సాక్షి, హైదరాబాద్: అతని పేరు కట్టా అభిజిత్‌రెడ్డి... తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు. కేవలం 22 ఏళ్ల వయసున్న అభిజిత్‌రెడ్డి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసి... రూ. 58 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందిన ఆ యువకుడు.. అందులో చేరేలోపే గుండెపోటుతో హఠాన్మరణం చెందడం కుటుంబ సభ్యులు సహా అందరినీ కలిచివేసింది. ఇలా కొందరు యువకులు గుండెపోట్లబారిన పడి హఠాన్మరణం చెందడం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో ఇందుకుగల కారణాలపై కథనం.
హృద్రోగాలకు కారణాలు అనేకం..
యుక్త వయసులోనే గుండెపోటు బారినపడటం ఇటీవల కాలంలో పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, కుటుంబ చరిత్ర, అసాధారణ లిపిడ్ ప్రొఫైల్, ఇతర ప్రమాద కారకాలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధ వ్యాధులు సంభవిస్తున్నాయంటున్నారు.
పెరిగిన గుండె చికిత్సలు...
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.69 లక్షల గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. అందుకోసం రూ. 3,200 కోట్లు ఖర్చు చేశారు. 21–30 ఏళ్ల వయసులో గుండె చికిత్సలు చేయించుకున్న వారిలో 8 శాతం మంది సింగిల్ స్టెంట్లు వేయించుకున్నారు. రెండు శాతం డబుల్ స్టెంట్లు చేయించుకున్నారు. అంటే స్టెంట్లు వేయించుకున్నవారు 10 శాతం ఉన్నారు. అదే వయసుగల రోగుల్లో వాల్వ్ మారి్పడి చేయించుకున్న వారు 20 శాతం మంది, గుండె రంధ్రం పూడిక ఆపరేషన్లు చేయించుకున్న వారు 14 శాతం మంది, బైపాస్ సర్జరీలు చేయించుకున్నవారు ఒక శాతం మంది ఉన్నారు.
అలాగే గుండెపోటు వచ్చి మందులు వాడేవారు 2 శాతం మంది ఉన్నారు. 31–40 ఏళ్ల వయసులో గుండె చికిత్స చేయించుకున్న వారిలో 40 శాతం మంది స్టెంట్లు వేయించుకున్నారు. బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నవారు మూడు శాతం ఉన్నారు. వాల్వ్ మార్పిడి చేయించుకున్నవారు 10 శాతం ఉన్నారు. గుండె రంధ్రం పూడిక ఆపరేషన్ చేయించుకున్నవారు 2 శాతం ఉన్నారు. మందులు వాడేవారు ఐదు శాతం ఉన్నారు.
వ్యాయామం చేయని వారు 50 శాతం..
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో వ్యాయామం సరిగా చేయనివారు 50 శాతం వరకు ఉన్నారు. సరాసరి ఏడాదికి 5 నుంచి 7 లీటర్ల మద్యం తాగుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల 20–25 శాతం ముందస్తు మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఆయా కారణాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీ
కరోనా తర్వాత యువతలో గుండెపోట్లు పెరిగాయి..
గతంతో పోలిస్తే యువకుల్లో గుండెపోట్లు పెరిగాయి. కరోనా తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి. దీనికి ప్రధానం కారణం ఒత్తిడి. రాత్రి నిద్ర తక్కువ పోవడం వల్ల పగలు ఒత్తిడి పెరుగుతుంది. కోవిడ్ తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల రక్తం గడ్డకట్టే గుణం పెరిగింది. రక్తం చిక్కబడి బ్రెయిన్, లంగ్స్, గుండెలో ఎక్కడైనా గడ్డకట్టొచ్చు. దీంతో గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఒక్కోసారి గుండె వేగం నిమిషానికి 200 దాటి కొట్టుకుంటోంది. దీనివల్ల కూడా గుండెపోట్లు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు రాత్రివేళల్లో పనిచేయడం వల్ల హార్మోన్ల సమస్యలతో గుండెపోట్లు వస్తున్నాయి. కనీసం 6–7 గంటల నిద్ర ఉండాలి. కనీసం 45 నిమిషాలు నడవాలి.
– డాక్టర్ శేషగిరిరావు, గుండె వైద్య నిపుణుడు, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment