
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.
మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.
మెనోపాజ్
ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి.
శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం.
నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే.
ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి.
ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి.
Comments
Please login to add a commentAdd a comment