overweight
-
గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..
పుట్టబోయే ఆ చిన్నారి ఒకింత బొద్దుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాస్తంత బొద్దుగా ఉంటే పర్వాలేదు గానీ మరీ ఎక్కువ బరువుండటం తల్లీ, బిడ్డా ఇద్దరికీ చేటు చేసే అంశం. అదెలాగంటే... మహిళలు గర్భం దాల్చినప్పుడు వారిలో కొంతమందికి తాత్కాలికంగా చక్కెరవ్యాధి వస్తుంది. ఇలా కేవలం వారు గర్భవతులుగా ఉన్నప్పుడు వచ్చే చక్కెరవ్యాధిని ‘జెస్టెషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ కండిషన్ ఉన్న మహిళలకు పుట్టే చిన్నారులు కాస్తంత ఎక్కువ బరువుతో పుట్టవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో కాస్తంత ఎక్కువ బరువుగా పిల్లలు పుడితే అది బిడ్డలకు ముప్పుగానూ పరిణమించవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్ ఉన్నవారికి పుట్టే పిల్లలు కాస్తంత ఎరుపు రంగులో ఉండటంతో వారిని ‘టొమాటో బేబీస్’ అంటారు. దీనికి కారణం... పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారికి ఆహారం అందించే క్రమంలోనూ, ఇతరత్రా రక్తప్రవాహం తోపాటు తల్లిలోని చక్కెర చిన్నారుల శరీరాల్లోకీ ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి చిన్నారిలోనూ ఇన్సులిన్ ఎక్కువగా స్రవిస్తుంది. దీని మరో పరిణామం ఏమిటంటే... గర్భంలోని బిడ్డ... తన తల్లి నుంచి చాలా ఎక్కువ మోతాదులో పోషకాలను స్వీకరిస్తుంది. అందుకే గర్భసంచిలో ఉన్న బిడ్డ సాధారణం కంటే చాలా ఎక్కువ బరువు పెరుగుతుంది. వీళ్లలో హిమోగ్లోబిన్ మోతాదు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా పిల్లలు మరీ ఎక్కువ బొద్దుగా, బరువు ఎక్కువగా ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘మాక్రోసోమియా’ అంటారు. సరిగ్గా ఈ అంశమే... ఇటు పుట్టబోయే బిడ్డకూ, అటు జన్మనిస్తున్న తల్లికీ... ఇద్దరికీ ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటి సందర్భాల్లో ... ప్రసవం చేసే డాక్టర్ అయిన అబ్స్ట్రెట్రీషియన్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా బిడ్డ ఏ మేరకు బొద్దుగా ఉన్నారనే అంశాన్ని అంచనా వేస్తారు. ఒక్కోసారి సాధారణ ప్రసవం అవుతుందని అనుకున్నా, తల మాత్రమే బయటకు వచ్చి (శీర్షోదయమై) భుజాలు ప్రసవమార్గంలో ఇరుక్కుపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘షోల్డర్ డిస్టోసియా’ అంటారు. అదొక మెడికల్ ఎమర్జెన్సీ సమస్య. ఇలాంటి అన్ని అంశాలూ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బిడ్డ మరీ బొద్దుగా ఉంటే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. పైగా బొద్దుగా ఉండటం అన్న అంశం ఆరోగ్యానికి ఏమాత్రం సూచిక కాదు. అది ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీకి దారితీయవచ్చు. దీనికి బదులుగా బిడ్డ సన్నగా ఉన్నా... ఆరోగ్యంగా ఉండటమనేది అందరూ కోరుకునే అంశం. అందుకే చిన్నారి బొద్దుగా పుట్టడం / ఉండటం కంటే ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవడం మంచిది. (చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!) -
ఎత్తుకు తగ్గా బరువు ఉంటున్నారా..?
ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు ఉండటం ఆరోగ్యానికి మేలు చేయదని అనేక మార్లు రుజువైంది. ఇటీవల ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో దాదాపు పదివేలమంది స్థూలకాయం ఉన్నవారితో పాటు సాధారణ బరువున్న మరో మూడు లక్షలమందిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది మరో మారు వాస్తవమని తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ‘లాస్’ అనే మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. బరువు పెరుగుతున్న కొద్దీ గుండెజబ్బులు, కేన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు వచ్చి అవి మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎవరి ఎత్తుకు తగినట్టు బరువును అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. (చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!) -
బాగా బొద్దుగా... రోగాలకు ముద్దుగా...
ఇటీవల అధిక బరువు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళల్లో బరువు పెరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. తెలంగాణలో బరువు ఎక్కువగా ఉన్న మహిళల సంఖ్య 28.6 శాతం నుంచి 30.1 శాతానికి, ఏపీలో 33.2 నుంచి 36.3 శాతానికి ఎగబాకిందని ఆ సర్వేలో పేర్కొంది. ఊబకాయం తెచ్చే అనర్థాలూ, బరువు తగ్గడానికి కొన్ని మార్గాలను తెలుసుకుందాం...ఓ వ్యక్తి తాను ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు ఉండటాన్ని స్థూలకాయం / ఊబకాయం ఇంగ్లిష్‌లో ఒబేసిటీగా చెబుతారు. ఒబేసిటీ అన్నది కేవలం లావుగా కనిపించడమో కాదనీ, ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమన్నది డాక్టర్ల మాట. వారు ఎందుకలా చెబుతున్నారో చూద్దాం...ఒబేసిటీకి ప్రధాన కారణాలు⇒ జన్యుపరమైనవి : వంశపారంపర్యంగా తల్లిదండ్రుల్లో ఊబకాయం ఉన్నప్పుడు కుటుంబాల్లో అది పిల్లల్లోనూ కనిపిస్తుంటుంది. ఈ తరహా ఒబేసిటీని తగ్గించడం అంత తేలిగ్గా సాధ్యపడదు. ప్రయత్నపూర్వకంగా కొంత తగ్గి, చురుగ్గా తమరోజువారీ కార్యక్రమాలు తేలిగ్గా జరుపుకుంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్టే.⇒ వయసు : యువకులుగా ఉన్నప్పుడు సన్నగా ఉన్నా మధ్యవయస్కులయ్యేనాటికి బరువు పెరగడం కొందరిలో కనిపిస్తుంది. ఈ పరిణామం స్త్రీపురుషులిద్దరిలోనూ ఉన్నా మహిళల్లో కాస్త ఎక్కువ. ప్రత్యేకంగా మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో ఇది ఇంకాస్త ఎక్కువ.⇒ ఆహార అలవాట్లు : ఆధునిక జీవనశైలిలో భాగంగా కొవ్వులు (శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్‌ఫ్యాట్స్) ఎక్కువగా ఉండే ఆహారం, తీపి పదార్థాలు తీసుకోవడంతో పాటు పాశ్చాత్య జీవనశైలిని అనుసరిస్తూ పిజ్జా, బర్గర్, ఫాస్ట్‌ఫుడ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, వేళకు తినకపోవడం, రాత్రి డ్యూటీలు చేస్తూ వేళగాని వేళల్లో ఆహారం తీసుకొని, పగలు పడుకోవడం వంటి కారణాలతో బరువు పెరగడం.⇒ శరీర కదలికలు తగ్గడం : ఇటీవలి కూర్చొని చేసే వృత్తులు పెరగడం వల్ల బరువు పెరగడం ఎక్కువైంది. ఈ ఆధునిక వృత్తుల్లో ఒంటి కదలికలకు ఏమాత్రం లేకపోవడంతో శరీరారికి తగిన శ్రమ లేక క్యాలరీలు దహనం కాకుండా కొవ్వుల రూపంలో అవి పేరుకుపోవడం.⇒ కొన్ని జబ్బులు (మెడికల్ రీజన్స్) : హైపోథైరాయిడిజమ్, కుషింగ్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, అలాగే తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్)తో కూడా బరువు పెరగడం.⇒ కొన్ని రకాల మందులతో : వైద్యకారణాలతో స్టెరాయిడ్స్‌తో కూడిన మందులు వాడటం, అలాగే డిప్రెషన్ ఉన్నవారు వాడే యాంటీడిప్రెసెంట్స్, మూర్చవ్యాధిగ్రస్తులు వాడే యాంటీ ఎపిలెప్టిక్ మందులతోనూ ఒళ్లు వచ్చే ప్రమాదం.ఒబేసిటీ కేవలం కాస్మటిక్ సమస్య కాదు... అది అనారోగ్యాలకు కారణం?డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసి గురకకు దారితీసే స్లీప్ ఆప్నియా, డిప్రెషన్, పిత్తాశయంలో రాళ్లు, హెర్నియా మొదలైన సమస్యలకు స్థూలకాయం ప్రధాన కారణం. సన్నగా ఉన్న మహిళలతో ΄ోల్చి చూస్తే లావుగా ఉన్న మహిళలలో ప్రసవం కష్టమవుతుంది. అబార్షన్లు అయ్యే అవకాశమూ ఎక్కువే. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. ఇలా దాదాపు 65 రకాల వ్యాధులకు ఒబెసిటీయే మూల కారణం. ఆరోగ్యకరమైన స్థూలకాయం లేనివారితో పోలిస్తే స్థూలకాయుల్లో ఆయుఃప్రమాణం 5 నుంచి 20 ఏళ్లు తగ్గే అవకాశం ఉంది.స్థూలకాయం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా?ఒక వ్యక్తి ఎత్తుకు తగినంత బరువు ఉండాలి. అతడు తన ఎత్తుకు తగిన బరువు ఉన్నాడా లేడా అనే విషయం తెలుసుకోడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ)ను ప్రమాణంగా తీసుకుంటారు. ఎవరైనా తమంతట తామే తెలుసుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా మొదట తమ బరువును కిలోగ్రాముల్లో తెలుసుకోవాలి. ఆ తర్వాత స్కేలు / టేప్ సాయంతో ఎత్తును మీటర్లలో కొలుచుకోవాలి. అటు తర్వాత తమ బరువును తమ ఎత్తు స్క్వేర్తో భాగించాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి 90 కిలోల బరువు ఉన్నాడనుకుందా. అతడి ఎత్తు 1.7 మీటర్లు అనుకుందాం. అప్పుడు అతడి బీఎమ్ఐ 90 / 1.7 ఇంటూ 1.7 = 31.14 అనే విలువ వస్తుంది. తమ ఈ విలువను బీఎమ్ఐ ఛార్ట్‌లో చూసుకుని తామ స్థూలకాయం (ఒబేసిటీ) ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. డాక్టర్లు కూడా దీన్నే అనుసరిస్తుంటారు.బరువు పెరగకుండా నియంత్రించుకునే మార్గాలు...∙అధిక బరువు (బీఎమ్ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్) వంటి వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి ∙ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం సమతులాహారం తీసుకోవడం అంటే కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం కంటే తాజా ఆకుకూరలు, కాయగూరలతో కూడిన ఆహారాలు తీసుకోవడం. ఒకవేళ మాంసాహారం తినాలనుకుంటే వేటమాంసం (రెడ్ మీట్) కంటే చేపలు, చికెన్ వంటి కొవ్వులు తక్కువగా ఉండే వైట్ మీట్ తినాలి ∙క్రమం తప్పకుండా ఒకే వేళకు తినడంతో పాటు తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తీసుకోవాలి ∙రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఒకవేళ మెలకువతో ఉన్నా ఏమీ తినకూడదు ∙చిరుతిండ్లూ, కూల్‌డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.పైన వచ్చిన విలువ ప్రకారం 90 కిలోల బరువున్న ఆ వ్యక్తి 31.14 విలువతో అధిక స్థూలకాయం కేటగిరీలో ఉన్నాడు. అలా బరువు పెరుగుతున్న కొద్దీ స్థూలకాయం ప్రమాణికతల ప్రకారం అతడు వ్యాధిగ్రస్థ స్థూలకాయంలో ఉన్నాడా లేక సూపర్ స్థూలకాయంలో ఉన్నాడా అన్నది తెలుస్తుంది. -
Court of Arbitration for Sport: ఒక్క గ్రాము ఎక్కువున్నా అనర్హతే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్) సూచించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయగా... కేవలం వంద గ్రాములే కదా దీన్ని మినహాయించండి అని భారత అథ్లెట్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. వాదనలు విన్న అనంతరం తీర్పును పలుమార్లు వాయిదా వేసిన సీఏఎస్ ఈనెల 14న వినేశ్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు ఏకవాక్యంలో తీర్పు ఇచి్చంది. ఇప్పుడు తాజాగా దీనిపై వివరణ ఇచి్చంది. ‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిరీ్ణత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. అందుకే పోటీపడే కేటగిరీ కంటే కాస్త తక్కువే ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. దరఖాస్తు చేసుకున్న అథ్లెట్ (వినేశ్ ఫొగాట్‌ను ఉద్దేశించి) తాను అధిక బరువు ఉన్నానని స్పష్టంగా పేర్కొంది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పొందుపరిచింది. దరఖాస్తుదారు అనుభవమున్న రెజ్లర్. గతంలో ఇలాంటి నిబంధనల నడుమ పోటీపడింది. రూల్స్ అర్థం చేసుకోలేకపోయిందనే సమస్యే తలెత్తదు. అయితే ఆమె అభ్యర్థన ఏంటంటే.. 100 గ్రాములు బరువు ఎక్కువ కాదని.. రుతుస్రావానికి ముందు దశలో అధికంగా నీరు తాగడం వల్లే ఇలా జరిగిందని.. తగిన సమయం లేనందు వల్లే బరువు తగ్గించలేకపోయానని.. మినహాయింపు ఇవ్వాలని కోరింది’ అని సీఏఎస్ సోమవారం వివరణ ఇచి్చంది. కాగా మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన వినేశ్.. తుది పోరుకు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై ఒలింపిక్ పతకానికి దూరమైంది. తొలి రోజు పోటీల్లో నిరీ్ణత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపెజ్‌తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసింది. పలు అంతర్జాతీయ టోర్నీల్లో రెండు కేజీల అధిక బరువు ఉన్నా యూడబ్ల్యూడబ్ల్యూ వారిని అనుమతిస్తోందని.. దీంతో వంద గ్రాములే కాబట్టి మినహాయించాలని సీఏఎస్‌లో అప్పీలు చేసింది. దీనికి భారత ఒలింపిక్ కమిటీ మద్దతిచ్చి నిష్ణాతులైన న్యాయ నిపుణులను నియమించింది. అయినా నిబంధనలు అందరికీ ఒక్కటే అని స్పష్టం చేసిన సీఏఎస్.. వినేశ్ అప్పీల్‌ను కొట్టేసింది. దీంతో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై విజయంతో సంచలనం సృష్టించడంతో పాటు.. ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకెక్కిన వినేశ్‌కు నిరాశే ఎదురైంది. -
వేసవిలో బార్లీ నీళ్లు : ప్రయోజనాలెన్నో..!
బార్లీ నీరు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. గట్ బాక్టీరియాను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మన ఆరోగ్యంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బార్లీ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల బాక్టీరాయిడ్స్ అనే గట్ బ్యాక్టీరియా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ రక్తపోటును అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు బార్లీ వాటర్ తాగవచ్చు. ⇒ ఎండల ప్రభావం పడకుండా ఉండాలన్న, వడదెబ్బ తగలకుండా ఉండాలన్న ఈ నీళ్లు తాగాల్సిందే ⇒ బార్లీ నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది. ⇒ పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ⇒ గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు ⇒ బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. ⇒ మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. -
లావైపోతున్నారు! ముంచేస్తున్న ఆహారపు అలవాట్లు
ఊబకాయం.. ఇప్పుడు సాధారణమైపోయింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య పీడిస్తోంది. దీని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాల మీద పడుతోంది. ఫలితంగా గుండె, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులకు మూలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఊబకాయం నివారణకు జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత ఆహారపు అలవాట్లు లావు కావడానికి ఒక కారణమైతే, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణమని జాతీయ ఆరోగ్య మిషన్ చేసిన సర్వేలో తేలింది. శ్రమగల జీవన విధానం, సమతులాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సర్వే స్పష్టం చేసింది. సాక్షి, చిత్తూరు రూరల్: ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం పెరిగిపోతోంది. దానికి తోడు వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక బరువు ఉన్న వారిని గుండె జబ్బులతో పాటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. ఊబకాయులు ఇటీవల అనేక దుష్ఫలితాలతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. కార్డియాలజీ రోగుల్లో 25 శాతం మంది ఊబకాయులే ఉంటున్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ నిర్వహిస్తున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్ (ఎన్ఎసీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్త పోటు, మధుమేహం, గుండె జబ్బులు సోకుతున్నట్లు తేలింది. జిల్లాలో 17,54,254 మంది ఉండగా 12,99,758 మందిని ఎన్సీడీ సర్వే చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్వే 74.09శాతం పూర్తయింది. అయితే ఈ సర్వేలో బీపీతో బాధపడుతున్నవారు 1,96,772 మంది, మధుమేహంతో 1,96,957 మంది, రెండు ఉన్నవారు 17,675 మంది ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలి, అధికబరువు వంటివి అని వైద్యులు చెబుతున్నారు. బరువుతో గుండె బలహీనత గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కార్డియాలజీ ఓపీల సంఖ్య పెరుగుతోంది. రోజుకు జిల్లాలో 200 నుంచి 250 మంది వరకూ రోగులు వస్తున్నట్లు వైద్యులు లెక్కలు చెబుతున్నాయి. వారిలో 25 శాతం మంది అంటే 55 మంది ఊబకాయులే. వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాకులు ఏర్పడటం, గుండెపై తీవ్ర ఒత్తిడి, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాకులు ఉన్న వారికి వాటిని తొలగించి స్టెంట్లు వేస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతోంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్‌లో ప్రొటీన్లు లీకవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు డయాలసిస్ కోసం వస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం 50 నుంచి 65 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులు ఒబెసిటీ వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒబెసిటీ ఉన్న వారిలో పదిశాతం మందికి గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడుతున్నాయి. ఫ్యాటీ లివర్ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్ సమస్యలు తలెత్తుతున్నాయి. మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయసులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తోంది. బరువు పెరగడానికి కారణాలు పట్టణాల నుంచి పల్లెల వరకు జంక్‌ఫుడ్ వినియోగం పెరిగింది. పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్‌ఫుడ్, ఐస్‌క్రీమ్‌లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్‌గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్లోని కొన్ని యాప్‌లద్వారా జంక్‌ఫుడ్‌ను ఆర్డర్ పెడితే క్షణాల్లో గుమ్మం ముందు డెలివరీ చేస్తున్నారు. దీనికి తోడు రెస్టారెంట్లలో విక్రయించే ఆహారాల్లో బిర్యానిదే మొదటిస్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండడం, వీటికి తోడు కూల్‌డ్రింక్‌లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మగవారితోపాటు అధికంగా మహిళలకు ఊబకాయం వచ్చేస్తోంది. ఇలా చేస్తే మేలు దేశంలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23.5 దాటిన వారందరినీ ఊబకాయులుగా భావిస్తారు. వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల ఆహారం తీసుకుంటే సత్పలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. దీర్ఘకాల విధానంలో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం ద్వారా బరువు చేయడం తగ్గించుకోవచ్చు. స్వల్పకాలంలో రోజుకు వెయ్యి కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతులను అనుసరించినా బరువు తగ్గకుంటే బీఎంఐ 30 శాతం దాటిన వారికి బేరియాట్రిక్ (మెటబాలిక్) సర్జరీలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు. బరువు తగ్గితే మంచిది ఊబకాయం ఉన్న మధుమేహులు తమ బరువులో ఐదు శాతం తగ్గించుకోగా తక్కువ మందులతో మెరుగైన వ్యాధి నియంత్రణా ఫలితాలు రాబట్టవచ్చు. హృద్రోగ సమస్యలను నివారించుకోవచ్చు. సమతుల ఆహారం, క్రమగల జీవన విధానం, జీవనశైలిలో మార్పులు పాటించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయుల్లో మధుమేహ నియంత్రణకు ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి. – డాక్టర్ అరుణ్‌కుమార్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ -
‘చిరు’కు రుచి మరిగి లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు..
