ఆహార నియమాలకు 5 సూత్రాలు | 5 Principles of dietary | Sakshi
Sakshi News home page

ఆహార నియమాలకు 5 సూత్రాలు

Published Wed, Nov 19 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

ఆహార నియమాలకు  5 సూత్రాలు

ఆహార నియమాలకు 5 సూత్రాలు

సమతుల ఆహారాన్ని వేళ ప్రకారం తీసుకుంటూ, శారీరక వ్యాయామానికి సరైన ప్రాధాన్యమిస్తూ ఉంటే అధికబరువు సమస్యే దరిచేరదు. అయితే, చాలామందికి ఆహారం తీసుకోవడంలో సరైన ప్రణాళిక ఉండదు. దాంతో అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నది పోషకాహార నిపుణుల అభిప్రాయం. ఆహార ప్రణాళికకు నిపుణులు  అందిస్తున్న 5 సూత్రాలు..

1. ఆహార ప్రణాళిక..

‘డైట్ ప్లాన్’ సరిగ్గా ఉండాలి కదా అని ఒకే తరహా ఆహారంతో సరిపెట్టేయకూడదు. దీని వల్ల ఆ ప్రణాళిక సవ్యంగా నడవదు. కొన్ని రకాల పదార్థాలు మరికొన్నింటితో కలిపితే రుచిగానే కాదు, ఆరోగ్యానికీ మేలు కలుగుతుంది. అయితే, ఏ పదార్థాలు కలిపితే శరీరానికి మంచిది అనేవి తెలిసుండటం ముఖ్యం. ఉదాహరణకి- చేపలు ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. అయితే, చేపలను కూరల రూపకంగానే కాకుండా ఆవిరి మీద ఉడికించి, గ్రిల్ చేసి, ఇతర కూరగాయల సలాడ్స్‌తో తీసుకోవచ్చు.
 
2. ఎంపిక ప్రధానం..


లక్ష్యం వైపుగానే ఆహారపు అలవాట్లు ఉండాలి. మనకు నచ్చనిదైనా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని కూడా మెల్ల మెల్లగా మొదలుపెట్టి శరీరానికి అలవాటు చేయవచ్చు. దీని వల్ల లక్ష్యానికి త్వరగా చేరువకావచ్చు.

3. భాగస్వామిని ఎంచుకోండి...

కుటుంబంలోనో, స్నేహితుల్లోనో, సహోద్యోగుల్లోనూ.. మీలాగే ఆహారనియమాలు పాటించే వ్యక్తిని ఈ నియమాల్లో భాగస్వామిగా ఎంచుకోండి. దీని వల్ల ఆహార నియమాలను పాటించడంలో ప్రోత్సాహం ఉంటుంది. వాయిదా వే సే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాయిదా వేసినా తిరిగి కొనసాగించే ధోరణి ఈ పద్ధతిలో ఎక్కువ.

4. సులువుగా కితాబు ఇచ్చేసుకోకండి...

మీకు మీరుగా ‘నేను చాలా బాగా ఆహార నియమాలు పాటించగలను’అనే కితాబు ముందే ఇచ్చుకోకండి. ఎప్పుడైనా నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల మీ ప్రణాళిక కూడా పూర్తిగా మూలన పడే అవకాశమూ ఉంది. అందుకే, ప్రతి రోజూ ‘ఈరోజును కొత్తగా, ఇంకా మరింత ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో ప్రారంభిస్తాను’ అనుకోండి.

5. ఒత్తిడిని అదుపులో ఉంచండి..

భావోద్వేగాల ప్రభావం ఆరోగ్యం మీద  చూపుతుంది. ఇలాంటి సమయాల్లో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, లేదా అసలు తీసుకోకపోవడం జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి అదుపులో లేకపోతే ఆహారం మీద అదుపు ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం మరింత మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇదొక విషవలయంగా మనిషిని వేధిస్తూనే ఉంటుంది. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకొని, నియమాల అమలు సక్రమంగా జరిగేలా చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement