింగ్, జంపింగ్ వంటి పరీక్షలు కూడా ఉంటాయి. అయితే అశ్విని ఇప్పటికి రెండు సార్లు ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యింది... కానీ రాత పరీక్షలో విఫలం అయ్యింది. ఈ క్రమంలో మూడో సారి మరింత దీక్షగా చదవడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఈవెంట్స్‌కు మరికొన్ని రోజులుందనగా అశ్వినికి తాను గర్భవతినని తెలిసింది. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి. గైనకాలజిస్ట్‌ను కలిసి.. పరిస్థితి వివరించింది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు పరిగెత్తడం లాంటి పనులు చేయకూడదని హెచ్చరించింది. కానీ ఈ అవకాశాన్ని వదులుకుంటే కలల జాబ్ దూరమవుతుంది. బాగా ఆలోచించిన అశ్విని అధికారుల దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించింది. 400 మీటర్ల పరుగు పందెం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. కానీ వారు అంగీకరించకపోవడంతో.. తప్పనిపరిస్థితుల్లో అశ్విని దానిలో పాల్గొంది. 2 నిమిషాల టార్గెట్ కాగా.. అశ్విని 1.36 సెకన్లలో దాన్ని పూర్తి చేసి.. అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ.. ‘‘అశ్విని గర్భవతి అనే విషయం మాకు తెలియదు. చాలా మంది మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాలంటే భయపడతారు. కానీ అశ్విని ధైర్యం చేసి.. పాల్గొనడమే కాక.. క్వాలిఫై అయ్యింది. ఈసారి ఆమె తప్పకుండా రాత పరీక్ష కూడా క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
పిల్లలు గంట.. పెద్దలు 45 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని అందరికీ తెలుసు. కానీ ఏ వయసు వారు ఎంతసేపు, ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనే అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా స్పష్టత ఇచ్చింది. ఐదేళ్ల పిల్లలు మొదలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, గర్భిణులను ఐదు కేటగిరీలుగా విభజించి ఎవరెంతసేపు ఎక్సర్సైజులు చేయాలో సూచించింది. బీపీ, షుగర్, ఎసిడిటీ, స్థూలకాయం, కేన్సర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు తిరిగి ఆరోగ్యకర జీవనం సాగించేందుకు వీలుగా శారీరక శ్రమపై తొలిసారి శాస్త్రీయ మార్గదర్శకాలతో నివేదిక విడుదల చేసింది. 5–17 ఏళ్ల వయసువారు... ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ఐదేళ్ల నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలు, ప్రతిరోజూ కనీసం గంటపాటు శక్తివంతమైన వ్యాయామాలు చేయాలి. ఎక్కువగా పరిగెత్తడం, జాగింగ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. వారంలో మూడురోజులు కండరాలు, ఎముకలను బలోపేతం చేసే ఎక్సర్సైజులు చేయాలి. ఆటలు ఆడాలి. 18–64 ఏళ్ల వయసువారు... ఈ విభాగంలోని వారు ప్రతివారం కనీసం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు (రోజుకు గరిష్టంగా సుమారు 45 నిమిషాలు) తేలికపాటి నుంచి కఠిన ఎక్సర్సైజులు చేయాలి. వారానికి కనీసం 95 నిమిషాల నుంచి రెండున్నర గంటల వరకు కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, కేన్సర్, టైప్–2 డయాబెటీస్ నుంచి బయటపడొచ్చు. శారీరక ఆరోగ్యం, మానసిక శ్రేయస్సు కోసం వ్యాయామం అవసరం. 65 ఏళ్లు పైబడినవారు... వృద్ధులు సైతం 18–64 ఏళ్ల వయసు కేటగిరీ వారు చేసే వ్యాయామాలన్నీ చేయవచ్చు. వాటితోపాటు వారు వారానికి కనీసం మూడు రోజులు శరీర బ్యాలెన్స్‌కు దోహదపడే ఎక్సర్సైజులు చేయడం మంచిది. వృద్ధులు తూలి కిందపడకుండా ఉండేందుకు ఈ తరహా వ్యాయామాలు ఉపయోగపడతాయి. గర్భిణులు... గర్భిణులు లేదా బాలింతలు ఎలాంటి సమస్యలు లేకపోతే డాక్టర్ల సూచన మేరకు ప్రతివారం కనీసం రెండున్నర గంటల వరకు పరిమితమైన ఏరోబిక్స్ చేయాలి. అయితే వ్యాయామ సమయంలో నిర్ణీత పరిమాణంలో మంచినీరు తప్పక తాగాలి. కఠినమైన వ్యాయామాలు చేయరాదు. దీర్ఘకాలిక అనారోగ్యాలున్నవారు... దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులున్న వారు వారానికి కనీసం గంటన్నర నుంచి ఐదు గంటలపాటు ఏరోబిక్స్ చేయాలి. లేదా వారానికి కనీసం 75 నిమిషాల నుంచి రెండున్నర గంటలపాటు కఠినమైన, శక్తివంతమైన ఏరోబిక్స్ చేయాలి. అలాగే వారానికి కొన్నిసార్లు, తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి బ్యాలెన్స్ వ్యాయామాలు చేయాలి. శారీరక శ్రమను ప్రోత్సహించాలి డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని మార్గదర్శకాలు అత్యంత శాస్త్రీయమైనవి. అందువల్ల శారీరక శ్రమ చేసేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. తద్వారా వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి మానసిక ఉల్లాసం లభిస్తుంది. శారీరక శ్రమ చేసే గర్భిణుల్లో బీపీ సమస్య తలెత్తదు. ముందస్తు కాన్పుల సమస్య తగ్గుతుంది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్న అంశాలివి ►రోజుకు 10–12 గంటలు స్థిరంగా కూర్చునే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగతావారికంటే 1.5 రెట్లు ఎక్కువ. ►శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కేన్సర్ వంటివి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తలెత్తదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయి. ►27.5 శాతం పెద్దలు, 81 శాతం యుక్త వయస్కులు శారీరక శ్రమ చేయడంలేదు. -
శారీరక శ్రమకు దూరంగా యువత
సాక్షి, హైదరాబాద్ : ఆడుతూ పాడుతూ శారీరకంగా అలసిపోవాల్సిన యువత.. ఎల క్ట్రానిక్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటు న్నారు. ప్రపంచంలో ప్రతి ఐదుగురు టీనేజర్లలో నలుగురు సరైన వ్యాయామం చేయ ట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని ‘ది లాన్సెట్’అనే సంస్థ 146 దేశాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా 11–17 ఏళ్ల వయసు గల విద్యా ర్థులపై ఈ సర్వే నిర్వహించింది. భారత్‌లో 72% మంది ఈ వయసు వారు వ్యాయామం చేయకపోవడంతో చురుగ్గా ఉండట్లేదని తేల్చింది. శారీరక శ్రమను పెంచడానికి అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఎముకలు, కండరాలు పటిష్టంగా ఉండాలంటే ఈ వయసులో కనీసం రోజుకు గంటపాటు కఠిన లేదా మితమైన వ్యాయామాలు చేయాలని సిఫార్సు చేసింది. దీంతో జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా పిల్లలను కాపాడుకోవచ్చని తెలిపింది. యువతకు ఆడుకునే హక్కుందని, ఆ హక్కును కల్పించాలని ఈ సర్వే సూచించింది. బాలుర కంటే బాలికల్లో మరీ తక్కువ ‘బాలుర కంటే బాలికల్లో శారీరక శ్రమ ఇంకా తక్కువగా ఉంది. వారిని ఇంటికే పరిమితం చేయడం, బయటకు పంపడానికి అనువైన వాతావరణం లేకపోవడం వంటివి కారణాలు కనిపించాయి. సాంస్కృతిక సంప్రదాయాలు, భద్రతాపరమైన అంశాలు బాలికలకు ప్రతికూలంగా మారుతున్నాయి. బాలికల శ్రమ విషయంలో మన దేశం సహా బంగ్లాదేశ్ అత్యంత వెనుకబడి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2001లో బాలురలో 80 శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటే, ఇప్పుడు 78 శాతానికి తగ్గింది. కానీ బాలికల్లో శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారు.. అప్పుడూ ఇప్పుడూ 85 శాతం మందే ఉండటం గమనార్హం. అన్ని దేశాలు కౌమార దశలోని పిల్లల శారీరక శ్రమపై తమ విధానాలను అభివృద్ధి చేయాలి. అందుకు అవసరమైన వనరులను కేటాయించాలి’అని లాన్సెట్ నివేదిక కోరింది. డిజిటల్ టెక్నాలజీ కారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై టీనేజర్లు ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆట స్థలాలేవీ? తెలంగాణలో 5 వేల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిల్లో 15 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. దాదాపు 95 శాతం స్కూళ్లల్లో ఆట స్థలాలున్నాయి. అయితే రాష్ట్రంలో 10,549 ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిల్లో 31.21 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. 8,044 ప్రైవేటు స్కూళ్లల్లో మైదానాలు ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ కాగితాలపైనే అవి ఉన్నాయని, 50 శాతం పైగా ప్రైవేటు స్కూళ్లల్లో ఆట స్థలాలు లేవని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉండగా, 1,500 ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. వాటిల్లో 10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 80 శాతం ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో మైదానాల్లేవు. కారణంగా విద్యార్థులు ఆటలు ఆడటం కష్టమవుతోంది. దీంతో పిల్లలపై జీవనశైలి వ్యాధులు దాడి చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 5 శాతం మంది బీపీతో బాధపడుతుండగా, తెలంగాణలో ఏకంగా 6.7 శాతం ఉండటం ఆందోళనకరం. అదే వయసు పిల్లల్లో మధుమేహంతో బాధపడేవారు దేశంలో 0.6 శాతం మంది ఉండగా, తెలంగాణలో 1.1 శాతం మంది ఉన్నారు. ఆ వయసు పిల్లల్లో దేశంలో తెలంగాణ బీపీ విషయంలో 5వ స్థానం, మధుమేహంలో 9వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 8.6 శాతం మంది ప్రీ డయాబెటిక్‌తో బాధపడుతున్నారని తేల్చింది. -
జీవితాన్నీ ఈదేసింది...
ఆరోగ్యం కోసం నేర్చుకున్న ఈత ఆమెను స్విమ్మింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. శారీరక వ్యాయామం అవుతుందని స్విమ్మింగ్çపూల్‌లోకి దిగిన ఆమెకు ఆ ఈతే ఇప్పుడు తన కాళ్లపై తాను నిలబడేలా ఉపాధి నిస్తోంది. ‘కోచ్‌గా అంతర్జాతీయ పాఠశాలలో విద్యార్థులకు ఈత నేర్పే అవకాశం వచ్చింది’ అని సంబరంగా చెబుతుంది ఈతలో మేటిగా ఎదిగిన చందికంటి అన్నపూర్ణ. నేటి రోజుల్లో ఇల్లు గడవాలంటే భర్త సంపాదనకు ఇల్లాలి ఆదాయం ఎంతో కొంత తోడవ్వాలి అనే వారి సంఖ్య పెరిగింది. అందుకే మొదట్లో ఉపాధి కోసం ఇంట్లోనే టైలరింగ్ పని చేసేవారు అన్నపూర్ణ. దాంట్లో పెద్దగా ఆదాయం లేకపోవడంతో స్వయంగా డ్రైవింగ్ స్కూల్ నడిపారు. మార్కెట్లో ఉన్న పోటీకి డ్రైవింగ్ స్కూల్ నడపడం కొంత ఇబ్బందిగా మారింది. ‘వేసవి సెలవుల్లో మా ఇద్దరు పిల్లలకు స్కేటింగ్ నేర్పించేందుకు నిజామాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ కాంప్లెక్స్‌కు వెళ్లాను. పిల్లలు స్కేటింగ్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న సిమ్మింగ్çపూల్‌లో కొందరు చిన్నారులు స్విమ్మింగ్ నేర్చుకోవడాన్ని చూశారు. వ్యాయామంతో పాటు, ఆరోగ్యానికీ ఉపయోగపడుతుందని, స్విమ్మింగ్ నేర్చుకుంటే బాగుంటుందని మా ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. వాళ్లూ సరే అన్నారు. అలా నాతో పాటు మరో ఇద్దరు మహిళలు వ్యాయామం కోసం ఈత నేర్చుకోవడం మొదలుపెట్టారు’ అని పదేళ్ల నాటి స్థితిని వివరించారు అన్నపూర్ణ. అంచెలంచెలుగా... ఈత పోటీల్లో అన్నపూర్ణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ‘మొదట 2009లో నిజామాబాద్‌లో జరిగిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలలో (మాస్టర్స్) మహిళా విభాగంలో పాల్గొన్నాను. మొదటి పోటీలోనే స్వర్ణ పతకం వరించింది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. దీంతో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికయ్యాను. హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, గుజరాత్, గుల్బర్గా, వైజాగ్ తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో బంగారు, రజితం, కాంస్య.. పతకాలను సాధించాను’ అని మెరిసేకళ్లతో చెప్పే అన్నపూర్ణ కిందటేడాది ఫిబ్రవరిలో కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ సిమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో వివిధ విభాగాల్లో మూడు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించి రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి పెంచారు. కోచ్‌గా స్వయం ఉపాధి అన్నపూర్ణ స్వస్థలం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అంజుమాన్ఫారం. ఇంటర్ వరకు చదువుకున్నారు. భర్త సత్యపాల్గౌడ్ చిరువ్యాపారి. ఇద్దరు అబ్బాయిలు బీటెక్, ఇంటర్ చదువుతున్నారు. అన్నపూర్ణ ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఉన్న గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో స్విమ్మింగ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. ‘2008లో నేను స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు నిజామాబాద్‌లో ఇద్దరు ముగ్గురు మినహా మహిళలెవ్వరూ ఈత నేర్చుకునేందుకు ముందుకురాలేదు. ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావించి నేర్చుకున్న ఈత నాకు ఉపాధి కల్పిస్తుందని ముందు అనుకోలేదు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’ అని అన్నపూర్ణ పేర్కొన్నారు. – పాత బాలప్రసాద్, -
సమర్థ రామదాసు
యోగి కథ మహారాష్ట్రకు చెందిన ఆధ్యాత్మిక గురువు, వాగ్గేయకారుడు సమర్థ రామదాసు సాక్షాత్తు శ్రీరాముడి దర్శనం పొందిన యోగి పుంగవుడిగా ప్రసిద్ధి పొందారు. మహారాష్ట్రలోని గోదావరి తీరంలో జల్నా జిల్లా జాంబ్ గ్రామంలో 1608వ సంవత్సరం శ్రీరామ నవమి రోజున జన్మించారు. తండ్రి సూర్యజీ పంత్, తల్లి రాణూబాయ్. ఆయన అసలు పేరు నారాయణ సూర్యజీ తోషర్. ఎనిమిదో ఏటనే తండ్రి మరణించడంతో అంతర్ముఖుడిగా మారారు. ఎక్కువసేపు ధ్యానంలోనే గడిపేవారు. అలా ధ్యానంలో ఉన్నప్పుడే తన పన్నెండో ఏట శ్రీరాముడి సాక్షాత్కారం