విద్యార్థుల్లో ఒబేసిటీకి టీచర్లే బాధ్యులు | Teachers in beijing are being held responsible for overweight Pupils | Sakshi
Sakshi News home page

అందుకు టీచర్లే బాధ్యులు..

Published Wed, Jul 6 2016 7:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

Teachers in beijing are being held responsible for overweight Pupils

బీజింగ్: అమెరికా తర్వాత పిల్లల్లో స్థూలకాయ సమస్యను ఎక్కువ ఎదుర్కొంటున్న దేశం చైనా. అందులోను ముఖ్యంగా బీజింగ్ నగరంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని అరికట్టడం కోసం ‘బీజింగ్ సెంటర్ ఫర్ డిసీస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (బీసీడీపీసీ)’ ఓ సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించింది. పిల్లల్లో స్థూలకాయ సమస్యను అరికట్టే బాధ్యతను నగరంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల టీచర్లకు అప్పగించింది. పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా పిల్లలకు క్రమంతప్పకుండా శారీరక వ్యాయామం చేయించాలని, ఆటలు ఆడించాలని ఆదేశించింది.

ఎప్పటికప్పుడు పాఠశాలల్లోని పిల్లల బరువును బేరీజు వేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటామని, పిల్లల బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పాఠశాలల్లో ఉన్నంతసేపు పిల్లలు అతిగా తినకుండా నియంత్రించడంతోపాటు అవసరమైన వ్యాయామాలు చేయిస్తామని, ఇంటికెళ్లాక ఎవరు వారిని నియంత్రిస్తారని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా పిల్లలో ఇంటికెళ్లాకే మాంసం లాంటి అధిక కొవ్వున్న పదార్థాలు తింటారని, ఐస్‌క్రీమ్‌లు, చాక్‌లెట్లు, కుకీలు, కేక్స్, చిప్స్ తింటారని, శీతల పానీయాలు సేవిస్తారని, అలాంటప్పుడు తాము వారి అలవాట్లకు ఎలా బాధ్యత వహిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా బాధ్యత తమదేనంటూ బీజింగ్ పరిధిలోని 16 జిల్లాల పాఠశాలలకు బీసీడీపీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీజింగ్ పాఠశాల పిల్లల్లో స్థూలకాయ సమస్య 15.6 శాతానికి పెరగడమే ఈ ఉత్తర్వులకు కారణం. అంతకుముందు ఏడాది కన్నా ఈ సమస్య 5.6 శాతం పెరిగింది.

చైనా ఆర్థిక వృద్ధిరేటు గణనీయంగా పెరుగుతుండడం, మొన్నటి వరకు ఒకే సంతానం నిబంధనను కచ్చితంగా అమలు చేయడం వల్ల పిల్లల్లో స్థూలకాయ సమస్య పెరిగిందని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆశ్చర్యంగా పేద వర్గాలకు చెందిన పిల్లల్లో కూడా ఈ సమస్య ఇప్పుడు ఎక్కువగానే ఉంది. చైనా బాలల్లో స్థూలకాయ సమస్య 23 శాతం ఉండగా, బాలికల్లో 14 శాతం ఉందని, అదే అమెరికాలోని బాలబాలికల్లో ఈ సమస్య 17 శాతం ఉందని వాషింఘ్టన్ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.

స్థూలకాయం సమస్య చైనాలో కేవలం పిల్లలకే పరిమితం కాలేదని, మొత్తం చైనాలో నాలుగున్నర కోట్ల మంది పెద్దవాళ్లు కూడా స్థూలకాయం సమస్యతో బాధ పడుతున్నారని, 30 కోట్ల మంది మోతాదుకు మించి బరువున్నారని యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. మరి వారి సమస్యను చైనా ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement