
నిద్ర సమస్యలు చాలామందికి సర్వసాధారణమే అయినా, మెనోపాజ్ కాలంలోను, ఆ తర్వాత తరచుగా నిద్ర సమస్యలను ఎదుర్కొనే మహిళలకు గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మెనోపాజ్‌కు కొద్దిరోజుల ముందు, మెనోపాజ్ తర్వాత సరిగా నిద్రపట్టక ఇబ్బందిపడే మహిళల గుండె పనితీరుపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు ఇటీవల అధ్యయనం చేపట్టారు.
ఈ అధ్యయన సారాంశాన్ని ఒక జర్నల్‌లో ప్రచురించారు. మెనోపాజ్ కాలంలో మహిళలు తమ నిద్ర తీరు తెన్నులపై దృష్టి ఉంచాలని, నిద్రపోయే వేళలు క్రమబద్ధంగా ఉండేలా చూసుకోవాలని వారు సూచించారు.
నిద్ర మధ్యలో తరచుగా మెలకువ వస్తూ, తిరిగి నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతున్నా, తరచుగా కలతనిద్రతో సతమతం అవుతున్నా, వెంటనే వైద్యులను సంప్రదించాలని కొలంబియా యూనివర్సిటీకి చెందిన కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బ్రూక్ అగర్వాల్ సూచిస్తున్నారు. మెనోపాజ్ కాలంలో ఎదురయ్యే నిద్ర సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, గుండె సమస్యలు జటిలంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
(చదవండి: 'మే'నిగనిగలకు కేర్ తీసుకుందామిలా..!)