
మాదాపూర్: మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివైబ్ సీఈవో రఘవీణసజ్జ తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం రన్ ఫర్ హర్ పేరిట పరుగు నిర్వహించనున్న కార్యక్రమానికి సంబందించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9వ తేదీన రన్‌ఫర్ హర్ కార్యక్రమాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభిస్తారని తెలిపారు. ఈ రన్‌కు సంబందించిన బ్రోచర్, టీషర్టు, మెడల్స్‌ను ఆవిష్కరించారు. ఇందులో 3కె, 5కె, 10కె విభాగంలో ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గంలోని నాలెడ్జీ సిటీ పార్కు వద్ద పరుగును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 200 మందికి పైగా వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మహిళలు, పురుషులు, చిన్నారులు పాల్గొననున్నట్టు తెలిపారు.
డబుల్స్ డైవ్ చాలెంజ్‌కు పదేళ్లు
సాక్షి, సిటీబ్యూరో: సింక్రోనీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘డబుల్స్ డైవ్ చాలెంజ్’ పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సింక్రోనీ బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. నగరంలోని నోవోటెల్ హెచ్‌ఐసీసీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సింక్రోనీ సంస్థకు చెందిన దాదాపు 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ‘డబుల్స్ డైవ్ ఛాలెంజ్’లో భాగంగా.. ఉద్యోగులు పేద విద్యార్థుల విద్యకు అవసరమైన వనరులను రూపొందించడంతో పాటు వారి సృజనాత్మకతకు సహకారం అందిస్తారని సింక్రోనీలో ఇ–చాట్ వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ రీజినల్ ఎంగేజ్‌మెంట్ హబ్ లీడర్ రాజ్ కోలా తెలిపారు. యూ అండ్ ఐ ట్రస్ట్ ప్రయత్నంలో భాగంగా హ్యాండ్‌మేడ్ బుక్‌మార్క్‌లు, ఆకర్షణీయమైన పద శోధన మెటీరియల్స్‌తో పాటు విజ్ఞాన అంశాలను పెంపొందించే చాట్‌బోర్డులు, పుస్తకాలను అందిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తామని, ఇందులో సీపీఆర్, ప్రథమ చికిత్స శిక్షణ తదితర అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక జట్టుగా పదేళ్ల పాటు కృషి చేయడం అభినందనీయమని వివరించారు.


మహిళామణుల ఆరోగ్యం కోసం..
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి, జలమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. వంద మందికిపైగా మహిళా ఉద్యోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు వీరికి బీపీ, షుగర్, ఈసీజీ, కంటి చూపు, దంత పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యురాలు డా.ఎం.మాధవి, ఫైనాన్స్ సీజీఎం కేదారేశ్వరి, జలమండలి ఉమెన్స్ మినిస్టీరియల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు శైలజ, జనరల్ సెక్రటరీ బిల్కిస్ భాను తదితరులు పాల్గొన్నారు.
ఆర్ట్ ఫర్ హోప్
సామాజిక మార్పు కోసం కళను సాధనంగా మార్చాలనే సందేశంతో హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ‘ఆర్ట్ ఫర్ హోప్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా 50 మంది ప్రతిభావంతులైన కళాకారులను ఎంపిక చేస్తున్నామని, వీరికి రూ.60 లక్షల మొత్తం గ్రాంట్‌గా అందిస్తున్నామన్నారు. ఎంపికైన
చిత్రకారుల కోసం దేశ రాజధానిలో భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment