మనలో చాలా మంది పొద్దున్నే నిద్ర లేవడానికి ఫోన్‌లో రెండు మూడు అలారాలను సెట్ చేస్తారు. కానీ, వాటిని కట్ చేసి మళ్లీ పడుకుంటారు. ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటుంది. ఆ తర్వాత తమని తాము తిట్టుకుంటూ ఉంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి లభించక ఇలా అవుతోందా? లేక నిజంగానే బద్ధకంగా ఉంటుందా? బద్ధకానికి, విశ్రాంతికి విభజనరేఖ ఏమిటి? ఉత్సాహకరమైన ఉదయాన్ని ప్రారంభించడానికి నిద్ర మంచం మీద నుండి లేవడం అనే కష్టం నుంచి బయటపడటానికి సులువైన టెక్నిక్స్ కొన్నిటిని తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు అలారం సెట్ చేసి పెట్టుకుంటారు. ఉదయాన్నే ఆ అలారం మోగగానే మెలకువ వచ్చినా, లేవకుండా అలారం ఆఫ్ చేసి మళ్లీ పడుకుంటారు. నిద్ర రాకపోయినా అలాగే పడక నుంచి బయటకు రాకుండా ఉంటారు. దీంతో నిద్ర పోకపోయినా అలాగే పడుకోవడం వల్ల సమయం వృథా అవుతుందని నమ్ముతారు. అయితే విశ్రాంతి కోసం కొంత సమయాన్ని బద్ధకంగా గడిపినా ఫర్వాలేదు. కానీ, విశ్రాంతి కోసం పనిని పక్కన పెట్టడం వల్ల ఇబ్బందుల్లో పడవచ్చు.
స్క్రీన్.. కలిగించే ఒత్తిడి
చాలా మంది బెడ్ మీద ఉన్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం, మెయిల్స్ లేదా సోషల్ మీడియా వార్తలు చూడటం చేస్తుంటారు. దీనివల్ల కొంత సమయం బాగానే గడిచిపోతుందని అనిపించవచ్చు. విశ్రాంతి పొందుతున్నాం అనే భావన కూడా కలగవచ్చు. కానీ ఎక్కువసేపు పడుకుని స్క్రీన్‌ని, అందులోని సమాచారాన్ని చూడటం వల్ల బ్రెయిన్ ఒక విధమైన అసౌకర్యానికి, ఒత్తిడికి లోనవుతుంది. ఉదయం లేస్తూనే ఫోన్ తీసుకొని వచ్చిన నోటిఫికేషన్లు, మెసేజ్‌లు చూసే అలవాటును వదులుకోవాలి.
మీతో మీరు..
రోజువారీ దినచర్యను ఎలాప్రారంభించాలో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. మంచం మీద నుంచి లేచి, బయటకు వచ్చిన వెంటనే ఒత్తిడిని పెంచే పనులను ప్రారంభించవద్దు. ఉదయం నిద్రలేచిన వెంటనే మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి. ఈ సమయంలో ప్రశాంతతను కలిగించే సంగీతాన్ని
వింటూ సులభంగా చేయదగిన పనులను ఎంచుకోవాలి. ఈ విధానం వల్ల ఆ రోజు మొత్తంలో చేయదగిన పనులను చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు.
అరగంట లోపు ఓకే!
ఉదయం నిద్రలేచిన తర్వాత కాసేపు అలాగే పడుకోవడం దినచర్యలో భాగమైతే ప్రతిరోజూ చేయవచ్చు. నిద్రలేచిన తర్వాత ఎంతసేపు మంచం మీద పడుకోవాలో నిర్ణీత నియమాలు లేవు. అయితే, 15 నుంచి 30 నిమిషాల తర్వాత బెడ్‌ను వదిలేయడం మంచిది.
శరీరం మాట వినాలి
విశ్రాంతి నిద్రకు ప్రత్యామ్నాయం కాదు. కానీ, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మంచిగా అనిపిస్తే అది నిద్రతో సమానంగా లేకపోయినా కచ్చితమైన ప్రయోజనాలను పొందవచ్చు. విశ్రాంతి అవసరమైతే శరీరం మాట వినిపించుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి అనిపించినప్పుడు దానిని పాటించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి బాగుంటుంది. కొంతమంది వారాంతాల్లో రోజంతా మంచం పైనే బద్ధకంగా దొర్లుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏ పనీ చేయలేకపోయాం అనే అపరాధ భావనకు లోనవుతారు. దీనివల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికాక కొత్త చిక్కులు ఎదురయే ప్రమాదం ఉంది. అందువల్ల నిద్రపోవాలి అని అనిపించిన ప్పుడు నిద్ర పోవడమే మంచిది.
మంచి నిద్ర కోసం..
- రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా, తిరిగి ఉదయం నిద్రలేచేలా స్థిరమైన షెడ్యూల్‌ని పాటించాలి. వారాంతాల్లో కూడా ఇదే నియమాన్ని పాటించాలి.
- నిద్రపోయే ముందు వేడినీటి స్నానం, ధ్యానం, పుస్తకం చదవడం, సంగీతం వినడం ప్రయోజనకరం.
- నిద్రపోయే ముందు మొబైల్‌ను దూరంగా ఉంచాలి. సోషల్ మీడియాను చూడటం పూర్తిగా మానుకోవాలి.
- త్వరగా జీర్ణం కాని ఆహారం, కెఫిన్, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment