ముప్పును మరింత పెంచుతున్న ఫుడ్ ఆర్డర్లు
రోజూ వ్యాయామం, తగినంత నిద్ర కూడా అవసరం
భారతీయ యువతలో పదేళ్ల ముందే గుండెపోటు
అమెరికా లాంటి దేశాల్లో సగటున 45 ఏళ్లకు గుండెపోటు వస్తుంటే.. భారతదేశంలో మాత్రం అంతకంటే పదేళ్ల ముందే, అంటే 35 ఏళ్ల వయసులోనే వచ్చేస్తోంది. ఇంతకుముందు రక్తపోటు, మధుమేహం, కొలెస్టరాల్ లాంటివి ప్రధాన ముప్పు కారకాలుగా ఉంటే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం కూడా గుండెపోటుకు కారణం అవుతోంది!
దీనికితోడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద రోజూ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవడం కూడా ఇందుకు దారితీస్తోంది. ఈ సరికొత్త పరిణామాలను నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ఎ. సాయి రవిశంకర్ వివరించారు.
మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ.. ఇలా ఏవైనా గానీ రోజుకు సగటున 8 నుంచి 10 గంటల వరకు చూస్తున్నారు. వీటన్నింటినీ స్క్రీన్ టైం అనే అంటారు. ఇలా ఎక్కువసేపు తెరకు అతుక్కుపోయి ఉండడం వల్ల గుండెపోటు వస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి.
వివిధ ఫుడ్ ఎగ్రిగేటర్ల వద్ద నుంచి పీజాలు, బర్గర్లు, ఇతర మాంసాహార వంటకాలు దాదాపు రోజూ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. ఎంత పెద్ద హోటల్ నుంచి తెప్పించుకున్నా, అక్కడ వాడిన వంటనూనెలు మళ్లీ మళ్లీ వాడడం వల్ల కొలెస్టరాల్ పెరిగిపోయి గుండెపోటుకు కారణమవుతోంది. ప్రపంచంలోనే ఫుడ్ ఆర్డర్లలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.
వ్యాయామం అస్సలు ఉండడం లేదు. పని ఉన్నంతసేపు పని చేసుకోవడం, తర్వాత మొబైల్ లేదా టీవీ చూసుకోవడం, పడుకోవడంతోనే సరిపెట్టేస్తున్నారు. సగటున రోజుకు 45 నిమిషాల చొప్పున వారానికి కనీసం ఐదారు రోజుల పాటు నడక, ఇతర వ్యాయామాలు చేస్తేనే గుండె ఆరోగ్యం బాగుంటుంది. నిశ్చల జీవనశైలి వల్ల కూడా చిన్నవయసులోనే గుండెపోటు కేసులు వస్తున్నాయి.
మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం కూడా గుండెపోటుకు దారితీస్తోంది. ఉద్యోగాల పరంగా అయినా, లేదా వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల అయినా మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటోంది. దానికి తోడు రోజుకు కనీసం 7-8 గంటల మంచి నిద్ర ఉండాలి. అది లేకపోవడం వల్ల కూడా గుండెపోటు వస్తోంది. వీటికి సిగరెట్లు కాల్చడం, వాతావరణ కాలుష్యం లాంటివి మరింత ఎక్కువగా కారణాలు అవుతున్నాయి.
-డాక్టర్ ఎ. సాయి రవిశంకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి
(చదవండి: టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!)
Comments
Please login to add a commentAdd a comment