ఇటీవల అధిక బరువు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళల్లో బరువు పెరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. తెలంగాణలో బరువు ఎక్కువగా ఉన్న మహిళల సంఖ్య 28.6 శాతం నుంచి 30.1 శాతానికి, ఏపీలో 33.2 నుంచి 36.3 శాతానికి ఎగబాకిందని ఆ సర్వేలో పేర్కొంది. ఊబకాయం తెచ్చే అనర్థాలూ, బరువు తగ్గడానికి కొన్ని మార్గాలను తెలుసుకుందాం...
ఓ వ్యక్తి తాను ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు ఉండటాన్ని స్థూలకాయం / ఊబకాయం ఇంగ్లిష్‌లో ఒబేసిటీగా చెబుతారు. ఒబేసిటీ అన్నది కేవలం లావుగా కనిపించడమో కాదనీ, ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమన్నది డాక్టర్ల మాట. వారు ఎందుకలా చెబుతున్నారో చూద్దాం...
ఒబేసిటీకి ప్రధాన కారణాలు
⇒ జన్యుపరమైనవి : వంశపారంపర్యంగా తల్లిదండ్రుల్లో ఊబకాయం ఉన్నప్పుడు కుటుంబాల్లో అది పిల్లల్లోనూ కనిపిస్తుంటుంది. ఈ తరహా ఒబేసిటీని తగ్గించడం అంత తేలిగ్గా సాధ్యపడదు. ప్రయత్నపూర్వకంగా కొంత తగ్గి, చురుగ్గా తమరోజువారీ కార్యక్రమాలు తేలిగ్గా జరుపుకుంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్టే.
⇒ వయసు : యువకులుగా ఉన్నప్పుడు సన్నగా ఉన్నా మధ్యవయస్కులయ్యేనాటికి బరువు పెరగడం కొందరిలో కనిపిస్తుంది. ఈ పరిణామం స్త్రీపురుషులిద్దరిలోనూ ఉన్నా మహిళల్లో కాస్త ఎక్కువ. ప్రత్యేకంగా మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో ఇది ఇంకాస్త ఎక్కువ.
⇒ ఆహార అలవాట్లు : ఆధునిక జీవనశైలిలో భాగంగా కొవ్వులు (శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్‌ఫ్యాట్స్) ఎక్కువగా ఉండే ఆహారం, తీపి పదార్థాలు తీసుకోవడంతో పాటు పాశ్చాత్య జీవనశైలిని అనుసరిస్తూ పిజ్జా, బర్గర్, ఫాస్ట్‌ఫుడ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, వేళకు తినకపోవడం, రాత్రి డ్యూటీలు చేస్తూ వేళగాని వేళల్లో ఆహారం తీసుకొని, పగలు పడుకోవడం వంటి కారణాలతో బరువు పెరగడం.
⇒ శరీర కదలికలు తగ్గడం : ఇటీవలి కూర్చొని చేసే వృత్తులు పెరగడం వల్ల బరువు పెరగడం ఎక్కువైంది. ఈ ఆధునిక వృత్తుల్లో ఒంటి కదలికలకు ఏమాత్రం లేకపోవడంతో శరీరారికి తగిన శ్రమ లేక క్యాలరీలు దహనం కాకుండా కొవ్వుల రూపంలో అవి పేరుకుపోవడం.
⇒ కొన్ని జబ్బులు (మెడికల్ రీజన్స్) : హైపోథైరాయిడిజమ్, కుషింగ్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, అలాగే తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్)తో కూడా బరువు పెరగడం.
⇒ కొన్ని రకాల మందులతో : వైద్యకారణాలతో స్టెరాయిడ్స్‌తో కూడిన మందులు వాడటం, అలాగే డిప్రెషన్ ఉన్నవారు వాడే యాంటీడిప్రెసెంట్స్, మూర్చవ్యాధిగ్రస్తులు వాడే యాంటీ ఎపిలెప్టిక్ మందులతోనూ ఒళ్లు వచ్చే ప్రమాదం.
ఒబేసిటీ కేవలం కాస్మటిక్ సమస్య కాదు... అది అనారోగ్యాలకు కారణం?
డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసి గురకకు దారితీసే స్లీప్ ఆప్నియా, డిప్రెషన్, పిత్తాశయంలో రాళ్లు, హెర్నియా మొదలైన సమస్యలకు స్థూలకాయం ప్రధాన కారణం. సన్నగా ఉన్న మహిళలతో ΄ోల్చి చూస్తే లావుగా ఉన్న మహిళలలో ప్రసవం కష్టమవుతుంది. అబార్షన్లు అయ్యే అవకాశమూ ఎక్కువే. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. ఇలా దాదాపు 65 రకాల వ్యాధులకు ఒబెసిటీయే మూల కారణం. ఆరోగ్యకరమైన స్థూలకాయం లేనివారితో పోలిస్తే స్థూలకాయుల్లో ఆయుఃప్రమాణం 5 నుంచి 20 ఏళ్లు తగ్గే అవకాశం ఉంది.
స్థూలకాయం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా?
ఒక వ్యక్తి ఎత్తుకు తగినంత బరువు ఉండాలి. అతడు తన ఎత్తుకు తగిన బరువు ఉన్నాడా లేడా అనే విషయం తెలుసుకోడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్‌ఐ)ను ప్రమాణంగా తీసుకుంటారు. ఎవరైనా తమంతట తామే తెలుసుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా మొదట తమ బరువును కిలోగ్రాముల్లో తెలుసుకోవాలి. ఆ తర్వాత స్కేలు / టేప్ సాయంతో ఎత్తును మీటర్లలో కొలుచుకోవాలి. అటు తర్వాత తమ బరువును తమ ఎత్తు స్క్వేర్‌తో భాగించాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి 90 కిలోల బరువు ఉన్నాడనుకుందా. అతడి ఎత్తు 1.7 మీటర్లు అనుకుందాం. అప్పుడు అతడి బీఎమ్‌ఐ 90 / 1.7 ఇంటూ 1.7 = 31.14 అనే విలువ వస్తుంది. తమ ఈ విలువను బీఎమ్‌ఐ ఛార్ట్‌లో చూసుకుని తామ స్థూలకాయం (ఒబేసిటీ) ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. డాక్టర్లు కూడా దీన్నే అనుసరిస్తుంటారు.
బరువు పెరగకుండా నియంత్రించుకునే మార్గాలు...
∙అధిక బరువు (బీఎమ్‌ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్‌ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్) వంటి వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి ∙ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం సమతులాహారం తీసుకోవడం అంటే కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం కంటే తాజా ఆకుకూరలు, కాయగూరలతో కూడిన ఆహారాలు తీసుకోవడం. ఒకవేళ మాంసాహారం తినాలనుకుంటే వేటమాంసం (రెడ్ మీట్) కంటే చేపలు, చికెన్ వంటి కొవ్వులు తక్కువగా ఉండే వైట్ మీట్ తినాలి ∙క్రమం తప్పకుండా ఒకే వేళకు తినడంతో పాటు తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తీసుకోవాలి ∙రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఒకవేళ మెలకువతో ఉన్నా ఏమీ తినకూడదు ∙చిరుతిండ్లూ, కూల్‌డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
పైన వచ్చిన విలువ ప్రకారం 90 కిలోల బరువున్న ఆ వ్యక్తి 31.14 విలువతో అధిక స్థూలకాయం కేటగిరీలో ఉన్నాడు. అలా బరువు పెరుగుతున్న కొద్దీ స్థూలకాయం ప్రమాణికతల ప్రకారం అతడు వ్యాధిగ్రస్థ స్థూలకాయంలో ఉన్నాడా లేక సూపర్ స్థూలకాయంలో ఉన్నాడా అన్నది తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment