
పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైన మైలురాళ్లు. చాలామంది విద్యార్థులు పరీక్షల సమయానికి తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. మెదడు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది? మన మనస్సు పరీక్షలకు అనుగుణంగా ఎలా సిద్ధం కావాలి? అనే విషయాలు తెలుసుకోవడం అవసరం.
మానసిక స్థిరత్వం, సమర్థమైన అధ్యయన పద్ధతులు, దృఢమైన ఆత్మవిశ్వాసం పరీక్ష విజయాన్ని నిర్దేశించే మూడు ప్రధాన అంశాలు. పరీక్షల సమయంలో ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం, మెదడును ఒత్తిడికి అలవాటు చేయడం, చదువును ఒక ఉల్లాసభరితమైన ప్రక్రియగా మార్చుకోవడం ఎంతో అవసరం.
పరీక్షలలో విజయం అనేది జ్ఞానం కన్నా మానసిక దారుఢ్యం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ వ్యాసంలో అందించే పద్ధతులను అనుసరిస్తే, పరీక్షలపై భయం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంచుకుని విజయాన్ని సాధించగలుగుతారు.
ఒత్తిడిలో మెదడు ఎలా స్పందిస్తుంది?
పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు, మెదడు అమిగ్డాలా అనే భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది మన భయాలకు, ఆందోళనకు ఆధారమైన భాగం. అమిగ్డాలా మిగతా మెదడు భాగాల కంటే హై అలర్ట్‌లోకి వెళ్ళి, ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితిలో మూడు రకాల ప్రతిచర్యలు కనిపిస్తాయి:
Fight Mode: పరీక్షను సవాలుగా తీసుకుని మరింత కృషి చేయడం
Flight Mode: పరీక్షలంటే భయపడి చదవడంపై ఆసక్తి చూపలేకపోవడం, అంటే తప్పించుకుని పారిపోవడం
Freeze Mode: పరీక్ష సమయంలో మెదడు పనిచేయకపోవడం, గుర్తొచ్చిన విషయాలు మర్చిపోవడం.
ఇందులో ఫ్లైట్, ఫ్రీజ్ మోడ్స్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకపోగా మీ లెర్నింగ్‌ను, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి. ఫైట్ మోడ్‌లో ఉండటం పరీక్షల్లో విజయానికి కచ్చితంగా అవసరం. అందుకే మీరో ఫైటర్‌లా మారండి. పరీక్షలను చాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగండి.
విజయానికి సానుకూల దృక్పథం
పరీక్షలో విజయానికి ఆ మూడు గంటలు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది అతి ముఖ్యమైన విషయం. నేనింతే సాధించగలననే ఫిక్స్‌డ్ మైండ్ సెట్ నుంచి నేను సాధించగలననే గ్రోత్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకోవాలి. అది మానసిక స్థితిని శక్తిమంతంగా మార్చి, ప్రతిభను మరింత పెంచుతుంది. అందుకోసం ఓ మూడు టెక్నిక్స్ తెలుసుకుందాం.
ఆటో సజెషన్: ‘‘నేను ఈ పరీక్షను విజయవంతంగా రాయగలను’’అని ప్రతిరోజూ మనసులో అనుకోవడం. సక్సెస్‌ఫుల్ స్టూడెంట్స్ ఉదాహరణలు చదవడం, ఆయా వీడియోలు చూడడం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
విజువలైజేషన్: పరీక్ష హాలులో ప్రశాంతంగా సమాధానాలు రాస్తున్నట్లు మనసులో ఊహించడం. ఇలా చేయడం వల్ల ఊహించిన అనుభవాలను నిజంగా అనుభవించినట్లు మెదడు గుర్తుంచుకుంటుంది. దానికి ఊహకూ, నిజానికీ మధ్య తేడా తెలియదు.
స్వీయ కరుణ: తప్పులు చేసినా, వాటిని నేర్చుకునే అవకాశంగా చూడటం అవసరం. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, మీతో మీరే పోటీ పడాలి. మీ ప్రగతిని చూసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని పూర్తిచేయడం ద్వారా మనసుకు ఓవర్‌లోడ్ కాకుండా ఉంటుంది.
ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం నేర్చుకోవాలి. అందుకోసం పలు సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం. అలాగని జస్ట్ తెలుసుకుంటే సరిపోదు, వాటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి.
శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం: మనసు ప్రశాంతంగా ఉండాలంటే శరీరం ప్రశాంతంగా ఉండాలి. అందుకోసం డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. అదేమంత కష్టమైన పనికాదు. వెరీ సింపుల్. నాలుగు సెకన్లు లోపలికి శ్వాస తీసుకోవడం, ఏడు సెకన్లు శ్వాసను బంధించడం, ఆ తర్వాత ఎనిమిది సెకన్లు నెమ్మదిగా వదిలేయడం. దీనివల్ల మెదడులో ఆక్సిజన్ పెరిగి ప్రశాంతతను అందిస్తుంది.
వ్యాయామం: రోజూ 20 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది.
దీంతో పాటు సరైన ఆహారం, నిద్ర అవసరం. గుడ్లు, కాయధాన్యాలు, ఉల్లిపాయలు, వాల్‌నట్స్ వంటి ఆహార పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పరీక్షల ముందు కనీసం 7 గంటలు నిద్రపోవడం అవసరం. రాత్రంతా మేల్కొని చదివితే మెదడు పనితీరు మందగిస్తుంది.
---సైకాలజిస్ట్ విశేష్,
www.psyvisesh.com
(చదవండి: 'గోచీ పండుగ': వినడానికి వింతగా ఉన్నా..పండుగలో మాత్రం..!)
Comments
Please login to add a commentAdd a comment