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): శ్రీధర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. కరోనా సెకండ్ వేవ్‌లో కంపెనీ అతనికి ఇంటి నుంచే పని చేయాలని బాధ్యతలు అప్పజెప్పింది. ఆఫీసులో అటూ ఇటూ తిరుగుతూ పనిచేసే అతను ఇంట్లో ఒకేచోట గంటల తరబడి కూర్చోవడమే గాక కుటుంబసభ్యులు గంటకోసారి చేసి పెట్టే చిరుతిళ్లు తింటూ లావైపోయాడు. మొదట్లో 65 కిలోల బరువు ఉండే అతను ఇప్పుడు 85 కిలోలకు పెరిగాడు. దీంతో పెరిగిన బరువును తగ్గించేందుకు న్యూట్రిషన్ సెంటర్లవైపు పరుగులు తీస్తున్నాడు. ►నారాయణరెడ్డి కేంద్ర సంస్థలో పనిచేసి రెండేళ్ల క్రితమే రిటైరయ్యాడు. అతను రిటైరైనప్పటి నుంచి కోవిడ్ ప్రారంభమైంది. అప్పటి వరకు ప్రతిరోజూ ఉదయమే గంటసేపు వాకింగ్ చేసేవాడు. లాక్డౌన్, కోవిడ్ నిబంధనల మేరకు ఇంట్లోనే గడపాల్సి వచ్చి ంది. కోవిడ్ తగ్గుముఖం పట్టినా కుటుంబసభ్యులు అతన్ని బయటకు వెళ్లనీయలేదు. దీంతో సన్నగా 65 కిలోల బరువుండే అతను ఇప్పుడు 80 కిలోలకు చేరాడు. దీంతో అతనిలో బీపీ, షుగర్ స్థాయిలు బాగా పెరిగాయి. ఈ కారణంగా మందుల వాడకమూ పెరిగింది. బరువు తగ్గేందుకు ఇప్పుడు ట్రెడ్మిల్ కొనుగోలు చేసి ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నాడు. చదవండి: (Jayanthi Narayanan: ఒక అమ్మ .. 1000 మంది పిల్లలు) వీరిద్దరే కాదు కోవిడ్ కారణంగా బరువు పెరిగి ఇబ్బంది పడే వారి సంఖ్య జిల్లాలో వేలల్లో ఉంది. కోవిడ్ వైరస్‌ను ఒక్కటే తీసుకురాలేదు. దాంతో పాటు పరిస్థితుల ప్రభావం వల్ల మానవుల జీవనశైలినే మార్చేసింది. దీంతో ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. బద్దకం పెరిగిపోయి ఊబకాయం అధికమైంది. దీంతో పాటు జీవనశైలి జబ్బులూ పెరిగిపోయాయి. వీటిని నియంత్రించేందుకు ఇప్పుడు ఆన్లైన్ యోగా క్లాసులు, ఇంట్లో ట్రెడ్మిల్ వాకింగ్లు గట్రా చేస్తూనే నోటిని కట్టడి చేస్తూ కడుపు కాల్చుకుంటున్నారు. జిల్లాలో 2020 మార్చి 28వ తేదీన తొలి కోవిడ్ కేసు నమోదైంది. దానికి నాలుగు రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైంది. 20 నెలల క్రితం నాడు మొదలైన కోవిడ్ కేసుల సంఖ్య నేడు 1.25 లక్షల దాకా చేరుకున్నాయి. దీనిబారిన పడి 854 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికీ రోజూ ఒకటో, రెండో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మొదటి అల, రెండో అల పేరుతో దూసుకొచ్చిన కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఆంక్షలు ఫలితంగా చాలా మందికి శారీరక శ్రమ కరువైంది. వాకింగ్ చేయాలంటే మైదానాలు, పార్కులు మూతపడ్డాయి. వీధుల్లో నడవాలంటే మోకాళ్ల నొప్పులు వస్తాయని భయం. జిమ్‌కు వెళ్లాలన్నా వాటిపైనా ఆంక్షలు. ఇప్పుడిప్పుడే అవి తెరుచుకున్నా రోజుల తరబడి విశ్రాంతి తీసుకున్న మనసు బద్దకిస్తోంది. తెగించి జిమ్‌కు వెళ్లినా ఒకటి రెండు రోజులకే మళ్లీ మనసు విశ్రాంతినే కోరుకుంటోంది. దీనికితోడు కూర్చుని తినే కార్యక్రమం అధికం కావడంతో జిల్లాలో గతంలో ఉన్న వారితో పోలిస్తే అదనంగా 30 శాతం మంది స్థూలకాయులుగా మారారని వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: (కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా తగ్గుతాయి..) వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇబ్బందులు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారిలో 90 శాతం మందికి కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు. ఈ కారణంగా ఇంట్లోనే ఉండటంతో చిరుతిళ్లపై మనసు లాగడంతో వారికి వండిపెట్టేవారూ రెడీ అయ్యారు. ఈ కారణంగా అవసరం లేకపోయినా చిరుతిళ్లు తింటూ పనిచేసుకునే వారు అధికమయ్యారు. దీంతో చాలా మందికి శరీరంలో అవసరమైన దానికంటే అధికంగా కేలరీలు పెరిగి స్థూలకాయం వచ్చింది. మారిన ఆహారపు అలవాట్లు చాలా మందికి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. రెండేళ్ల క్రితం రోజుకు మూడు పూటలు తినేవారు కరోనా దెబ్బకు ఐదారు పూటలు (స్నాక్స్‌తో కలిపి) లాగించేశారు. అధిక శాతం ఇంట్లోనే ఉండటం, కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలనే వాదన ఒకటి రావడంతో చాలా మంది ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో శారీరక శ్రమను గాలికి వదిలేశారు. దీంతో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చదవండి: (సామలు, కొర్రలు, ఊదలు, అరికెలు.. వీటిని ఎప్పుడైనా రుచి చూశారా?) ఊబకాయంతో నష్టాలు ఊబకాయం కారణంగా పది మందిలో తిరగాలంటే ఇబ్బంది. ఇతరులు సన్నగా, నాజూగ్గా ఉంటే వీరు చురుకుతనం తగ్గిపోయి బరువుగా అడుగులు వేయాల్సి వస్తుంది. అప్పటికే ఒంట్లో బీపీ, షుగర్లు ఉంటే వాటి స్థాయిలు మరింత పెరిగి మందుల డోసు కూడా అధికమైంది. దీనికితోడు అధిక బరువు కారణంగా కీళ్లనొప్పులు, ఆయాసం, గుండెజబ్బులు, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలతో వైద్యుల వద్దకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. కిడ్నీలపై భారం పడుతుంది ఊబకాయం వల్ల కిడ్నీ పనితనంపై భారం పెరిగే అవకాశం ఉంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 దాటితే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో పాటు స్మోకింగ్ అలవాటు ఉంటే రక్తనాళాలు కుచించుకుపోయి రక్తసరఫరాలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో కిడ్నీ ఎక్కువగా పనిచేయడం వల్ల ప్రొటీన్స్ లీక్ అవుతాయి. ఈ కారణంగా కాళ్లవాపులు వస్తాయి. ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. –డాక్టర్ పీఎల్. వెంకటపక్కిరెడ్డి,నెఫ్రాలజిస్టు, కర్నూలు బరువు నియంత్రణా ముఖ్యమే కోవిడ్ అనంతరం ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆహారం తీసుకోవడంలో వచ్చిన మార్పులే. అధిక బరువును ఆహార నియంత్రణతోనే తగ్గించుకోవాలి. ఈ మేరకు శరీరానికి అవసరమైన కేలరీలను వారి బరువు, వయస్సుకు తగినట్లుగా తీసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీరు తాగాలి. ఇదే క్రమంలో తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఫాస్ట్ఫుడ్లు, జంక్‌ఫుడ్‌లు మానేయాలి. – డాక్టర్ జి.రమాదేవి, డైటీషియన్, కర్నూలు -
వీడని భయం.. ఊబకాయం
మితివీురిన ఆహారం, జంక్ ఫుడ్ల వల్ల శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే ఒక వ్యాధినే ఊబకాయంగా పిలుస్తారు. దీనినే స్థూలకాయం అని కూడా అంటారు. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ధూమపాన వ్యసనం, ఒత్తిళ్లు, కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా దీనిబారిన పడొచ్చు. అంటే ఒక వ్యక్తి తన ఎత్తు, వయస్సుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకు మించితే దీనిని అనారోగ్య సమస్యగా గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం (గురక), కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన కేన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పనిభారం అధికం కావడంతో ఒత్తిడికి గురవుతుంటారు. ఊబకాయానికి తోడు ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, సామర్థ్యానికి మించి పనిచేయడం వలన పలువురు రక్తపోటు బారిన పడుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు పెరగడం అంతిమంగా హృదయంపై ప్రభావం చూపనుంది. ఉదయం, సాయంత్రం వేళ కచ్చితంగా కొంత సమయం వ్యాయామం చేయాలని, చెమట పట్టేలా నడవడం, పరిగెత్తడం ద్వారా కొవ్వు కరిగించి బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ ప్రభావం అధిక కేలరీలు కలిగి ఉండే ఆహారంగా చెప్పుకునే జంక్‌ఫుడ్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది. పెద్దల పరిస్థితీ అంతే. సాచ్యురేటెడ్ కొవ్వులు, ఉప్పు, పంచదార పాళ్లు మోతాదుకు మించి ఉండే చిరుతిళ్లు తినడం ప్రమాదకరం. అంటే బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేకులు, నూడిల్స్, చిప్స్, తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరల్స్, ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్ లాంటివి జంక్ ఫుడ్‌గానే చెప్పొచ్చు. ఇంకా మసలా చాట్, పకోడీలు, బజ్జీలు, టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్–డాంగ్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవద్దు. మోతాదుకు మించి తినొద్దు పిల్లలు టీవీ ముందు కూర్చొని చిరుతిళ్లు ఎక్కువగా తింటుంటారు. ఈ పద్ధతిని మాన్పించాలి. పెద్దలు వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఫైబర్ ఉన్న పదార్థాలు తినాలి. మాంసాహారం, ధూమపానం, మద్యపానం అలవాట్లు మానాలి. – డాక్టర్ భూక్యా నాగమణి, సుజాతనగర్ పీహెచ్సీ -
పిల్లలు విపరీతంగా బరువు పెరుగుతున్నారా?
ఇటీవల పిల్లలు జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలితో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. టీనేజ్‌లో ఉన్న సమయంలోనే పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పకపోతే వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పిల్లల్లో వారి ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో ముందుగా గమనించాలి. ముందుగా వారికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నేర్పాలి. ►స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటితో బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువ. అందుకే వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల పళ్లు, ఎముకలు దెబ్బతింటాయి. కలరింగ్ ఏజెంట్స్ వల్ల కిడ్నీలు, ప్రిజర్వేటివ్స్ వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను మరింత దూరం ఉంచడం మంచిది ►వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు ►పిజ్జా, బర్గర్స్, కేక్స్ వంటి బేకరీ ఉత్పాదనల్లోని ఫ్యాట్ కంటెంట్స్ పిల్లల్లో బరువును మరింత పెంచుతాయి. ఈ ఆహారాల్లో పీచు లేకపోవడం ఆరోగ్యానికి అంతగా ఉపకరించే విషయం కాదు ►తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు తమ పిల్లలకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారం ఇవ్వడం మంచిది ►పిల్లలకు మంచి ఆహారంతో పాటు తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలన, క్రమం తప్పకుండా ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల్లో ఉంచాలి. ఈ పనుల్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కొంతసేపు పాలుపంచుకోవడం మంచిది ►పిల్లల్లో బరువు పెరగకుండా చూసేందుకు పై అలవాట్లతో పాటు ముందుగా థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి వాటిని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. -
మోకాళ్ల నొప్పులు మళ్లీ రానే రావు...
నా వయసు 50 ఏళ్లు. ఇటీవల కొంతకాలంగా మోకాళ్లనొప్పుల తో బాధపడుతున్నాను. దీనికి హోమియోలో చికిత్స ఉందా? మోకాళ్ల నొప్పులు రావడానికి అధిక బరువే మొదటి కారణం. దేహం తాలూకు బరువు వివిధ దశల్లో కీళ్ల మీద పడుతుంది. నడిచేటప్పుడు ఆ బరువు నాలుగు రెట్లు అధికమై మోకాళ్ల మీద పడుతుంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాళ్ల మీద పడే భారం 6 నుంచి 7 రెట్లు అధికంగా ఉంటుంది. కీళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు కానీ... కీలు దెబ్బతిన్నప్పుడు మాత్రం సమస్యలు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు: ►కూర్చుని లేచే సమయంలో ఇబ్బంది∙కీలు బిగుసుకుపోవడం ►లేచేటప్పుడు, కదిలించేటప్పుడు, నడిచేటప్పుడు మోకాలి నుంచి శబ్దం ►మోకాలిపై వాపు, నొక్కితే నొప్పి ఎక్కువవుతుంది. ►నొప్పి మూలంగా మెట్లు ఎక్కడం, దిగడంలో ఇబ్బంది. హోమియో చికిత్స: మోకాలి నొప్పులను దూరం చేయడంలో హోమియో మందులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఇతర వైద్య విధానాల్లో తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ హోమియో చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ చర్మంపై పొలుసుల్లా రాలుతున్నాయి! నా వయసు 45 ఏళ్లు. ఐదు సంవత్సరాలుగా చర్మంపైన మచ్చలుగా ఏర్పడి పొట్టు రాలిపోతున్నది. ఎంతోమంది డాక్టర్లకు చూపించాను. ప్రయోజనం కనిపించడం లేదు. కీళ్లనొప్పులు కూడా వస్తున్నాయి. హోమియో మందులతో తగ్గుతుందా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ వ్యాధి సోరియాసిస్‌గా తెలుస్తోంది. ఇది సాధారణంగా 15–30 ఏళ్ల మధ్యవయస్కులకి ఎక్కువగా వస్తుంది. కానీ వంశపారంపర్యంగా ఏ వయసువారికైనా రావచ్చు. లక్షణాలు: ►చేతులు, కాళ్లు, తల, ముఖం, చర్మంపై మచ్చలు లేదా బొబ్బలు వచ్చి చేప పొలుసులుగా చర్మం ఊడిపోతుంది. ►కేవలం చర్మం మీద మాత్రమే గాక గోళ్లపై కూడా మచ్చలు రావడం, కీళ్లనొప్పులు ఉంటాయి. ►తలపై చుండ్రులాగా పొలుసులతో పాటు జుట్టు కూడా రాలిపోతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తాము చూడటానికి కూడా బాగాలేకపోవడంతో మానసిక క్షోభకు గురవుతారు. ఇటీవలి ట్రెండ్: ఆధునిక జీవన శైలి వల్ల ఇటీవల వంశపారంపర్యంగా వ్యాధి లేని వారిలోనూ ఇది కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. హడావుడి, ఆదుర్దా కలిగిన జీవనశైలి వల్ల ఇది మరింత అధికం అవుతుంది. కాబట్టి ఒత్తిడిని దూరంగా ఉంచుతూ, పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలి. తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాలి. చికిత్స: రోగి స్వభావం, తత్వం వంటి అంశాలను బట్టి వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా హోమియోలో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా సోరియాసిస్ సమస్యకు సమూలమైన చికిత్స ఉంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
నైట్ షిఫ్ట్‌ల్లో ఆ రిస్క్ ఎక్కువ
వాషింగ్టన్: నైట్ షిఫ్ట్‌ల్లో తరచూ పనిచేసేవారికి త్వరగా లావెక్కి ఒబెసిటీకి గురయ్యే ప్రమాదం 29 శాతం అధికమని ఓ అథ్యయనంలో వెల్లడైంది. అడపాదడపా నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే వారితో పోలిస్తే నిత్యం రాత్రి వేళల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ముప్పు మరింత ఎక్కువని తేలింది.రాత్రి వేళల్లో పనిచేయడాన్ని వీలైనంత తగ్గిస్తే ఒబెసిటీ రిస్క్ నుంచి కొంతమేర తప్పించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. పలు ప్రచురిత అథ్యయనాలను విశ్లేషించిన నిపుణులు ఈ అంశాన్ని నిగ్గుతేల్చారు. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది ఉద్యోగులు షిఫ్ట్ వర్క్‌ల్లో నిమగ్నమయ్యారని సీనియర్ స్టడీ రచయిత డాక్టర్ లాప్త్సే వివరించారు. ఇక షిఫ్ట్‌ల్లో పనిచేసేవారిలో పని స్వభావాన్ని అనుసరించి కూడా ఒబెసిటీ, ఓవర్‌వెయిట్ రిస్క్ ఉంటుందని అథ్యయనం వెల్లడించింది. ఒబెసిటీ బ్రెస్ట్ క్యాన్సర్, మధుమేహం, గుండెజబ్బులు వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని ఈ అథ్యయనం పేర్కొంది. -
ఉద్యోగులు బరువు పెరిగారని..
న్యూఢిల్లీ: సంస్ధలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు బరువు పెరిగారని భారతీయ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా వారిని గ్రౌండ్ డ్యూటీలకు బదిలీ చేసింది. క్యాబిన్ క్రూ ఉద్యోగులుగా పనిచేస్తున్న 57 మంది(వీరిలో ఎక్కువ మంది ఎయిర్ హోస్టస్ గా విధులు నిర్వహిస్తున్నారు) అధిక బరువు ఉన్నట్లు ఎయిర్ ఇండియా గత నెలలో గుర్తించింది. త్వరగా బరువు తగ్గకపోతే శాశ్వత గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగులుగా చేస్తామని హెచ్చరించింది కూడా. డెడ్ లైన్ లోగా బరువు తగ్గాలని సూచించిన ఎయిర్ ఇండియా అందులో ఫెయిల్ అయిన వారిని గ్రౌండ్ జాబ్స్ కు పంపినట్లు ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్(బీఎమ్ఐ) ప్రకారం.. అధిక బరువును కలిగివున్నట్లు గుర్తించామని చెప్పారు. గ్రౌండ్ జాబ్ లో చేరడమంటే నెలకు రూ.35 వేల నుంచి రూ.50 వేల ఫ్లైయింగ్ అలవెన్సును కోల్పోయినట్లే. అధిక బరువు కలిగిన వారిని క్యాబిన్ క్రూ జాబ్ కు తొలుత ఆరు నెలల పాటు అన్ ఫిట్ గా పరిగణిస్తారు. 18నెలల్లోగా తిరిగి తక్కువ బరువును చూపించలేకపోతే పర్మనెంట్ గా క్యాబిన్ క్రూ జాబ్ కు అన్ ఫిట్ గా పరిగణిస్తారు. -
బరువెక్కుతున్న ఆంధ్రప్రదేశ్!
► రాష్ట్రంలో అధిక బరువున్న వారు 33% పైనే.. తెలంగాణలో 28% మంది ► పట్టణీకరణ, వ్యాయామంపై అవగాహన లేమి కారణాలు ► జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడి సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బరువెక్కుతోంది. దేశంలోనే ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. వయసు, ఎత్తును బట్టి చూస్తే ఉండాల్సిన బరువు కంటే 33 శాతం మంది అధికంగా ఉన్నట్టు తేలింది. అధిక బరువును దాటి చాలామంది ఊబకాయంలోకి కూడా వచ్చేశారు. గతంలో శరీరానికి మించి బరువున్న వారు పట్టణాలకే పరిమితమయ్యేవారు. పెరుగుతున్న పట్టణీకరణ, ఆహారపు అలవాట్లతో ఈ సమస్య పట్టణాలకు ఎగబాకింది. ఉండాల్సిన దానికంటే కాస్త తక్కువైతే ఫర్వాలేదుగానీ, ఎక్కువైతే చాలా సమస్యలుంటాయనేది వైద్య నిపుణుల అభిప్రాయం. ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ జరిపిన సర్వేలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ మంది అధిక బరువుతో ఉన్నారని తేలింది. రెండో స్థానంలో తెలంగాణ ఉన్నట్టు తేల్చింది. ఏపీలో పురుషులు, మహిళలు ఇరువురిలోనూ ఇదే పరిస్థితి. ఇది క్రమంగా పెరుగుతోందని కూడా సర్వే వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఆరు రెట్లు బరువులో గ్రోత్ రేటు పెరిగింది. బిహార్‌లో చాలా తక్కువ దేశంలో బరువు అధికంగా ఉన్న వారిలో బిహార్ చివరి స్థానంలో ఉంది. బిహార్‌లో బాడీ మాస్ ఇండెక్స్ (బరువును కిలోలతో కొలిచి, ఎత్తును మీటర్లతో లెక్కించి బరువును ఎత్తుతో భాగించడం) కంటే మించి బరువు ఉన్న మహిళల శాతం కేవలం 4.6 మాత్రమే. అదే ఆంధ్రప్రదేశ్‌లో 33.2 శాతం ఉండటం గమనార్హం. ఇక బిహార్‌లో పురుషుల్లో అధిక బరువున్న వారు 6.3 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 33.5 శాతం మంది. తెలంగాణలో 28 శాతం మంది శరీరానికి మించి బరువు అధికంగా ఉన్నారు. బాడీ మాస్ ఇండెక్స్‌ను బట్టే కొలతలు బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనిషి బరువును, శరీరం కొలతల ఆధారంగా కొలుస్తారు. బరువును కిలోలతో కొలిచి, ఎత్తును మీటర్లతో లెక్కించి బరువులోని కిలోలను ఎత్తులో వచ్చిన మీటర్లతో భాగిస్తే వచ్చేదే బాడీ మాస్ ఇండెక్స్. సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ అంటే 18.5 నుంచి 24.9 వరకూ ఉండాలి. 25 నుంచి 29.9 ఉంటే అధిక బరువు కలిగి ఉన్నట్టు లెక్క. బాడీ మాస్ ఇండెక్స్‌ను బట్టి బరువు 30 దాటితే మాత్రం ఇది ఒబెసిటీ. కొన్ని రాష్ట్రాల్లో అధిక బరువు ఉన్న వారు (శాతంలో) రాష్ట్రం స్త్రీలు పురుషులు ఆంధ్రప్రదేశ్ 33.2 33.5 తెలంగాణ 28.1 24.2 తమిళనాడు 20.9 14.5 కర్ణాటక 15.3 10.9 పశ్చిమబెంగాల్ 11.4 5.5 బిహార్ 4.6 6.3 మధ్యప్రదేశ్ 7.6 4.3 రకరకాల కారణాలు ♦ వ్యాయామంపై అవగాహన లేకపోవడం, వాతావరణం, జీవనశైలిలో వచ్చిన మార్పులు ♦ వరి అన్నం ఎక్కువ తీసుకోవడం. దీనివల్ల కార్బోహైడ్రేట్స్ పెరుగుతాయి ♦ ఓ మోస్తరు టౌన్లకూ పట్టణీకరణ వ్యాపించి ఆహారపు అలవాట్లలో పెను మార్పులు రావడం ♦ పల్లెలకూ జంక్‌ఫుడ్ విస్తరించడం.. దాని ప్రభావం చిన్నారుల్లోనూ కనిపించడం ♦ సమతుల పోషకాహారం తీసుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలని కర్నూలు ప్రభుత్వ వైద్యశాల సీనియర్ జనరల్ ఫిజీషియన్ డా.కె.విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. -
డయాబెటిస్ ఉన్నా...
స్థూలకాయులకూ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మామిడిపండు పట్ల చాలానే ఆంక్షలు ఉన్నాయి. ఇది వారికి అంత మంచిది కాదని అందరూ అంటుంటారు. అయితే ఇది అపోహ మాత్రమేననీ, టైప్-2 డయాబెటిస్‌ను మామిడి సమర్థంగా నియంత్రిస్తుందని అంటున్నారు పరిశోధకులు. కొవ్వులను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థలో ఏర్పడే కొన్ని బ్యాక్టీరియాను ఈ పండు నివారిస్తుందని పేర్కొంటున్నారు ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో ఇది తెలిసిందంటూ తమ పరిశోధనల వివరాలను వెల్లడించారు. దాదాపు 60 ఎలుకలపై 12 వారాలపాటు ఈ అధ్యయనం నిర్వహించారు. అవి తీసుకునే ఆహారంలోని క్యాలరీలలో 10 శాతం జంతువుల కొవ్వునుంచి, 60 శాతం ఆహారాన్ని ఇతర కొవ్వుల నుంచి, మరో 10 శాతం మామిడి నుంచి లభ్యమయ్యేలా చూశారు. మిగతా క్యాలరీలు ఇతర ఆహారం నుంచి లభ్యమయ్యేలా చేశారు. ఈ తరహా ఆహారాన్ని ఇచ్చే ముందూ... ఆ తర్వాతా మామూలుగా ఆహారాన్ని ఇచ్చారు. ఈ మూడు సమయాల్లోనూ వచ్చిన ఫలితాలను విశ్లేషించారు. మామిడిని ఆహారంగా ఇచ్చే సమయంలో జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా తీరుతెన్నులను పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. మామిడి స్థూలకాయాన్ని నివారించేదిగా (యాంటీ-ఒబెసోజెనిక్), చక్కెరను తగ్గించేదిగా (హైపోగ్లైసీమిక్), వ్యాధి నిరోధకతను పెంచేందుకు తోడ్పడేదిగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంటున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్ ఎడ్రాలిన్ ల్యూకాస్. ‘‘జంతువుల్లో నిర్వహించిన అనేక పరిశోధనల ద్వారా మామిడిపండు జీర్ణవ్యవస్థలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పాళ్లను క్రమబద్ధంగా ఉంచుతుందని తేలింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇందులోని పీచుపదార్థం పేగులనూ, జీర్ణవ్యవస్థనూ మరింత ఆరోగ్యంగా ఉంచుతుందని వివరిస్తున్నారాయన. ఈ అధ్యయనం పూర్తి ఫలితాలూ, మానవుల్లోనూ అదే ప్రభావం ఉంటుందా అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు, స్థూలకాయంతో బాధపడేవారు మామిడిని పూర్తిగా దూరం చేసుకోనవసరం లేదని, పరిమిత మోతాదుల్లో తీసుకోచ్చనే మంచి విషయం త్వరలో సాధికారికంగా తెలియనుందనే సంకేతాలను ఈ పరిశోధన వెల్లడిస్తోంది. -
స్థూలకాయులకు మాంసాహారం ముప్పే!
పరిపరి శోధన మధుమేహవ్యాధిగ్రస్థులు స్వీట్సు తినడం వల్ల ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుందో, స్థూలకాయులు మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల అదేవిధమైన హాని కలుగుతుందట. మాంసాహారం లేనిదే ముద్ద గొంతు దిగని వారికి ఈ విషయం మింగుడు పడదేమో మరి! ఎందుకంటే స్థూలకాయం ఉన్నవారికి మాంసాహారం తినడం వల్ల ముప్పు తప్పదంటున్నాయి కొత్త పరిశోధనలు. మన శరీరానికి కొవ్వులు, ప్రొటీన్లు అవసరమే. అయితే అవసరమైనదానికన్నా ఎక్కువ తీసుకుంటేనే చిక్కొచ్చిపడుతుంది. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఫరవాలేదు కానీ, తరచు మాంసాహారం తీసుకోవడం వల్ల ముప్పే. ముఖ్యంగా స్థూలకాయులకైతే మరింత ఇబ్బంది తప్పదని అంటున్నారు అడిలైడ్స్ విశ్వవిద్యాలయంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ శాఖ పరిశోధకులు. -
విద్యార్థుల్లో ఒబేసిటీకి టీచర్లే బాధ్యులు
బీజింగ్: అమెరికా తర్వాత పిల్లల్లో స్థూలకాయ సమస్యను ఎక్కువ ఎదుర్కొంటున్న దేశం చైనా. అందులోను ముఖ్యంగా బీజింగ్ నగరంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని అరికట్టడం కోసం ‘బీజింగ్ సెంటర్ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (బీసీడీపీసీ)’ ఓ సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించింది. పిల్లల్లో స్థూలకాయ సమస్యను అరికట్టే బాధ్యతను నగరంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల టీచర్లకు అప్పగించింది. పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా పిల్లలకు క్రమంతప్పకుండా శారీరక వ్యాయామం చేయించాలని, ఆటలు ఆడించాలని ఆదేశించింది. ఎప్పటికప్పుడు పాఠశాలల్లోని పిల్లల బరువును బేరీజు వేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటామని, పిల్లల బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాఠశాలల్లో ఉన్నంతసేపు పిల్లలు అతిగా తినకుండా నియంత్రించడంతోపాటు అవసరమైన వ్యాయామాలు చేయిస్తామని, ఇంటికెళ్లాక ఎవరు వారిని నియంత్రిస్తారని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పిల్లలో ఇంటికెళ్లాకే మాంసం లాంటి అధిక కొవ్వున్న పదార్థాలు తింటారని, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, కుకీలు, కేక్స్, చిప్స్ తింటారని, శీతల పానీయాలు సేవిస్తారని, అలాంటప్పుడు తాము వారి అలవాట్లకు ఎలా బాధ్యత వహిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా బాధ్యత తమదేనంటూ బీజింగ్ పరిధిలోని 16 జిల్లాల పాఠశాలలకు బీసీడీపీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీజింగ్ పాఠశాల పిల్లల్లో స్థూలకాయ సమస్య 15.6 శాతానికి పెరగడమే ఈ ఉత్తర్వులకు కారణం. అంతకుముందు ఏడాది కన్నా ఈ సమస్య 5.6 శాతం పెరిగింది. చైనా ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెరుగుతుండడం, మొన్నటి వరకు ఒకే సంతానం నిబంధనను కచ్చితంగా అమలు చేయడం వల్ల పిల్లల్లో స్థూలకాయ సమస్య పెరిగిందని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆశ్చర్యంగా పేద వర్గాలకు చెందిన పిల్లల్లో కూడా ఈ సమస్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. చైనా బాలల్లో స్థూలకాయ సమస్య 23 శాతం ఉండగా, బాలికల్లో 14 శాతం ఉందని, అదే అమెరికాలోని బాలబాలికల్లో ఈ సమస్య 17 శాతం ఉందని వాషింఘ్టన్ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. స్థూలకాయం సమస్య చైనాలో కేవలం పిల్లలకే పరిమితం కాలేదని, మొత్తం చైనాలో నాలుగున్నర కోట్ల మంది పెద్దవాళ్లు కూడా స్థూలకాయం సమస్యతో బాధ పడుతున్నారని, 30 కోట్ల మంది మోతాదుకు మించి బరువున్నారని యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. మరి వారి సమస్యను చైనా ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. -
నగ్న రెస్టారెంటులో ఊబకాయులకు నో ఎంట్రీ!
భోజనప్రియుల కోసం టోక్యోలో కొత్త కాన్సెప్ట్ తో ప్రారంభం కానున్న నగ్న రెస్టారెంట్ (నేకెడ్ రెస్టారెంట్) అతిథులకు కొన్ని నిబంధనలను విధించింది. విభిన్న రుచులతో రెస్టారెంట్ లో భోజనం చేయాలని ఉవ్విల్లూరే వారికి నగ్నంగా భోజనం చేసే సదుపాయం అందిస్తున్న రెస్టారెంట్... తమ నిబంధనల ప్రకారం ఊబకాయులకు అనుమతి నిరాకరిస్తోంది. సరికొత్త డైనింగ్ అనుభవాలను పొందాలనుకుంటే తమ వెబ్ సైట్ లోని నియమాల జాబితాను తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందేనని నిక్కచ్చిగా చెప్తోంది. టోక్యోలో ప్రారంభం కానున్న జపనీస్ నేకెడ్ రెస్టారెంట్ వినియోగదారులకు కఠిన నిబంధనలను విధిస్తోంది. ముఖ్యంగా ఊబకాయులకు ప్రవేశాన్ని నిషేధించడంతోపాటు, వయో నిబంధనలను కూడ అమలుచేస్తోంది. రెస్టారెంట్ విధించిన నిబంధనల ప్రకారం వయసుతోపాటు బరువును కూడా పాటించగలిగే వారే అక్కడ నగ్నంగా భోజనం చేసే అవకాశం పొందుతారు. లండన్, మెల్బోర్న్ సంస్థలను అనుసరిస్తూ.. కేవలం 16 - 60 ఏళ్ల మధ్య వయస్కులనే అనుమతించడంతోపాటు... వచ్చిన వారి బట్టలను చెక్ చేసి, పేపర్లో ఉంచి వారికి ప్రత్యేకమైన అండర్ వేర్‌ను అందిస్తోంది. అందుకు సంబంధించిన నియమ నిబంధనల లిస్టును స్టేట్స్ రెస్టారెంట్స్ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. నగ్న రెస్టారెంట్ ను సందర్శించి అక్కడి భోజనాన్ని ఆస్వాదించాలనుకునేవారు వెబ్ సైట్ లోని నియమాల జాబితాను ఫాలో అవ్వక తప్పదని నిర్వాహకులు చెప్తున్నారు. భోజనానికి వచ్చిన వారిని అక్కడికక్కడే బరువును చూసి మరీ లోపలకు అనుమతిస్తారు. ఒకవేళ నిబంధనకు మించి బరువు ఎక్కువగా ఉంటే బయటకు పంపించేందుకు ఏమాత్రం వెనుకాడే పనిలేదని నిర్వాహకులు కచ్చితంగా చెబుతున్నారు. జూలై 29న ప్రారంభం కానున్న నేకెడ్ రెస్టారెంట్ కు సంబంధించిన ఆన్ లైన్ బుకింగ్ పేజిలోనే ముందుగా అన్ని రకాల చెల్లింపులు చేసి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని, మొత్తం డబ్బును అడ్వాన్స్ గా చెల్లించిన తర్వాత రెస్టారెంటుకు వచ్చిన తర్వాత బరువు ఎక్కువగా ఉన్నవారిని బయటకు పంపడమే కాక, డబ్బును తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పటికే ఉన్న అతిథులను నియమాల జాబితా గురించి అడగటం, వారిని విసిగించడం, సందర్శకులను ముట్టుకునేందుకు ప్రయత్నించడం చేస్తే... అలాంటివారి ప్రవేశాన్ని నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే వచ్చిన అతిథుల మొబైల్ ఫోన్లు, కెమెరాలను వారికి దూరంగా టేబుల్ టాప్ బాక్స్ లో భద్రపరుస్తారు. త్వరలో ప్రారంభానికి సిద్ధమౌతున్న నేకెడ్ రెస్టారెంటులో ప్రవేశ టికెట్ ఖరీదు దాదాపు రూ. 50 వేలు. దీన్ని ముందుగా వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలి. ఇలా రెస్టారెంట్ కు వచ్చిన అతిథులకు... జీ స్ట్రింగ్స్ ధరించిన కండల వీరులు భోజనాన్ని వడ్డిస్తారు. కావలసిన రుచులను ఆస్వాదిస్తూ... మేల్ మోడల్స్ చేసే కనువిందైన డ్యాన్స్ షోను తిలకించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తారు. అయితే నృత్య ప్రదర్శన చూడాలనుకున్నవారు భోజనం టికెట్ కాక, డ్యాన్స్ షో టికెట్ ను వారి వారి ఇష్టాన్ని బట్టి మెనూలో ఎంపిక చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. -
తిక్క బుద్ధి జైలుపాలు చేసింది
స్పెయిన్: పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో రుచి అంటుంటారు. ఇక్కడ జిహ్వ మాట పక్కకు పెడితే స్పెయిన్‌లో ఓ వ్యక్తి పుర్రెకు వచ్చిన వింత బుద్ధి అతడిని కటకటాలపాలు చేసింది. మూగజీవాల యోగ క్షేమాలు చూసుకునే అతడు పిచ్చి ఆలోచనతో వింత చేష్టలు చేయడంతో జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. 22 ఏళ్లకే భారీ ఆకారంతో ఉన్న ఓ యువకుడు.. తాను మంచిచెడులు చూసుకునే ఓ పందుల గుంపులోకి దూకి వాటిపై పడి ఇష్టమొచ్చినట్లు దొర్లడంతో దాదాపు 19 పందులు అక్కడికక్కడే చనిపోగా.. మరో 53పందులు తీవ్రగాయాలపాలయై అనంతరం చనిపోయాయి. ఈ తంతునంతా అతడి పక్కనే ఉన్న మరో యువకుడు(19) చూస్తూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడు. ఇది కాస్త ఆ పందుల పెంపకం యజమాని దగ్గరకు చేరి అతడు చూడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకాస్త వివరాల్లోకి వెళితే, స్పెయిన్ లో ఓ వ్యక్తి భారీ సంఖ్యలో పందులను పెంచుతున్నాడు. వాటి మంచిచెడూ, తిండితిప్పలు చూసేందుకు ఇద్దరు యువకులను పెట్టుకున్నాడు. అయితే, ఆ ఇద్దరిలో బాగా లావుగా ఉన్న వ్యక్తికి ఆ పందులను చూసి ఏమనిపించిందో.. తాను పందులపై పడి దొర్లుతానని, ఆ సమయంలో జరిగే మొత్తాన్ని వీడియో తీయాలని మరో యువకుడికి చెప్పి అమాంతం వాటిపై పడ్డాడు. అలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉండగా.. అతడు చేస్తున్న తిక్క పనులు చూస్తూ బిగ్గరగా నవ్వుతూ వీడియో తీసి వాట్సాప్ లో పెట్టాడు. అంతే, చివరకు ఇద్దరూ బుక్ అయ్యారు. -
ప్రాణాల మీదకు తెస్తున్న బరువు
వెయిట్ తగ్గడం, కొవ్వులు కరిగించుకోవడం కోసం క్యూ ♦ బేరియాట్రిక్, ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్న వారు ఎక్కువే ♦ సినిమా, రాజకీయ రంగాల వారే అధికం ♦ శస్త్రచికిత్సల ఖరీదు ఏటా వెయ్యికోట్ల పైనే! సాక్షి, హైదరాబాద్: మొన్న ఆర్టీఏ అధికారి రాజేంద్ర... నేడు నటి ఆర్తి అగర్వాల్.. ఇద్దరూ బరువు తగ్గించుకోవడానికి డాక్టర్లను ఆశ్రయించి మృతి చెందిన వారే! ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే కావచ్చు గానీ.. నయా ఫ్యాషన్ ట్రెండ్‌లో యువతీయువకులు తమ శరీర ఆకృతిని ఆకర్షణీయంగా మార్చుకునేందుకు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న 8 మంది హీరోలు లైపోసక్షన్ చేయించుకున్న వారే. గత నాలుగేళ్లలో రాజకీయ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సుమారు 60 మంది బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో నెలకు 150 బేరియాట్రిక్ సర్జరీలు జరుగుతుండగా, లైపోసక్షన్ సర్జరీలు 1,500 నుంచి 2 వేల వరకూ జరగుతున్నట్టు సమాచారం. ఇలా అధిక బరువును తగ్గించుకునేందుకు జరుగుతున్న శస్త్రచికిత్సల వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి పట్టణాల్లో బరువును తగ్గించుకునేందుకు బేరియాట్రిక్, లైపోసక్షన్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. అసలు ఈ రెండిటి మధ్య తేడా కూడా తెలియకుండానే శస్త్ర చికిత్సలకు సిద్ధపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ రెండు సర్జరీల మధ్య తేడా ఓసారి చూద్దాం. లైపోసక్షన్ ఇది పూర్తిగా కాస్మొటిక్ శస్త్రచికిత్స. శరీరంలో ఉన్న కొవ్వులను కరిగించి బయటకు తీయడం. మనిషి బరువును బట్టి కనిష్టంగా 5 లీటర్ల నుంచి గరిష్టంగా 14 లీటర్ల కొవ్వును బయటకు తీస్తారు. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం, శరీరాకృతి మార్చుకోవడం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది లైపోసక్షన్ కోసం వస్తున్నవారే. వీరిలో 80 శాతం మంది 35 నుంచి 45 ఏళ్ల లోపు వారే కావడం విశేషం. ఇవిగాకుండా ముక్కు(రినోప్లాస్టీ), లాసిక్(కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ (వక్షోజాలు పెంచుకోవడం) చేయించుకునే వారూ ఎక్కువే. బేరియాట్రిక్ సర్జరీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ అనేవి వీటిలో రకాలు. ఇందులో ప్రధానంగా జీర్ణాశయాన్ని శస్త్రచికిత్స ద్వారా చిన్నదిగా చేసి, చిన్న పేగు మధ్య భాగాన్ని కత్తిరించి ఈ సంచికి కలిపేస్తారు. ఈ శస్త్రచికిత్స ద్వారా జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని డియోడినల్లోకి కాకుండా నేరుగా పేగు మధ్యభాగంలోకి వెళుతుంది. అంటే మనం తినే ఆహారం పేగుల్లో ఇంకిపోవడం తగ్గిపోతుంది. దీనిద్వారా కొద్దిగా తినగానే కడుపు నిండుతుంది. ఇది పూర్తిగా హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపేలా చేస్తుంది. గుండె జబ్బులు, డయాబెటిక్ తదితర జబ్బులున్న వారు ఈ ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉండాలి. సర్జరీల ముందూ.. వెనుకా.. ♦ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలతోపాటు ప్రధాన వైద్య పరీక్షలన్నీ చేసి, అంతా బాగుందన్న తర్వాతే బేరియాట్రిక్ లేదా లైపోసక్షన్ చేయాలి ♦ ఆపరేషన్ పూర్తయ్యాక 2 వారాల పాటు తరచూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి ♦ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి ♦ తినడానికి అరగంట ముందు, తిన్నాక అరగంట తర్వాత వరకూ నీళ్లు తీసుకోకూడదు ♦ బేరియాట్రిక్ చేయించుకున్న వారు పూర్తిగా ఆహారాన్ని నమిలి మింగాలి ♦ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు, గుండెజబ్బులు లేదా మధుమేహం ఉన్నవారికి బేరియాట్రిక్ లేదా లైపోసక్షన్ చెయ్యడం మంచిది కాదు ♦ లైపోసక్షన్ చేయించుకున్న వారు కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తగ్గించాలి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం చెయ్యాలి. వీటి ద్వారా తగ్గొచ్చు.. ఆహార నియమాలు విధిగా పాటించడం. తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవడం. రోజూ కనీసం 45 నిముషాల నడక లేదా ఈత. యోగా, ఏరోబిక్స్ చేయడం. - డా.ఫణిమహేశ్వరరెడ్డి, ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల, విజయవాడ దుష్పరిణామాలు ఎన్నో... లైపోసక్షన్ ♦ లైపోసక్షన్ వల్ల చాలావరకూ తాత్కాలికంగా స్వల్ప సమస్యలు మాత్రమే తలెత్తుతాయి. ♦ అరుదుగా వివిధ కారణాల వల్ల తీవ్రమైన దుష్పరిణామాలు, చాలా అరుదుగా మరణం కలుగుతాయి. ♦ ఒకేసారి వేర్వేరు చోట్ల కొవ్వును తొలగించినా, ఎక్కువ మొత్తంలో తొలగించినా ప్రమాదం. ♦ లైపోసక్షన్‌తో పాటు ఇతర శస్త్రచికిత్సలు చేసినా ప్రమాదం ఎక్కువ. ♦ రక్తం, ద్రవాలు ఎక్కువగా తొలగిపోతే షాక్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ♦ చర్మం కింద ద్రవాలు లేదా రక్తం లీక్ కావడంతో పాటు ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగొచ్చు. ♦ పొరపాటుగా ప్లీహం, కాలేయం వంటి కీలక అవయవాలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంటుంది. ♦ ఇంజెక్ట్ చేసిన ద్రావణం విషపూరితంగా మారి కూడా ముప్పు కలగవచ్చు. ♦ ఊపిరితిత్తుల్లో కొవ్వు లేదా రక్తం గడ్డలు ప్రాణాంతకం కావొచ్చు. బేరియాట్రిక్ ♦ ఈ శస్త్రచికిత్సలు చేసుకునే ప్రతి 20 మందిలో ఒకరు ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. ♦ పౌష్టికాహార లోపం, పేగుల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. ♦ ప్రతి 100 మందిలో ఒకరికి కాళ్లలో లేదా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు కట్టవచ్చు. ♦ గుండె వద్ద మంట, వాంతులు, వికారం కలుగుతాయి. ♦ శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగొచ్చు. ♦ శస్త్రచికిత్స తర్వాత పది నెలలకు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవచ్చు. ♦ అరుదుగా గుండెపోటు వచ్చి మరణమూ సంభవించవచ్చు. -
లావొక్కింతయూ తగ్గాల్సిందే..
-
ఒత్తిడితో చిత్తు..
టెన్షన్లో గ్రేటర్ యువత 40 శాతం మందిలో హైబీపీ నేడు ప్రపంచ హైపర్ టెన్షన్ డే సిటీబ్యూరో: ఉరుకుల పరుగుల జీవితం..మారిన ఆహారపు అలవాట్లు.. అధిక బరువు..పని ఒత్తిడి.. కాలుష్యం..వెరసి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్రేటర్లో 40 శాతం మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల వెల్లడించింది. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో కన్పించే హైపర్ టెన్షన్ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోకపోతే గుండె, మూత్రపిండాలు, మెదడు వ ంటి కీలక అవయవాల పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నేడు(ఆదివారం)వరల్డ్ హైపర్‌టెన్షన్ డే! మారిన జీవన శైలితోనే.. ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదుపనీయడం లేదు. కూర్చున్న చోట నుంచి అన్ని పనులు చకచక పూర్తి చేసే అవకాశం వచ్చింది. సెల్‌ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, పిజ్జాలు, బర్గలు, మద్యం కూడా అధిక బరువుకు కారణం అవుతున్నాయి. గ్రేటర్లో రోజు రోజుకు పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మధ్య వయస్కులతో పోలిస్తే...యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. ఒత్తిడికి గురయ్యే వారు రెండు రకాలు. టైప్ ‘ఏ’ కోపంగా ఉండేవారు. టైప్ ‘బి’ తమలోని భావాలను చెప్పకుండా తక్కువ మాట్లాడే వారు. వీరిలో టైప్ ‘ఏ’ వారికే ఎక్కువ రిస్క్ ఉంటుంది. అధిక రక్తపోటుతో హృద్రోగ సమస్యలు.. 95 శాతం హైపర్ టెన్షన్‌కు మారిన జీవనశైలే కారణం. కేవలం ఐదు శాత ం మందిలో జన్యుపరంగా సంక్రమిస్తుంది. తరచు తల నొప్పి , కళ్లు బైర్లు కమ్మడం..ఛాతీ గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. చీటికిమాటికి చికాకు, పట్టలేని కోపం ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్ చేయించుకోవాలి.ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు తీసుకోవాలి. - డాక్టర్ సి.వెంకట ఎస్. రామ్, అపోలో ఆస్పత్రి ఇలా అధిగమించవచ్చు.. ఒత్తిడికి లోనైనప్పుడు నిశబ్దంగా ఉన్న గదిలో కూర్చుని కళ్లుమూసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదులుతుండాలి. పగటి కలలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపే వారిలో మానసిక ఒత్తిడి చాలా తక్కువ. 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఆటలకు కొంత సమయం కేటాయించాలి. - డాక్టర్ ప్రవీణ్ కొప్పుల, జనరల్ ఫిజిషియన్, గ్లోబల్ ఆస్పత్రి -
బ్యాన్ ఆన్ జంక్
జంక్‌ఫుడ్ తయారీదార్లను జంకేలా చేస్తేనే బెటర్ ఇప్పుడు దేశవిదేశాలలో పొంచి ఉన్న భయం స్థూలకాయం. స్థూలకాయ సమస్య 65 రకాల వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహం, రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు చేరడం, గుండెపోటు, పక్షవాతం, కీళ్లనొప్పులు, స్లీప్ ఆప్నియా, డిప్రెషన్, పిత్తాశయంలో రాళ్లు, హెర్నియా వంటి ఎన్నో సమస్యలకు కారణమవుతున్న స్థూలకాయాని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు నడుం కట్టాయి. ఉదాహరణకు... బ్రిటన్ : ఈ దేశంలో 26 శాతం జనాభా స్థూలకాయులవుతున్నందున స్కూళ్లలో జంక్‌ఫుడ్ తినడంపై 2005 నుంచి నిషేధం విధించారు. అంతేకాదు 2008 నుంచి జంక్‌ఫుడ్ యాడ్స్‌ను సైతం నిషేధించారు. అమెరికా : అమెరికాలోని స్కూళ్లలో జంక్‌ఫుడ్ తినడంపై నిషేధాన్ని గత ఏడాది జులై నుంచి విధించారు. కొవ్వుపాళ్లు 35% మించిన ఆహారాలను నిషేధించారు. మనదేశంలోని పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇలాంటి చర్యలే తీసుకుంటే రేపటి మన యువత ఆరో గ్యకరంగా ఉంటుందని వైద్య నిపుణుల అభిప్రాయం. -
పెరిగే బరువు... తగ్గే ఆయువు!
హిట్ బై ఫ్యాట్ ఒక వ్యక్తి ఉండాల్సినదాని కంటే అధికంగా బరువు పెరుగుతుంటే అది మృత్యుమార్గంలో ప్రయాణించడమేనని యూఎస్‌కు చెందిన ‘ప్లాస్’ మెడికల్ జర్నల్ పేర్కొంటోంది. దాదాపు ఇరవై వేర్వేరు అధ్యయనాల్లో 9,564 మంది స్థూలకాయం ఉన్నవారితో పాటు 3,04,011 మంది సాధారణ బరువున్న వారిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇది తేలింది. మామూలు బరువున్నవారితో పోలిస్తే స్థూలకాయులలో మరణాల రేటు 2.5 రెట్లు అధికమని ఆ జర్నల్‌లో పేర్కొన్నారు. ఒకవేళ నేరుగా బరువే మరణాలకు కారణం కాకపోయినా, లావెక్కుతున్న కొద్దీ వచ్చే గుండెజబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, డయాబెటిస్, కిడ్నీ జబ్బులు, కాలేయ సమస్యలు మృత్యువుకు దారితీయవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అందుకే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలనుకుంటే బరువు తప్పక తగ్గదని వారు హెచ్చరిస్తున్నారు. -
ఆపరేషన్ లేకుండానే ఆమె జీవితంలో చిరునవ్వులు
ఆమె పేరు స్నేహ. వయస్సు 23 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం, అయిదంకెల జీతం. అంతా హ్యాపీ, కానీ అదంతా కొన్ని రోజుల క్రితం వరకు, ఇప్పుడామె ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంట్లోనే ఉంటోంది. ఉద్యోగం దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అంత మంచి ఉద్యోగాన్ని ఎలా వదులుకుందని స్నేహితులు, బంధువులు ప్రశ్నలు అడగటం మొదలు పెట్టారు. అయితే ఏవో కారణాలు చెప్పుకుంటూ వచ్చింది. అసలు కారణం ‘స్థూలకాయం’. అధిక బరువు వల్ల ఆమె శరీరాకృతి మొత్తం దెబ్బతింది. ఆమెకే ఎబ్బెట్టుగా అనిపించేది. ఓ రోజు కొలీగ్స తన శరీరాకృతి గురించి మాట్లాడుకోవటం ఆమె చెవిన పడింది. అప్పట్నుంచి ఆమెలో ఆత్మన్యూనతా భావం మొదలైంది. నలుగురిలో మాట్లాడటం తగ్గిపోయింది. అమ్మానాన్నల సలహాతో వాకింగ్ మొదలెట్టింది. తిండి బాగా తగ్గించేసింది. దీంతో నీరసం. బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు ప్రారంభమయ్యాయి. అధిక బరువు ఉండి వాకింగ్ చేయడం మూలంగా కీళ్ల నొప్పులు. క్రమంగా స్నేహలో డిప్రెషన్. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబం ధాలు చూస్తున్నా.. ఎవరికీ అమ్మాయి నచ్చడం లేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండగా.. ఇంటర్లో తనతో కలసి చదువుకున్న పావని తారసపడింది. ఇద్దరు పిచ్చాపాటీ మాట్లాడుకున్న తరువాత తన బాధనంతా చెప్పుకొచ్చింది స్నేహ. దానికి పావని అదేం బాధపడాల్సి నంత పెద్ద విషయం కాదని, ఆపరేషన్ లేకుండానే అధిక బరువును తగ్గించుకునే చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ‘హెల్దీ కర్వ్స’ క్లినిక్‌లో తను కూడా ఆ విధానాల ద్వారా బరువు తగ్గానని చెప్పింది. స్నేహను ‘హెల్దీ కర్వ్స’ క్లినిక్‌కు తీసుకొచ్చింది. మేం ముందుగా ఆమె గతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం... నేపథ్యం ఏమిటి? ఆమె పుట్టుక నుంచి లావుగా ఉందా.. ఈ మధ్య కాలంలో లావయిందా అనే ప్రశ్నలను అడిగాం. ఇక్కడ మాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. స్నేహ ఇంటర్ చదివే రోజుల్లో స్లిమ్‌గా ఉండేది. ఇంటర్ తరువాత ఇంజనీరింగ్‌లో చేరింది. నాలుగేళ్లు హాస్టల్లో ఉండి చదువుకుంది. వ్యాయామం లేకపోవటం, క్లాసు రూముల్లో కంప్యూటర్ ముందు కూర్చుని చదువుకోవటం.. లేదంటే పడుకోవటం... నాలుగేళ్లు ఇలానే గడిచాయి. దీంతో బరువు పెరిగింది. చదువు పూర్తికావడంతోనే ఉద్యోగంలో చేరింది. అక్కడా అంతే... కంప్యూటర్ ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుని పని చేసేది. ఆఫీసుకు క్యాబ్‌లోనే వెళ్లి వచ్చేది. ఎక్కడా నాలుగు అడుగులు వేసే పని ఉండేది కాదు. దానికి తోడు పిజ్జాలు, బర్గర్లు, వీకెండ్లో పార్టీలు... అన్నీ కలిపి స్థూలకాయాన్ని తెచ్చిపెట్టాయి. అనర్థాలు వివరించాం... అధిక బరువు వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు, స్త్రీలలో సంతానలేమి, పీసీఓడీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్పాం. ముందుగా కౌన్సిలింగ్ చికిత్సకు ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల పేషంట్‌కు నమ్మకం కలుగుతుంది. అందుకే స్నేహకు కౌన్సిలింగ్ ఇచ్చాం. బరువు తగ్గడానికి ఉన్న మార్గాలను వివరించాం. స్నేహ కూడా బరువు తగ్గటానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయింది. కాబట్టి ఆమెకు ‘క్రయోలిపోలైసిస్’ చికిత్స ఒక్కటే మార్గమని చెప్పాం. చికిత్స ఎలా ఉంటుంది? మొదటగా డాక్టర్... స్నేహ శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాలను గుర్తించి, ఆ భాగాలను ‘క్రయోలిపోలైసిస్’ చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోవటం జరిగింది. ఈ పద్ధతిని వైద్య పరిజ్ఞానంలో అపోప్టసిస్ అంటారు. దీని తరువాత ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం మొదలు పెట్టింది. దానివల్ల చనిపోయిన కొవ్వు కణాలు శరీరం నుండి చెమట, మూత్రం, వ్యర్థాల రూపంలో బయటకు వెళ్లిపోయాయి. ఈ చికిత్సలో నొప్పి, గాయాలు, రక్తస్రావం, కుట్లు వంటివి ఉండవు. బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. చికిత్స జరిగే సమయంలో స్నేహ ఎంచక్కా ల్యాప్‌టాప్‌పై పనిచేసుకుంది. చికిత్స తరువాత... చికిత్స జరిగిన మూడు వారాల తరువాత మంచి ఫలితాన్ని చూసింది. నడుం, తొడలు, పిరుదుల భాగంలో ఉన్న కొవ్వు బాగా తగ్గిపోయింది. శరీరాకృతిలో తేడాను ఆమె స్పష్టంగా గుర్తించింది. ఇంటర్ చదివే రోజుల్లో నాజూగ్గా ఎలా ఉండేదో అలా తయారయింది. ఇప్పుడు ఆమె ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మళ్లీ ఉద్యోగంలో చేరిపోయింది. పెళ్లి కూడా చేసుకొని సెటిలయింది. ఎందరికో స్ఫూర్తినిస్తున్న ఆమె జీవితం, చికిత్సా వివరాలను కేస్ స్టడీ రూపంలో అందించాం. కొసమెరుపు ఏమిటంటే ఈ చికిత్సా విధానం కేవలం ఒకటి లేదా రెండు సార్లు చేయించుకుంటే సరిపోతుంది. -
ఆహార నియమాలకు 5 సూత్రాలు
సమతుల ఆహారాన్ని వేళ ప్రకారం తీసుకుంటూ, శారీరక వ్యాయామానికి సరైన ప్రాధాన్యమిస్తూ ఉంటే అధికబరువు సమస్యే దరిచేరదు. అయితే, చాలామందికి ఆహారం తీసుకోవడంలో సరైన ప్రణాళిక ఉండదు. దాంతో అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నది పోషకాహార నిపుణుల అభిప్రాయం. ఆహార ప్రణాళికకు నిపుణులు అందిస్తున్న 5 సూత్రాలు.. 1. ఆహార ప్రణాళిక.. ‘డైట్ ప్లాన్’ సరిగ్గా ఉండాలి కదా అని ఒకే తరహా ఆహారంతో సరిపెట్టేయకూడదు. దీని వల్ల ఆ ప్రణాళిక సవ్యంగా నడవదు. కొన్ని రకాల పదార్థాలు మరికొన్నింటితో కలిపితే రుచిగానే కాదు, ఆరోగ్యానికీ మేలు కలుగుతుంది. అయితే, ఏ పదార్థాలు కలిపితే శరీరానికి మంచిది అనేవి తెలిసుండటం ముఖ్యం. ఉదాహరణకి- చేపలు ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు. అయితే, చేపలను కూరల రూపకంగానే కాకుండా ఆవిరి మీద ఉడికించి, గ్రిల్ చేసి, ఇతర కూరగాయల సలాడ్స్‌తో తీసుకోవచ్చు. 2. ఎంపిక ప్రధానం.. లక్ష్యం వైపుగానే ఆహారపు అలవాట్లు ఉండాలి. మనకు నచ్చనిదైనా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని కూడా మెల్ల మెల్లగా మొదలుపెట్టి శరీరానికి అలవాటు చేయవచ్చు. దీని వల్ల లక్ష్యానికి త్వరగా చేరువకావచ్చు. 3. భాగస్వామిని ఎంచుకోండి... కుటుంబంలోనో, స్నేహితుల్లోనో, సహోద్యోగుల్లోనూ.. మీలాగే ఆహారనియమాలు పాటించే వ్యక్తిని ఈ నియమాల్లో భాగస్వామిగా ఎంచుకోండి. దీని వల్ల ఆహార నియమాలను పాటించడంలో ప్రోత్సాహం ఉంటుంది. వాయిదా వే సే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాయిదా వేసినా తిరిగి కొనసాగించే ధోరణి ఈ పద్ధతిలో ఎక్కువ. 4. సులువుగా కితాబు ఇచ్చేసుకోకండి... మీకు మీరుగా ‘నేను చాలా బాగా ఆహార నియమాలు పాటించగలను’అనే కితాబు ముందే ఇచ్చుకోకండి. ఎప్పుడైనా నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల మీ ప్రణాళిక కూడా పూర్తిగా మూలన పడే అవకాశమూ ఉంది. అందుకే, ప్రతి రోజూ ‘ఈరోజును కొత్తగా, ఇంకా మరింత ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో ప్రారంభిస్తాను’ అనుకోండి. 5. ఒత్తిడిని అదుపులో ఉంచండి.. భావోద్వేగాల ప్రభావం ఆరోగ్యం మీద చూపుతుంది. ఇలాంటి సమయాల్లో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, లేదా అసలు తీసుకోకపోవడం జరుగుతుంటుంది. మానసిక ఒత్తిడి అదుపులో లేకపోతే ఆహారం మీద అదుపు ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం మరింత మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. ఇదొక విషవలయంగా మనిషిని వేధిస్తూనే ఉంటుంది. అందుకని మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకొని, నియమాల అమలు సక్రమంగా జరిగేలా చూడాలి.