fetus
-
గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..
పుట్టబోయే ఆ చిన్నారి ఒకింత బొద్దుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కాస్తంత బొద్దుగా ఉంటే పర్వాలేదు గానీ మరీ ఎక్కువ బరువుండటం తల్లీ, బిడ్డా ఇద్దరికీ చేటు చేసే అంశం. అదెలాగంటే... మహిళలు గర్భం దాల్చినప్పుడు వారిలో కొంతమందికి తాత్కాలికంగా చక్కెరవ్యాధి వస్తుంది. ఇలా కేవలం వారు గర్భవతులుగా ఉన్నప్పుడు వచ్చే చక్కెరవ్యాధిని ‘జెస్టెషనల్ డయాబెటిస్’ అంటారు. ఈ కండిషన్ ఉన్న మహిళలకు పుట్టే చిన్నారులు కాస్తంత ఎక్కువ బరువుతో పుట్టవచ్చు. అయితే ఇలాంటి సమయాల్లో కాస్తంత ఎక్కువ బరువుగా పిల్లలు పుడితే అది బిడ్డలకు ముప్పుగానూ పరిణమించవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్ ఉన్నవారికి పుట్టే పిల్లలు కాస్తంత ఎరుపు రంగులో ఉండటంతో వారిని ‘టొమాటో బేబీస్’ అంటారు. దీనికి కారణం... పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వారికి ఆహారం అందించే క్రమంలోనూ, ఇతరత్రా రక్తప్రవాహం తోపాటు తల్లిలోని చక్కెర చిన్నారుల శరీరాల్లోకీ ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి చిన్నారిలోనూ ఇన్సులిన్ ఎక్కువగా స్రవిస్తుంది. దీని మరో పరిణామం ఏమిటంటే... గర్భంలోని బిడ్డ... తన తల్లి నుంచి చాలా ఎక్కువ మోతాదులో పోషకాలను స్వీకరిస్తుంది. అందుకే గర్భసంచిలో ఉన్న బిడ్డ సాధారణం కంటే చాలా ఎక్కువ బరువు పెరుగుతుంది. వీళ్లలో హిమోగ్లోబిన్ మోతాదు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా పిల్లలు మరీ ఎక్కువ బొద్దుగా, బరువు ఎక్కువగా ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘మాక్రోసోమియా’ అంటారు. సరిగ్గా ఈ అంశమే... ఇటు పుట్టబోయే బిడ్డకూ, అటు జన్మనిస్తున్న తల్లికీ... ఇద్దరికీ ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువ. అందుకే ఇలాంటి సందర్భాల్లో ... ప్రసవం చేసే డాక్టర్ అయిన అబ్స్ట్రెట్రీషియన్లు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా బిడ్డ ఏ మేరకు బొద్దుగా ఉన్నారనే అంశాన్ని అంచనా వేస్తారు. ఒక్కోసారి సాధారణ ప్రసవం అవుతుందని అనుకున్నా, తల మాత్రమే బయటకు వచ్చి (శీర్షోదయమై) భుజాలు ప్రసవమార్గంలో ఇరుక్కుపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘షోల్డర్ డిస్టోసియా’ అంటారు. అదొక మెడికల్ ఎమర్జెన్సీ సమస్య. ఇలాంటి అన్ని అంశాలూ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బిడ్డ మరీ బొద్దుగా ఉంటే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. పైగా బొద్దుగా ఉండటం అన్న అంశం ఆరోగ్యానికి ఏమాత్రం సూచిక కాదు. అది ఛైల్డ్‌హుడ్ ఒబేసిటీకి దారితీయవచ్చు. దీనికి బదులుగా బిడ్డ సన్నగా ఉన్నా... ఆరోగ్యంగా ఉండటమనేది అందరూ కోరుకునే అంశం. అందుకే చిన్నారి బొద్దుగా పుట్టడం / ఉండటం కంటే ఆరోగ్యంగా పుట్టాలని కోరుకోవడం మంచిది. (చదవండి: 'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!) -
నవజాత శిశువు కడుపులో కవల పిండం...షాక్‌లో తల్లి
కవల పిండంతో ఒక నవజాత శిశువు జన్మించింది. ఈ ఘటన ఇజ్రాయెల్‌లో అష్టోడ్లోని అసుతా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తల్లి గర్భంలో ఉండగానే నిర్వహించిన అల్ట్రాసౌండ్ పరీక్షల్తో శిశువు ఏదో సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆ శిశువు జన్మించాక నిర్వహించిన పరీక్షల్లో కడుపులో ట్విన్పిండం ఉన్నట్లు గుర్తించి వైద్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వివరాల్లోకెళ్తే...నవజాత శిశువు కడుపులో కవల పిండం ఉంది. దీన్ని ఫీటస్ ఇన్ ఫీటూ(ఎఫ్ఐఎఫ్) అంటారు. గతేడాది బిడ్డ పుట్టిన తర్వాత వైద్యులు అల్ట్రాసౌండ్ ఎక్స్‌రేలతో సహా పలు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో శిశువు పొత్తికడుపులో పాక్షికంగా అభివృద్ధి చెందిన పిండాన్ని కనుగొన్నారు. వైద్యులు శిశువు కడుపులో కవల పిండం ఉన్నట్లు చెప్పగానే ఆ చిన్నారి తల్లి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. ఆ తర్వాత ఆ శిశువుకు విజయవంతంగా ఆపరేషన్ చేసి ఆ పిండాన్ని తొలగించారు. ఈ మేరకు మెడికల్ సెంటర్లోని నియోనాటాలజీ డైరెక్టర్ డాక్టర్ ఒమెర్ గ్లోబస్ మాట్లాడుతూ... ఆ శిశువు పొత్తి కడుపులో ఉన్నది పిండం అని తెలుసుకుని మేము ఆశ్యర్యపోయాం. కానీ పరీక్షల్లో అది పిండంలా కనిపించలేదు. ఐతే అది పొత్తి కడుపులో పాక్షికంగా అభివృద్ధి చెందుతుంది కానీ జీవించదని అక్కడే అలా ఉండిపోతుందని చెబుతున్నారు. సదరు తల్లి ఆలస్యంగా గర్భం దాల్చిందని కూడా చెప్పారు అందువల్ల కూడా పలు సమస్యలు తలెత్తుతాయని అన్నారు. కానీ ఇలాంటి అరుదైన పరిస్థితి ప్రతి అరమిలియన్ జననాలకు ఒకరికి మాత్రమే సంభవిస్తుంది. (చదవండి: వామ్మో! దగ్గితే పక్కటెముకలు విరిగిపోవడమా!) -
గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌పై టీఎస్ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: సమీప బంధువు లైంగిక దాడితో గర్భం దాల్చిన 16 ఏళ్ల బాలిక గర్భస్థ పిండాన్ని, 48 గంటల్లో తొలగించాలని కోఠి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. బాలిక జీవించే హక్కు దృష్ట్యా పిండాన్ని తొలగించాలని ఆదేశించే అధికారం తమకుందని తేల్చిచెప్పింది. సీనియర్ గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికల్ పద్ధతి లేదా శస్త్రచికిత్స ద్వారా ఈ పిండాన్ని తొలగించాలని స్పష్టం చేసింది. డీఎన్ఏ పరీక్ష చేసేందుకు వీలుగా పిండం కణజాలాన్ని, రక్త నమూనాలను భద్రపర్చాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. బాలికపై లైంగిక దాడికి సంబంధించి నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా పిండం కణజాలాన్ని, రక్త నమూనాలను డీఎన్ఏ, ఇతర పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని, ఈ కేసు తుది విచారణ కోసం డీఎన్ఏ, ఇతర పరీక్షల రిపోర్టులను భద్రపర్చాలని దర్యాప్తు అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ అధికారులు సహకరించి న్యాయబద్ధంగా అందాల్సిన పరిహారాన్ని ఇప్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఇటీవల తీర్పునిచ్చారు. ‘లైంగిక దాడితో బాలిక గర్భం దాల్చింది. బాలిక సమ్మతి లేకుండా వచ్చిన ఈ గర్భాన్ని కొనసాగించాలా, తొలగించుకోవాలా అన్న స్వేచ్ఛ సదరు బాలికకు ఉంది. 25 వారాల గర్భంతో ఉంది కాబట్టి గర్భాన్ని తొలగించలేమనడం సరికాదు. గర్భం తొలగించకపోతే భవిష్యత్తులో అనేక తీవ్రమైన మానసిక, శారీరక రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కుకు ఇది విఘాతం’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. చదవండి: Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి.. రూ.100కే వెయ్యి చైల్డ్ పోర్న్ వీడియోలతో.. కాగా హైదరాబాద్‌కు చెందిన బాలికపై సమీప బంధువు బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చూపించగా, 25 వారాల గర్భంతో ఉందని డాక్టర్లు నిర్ధారించారు. 24 వారాల గర్భం దాటితే గర్భస్థ పిండాన్ని తొలగించడానికి చట్టప్రకారం హైకోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. -
పసిపాప కడుపులో పిండం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏడాది పాప కడుపులో పిండం ఉన్న అరుదైన ఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో వెలుగు చూసింది. పులియంపట్టికి చెందిన రాజు, సుమతి దంపతులకు నిశా అనే ఏడాది పాప ఉంది. ఇటీవల పాప పొట్ట అసాధారణంగా పెరగడంతో తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. స్కాన్ తీసిన వైద్యులు కడుపులో పిండాన్ని గుర్తించారు. పాప ప్రాణానికి ముప్పు ఉండటంతో సోమవారం శస్త్రచికిత్స చేసిన వైద్యులు మూడు కేజీల పిండాన్ని తొలగించారు. పిండానికి అప్పటికే జుట్టు, కొన్ని ఎముకలు ఏర్పడ్డాయని డాక్టర్ విజయగిరి తెలిపారు. పాప తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో తల్లి గర్భంలో రెండు పిండాలు ఏర్పడి ఉంటాయని, వాటిల్లో ఒకటి ఈ పాపకాగా, మరో పిండం ఈ పాప కడుపులోకి చేరిందన్నారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటోంది. -
గర్భంలోనే పసిగట్టొచ్చు..
వాషింగ్టన్: గర్భస్థ శిశువులోని జన్యువుల పరిస్థితి, బ్లడ్ గ్రూప్, లింగత్వం, డీఎన్ఏ వంటివి నిర్ధారించేందుకు కచ్చితమైన, తక్కువ ముప్పు ఉండే రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్‌లోని ‘ప్లైమౌత్ యూనివర్సిటీ’కి చెందిన నీల్ అవెంట్ సారథ్యంలో ఈ పద్ధతిని కనుగొన్నారు. ప్రస్తుతం చేస్తున్న పరీక్ష (ఆమ్నియోసెంటెసిస్) ద్వారా గర్భ స్రావం అయ్యే అవకాశం (ఒక్క శాతం)ఉండటంతో ఎంతో మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చు, తక్కువ హానికరమైన పరీక్ష ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష ద్వారా తల్లి నుంచి సంక్రమించే జన్యు సంబంధ వ్యాధులను బిడ్డ పుట్టక ముందే గుర్తించవచ్చు. ఈ పరీక్ష కోసం రక్తాన్ని గర్భం దాల్చిన మొదట్లోనే తల్లి నుంచి సేకరిస్తారు. అంతే కాకుండా తల్లి నుంచి సేకరించిన రక్తం ద్వారా దాదాపు 10 ఏళ్ల వరకు పుట్టబోయే బిడ్డ బ్లడ్ గ్రూప్, జన్యువుల పై అధ్యయనం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా బిడ్డ డీఎన్ఏను కచ్చితంగా నిర్ధారించవచ్చు. -
60 ఏళ్లుగా కడుపులో పిండం!
వాషింగ్టన్: 91 ఏళ్ల వృద్ధురాలు 60 ఏళ్లుగా కడుపులో పిండాన్ని మోస్తోంది! చిలీకి చెందిన ఎస్తెలా అనే మహిళ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. కడుపులో కణతి ఉందేమోనన్న అనుమానంతో వైద్యులు కొన్ని రోజులు చికిత్స చేశారు. అయితే ఫలితం లేకపోవటంతో ఎక్స్‌రే, ఇతర పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్భాశయంలో పిండం ఉండటం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. అరవై ఏళ్లుగా ఆమె ఆ పిండాన్ని మోస్తోందని వైద్యులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్తెలా తన కడుపులోకి పిండం ఎలా వచ్చిందో తెలియదని పేర్కొంది. తను, తన భర్త పిల్లల కోసం ఎంతో ఎదురుచూసినా పిల్లలు కలగలేదని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె వయసు దృష్టా శస్త్రచికిత్స చేసి పిండాన్ని తొలగించటం ప్రమాదకరమని, ఇన్నాళ్లు ఉన్నట్లే ఉంచటం నయమని వైద్యులు వెల్లడించారు.