వాషింగ్టన్: గర్భస్థ శిశువులోని జన్యువుల పరిస్థితి, బ్లడ్ గ్రూప్, లింగత్వం, డీఎన్‌ఏ వంటివి నిర్ధారించేందుకు కచ్చితమైన, తక్కువ ముప్పు ఉండే రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్‌లోని ‘ప్లైమౌత్ యూనివర్సిటీ’కి చెందిన నీల్ అవెంట్ సారథ్యంలో ఈ పద్ధతిని కనుగొన్నారు. ప్రస్తుతం చేస్తున్న పరీక్ష (ఆమ్నియోసెంటెసిస్) ద్వారా గర్భ స్రావం అయ్యే అవకాశం (ఒక్క శాతం)ఉండటంతో ఎంతో మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
దీంతో తక్కువ ఖర్చు, తక్కువ హానికరమైన పరీక్ష ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష ద్వారా తల్లి నుంచి సంక్రమించే జన్యు సంబంధ వ్యాధులను బిడ్డ పుట్టక ముందే గుర్తించవచ్చు. ఈ పరీక్ష కోసం రక్తాన్ని గర్భం దాల్చిన మొదట్లోనే తల్లి నుంచి సేకరిస్తారు. అంతే కాకుండా తల్లి నుంచి సేకరించిన రక్తం ద్వారా దాదాపు 10 ఏళ్ల వరకు పుట్టబోయే బిడ్డ బ్లడ్ గ్రూప్, జన్యువుల పై అధ్యయనం చేయవచ్చు. ఈ పద్ధతి ద్వారా బిడ్డ డీఎన్‌ఏను కచ్చితంగా నిర్ధారించవచ్చు.