హృదయం.. పదిలం..!
- మనిషి అవయవాల్లో గుండె కీలకం
- శారీరక వ్యాయామం చేయాలంటున్న వైద్యులు
- నేడు ‘వరల్డ్ హార్ట్ డే’
నారాయణఖేడ్: మనిషి జీవనానికి కీలకమైన అవయవం గుండె. అలాంటి కీలకమైన గుండెకు కష్టం వస్తే శారీరక వ్యాధులు దీర్ఘకాలికంగా ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. గుండె పోటుతో కన్నుమూస్తున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే. గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేను నిర్విహస్తోంది. ఈ సందర్భంగా కథనం.
జీవన శైలి మార్పుతో ప్రమాదం:
మారిన మనిషి జీవన శైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ తగ్గడంతో ప్రజలకు సరైన శారీరక వ్యాయామం జరగడం లేదు. ఒత్తిళ్లు పెరగడంతో మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. ప్రతి పనికీ యంత్రాల వాడకం పెరగడంతో కాలి నడక పూర్తిగా తగ్గిపోతోంది. రోజుకు నాలుగడుగులు వేయలేని పరిస్థితిలో కొందరు ఉంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, యువకులే కాక అన్ని వృత్తుల వారికి శారీరక శ్రమ తగ్గింది. దీంతో శరీరంలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయులుగా మారుతున్నారు. అధిక బరువుతో బాధపడే వారిలో ఎక్కువ మంది హృద్రోగ సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో అతి కీలకమైన గుండెను కాపాడుకోవాలని వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. జిల్లాలో అధికంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
చెడు ఆహారపు అలవాట్లతో చేటు:
ఆహారపు అలవాట్లలో నియంత్రణ లేకపోవడంతో గుండె వ్యాధులు వస్తున్నాయి. మితిమీరిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా సిగరెట్, మద్యం అధికంగా సేవించడంతో గుండెపోటు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం సేవించేటపుడు రకరకాల నూనె పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ పదార్థాలు, మాంసాహారాన్ని, కొవ్వు ఎక్కువగా ఉండే వాటిని అధికంగా తింటున్నారు.
మద్యం, కొవ్వు పదార్థాలను తీసుకోవడంతో కొవ్వు శాతం పెరిగి హృద్రోగ సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పరీక్షలు చేయించుకుంటే తప్ప గుండె సమస్యలు ఉన్నట్లు తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఆలస్యంగా చికిత్సలు చేయించుకుంటుండడంతో అప్పటికే గుండె సమస్యలు పెరిగిపోయి హార్ట్ అటాక్‌తో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. శారీరక వ్యాయామంతో గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.