బరువెక్కుతున్న ఆంధ్రప్రదేశ్!
► రాష్ట్రంలో అధిక బరువున్న వారు 33% పైనే.. తెలంగాణలో 28% మంది
► పట్టణీకరణ, వ్యాయామంపై అవగాహన లేమి కారణాలు
► జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బరువెక్కుతోంది. దేశంలోనే ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. వయసు, ఎత్తును బట్టి చూస్తే ఉండాల్సిన బరువు కంటే 33 శాతం మంది అధికంగా ఉన్నట్టు తేలింది. అధిక బరువును దాటి చాలామంది ఊబకాయంలోకి కూడా వచ్చేశారు. గతంలో శరీరానికి మించి బరువున్న వారు పట్టణాలకే పరిమితమయ్యేవారు. పెరుగుతున్న పట్టణీకరణ, ఆహారపు అలవాట్లతో ఈ సమస్య పట్టణాలకు ఎగబాకింది. ఉండాల్సిన దానికంటే కాస్త తక్కువైతే ఫర్వాలేదుగానీ, ఎక్కువైతే చాలా సమస్యలుంటాయనేది వైద్య నిపుణుల అభిప్రాయం.
ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ జరిపిన సర్వేలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ మంది అధిక బరువుతో ఉన్నారని తేలింది. రెండో స్థానంలో తెలంగాణ ఉన్నట్టు తేల్చింది. ఏపీలో పురుషులు, మహిళలు ఇరువురిలోనూ ఇదే పరిస్థితి. ఇది క్రమంగా పెరుగుతోందని కూడా సర్వే వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఆరు రెట్లు బరువులో గ్రోత్ రేటు పెరిగింది.
బిహార్‌లో చాలా తక్కువ
దేశంలో బరువు అధికంగా ఉన్న వారిలో బిహార్ చివరి స్థానంలో ఉంది. బిహార్‌లో బాడీ మాస్ ఇండెక్స్ (బరువును కిలోలతో కొలిచి, ఎత్తును మీటర్లతో లెక్కించి బరువును ఎత్తుతో భాగించడం) కంటే మించి బరువు ఉన్న మహిళల శాతం కేవలం 4.6 మాత్రమే. అదే ఆంధ్రప్రదేశ్‌లో 33.2 శాతం ఉండటం గమనార్హం. ఇక బిహార్‌లో పురుషుల్లో అధిక బరువున్న వారు 6.3 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 33.5 శాతం మంది. తెలంగాణలో 28 శాతం మంది శరీరానికి మించి బరువు అధికంగా ఉన్నారు.
బాడీ మాస్ ఇండెక్స్‌ను బట్టే కొలతలు
బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనిషి బరువును, శరీరం కొలతల ఆధారంగా కొలుస్తారు. బరువును కిలోలతో కొలిచి, ఎత్తును మీటర్లతో లెక్కించి బరువులోని కిలోలను ఎత్తులో వచ్చిన మీటర్లతో భాగిస్తే వచ్చేదే బాడీ మాస్ ఇండెక్స్. సాధారణ బాడీ మాస్ ఇండెక్స్ అంటే 18.5 నుంచి 24.9 వరకూ ఉండాలి. 25 నుంచి 29.9 ఉంటే అధిక బరువు కలిగి ఉన్నట్టు లెక్క. బాడీ మాస్ ఇండెక్స్‌ను బట్టి బరువు 30 దాటితే మాత్రం ఇది ఒబెసిటీ.
కొన్ని రాష్ట్రాల్లో అధిక బరువు ఉన్న వారు (శాతంలో)
రాష్ట్రం స్త్రీలు పురుషులు
ఆంధ్రప్రదేశ్ 33.2 33.5
తెలంగాణ 28.1 24.2
తమిళనాడు 20.9 14.5
కర్ణాటక 15.3 10.9
పశ్చిమబెంగాల్ 11.4 5.5
బిహార్ 4.6 6.3
మధ్యప్రదేశ్ 7.6 4.3
రకరకాల కారణాలు
♦ వ్యాయామంపై అవగాహన లేకపోవడం, వాతావరణం, జీవనశైలిలో వచ్చిన మార్పులు
♦ వరి అన్నం ఎక్కువ తీసుకోవడం. దీనివల్ల కార్బోహైడ్రేట్స్ పెరుగుతాయి
♦ ఓ మోస్తరు టౌన్లకూ పట్టణీకరణ వ్యాపించి ఆహారపు అలవాట్లలో పెను మార్పులు రావడం
♦ పల్లెలకూ జంక్‌ఫుడ్ విస్తరించడం.. దాని ప్రభావం చిన్నారుల్లోనూ కనిపించడం
♦ సమతుల పోషకాహారం తీసుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలని కర్నూలు ప్రభుత్వ వైద్యశాల సీనియర్ జనరల్ ఫిజీషియన్ డా.కె.విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు.