sleeping decease
-
హెల్త్: నిద్రలేమి సమస్యా? అయితే ఇలా చేయండి!
ఆరోగ్యంగా ఉండటానికి సరైన తిండి, శరీరానికి తగిన వ్యాయామాలతో పాటు కంటినిండా నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంతమంది జీవన శైలి, మానసిక ఒత్తిడి కారణంగా సరిగా నిద్రపోవడం లేదు. అటువంటి వారు నిద్రమాత్రలకు బదులు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని పండ్లు తీసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా శరీరాన్ని రక్షించుకోవచ్చు. అరటి పండు.. నిద్రలేమితో బాధపడుతున్న వారు పడుకునే సమయంలో అరటిపండును తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే గుణాలు శరీరంలోని ఒత్తిడిని సులభంగా తగ్గించి నిద్రను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈరోజు అరటి పండ్లతోపాటు చెర్రీలను కూడా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంతమంది తరచుగా నిద్ర పోయినట్లే పోయి మేల్కొంటారు. అయితే ఇలాంటివారు చెర్రీస్తో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రసాన్ని తాగడం వల్ల చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నిద్రను మెరుగుపరిచేందుకు పైనాపిల్ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి నిద్రలేని సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ జ్యూస్‌ను తీసుకోవాలి. పైనాపిల్‌లో మెలటోనిన్, విటమిన్ సి, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు దీనితో జ్యూస్‌ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కివీ పండ్లు.. ద్ర సమస్యలతో బాధపడేవారు కివి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే గుణాలు కూడా నిద్ర స్థాయులను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. యాపిల్.. యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ యాపిల్ తింటే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి పూట తినడానికి యాపిల్ అనేది బెస్ట్ స్నాక్‌గా చెపొ్పచ్చు. రాత్రి ఆకలి వేస్తే ఎలాంటి సందేహం లేకుండా యాపిల్ తినండి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. నిద్ర అనేది బాగా పడుతుంది. బొప్పాయి.. బొప్పాయిలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు హాయిగా నిద్ర పోయేలా చేస్తాయి. నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట బొప్పాయి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చదవండి: Summer Season: డీ హైడ్రేషన్‌తో ఇబ్బందా? నివారించండి ఇలా.. -
హెల్త్: ఏంటీ అలసటగా ఉందా..? బహుశా ఇలా చేస్తున్నారా..!?
మనలో చాలా మంది పొద్దున్నే నిద్ర లేవడానికి ఫోన్లో రెండు మూడు అలారాలను సెట్ చేస్తారు. కానీ, వాటిని కట్ చేసి మళ్లీ పడుకుంటారు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటుంది. ఆ తర్వాత తమని తాము తిట్టుకుంటూ ఉంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి లభించక ఇలా అవుతోందా? లేక నిజంగానే బద్ధకంగా ఉంటుందా? బద్ధకానికి, విశ్రాంతికి విభజనరేఖ ఏమిటి? ఉత్సాహకరమైన ఉదయాన్ని ప్రారంభించడానికి నిద్ర మంచం మీద నుండి లేవడం అనే కష్టం నుంచి బయటపడటానికి సులువైన టెక్నిక్స్ కొన్నిటిని తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు అలారం సెట్ చేసి పెట్టుకుంటారు. ఉదయాన్నే ఆ అలారం మోగగానే మెలకువ వచ్చినా, లేవకుండా అలారం ఆఫ్ చేసి మళ్లీ పడుకుంటారు. నిద్ర రాకపోయినా అలాగే పడక నుంచి బయటకు రాకుండా ఉంటారు. దీంతో నిద్ర పోకపోయినా అలాగే పడుకోవడం వల్ల సమయం వృథా అవుతుందని నమ్ముతారు. అయితే విశ్రాంతి కోసం కొంత సమయాన్ని బద్ధకంగా గడిపినా ఫర్వాలేదు. కానీ, విశ్రాంతి కోసం పనిని పక్కన పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు. స్క్రీన్.. కలిగించే ఒత్తిడి చాలా మంది బెడ్ మీద ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడటం, మెయిల్స్ లేదా సోషల్ మీడియా వార్తలు చూడటం చేస్తుంటారు. దీనివల్ల కొంత సమయం బాగానే గడిచిపోతుందని అనిపించవచ్చు. విశ్రాంతి పొందుతున్నాం అనే భావన కూడా కలగవచ్చు. కానీ ఎక్కువసేపు పడుకుని స్క్రీన్‌ని, అందులోని సమాచారాన్ని చూడటం వల్ల బ్రెయిన్ ఒక విధమైన అసౌకర్యానికి, ఒత్తిడికి లోనవుతుంది. ఉదయం లేస్తూనే ఫోన్ తీసుకొని వచ్చిన నోటిఫికేషన్లు, మెసేజ్‌లు చూసే అలవాటును వదులుకోవాలి. మీతో మీరు.. రోజువారీ దినచర్యను ఎలాప్రారంభించాలో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. మంచం మీద నుంచి లేచి, బయటకు వచ్చిన వెంటనే ఒత్తిడిని పెంచే పనులను ప్రారంభించవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి. ఈ సమయంలో ప్రశాంతతను కలిగించే సంగీతాన్ని వింటూ సులభంగా చేయదగిన పనులను ఎంచుకోవాలి. ఈ విధానం వల్ల ఆ రోజు మొత్తంలో చేయదగిన పనులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అరగంట లోపు ఓకే! ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు అలాగే పడుకోవడం దినచర్యలో భాగమైతే ప్రతిరోజూ చేయవచ్చు. నిద్రలేచిన తర్వాత ఎంతసేపు మంచం మీద పడుకోవాలో నిర్ణీత నియమాలు లేవు. అయితే, 15 నుంచి 30 నిమిషాల తర్వాత బెడ్‌ను వదిలేయడం మంచిది. శరీరం మాట వినాలి విశ్రాంతి నిద్రకు ప్రత్యామ్నాయం కాదు. కానీ, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తే అది నిద్రతో సమానంగా లేకపోయినా కచ్చితమైన ప్రయోజనాలను పొందవచ్చు. విశ్రాంతి అవసరమైతే శరీరం మాట వినిపించుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి అనిపించినప్పుడు దానిని పాటించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. కొంతమంది వారాంతాల్లో రోజంతా మంచం పైనే బద్ధకంగా దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏ పనీ చేయలేకపోయాం అనే అపరాధ భావనకు లోనవుతారు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికాక కొత్త చిక్కులు ఎదురయే ప్రమాదం ఉంది. అందువల్ల నిద్రపోవాలి అని అనిపించిన ప్పుడు నిద్ర పోవడమే మంచిది. మంచి నిద్ర కోసం.. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా, తిరిగి ఉదయం నిద్రలేచేలా స్థిరమైన షెడ్యూల్‌ని పాటించాలి. వారాంతాల్లో కూడా ఇదే నియమాన్ని పాటించాలి. నిద్రపోయే ముందు వేడినీటి స్నానం, ధ్యానం, పుస్తకం చదవడం, సంగీతం వినడం ప్రయోజనకరం. నిద్రపోయే ముందు మొబైల్‌ను దూరంగా ఉంచాలి. సోషల్ మీడియాను చూడటం పూర్తిగా మానుకోవాలి. త్వరగా జీర్ణం కాని ఆహారం, కెఫిన్, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఇవి చదవండి: వేగంగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలివిగో! -
యూజర్ల నిద్ర సమస్యల్ని గుర్తించే స్మార్ట్ వాచ్!
ఇప్పటికే రకరకాల స్మార్ట్‌వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది. ‘శామ్సంగ్ గెలాక్సీ వాచ్5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
బైడెన్‌కు తీవ్ర నిద్ర సమస్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రకు సంబంధించిన స్లీప్ అప్నియా అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో, ఆయన కొన్ని రోజులుగా నిద్ర కోసం సీపాప్(కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) అనే యంత్రాన్ని వాడుతున్నారని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. స్లీప్ అప్నియా సమస్య ఆయనకు దశాబ్దకాలంగా ఉందని తెలిపారు. 2008 నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన తన మెడికల్ రిపోర్టుల్లో వెల్లడిస్తున్నారని కూడా పేర్కొన్నారు. స్లీప్ అప్నియా అనేది సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోతుంటుంది. ఈ సమస్య ఉన్న వారు రాత్రి మొత్తం నిద్రపోయినా పగటి వేళ అలసిపోయినట్లు ఉంటారు. సీపాప్ యంత్రాన్ని అధ్యక్షుడు మంగళవారం రాత్రి కూడా వాడాల్సి వచి్చందని వైట్‌హౌస్ అధికారులు వివరించారు. షికాగోలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు బయలుదేరిన సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించాయి. సీపాప్ పరికరాన్ని వాడటం వల్లే ఇలా గీతలు పడ్డాయని తెలిపారు. -
నిద్రలేమి అనారోగ్యాలను తీవ్రతరం చేస్తున్న కోవిడ్!
నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం... దాంతో అనేక అనారోగ్యాలు కలుగుతాయన్నది తెలిసిందే. కానీ నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్ సోకితే... దానివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయనీ... పైగా మానసిక అనారోగ్యాలూ కలుగుతాయని తాజాగా నిరూపితమైంది. మంచి ఆరోగ్యం కోసం ఎంతసేపు నిద్రపోవాలన్న అంశం చర్చనీయాంశమైనప్పటికీ... సాధారణంగా యువతీ–యువకులకు కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలని, కౌమార బాలబాలికలైతే అంతకంటే మరో గంట ఎక్కువే నిద్రపోవాలనీ... అప్పుడే వారిలో జ్ఞాపకశక్తి, పెరుగుదల ఉంటాయని నిద్ర నిపుణులు చెబుతుంటారు. మామూలుగా ఆరు గంటలు నిద్ర కూడా సరిపోతుందని కొందరు చెబుతుంటారుగానీ... ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారికి కోవిడ్ సోకినప్పుడు వారిలో చాలామంది మానసిక అనారోగ్యాలకు గురయ్యారని ఇటీవలి కోవిడ్ సోకిన రోగులను పరిశీలించినప్పుడు తెలియవచ్చింది. అంతేకాదు.. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనవేత్తల పరిశీలనలోనూ ఇదే నిజమని తేలింది. ఇలా నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్ సోకినప్పుడు వాళ్లలో ఎక్కువ మంది అంటే దాదాపు 75›శాతానికి పైగా మానసిక అనారోగ్యాల బారిన పడ్డారనీ... అందులోనూ డిప్రెషన్‌తో కుంగుబాటుకు లోనైనవారే ఎక్కువనీ, అటు తర్వాత యంగై్జటీ వంటి బాధలకు గురయ్యారని కూడా వైద్యుల పరిశీలనలో తేలింది. సంఖ్యాపరంగా చూస్తే... డిప్రెషన్, యాంగై్జటీల తర్వాత భావోద్వేగాల పరంగానూ, భౌతికంగానూ బాగా అలసటగా ఫీలయ్యేవారు ఎక్కువన్నది నిపుణుల మాట. మానసిక ఆరోగ్యానికి నిద్ర మరింత అవసరమనే అంశం నిర్ద్వంద్వంగా నిరూపితమయ్యిందంటున్నారు హార్వర్డ్‌కు చెందిన పరిశోధకులు. -
సుఖమైన నిద్ర కోరుకునే వారికి ఇది కూడా అవసరమే!
శరీరారోగ్యానికి సుఖనిద్ర ఎంతో అవసరం. మరి సుఖ నిద్ర కావాలంటే సరైన పడక కూడా అవసరమే! కేవలం సుఖ నిద్రకే కాకుండా, ఆరోగ్యానికి సైతం పడక పరిశుభత్ర అవసరమన్నది నిపుణుల మాట. కానీ కొంతమంది మాత్రమే పడకను పరిశుభ్రంగా ఉంచుకునే అలవాటుతో ఉంటారు. చాలామందికి, ముఖ్యంగా యువతలో ఈ పడక పరిశ్రుభత చాలా తక్కువ. తల్లితండ్రులకు దూరంగా ఉండే యువతలో బెడ్ హైజిన్‌పై అవగాహన, ఆసక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఎక్కడెక్కడో తిరిగిన బట్టలతో అలాగే పడుకోవడం, లేవగానే కనీసం బెడ్‌షీట్, దుప్పట్లను మడత పెట్టకుండా ఉండ చుట్టి పెట్టుకోవడం, దిండ్లను ఇష్టారీతిన నలిపి వాటి కవర్లను అపరిశుభ్రంగా ఉంచుకోవడం, పడుకునే పరుపు లేదా బొంతను ఎన్నాళ్లున్నా కనీసం దులపకపోవడం. అదే విధంగా బెడ్‌పైనే తినడం, తాగడం చేయడం, పడక దగ్గర రకరకాల వాసనలు వస్తున్నా క్లీన్ చేయకపోవడం.. వంటివన్నీ అనారోగ్యాలకు దారి తీసే అంశాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పడకను చెత్తకుప్పలాగా మార్చడం ప్రమాదకరమన్నది నిపుణుల మాట. ప్రతిరోజూ నిద్రపోయిలేవగానే బెడ్‌పై మనిషి తాలుకా లాలాజలం, చెమట, చుండ్రు, మృత చర్మ కణాల్లాంటివి పడుతూ ఉంటాయి. వీటివల్ల ప్రమాదకరమైన సూక్ష్మజీవులు బెడ్‌పై ఆవాసం ఏర్పరుచుకునే వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు పడకను శుభ్రంగా ఉంచుకోకపోతే కోరి రోగాలు తెచ్చుకున్నట్లే! బ్యాక్టీరియా బాంబులు పలు రకాల బ్యాక్టీరియా జాతులకు మన పడకలు ఆవాసాలుగా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఉదాహరణకు స్టెఫైలోకోకస్ రకం బ్యాక్టీరియా పడకల్లో నివాసమేర్పురుచుకుంటుంది. ఇవి నిజానికి హానికారకమైనవి కావు, కానీ మనిషి శరీరంపైన ఏదైనా గాయం ద్వారా రక్తప్రసారంలోకి చేరితే మాత్రం తీవ్ర అనారోగ్యం కలిగిస్తాయి. స్టెఫైలోకోకస్ ఆరియస్ బ్యాక్టీరియా పడకపై చేరితే చర్మ సంబంధ వ్యాధులు, న్యుమోనియా, ఎన్నటికీ తగ్గని మొటిమలు వస్తుంటాయి. వీటిలో కొన్ని ప్రజాతులు యాంటిబయాటిక్స్‌కు కూడా తొందరగా లొంగనంతగా బలపడుతుంటాయి. ఇకోలి బ్యాక్టీరియా సైతం బెడ్‌పై కనిపిస్తుంది. ఇవి మనిషి పేగుల్లో ఉండే సాధారణమైన బ్యాక్టీరియా. కానీ కొన్ని ప్రజాతులు మనిషిలో తీవ్రమైన మూత్రసంబంధిత వ్యాధులు, డయేరియా, మెనింజైటిస్ కలిగిస్తాయి. అందుకే నిద్రపోతున్నవారు మూత్రవిసర్జనకు మేల్కొంటే, తిరిగి పడుకోబోయేముందు కాళ్లు చేతులు కడుక్కోవాలని పెద్దలు చెబుతుంటారు. స్టెఫైలోకోకస్ కానీ, ఇ కోలి కానీ పెద్ద సంఖ్యలో పునరుత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని బెడ్‌పైకి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలి. బాబోయ్ బెడ్ బగ్స్ మనిషి ప్రతిరోజు నిద్రలో దాదాపు 50 కోట్ల మృత చర్మ కణాలను రాలుస్తాడు. పడకల్లో దాగుండే నల్లులు, బెడ్బగ్స్కు ఈ మృతకణాలు మంచి ఆహారం. వీటివల్ల తక్షణ చర్మ సమస్యలు, అలెర్జీలు, ఆస్తమా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరోక్షంగా యాంక్జైటీ, ఇ¯Œ సోమ్నియాకు కూడా ఇవి కారణాలవుతాయన్నారు. బ్యాక్టీరియాల కన్నా పెద్దవైనా ఇవి మాములు కంటికి తొందరగా కనిపించవు. ఒక పడక నుంచి ఇంకో పడకకు కుటుంబ సభ్యుల ద్వారా ఇవి వ్యాపిస్తుంటాయి. పసిపిల్లల పడకలో ఇవి చేరితే మరింత ప్రమాదం. వారు కనీసం ఏం జరుగుతుందో కూడా అర్దం చేసుకోలేరు, బయటకు చెప్పలేరు. అందువల్ల ఈ బగ్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బాత్రూమ్ టవల్స్‌ను ఉండ చుట్టి బెడ్‌పై వేయడం వంటి అలవాట్లు పడకను పాడు చేస్తాయి. బ్యాక్టీరియా, బెడ్బగ్స్తో పాటు వైరస్‌లకు కూడా పడకలు నివాసాలుగా మారుతుంటాయి. వాక్సీనా లాంటి కొన్ని వైరస్‌లైతే శుభ్రం చేయని పడకల్లో 14 వారాలపాటు ఓపిగ్గా హోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏం చేయాలి? ► వ్యక్తిగత పరిశుభ్రత... అంటే ఎప్పటికప్పుడు కాళ్లు చేతులు కడుక్కోవడం, పొడిగా తుడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. ∙పసిపిల్లల పడకలను రోజుకు రెండు మార్లు పూర్తిగా మార్చడం, వారికి వాడే దుప్పట్లు, కవర్లను జాగత్త్రగా పరిశీలించడం ఎంతో అవసరం. ►ప్రతిరోజూ పడకను శుభ్రపరుచుకోవాలి. బెడ్ షీట్ మార్చడం, బెడ్‌ను దులపడం, దుప్పట్లు మార్చడం, పిల్లో కవర్లు తాజాగా ఉంచుకోవడం చేస్తుండాలి. పడకపై వాడే దుప్పట్లు, కవర్లు రెండు మూడురోజులకొకసారి ఎండలో వేయాలి. చాప వాడే అలవాటుంటే దాన్ని సైతం ఎండలో ఆరవేయాలి. ► తడి కాళ్లతో పడకపైకి చేరడమంటే సూక్ష్మజీవులకు ఆహ్వానం పంపినట్లేనని గుర్తించాలి. ► పెద్ద పరుపులు, చాపలను ఉతకలేము కాబట్టి వాటికి సరిపడా కవర్లను వాడడం, ఆ కవర్లను తరచూ మారుస్తుండడం, వీలైనప్పుడు వీటిని ఎండలో వేయడం మరవకూడదు. ►వాక్యూమ్ క్లీనర్ ఉన్నవాళ్లు చాపలు, బెడ్స్‌ను వాక్యూమ్ చేయడం బెటర్. ► పెంపుడు జంతువులున్నవాళ్లు సాధ్యమైనంత వరకు వాటిని పడకలపై చేరకుండా జాగ్రత్త వహించాలి. ► మరీ పాతపడిపోయిన పరుపులు, చాపలు, దుప్పట్లు వాడకుండా కొత్తవాటిని ఏర్పాటు చేసుకోవాలి. ► వీలైనప్పుడు కవర్లు, దుప్పట్లు బాగా మరిగించిన నీటిలో వేసి శుభ్రం చేయాలి. ► బయట నుంచి వచ్చి బట్టలు కూడా మార్చుకోకుండా పడకెక్కడం, మేకప్ ఉంచుకొని పడుకోవడం, సరైన గాలిరాని ప్రదేశాల్లో పడక ఏర్పాటు చేసుకోవడం, బెడ్‌పై తినడం, తాగడం వంటి అలవాట్లు వెంటనే వదులుకోవాలి. ► శరీరం అలసిపోతే ఎక్కడైనా నిద్రవస్తుంది, అందుకని పడక పరిశుభ్రతపై అవగాహన అవసరం లేదని భావించకూడదు. బెడ్ హైజిన్ లోపిస్తే జరిగే అనర్ధాలు వెంటనే అర్దం కావు, అందువల్ల పడక పరిశుభ్రతపై పట్టింపు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. డి. శాయి ప్రమోద్ -
మరో కుంభకర్ణుడు! ఏడాదికి 300 రోజులు నిద్రలోనే..
Rajasthan Sleep Man: ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. తిండి, నీరు అనేది ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలైనా నిద్ర పోవాలని వైద్యులు, నిపుణులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మంచిదని చెబుతోంది. ఇక ఆధునికయుగం అతి వేగంగా దూసుకెళ్తోంది. టెక్నాలజీ పెరగడంతో మనుషుల్లో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. అయితే రాజస్థాన్‌కి చెందిన పూర్ఖారామ్ అనే వ్యక్తి సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతాడు. దీనిపై పూర్ఖారామ్ స్పందిస్తూ.. ఈ అతి నిద్ర తన జీవితంలో 23 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని తెలిపాడు. తాను మేల్కోవాలనుకున్నప్పుడల్లా.. అతని శరీరం తనకి సహకరించడం లేదని అన్నాడు. మొదట్లో 18 గంటలు పడుకునేవాడని వెల్లడించాడు. కానీ రాను రాను నెలలో 5 నుంచి 7 రోజులు, ఆ తర్వాత 20 నుంచి 25 రోజులు నిద్రపోతున్నట్లు పేర్కొన్నాడు. ఇలా సంవత్సరానికి సగటున 300 రోజుల నిద్రలోనే గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పూర్ఖారామ్ భార్య లిచ్మి దేవి మాట్లాడుతూ.. తన భర్త అనారోగ్యం తనకు చాలా ఇబ్బందులను కలిగిస్తోందని తెలిపింది. ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లిన సమస్య ఏంటో ఎవరికీ అర్థం కాలేదని వాపోయింది. కాగా, కొన్ని నివేదికలు ఈ వ్యాధిని హైపర్సోమ్నియా అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాధి కారణంగా పూర్ఖారామ్ను చుట్టుప్రక్కల వారు కుంభకర్ణుడు అని పిలవడం మొదలుపెట్టారు. -
తింటూ కూడా నిద్రలోకి జారుకుంటున్నారా?
కొందరు కూర్చుని పనిచేస్తూ, కూర్చుని తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. నార్కొలెప్సీ అనే సమస్య ఉన్నవారు పట్టపగలు తాము ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్‌సైకిల్స్ కొనసాగుతాయి. కనుపాపలు వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇదమిత్థంగా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనమైపోతాయి. మాటకూడా ముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్ స్పెషలిస్టులు కొన్ని యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చే స్తారు. చదవండి: మొటిమల సమస్యా? మీ కోసమే.. -
నిద్రపట్టడం లేదని.. ఉరేసుకుని
మోత్కూరు : నిద్ర పట్టడం లేదని మనోవేదనతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరులోలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన కొండకింది సోమిరెడ్డి (52) అలియాస్ థామస్‌రెడ్డి స్థానిక ఓ జువెల్లరి షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతను ఆరు నెలలుగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడు. ఉదయం భార్య జోనమ్మ, కుమారుడు జోసెఫ్‌రెడ్డి కూలి పనులకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే సరికి తండ్రి విగతజీవిగా కనిపించాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్ఐ అంకిరెడ్డి యాదయ్య తెలిపారు. -
నిద్రలేమికి ‘ఆక్టిమీటర్’తో చెక్!
బెర్లిన్: నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టేందుకు జర్మనీ శాస్త్రవేత్తలు ఓ కొత్త పరికరాన్ని రూపొందించారు. దీన్ని ఉపయోగించడం వల్ల మనకు నాణ్యమైన నిద్ర ఎంతవరకు అందింది, ఇంకా ఎంత నిద్ర అవసరమో సూచిస్తుంది. ఆక్టిమీటర్గా పిలిచే ఈ పరికరాన్ని చేతికి గడియారంలా ధరించాల్సి ఉంటుంది. లుడ్విగ్ మాక్సిమిలియన్ వర్సి టీ ఆఫ్ మునిచ్ (ఎల్ఎంయూ)కి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు. ఈ ఆక్టిమీటర్ లేచినప్పటి నుంచి విశ్రాంతి తీసుకున్న సమయం, యాక్టివ్‌గా పనిచేస్తున్న సమయం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. 3 నెలల కాలానికి సరిపడా డాటాను భద్రపరుస్తుంది. 8 నుంచి 92 ఏళ్ల వయసు గల 574 మందిపై ఆక్టిమీటర్ అమర్చి..నిద్ర నమూనాలు సేకరించి శాస్త్రవేత్తలు పరిశోధించారు. -
పశువుల్లో పడక జబ్బు
నివారణే ప్రధానం.. సకాలంలో చర్యలు చేపట్టాలి గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహాలు... సూచనలు గజ్వేల్: పశువుల్లో పడక జబ్బు తలెత్తి రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి కారణంగా పశువులు తెలివిగా ఉండి కూడా లేచి నిలబడలేకపోతాయి. అధికంగా పాలిచ్చే పశువుల్లో ఈ వ్యాధి కనబడుతుంది. ఈ వ్యాధి నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలని గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి(సెల్ : 9505056118) తెలిపారు. ఈ సందర్భంగా సలహాలు, సూచనలు అందించారు. వ్యాధి సోకడానికి కారణాలు సాధారణంగా పశువులు ఈనిన వెంటనే వచ్చే పాల జ్వరం వ్యాధి చికిత్స సక్రమంగా పూర్తి చేయకపోతే అవి డౌనర్గా మారతాయి. తొడ, కండరాళ్లకు గాయాలవ్వడం, వాటికి సంబంధించిన నరాలు దెబ్బ తినడం వల్ల గర్భస్త దూడ పెద్దగా ఉన్నప్పుడు, అందించే మేపులో, రక్తంలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం లోపమున్నప్పుడు, పొటాషియం లవణ లోపం వల్ల ఆవులు పడుకుని పాకుతూ ఉంటాయి. లక్షణాలు శ్వాస సాధారణంగా, నాడీరేటు అధికంగా ఉంటాయి. పడుకున్న ఆవులు తరచుగా నిలబడడనికి ప్రయత్నిస్తుంటాయి. కానీ నిలబడలేవు. మేత మేస్తుంటాయి. నెమరు వేస్తుంటాయి. కొన్ని ఆవులు కాళ్లను చాచి పడుకుని, తలను వెనక్కి లాక్కుని ఉండిపోతాయి. కొన్ని ఆవులు తరచుగా బెదురుతూ గిలగిలా కొట్టుకుంటాయి. పడక వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడతాయి. 7 రోజుల పాటు అదే పరిస్థితి ఉంటే పశువుల లేవడం కష్టం. చికిత్స అవసరాన్ని బట్టి పశు వైద్యుల సలహాపై నో విజాక్-పి, కార్టిజోన్స్, విటమిన్-ఈ, కాల్షియం, పాస్ఫరస్, సెలీనియం ఇంజక్షన్లు వాడాలి. అదే విధంగా బీ1, బీ6, బీ12కు సంబంధించిన ఇంజక్షన్లు వాడాలి. నీరు, మేత తీసుకోకుండా ఉంటే 20శాతం గ్లూకోజ్ ఎక్కించాలి. వ్యాధిగ్రస్త పశువుల్ని అటూ... ఇటు తిప్పుతుండాలి. పశువులకు మెత్తని పడకను ఏర్పాటు చేయాలి. వ్యాధి గ్రస్త పశువుల కండరాల్ని వరిగడ్డి లేదా కొబ్బరి పీచుతో మసాజ్ చేస్తుండాలి. ఇన్ఫ్రారెడ్ కిరణాల్లో కూడా మసాచ్ చేయవచ్చు. ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజు వాడుతుండాలి. ఇవే కాకుండా పడక వ్యాధితో బాధపడే పశువులను క్రమక్రమంగా పైకి లేపడం ద్వారా బాగు చేయడానికి ప్రత్యేకంగా మహారాష్ట్రలో పరికరాన్ని తయారు చేశారు. దీని ధర సుమారు రూ. 15వేల వరకు ఉంటుందని, స్థానికంగా కూడా ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు.