ఆరోగ్యం కోసం నేర్చుకున్న ఈత ఆమెను స్విమ్మింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. శారీరక వ్యాయామం అవుతుందని స్విమ్మింగ్çపూల్‌లోకి దిగిన ఆమెకు ఆ ఈతే ఇప్పుడు తన కాళ్లపై తాను నిలబడేలా ఉపాధి నిస్తోంది. ‘కోచ్‌గా అంతర్జాతీయ పాఠశాలలో విద్యార్థులకు ఈత నేర్పే అవకాశం వచ్చింది’ అని సంబరంగా చెబుతుంది ఈతలో మేటిగా ఎదిగిన చందికంటి అన్నపూర్ణ. నేటి రోజుల్లో ఇల్లు గడవాలంటే భర్త సంపాదనకు ఇల్లాలి ఆదాయం ఎంతో కొంత తోడవ్వాలి అనే వారి సంఖ్య పెరిగింది. అందుకే మొదట్లో ఉపాధి కోసం ఇంట్లోనే టైలరింగ్ పని చేసేవారు అన్నపూర్ణ. దాంట్లో పెద్దగా ఆదాయం లేకపోవడంతో స్వయంగా డ్రైవింగ్ స్కూల్ నడిపారు. మార్కెట్‌లో ఉన్న పోటీకి డ్రైవింగ్ స్కూల్ నడపడం కొంత ఇబ్బందిగా మారింది.
‘వేసవి సెలవుల్లో మా ఇద్దరు పిల్లలకు స్కేటింగ్ నేర్పించేందుకు నిజామాబాద్‌లోని స్పోర్ట్స్ అథారిటీ కాంప్లెక్స్‌కు వెళ్లాను. పిల్లలు స్కేటింగ్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న సిమ్మింగ్çపూల్‌లో కొందరు చిన్నారులు స్విమ్మింగ్ నేర్చుకోవడాన్ని చూశారు. వ్యాయామంతో పాటు, ఆరోగ్యానికీ ఉపయోగపడుతుందని, స్విమ్మింగ్ నేర్చుకుంటే బాగుంటుందని మా ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. వాళ్లూ సరే అన్నారు. అలా నాతో పాటు మరో ఇద్దరు మహిళలు వ్యాయామం కోసం ఈత నేర్చుకోవడం మొదలుపెట్టారు’ అని పదేళ్ల నాటి స్థితిని వివరించారు అన్నపూర్ణ.
అంచెలంచెలుగా...
ఈత పోటీల్లో అన్నపూర్ణ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ‘మొదట 2009లో నిజామాబాద్‌లో జరిగిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలలో (మాస్టర్స్) మహిళా విభాగంలో పాల్గొన్నాను. మొదటి పోటీలోనే స్వర్ణ పతకం వరించింది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. దీంతో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికయ్యాను. హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, గుజరాత్, గుల్బర్గా, వైజాగ్ తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో బంగారు, రజితం, కాంస్య.. పతకాలను సాధించాను’ అని మెరిసేకళ్లతో చెప్పే అన్నపూర్ణ కిందటేడాది ఫిబ్రవరిలో కజకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ సిమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో వివిధ విభాగాల్లో మూడు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించి రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి పెంచారు.
కోచ్‌గా స్వయం ఉపాధి
అన్నపూర్ణ స్వస్థలం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అంజుమాన్‌ఫారం. ఇంటర్ వరకు చదువుకున్నారు. భర్త సత్యపాల్‌గౌడ్ చిరువ్యాపారి. ఇద్దరు అబ్బాయిలు బీటెక్, ఇంటర్ చదువుతున్నారు. అన్నపూర్ణ ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఉన్న గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో స్విమ్మింగ్ కోచ్‌గా పనిచేస్తున్నారు. ‘2008లో నేను స్విమ్మింగ్ నేర్చుకున్నప్పుడు నిజామాబాద్‌లో ఇద్దరు ముగ్గురు మినహా మహిళలెవ్వరూ ఈత నేర్చుకునేందుకు ముందుకురాలేదు. ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావించి నేర్చుకున్న ఈత నాకు ఉపాధి కల్పిస్తుందని ముందు అనుకోలేదు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’ అని అన్నపూర్ణ పేర్కొన్నారు.
– పాత బాలప్రసాద్,
Comments
Please login to add a commentAdd a comment