పొందారు. శ్రీరాముడే ఆయనకు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశించినట్లు ప్రతీతి. అప్పటి నుంచే ఆయన సమర్థ రామదాసుగా ప్రఖ్యాతి పొందారు. బాల్యంలో ఆట పాటలపై యోగాసనాలు, శారీరక వ్యాయామ విన్యాసాలపై ఆసక్తి చూపే సమర్థ రామదాసు రామబంటు అయిన హనుమంతుడిని కూడా ఎంతో ప్రీతిగా ఆరాధించేవారు. వైవాహిక జీవితానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన 1632 నుంచి ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించారు. తన అనుభవ సారాంశాన్ని వివరిస్తూ ‘ఆస్మానీ సుల్తానీ’, ‘పరచక్ర నిరూపణ’ అనే ఆధ్యాత్మిక గ్రంథాలతో పాటు ప్రబోధాత్మక కవితలతో పలు గ్రంథాలు రాశారు. విదేశీ పాలకులకు వ్యతిరేకంగా పోరు సాగించిన అప్పటి మరాఠీ యోధుడు శివాజీకి అండగా నిలిచారు. పలుచోట్ల పర్యటిస్తూ సంచార జీవితం కొనసాగించిన సమర్థ రామదాసు ఆద్యచాఫల్ మఠం, రామ మందిరం, దాసాంజనేయ మందిరం, వీర మారుతి మందిరం స్థాపించారు. అవసాన దశలో ప్రాయోపవేశం చేసి, తన 73వ ఏట సజ్జన్గడ్లో తుదిశ్వాస విడిచారు. -
appకీ కహానీ...
నైక్ప్లస్... మీ ఫిట్నెస్ ట్రైనర్! చాలామంది ఏదో ఒక శారీరక వ్యాయామం చేస్తూనే ఉంటారు. ఎక్కువ మంది వాకింగ్, జాగింగ్ చేస్తారు. కొందరు జిమ్‌కు వెళ్తారు. ఇక ప్రముఖులు, సినీ తారలైతే నాజూకైన శరీరాకృతి కోసం పర్సనల్ ట్రైనర్లను నియమించుకుంటున్నారు. దీనికి వారు భారీగానే వెచ్చిస్తుంటారు. మరి వీరిలా పర్సనల్ ట్రైన ర్లను ఏర్పాటు చేసుకుని ఖర్చు చేయలేనివారి సంగతేంటి? నిజానికి చక్కని శరీరాకృతిని పొందటానికి మనకూ కొన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి హెల్త్, ఫిట్నెస్ యాప్ ‘నైక్ ప్లస్ ట్రైనింగ్ క్లబ్’(ఎన్టీసీ). నైక్ సంస్థ రూపొందించిన ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ప్రత్యేకతలు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. కావలసిన, అవసరమైన వర్కవుట్లనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని కస్టమైజ్ చేసుకునే వెసులుబాటుంది. శరీరంలోని ఒక్కో భాగానికి ఒక్కో వర్కవుట్ అవసరమవుతుంది. నడుమును నాజూకుగా మార్చుకోవాలంటే చేతితో డంబెల్ పట్టుకొని వర్కవుట్ చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే మనకు కావలసిన వర్కవుట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్కవుట్ ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే విషయాలు కూడా ఉంటాయి.మనకు అవసరమైన, డౌన్లోడ్ చేసుకున్న వర్కవుట్లను వీడియో రూపంలో, ఫొటోల రూపంలో చూడొచ్చు. మీరు మీ కసరత్తులకు సంబంధించిన ఫొటోలను తీసుకొని, వాటిని సోషల్ నెట్వర్క్ సైట్ల ద్వారా మీ స్నేహితులకు కూడా షేర్ చేయొచ్చు. వర్కవుట్లకు సంబంధించి నైక్ మాస్టర్ ట్రైనర్స్, స్నేహితుల సలహాలను తీసుకోవచ్చు. క్రోమ్‌కాస్ట్, హెచ్డీఎంఐ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని ఎన్టీసీ వర్కవుట్లను టీవీలో చూసుకోవచ్చు. నైక్ ప్లస్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ను ఎపుడైనా, ఎక్కడైనా సులభంగా యాక్సెస్ చేయొచ్చు. యాప్‌ను ఉపయోగించాలంటే ఈ-మెయిల్ తప్పనిసరి. దీని ద్వారా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది. -
జవాన్లకు రోజూ యోగా
తప్పనిసరి చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు న్యూఢిల్లీ: దేశంలో 10 లక్షల మందికి పైగా ఉన్న పారామిలటరీ జవాన్ల రోజువారీ భౌతిక వ్యాయామంలో యోగాను చేర్చాలని కేంద్ర సాయుధ పోలీసు దళాలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దేశ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఉన్నా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నా తప్పనిసరిగా యోగా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించింది. సాధారణంగా సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ వంటి కేంద్ర సాయుధ బలగాల జవాన్లు రోజువారీ భౌతిక వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వారు క్యాంపుల్లో ఉన్నా, సరిహద్దుల వద్ద విధుల్లో ఉన్నా కూడా వ్యాయామం చేయాల్సిందే. అయితే తాజాగా భౌతిక వ్యాయామాలతో పాటు యోగా చేయడానికి కూడా తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐడీబీపీ, ఎస్ఎస్బీ, ఎన్ఎస్జీ, అస్సాం రైఫిల్స్ తదితర బలగాలకు కేంద్ర హోంశాఖ సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిపై క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందికి సూచనలు జారీచేయాలని పేర్కొంటూ ఆయా దళాల డెరైక్టర్ జనరల్స్‌ను ఆదేశించింది. ‘భారతీయ పురాతన సాంప్రదాయమైన యోగాను రోజువారీ చర్యల్లో భాగంగా చేసుకుని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. భద్రతా బలగాల రోజువారీ చర్యల్లో యోగాను చేర్చడం సముచితమైనది..’ అని సర్క్యులర్‌లో పేర్కొంది. -
ఆహార నియమాలకు 5 సూత్రాలు
సమతుల ఆహారాన్ని వేళ ప్రకారం తీసుకుంటూ, శారీరక వ్యాయామానికి సరైన ప్రాధాన్యమిస్తూ ఉంటే అధికబరువు సమస్యే దరిచేరదు. అయితే, చాలామందికి ఆహారం తీసుకోవడంలో సరైన ప్రణాళిక ఉండదు. దాంతో అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నది పోషకాహార నిపుణుల అభిప్రాయం. ఆహార ప్రణాళికకు నిపుణులు అందిస్తున్న 5 సూత్రాలు.. 1. ఆహార ప్రణాళిక.. ‘డైట్ ప్లాన్’ సరిగ్గా ఉండాలి కదా అని ఒకే తరహా ఆహారంతో సరిపెట్టేయకూడదు. దీని వల్ల ఆ ప్రణాళిక సవ్యంగా నడవదు. కొన్ని రకాల పదార్థాలు మరికొన్నింటితో కలిపితే రుచిగానే కాదు, ఆరోగ్యానికీ మేలు కలుగుతుంది. అయితే, ఏ పదార్థాలు కలిపితే శరీరానికి మంచిది అనేవి తెలిసుండటం ముఖ్యం. ఉదాహరణకి- చేపలు ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. అయితే, చేపలను కూరల రూపకంగానే కాకుండా ఆవిరి మీద ఉడికించి, గ్రిల్ చేసి, ఇతర కూరగాయల సలాడ్స్‌తో తీసుకోవచ్చు. 2. ఎంపిక ప్రధానం.. లక్ష్యం వైపుగానే ఆహారపు అలవాట్లు ఉండాలి. మనకు నచ్చనిదైనా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని కూడా మెల్ల మెల్లగా మొదలుపెట్టి శరీరానికి అలవాటు చేయవచ్చు. దీని వల్ల లక్ష్యానికి త్వరగా చేరువకావచ్చు. 3. భాగస్వామిని ఎంచుకోండి... కుటుంబంలోనో, స్నేహితుల్లోనో, సహోద్యోగుల్లోనూ.. మీలాగే ఆహారనియమాలు పాటించే వ్యక్తిని ఈ నియమాల్లో భాగస్వామిగా ఎంచుకోండి. దీని వల్ల ఆహార నియమాలను పాటించడంలో ప్రోత్సాహం ఉంటుంది. వాయిదా వే సే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాయిదా వేసినా తిరిగి కొనసాగించే ధోరణి ఈ పద్ధతిలో ఎక్కువ. 4. సులువుగా కితాబు ఇచ్చేసుకోకండి... మీకు మీరుగా ‘నేను చాలా బాగా ఆహార నియమాలు పాటించగలను’అనే కితాబు ముందే ఇచ్చుకోకండి. ఎప్పుడైనా నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల మీ ప్రణాళిక కూడా పూర్తిగా మూలన పడే అవకాశమూ ఉంది. అందుకే, ప్రతి రోజూ ‘ఈరోజును కొత్తగా, ఇంకా మరింత ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో ప్రారంభిస్తాను’ అనుకోండి. 5. ఒత్తిడిని అదుపులో ఉంచండి.. భావోద్వేగాల ప్రభావం ఆరోగ్యం మీద చూపుతుంది. ఇలాంటి సమయాల్లో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, లేదా అసలు తీసుకోకపోవడం జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి అదుపులో లేకపోతే ఆహారం మీద అదుపు ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం మరింత మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇదొక విషవలయంగా మనిషిని వేధిస్తూనే ఉంటుంది. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకొని, నియమాల అమలు సక్రమంగా జరిగేలా చూడాలి. -
క్రయోలిపోలిసిస్ చేసే విధానం...
కేవలం ఒకే ఒక్క సారి మీరు క్లినిక్‌ని సందర్శించండి.. మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి. శరీరంలోని కొన్ని భాగాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే అత్యంత అధునాతన, సురక్షితమైన విధానం క్రయోలిపోలిసిస్. సర్జరీ లేకుండా... ఎక్కువసార్లు క్లినిక్‌ను సందర్శించకుండా... కేవలం ఒకటి లేదా రెండు సార్లు క్లినిక్‌ను సందర్శిస్తే సరిపోతుంది. దీనిద్వారా మీ శరీరంలోని వివిధ భాగాల్లోని పేరుకుపోయిన కొవ్వును చాలా తక్కువ సమయంలో తొలగించుకోవచ్చు. ఇది లైపోసక్షన్‌కు ప్రత్యామ్నాయంగా సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే విధానం. దీనికి ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి ఊఈఅ అనుమతి కూడా లభించింది. క్రయోలిపోలిసిస్ చేసే విధానం... మొదటగా డాక్టర్ శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను కొన్ని ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో (APOPTOSI) అపోప్టసి అంటారు. దీని తరువాత చేయించుకున్న వ్యక్తి ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం మొదలుపెడితే చాలా మంచిది. ఈ విధానం ద్వారా చికిత్స చేశాక కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో కణాలు పూర్తిగా చనిపోయి, నెమ్మదిగా మన శరీరం నుండి బయటకు వెళ్లిపోవటం జరుగుతుంది. అందువల్ల మళ్లీ కొవ్వు పేరుకుపోయే ప్రసక్తే ఉండదు. ఈ చికిత్స జరుగుతున్న ప్రాంతంలో కొంత సమయం చల్లదనంతో కూడిన అనుభూతితో పాటు కొంత చర్మం ముందుకు లాగినట్లు ఉంటుంది. కొంత మంది శరీర సారూప్యత వలన శరీరం ఎర్రగా మారుతుంది. కానీ కొద్ది సమయంలోనే మామూలు స్థాయికి వెళ్లిపోతుంది. చికిత్స జరిగే సమయంలో మీరు ఎంచక్కా పుస్తకాలు చదువుకోవచ్చు. ల్యాప్‌టాప్‌పై పనిచేసుకోవచ్చు.. చికిత్స తర్వాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన పనులను మనం చేసుకోవచ్చు. తరువాత ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. చికిత్స జరిగిన మూడు వారాలలోపే ఫలితాలను మీరు గమనిస్తారు. ఈ చికిత్స చేయించుకోవాలని అనుకునేవారు ముందుగా క్రయోలిపోలిసిస్ డాక్టర్ని కలసి ఆయన సూచనల మేరకు చేయించుకోవటం మంచిది. ఇక ఈ చికిత్సకు సంబంధించిన ఖర్చు... మనం ఏ భాగాలలో ఎంత పరిధి మేరకు కొవ్వు తొలగించుకోవాలని అనుకుంటున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కొవ్వు ఒకేలా ఉండదు. కనుక డాక్టర్ సూచనల మేరకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలాగే ఎన్ని సెషన్స్ అవసరమనే దాని మీద కూడా ఖర్చు ఆధారపడి ఉంటుంది. సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా..? ఈ చికిత్స జరిగిన ప్రాంతంలో శరీరం ఎర్రగా మారుతుంది. కానీ కొద్ది సమయంలోనే మాములు స్థాయికి వెళ్లిపోతారు. cryoglobulinemia లేదా Paraxysmal cold hemoglobinuria తో బాధ పడేవారు ఈ చికిత్సకు అర్హులు కాదు. Healthii Curvess Pvt Ltd, Jubleehills / Secunderabad, Cell: 9705 838383 9705 828282 -
హృదయం.. పదిలం..!
- మనిషి అవయవాల్లో గుండె కీలకం - శారీరక వ్యాయామం చేయాలంటున్న వైద్యులు - నేడు ‘వరల్డ్ హార్ట్ డే’ నారాయణఖేడ్: మనిషి జీవనానికి కీలకమైన అవయవం గుండె. అలాంటి కీలకమైన గుండెకు కష్టం వస్తే శారీరక వ్యాధులు దీర్ఘకాలికంగా ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. గుండె పోటుతో కన్నుమూస్తున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే. గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేను నిర్విహస్తోంది. ఈ సందర్భంగా కథనం. జీవన శైలి మార్పుతో ప్రమాదం: మారిన మనిషి జీవన శైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ తగ్గడంతో ప్రజలకు సరైన శారీరక వ్యాయామం జరగడం లేదు. ఒత్తిళ్లు పెరగడంతో మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. ప్రతి పనికీ యంత్రాల వాడకం పెరగడంతో కాలి నడక పూర్తిగా తగ్గిపోతోంది. రోజుకు నాలుగడుగులు వేయలేని పరిస్థితిలో కొందరు ఉంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, యువకులే కాక అన్ని వృత్తుల వారికి శారీరక శ్రమ తగ్గింది. దీంతో శరీరంలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయులుగా మారుతున్నారు. అధిక బరువుతో బాధపడే వారిలో ఎక్కువ మంది హృద్రోగ సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో అతి కీలకమైన గుండెను కాపాడుకోవాలని వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. జిల్లాలో అధికంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లతో చేటు: ఆహారపు అలవాట్లలో నియంత్రణ లేకపోవడంతో గుండె వ్యాధులు వస్తున్నాయి. మితిమీరిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా సిగరెట్, మద్యం అధికంగా సేవించడంతో గుండెపోటు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం సేవించేటపుడు రకరకాల నూనె పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ పదార్థాలు, మాంసాహారాన్ని, కొవ్వు ఎక్కువగా ఉండే వాటిని అధికంగా తింటున్నారు. మద్యం, కొవ్వు పదార్థాలను తీసుకోవడంతో కొవ్వు శాతం పెరిగి హృద్రోగ సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పరీక్షలు చేయించుకుంటే తప్ప గుండె సమస్యలు ఉన్నట్లు తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఆలస్యంగా చికిత్సలు చేయించుకుంటుండడంతో అప్పటికే గుండె సమస్యలు పెరిగిపోయి హార్ట్ అటాక్‌తో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. శారీరక వ్యాయామంతో గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.