పుట్టబోయే ఆ చిన్నారి ఒకింత బొద్దుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాస్తంత బొద్దుగా ఉంటే పర్వాలేదు గానీ మరీ ఎక్కువ బరువుండటం తల్లీ, బిడ్డా ఇద్దరికీ చేటు చేసే అంశం. అదెలాగంటే...
మహిళలు గర్భం దాల్చినప్పుడు వారిలో కొంతమందికి తాత్కాలికంగా చక్కెరవ్యాధి వస్తుంది. ఇలా కేవలం వారు గర్భవతులుగా ఉన్నప్పుడు వచ్చే చక్కెరవ్యాధిని ‘జెస్టెషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ కండిషన్ ఉన్న మహిళలకు పుట్టే చిన్నారులు కాస్తంత ఎక్కువ బరువుతో పుట్టవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో కాస్తంత ఎక్కువ బరువుగా పిల్లలు పుడితే అది బిడ్డలకు ముప్పుగానూ పరిణమించవచ్చు.
జెస్టెషనల్ డయాబెటిస్ ఉన్నవారికి పుట్టే పిల్లలు కాస్తంత ఎరుపు రంగులో ఉండటంతో వారిని ‘టొమాటో బేబీస్’ అంటారు. దీనికి కారణం... పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారికి ఆహారం అందించే క్రమంలోనూ, ఇతరత్రా రక్తప్రవాహం తోపాటు తల్లిలోని చక్కెర చిన్నారుల శరీరాల్లోకీ ప్రవేశిస్తుంది.
ఈ పరిస్థితిని నియంత్రించడానికి చిన్నారిలోనూ ఇన్సులిన్ ఎక్కువగా స్రవిస్తుంది. దీని మరో పరిణామం ఏమిటంటే... గర్భంలోని బిడ్డ... తన తల్లి నుంచి చాలా ఎక్కువ మోతాదులో పోషకాలను స్వీకరిస్తుంది. అందుకే గర్భసంచిలో ఉన్న బిడ్డ సాధారణం కంటే చాలా ఎక్కువ బరువు పెరుగుతుంది. వీళ్లలో హిమోగ్లోబిన్ మోతాదు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇలా పిల్లలు మరీ ఎక్కువ బొద్దుగా, బరువు ఎక్కువగా ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘మాక్రోసోమియా’ అంటారు. సరిగ్గా ఈ అంశమే... ఇటు పుట్టబోయే బిడ్డకూ, అటు జన్మనిస్తున్న తల్లికీ... ఇద్దరికీ ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువ.
అందుకే ఇలాంటి సందర్భాల్లో ... ప్రసవం చేసే డాక్టర్ అయిన అబ్‌స్ట్రెట్రీషియన్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా బిడ్డ ఏ మేరకు బొద్దుగా ఉన్నారనే అంశాన్ని అంచనా వేస్తారు. ఒక్కోసారి సాధారణ ప్రసవం అవుతుందని అనుకున్నా, తల మాత్రమే బయటకు వచ్చి (శీర్షోదయమై) భుజాలు ప్రసవమార్గంలో ఇరుక్కుపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘షోల్డర్ డిస్టోసియా’ అంటారు. అదొక మెడికల్ ఎమర్జెన్సీ సమస్య.
ఇలాంటి అన్ని అంశాలూ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బిడ్డ మరీ బొద్దుగా ఉంటే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. పైగా బొద్దుగా ఉండటం అన్న అంశం ఆరోగ్యానికి ఏమాత్రం సూచిక కాదు. అది ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీకి దారితీయవచ్చు. దీనికి బదులుగా బిడ్డ సన్నగా ఉన్నా... ఆరోగ్యంగా ఉండటమనేది అందరూ కోరుకునే అంశం. అందుకే చిన్నారి బొద్దుగా పుట్టడం / ఉండటం కంటే ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవడం మంచిది.
(చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్‌నెస్ మంత్ర..!)
Comments
Please login to add a commentAdd a comment