30 ఏళ్లకే నిట్టనిలువునా కూలిపోతున్నారు | World Heart Day Celebrations In September 29th | Sakshi
Sakshi News home page

గుండెజబ్బులకు కారణాలెన్నో..

Published Sun, Sep 27 2020 8:41 AM | Last Updated on Sun, Sep 27 2020 11:02 AM

World Heart Day Celebrations In September 29th - Sakshi

గుండెజబ్బు అంటే ముసలివాళ్లకు మాత్రమే వచ్చే సమస్య అని ఒకప్పుడు అనుకునేవాళ్లు! ఇప్పుడు ఆ తారతమ్యమేమీ లేదు.  ఇరవై, ముప్పై ఏళ్లకే నిట్టనిలువునాకూలిపోతున్నవారిని.. గుండెజబ్బుల సమస్యలతో బతుకీడ్చే వాళ్లనూ చూస్తూనే ఉన్నాం! మారుతున్న జీవనశైలి అనండి.. తినే తిండిలో తేడాలనండి.. ఇంకేదైనా కారణం చెప్పండి. ఏటా కోటీ డెభ్బై తొమ్మిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నది మాత్రం వాస్తవం.  అందుకే ఈ సమస్యపై అవగాహన మరింతపెంచేందుకు, తద్వారా ప్రాణాలను కాపాడేందుకు.. ఈ నెల 29న వరల్డ్‌ హార్ట్‌ డే నిర్వహిస్తున్నారు! 

గుండెజబ్బులపై సామాన్యుల్లో అవగాహన మరింత పెంచే లక్ష్యంతో వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ , ప్రపంచ ఆరోగ్య సంస్థ 1999 నుంచి ఈ వరల్డ్‌ హార్ట్‌ డేను నిర్వహించడం మొదలుపెట్టాయి. అప్పట్లో వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆంటోనీ బేస్‌ డి లూనా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఈ వార్షిక వేడుక. ఇప్పటివరకు సుమారు 100 దేశాల్లో ఏటా సెప్టెంబర్‌ 29ని వరల్డ్‌ హార్ట్‌ డేగా జరుపుకుంటున్నారు. 2025 నాటికల్లా ప్రపంచం మొత్తమ్మీద గుండెజబ్బులతోపాటు ఐదు అసాంక్రమిక వ్యాధుల ద్వారా జరుగుతున్న ప్రాణనష్టాన్ని కనీసం 25 శాతం తగ్గించాలన్న ప్రపంచ నాయకుల సంకల్పం కూడా ఈ వేడుకల ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఎందుకంటే అసాంక్రమిక వ్యాధుల ద్వారా సంభవిస్తున్న మరణాల్లో సగం గుండె జబ్బుల కారణంగానే చోటు చేసుకుంటున్నాయి కాబట్టి. గుండెపోటు, గుండెజబ్బులకు కారణాలు? నివారించేందుకు ఉన్న మార్గాలు వంటి అంశాలపై ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గుండె సమస్యలతో ఏటా సంభవిస్తున్న 1.79 కోట్ల మరణాల్లో కనీసం 80 శాతం వాటిని నివారించే అవకాశం ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

కారణాలు ఎన్నో...
గుండెజబ్బులు, గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. కొందరికి పుట్టుకతోనే ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. తగిన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలే చాలామందిలో గుండెజబ్బు లేదా పోటు వచ్చేందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణాల్లో ఎన్ని మనకు అన్వయిస్తాయో... సమస్య మన దరి చేరేందుకు అంతే స్థాయిలో అవకాశాలు పెరుగుతాయన్నమాట. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, వేళాపాళా లేకుండా తినడం, ఇతర అలవాట్ల కారణంగా శరీరంలో చెడు కొవ్వులు పెరిగి ధమనుల్లో గార లాంటి పదార్థం పేరుకుపోయి గుండెబ్బులు లేదా పోటుకు దారి తీస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. ధమనుల్లో గార పేరుకుపోవడం శరీరంలోని ఏ భాగంలోనైనా జరగవచ్చు. గుండె ధమనుల్లో పేరుకుపోతే కరోనరీ ఆర్టరీ డిసీస్‌ అని పిలుస్తారు. కాళ్ల ప్రాంతంలో సంభవిస్తే పెరిఫరీ ఆర్టీరియల్‌ డిసీజ్‌ అని పిలుస్తారు.  


మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు వేరుగా ఉంటాయా?

ఛాతీ మధ్యభాగంలో నొప్పి అనిపించడం పురుషుల్లో కనిపించే గుండెజబ్బు లక్షణం. ఛాతీలోని నొప్పి ఎడమ చేతివైపు ప్రసారం కావడం, దవడలోనూ నొప్పి ఉండటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం కూడా పురుషుల్లో గుండెజబ్బు లక్షణాలే. మహిళల విషయానికి వస్తే.. కొంతమందిలో ఇదే రకమైన లక్షణాలు కనిపించవచ్చు. కానీ నొప్పి భుజాలు, మెడ, చేతులు, కడుపు, వెన్నువైపు ప్రసరించే అవకాశం ఉంటుంది. మహిళల్లో గుండెజబ్బు లక్షణం అజీర్తిని పోలి ఉంటుంది. అప్పుడప్పుడూ నొప్పి వచ్చిపోతూ ఉండవచ్చు. కొంతమందిలో అసలు నొప్పి లేకుండా కూడా ఉంటుంది. వివరించలేని యాంగ్జైటీ, వికారం, తలతిరగడం, గుండె కొట్టుకునే వేగం ఎక్కువ కావడం, చెమటలు పట్టడం మహిళల్లో కనిపించే గుండెజబ్బు లక్షణాలు. బాగా నిస్సత్తువను అనుభవించిన తరువాత మహిళల్లో గుండెజబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా.. పురుషులతో పోలిస్తే మహిళల్లో మొట్టమొదట వచ్చే గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 

మహిళలకు ఈస్ట్రోజెన్‌  ద్వారా గుండెజబ్బుల నుంచి రక్షణ ఉంటుంది కదా? 
ఈస్ట్రోజెన్‌  వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుందన్నది వాస్తవమే. అయితే రుతుస్రావం నిలిచిపోయిన తరువాత మహిళల్లో గుండెజబ్బు అవకాశాలు ఎక్కువవుతాయి. మధుమేహం, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉంటే ఈస్ట్రోజెన్‌  ద్వారా లభించే రక్షణ బలహీనపడుతుంది.

గుండె జబ్బులను గుర్తించే పద్ధతులేమిటి?
యాంజియోగ్రామ్‌ ఒకటి. ధమనుల్లోకి అపాయకరమైన రసాయనం కాని ఒకదాన్ని పంపి ఎక్స్‌ రే సాయంతో రక్త ప్రవాహాన్ని పరి శీలిస్తారు. ఆ ఎక్స్‌ రే ఛాయాచిత్రాల సాయంతో ధమనుల్లో ఏమైనా అడ్డంకు లు ఏర్పడ్డాయా? అన్నది పరిశీలిస్తారు. ఇది కాకుండా.. ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌ (ఈకేజీ) అనేది గుండెజబ్బులను గుర్తించేందుకు ఉన్న ఇంకో పద్ధతి. ఇందులో గుండె తాలూకూ ఎలక్ట్రికల్‌ యాక్టివిటీని పరిశీలిస్తారు. గుండె ఎంత క్రమబద్ధంగా కొట్టుకుంటోంది? గుండె కవాటాల పరిమాణం, స్థానం, గుండెకు ఏమైనా నష్టం జరిగిందా? అన్నది ఈ ఈకేజీ ద్వారా తెలుస్తుంది. మందులు, కొన్ని పరికరాల సాయంతో గుండె కొట్టుకునే క్రమంలో ఉన్న తేడాలను సరిచేయవచ్చు. 

అధిక రక్తపోటుకు,గుండెకు లింకేమిటి?
ధమనుల్లో ప్రవహించే రక్తం నాడుల గోడలను ఎంత శక్తితో కొట్టుకుంటాయో చెప్పేదే రక్తపోటు. అధిక రక్తపోటు అంటే.. గుండె పనిచేసేందుకు ఎక్కువ కష్టపడుతోందని అర్థం. చిన్న చిన్న ధమనులు బిరుసుగా మారినప్పుడు కూడా రక్తపోటు ఎక్కువ అవుతుంది. వీటిద్వారా కూడా రక్తాన్ని ప్రవహించేలా చేసేందుకు గుండె ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఈ కారణంగా ధమనులు బలహీనపడతాయి. వాటిల్లో పాచిలాంటిది పేరుకుపోయే అవకాశాలు ఏర్పడతాయి.  

హైపర్‌ టెన్షన్‌ అంటే..?
రక్తపోటును సాధారణంగా సిస్టోలిక్, డయాస్టోలిక్‌ అన్న రెండు ప్రమాణాల్లో చెబుతూ ఉంటారు. సిస్టోలిక్‌ ప్రమాణం 120 మిల్లీమీటర్ల ఎంఎంహెచ్‌జీ (మిల్లీమీటర్స్‌ ఆఫ్‌ మెర్కురీ)గానూ, డయాస్టోలిక్‌ ప్రమాణం 80గానూ ఉండటం గుండె ఆరోగ్యంగా పనిచేస్తోందనేందుకు నిదర్శనం. సిస్టోలిక్‌ రక్తపోటు 140, డయాస్టోలిక్‌ ప్రమాణం 90 ఎంఎంహెచ్‌జీగా ఉంటే దాన్ని హైపర్‌ టెన్షన్‌గా పరిగణిస్తారు. గుండె కుంచించుకుపోయినప్పుడు ధమనుల గోడలపై పడే ఒత్తిడిని సిస్టోలిక్‌గా... గుండె వ్యాపించినప్పుడు ఉండే ఒత్తిడిని డయాస్టోలిక్‌గా వ్యవహరిస్తారు.  

గుండె జబ్బులు వారసత్వంగా వస్తాయా?
కొన్ని కుటుంబాల్లో గుండెజబ్బులు వారసత్వంగా ఉండే అవకాశం ఉంది. అయితే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి గుండెజబ్బుల కారకాలు వారసత్వంగా వచ్చినప్పటికీ జీవనశైలి మార్పులు, వ్యాయామం తదితర చర్యల ద్వారా తరువాతి తరం వారు గుండెజబ్బులు రాకుండా చేసుకోవచ్చు.   

ఆహారం పాత్ర ఏమిటి?
గుండెజబ్బుల నివారణలో ఆహారం పాత్ర చాలా కీలకమైంది. తాజా కాయగూరలు, పండ్లు తీసుకోకపోతే, పశు సంబంధిత కొవ్వులు ఎక్కువగా తీసుకుంటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. మద్యపానం కూడా గుండె సమస్యలను ఎక్కువ చేస్తాయి. కొవ్వులు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం దీర్ఘకాలం గుండెకు శ్రీరామ రక్ష అని శాస్త్రవేత్తలు చెబుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement