![ఒత్తిడితో చిత్తు..](/styles/webp/s3/article_images/2017/09/3/81431807489_625x300.jpg.webp?itok=Vn48_sb_)
ఒత్తిడితో చిత్తు..
టెన్షన్‌లో గ్రేటర్ యువత
40 శాతం మందిలో హైబీపీ
నేడు ప్రపంచ హైపర్ టెన్షన్ డే
సిటీబ్యూరో: ఉరుకుల పరుగుల జీవితం..మారిన ఆహారపు అలవాట్లు.. అధిక బరువు..పని ఒత్తిడి.. కాలుష్యం..వెరసి మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్రేటర్‌లో 40 శాతం మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల వెల్లడించింది. సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో కన్పించే హైపర్ టెన్షన్ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్లకే బయపడుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోకపోతే గుండె, మూత్రపిండాలు, మెదడు వ ంటి కీలక అవయవాల పనితీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నేడు(ఆదివారం)వరల్డ్ హైపర్‌టెన్షన్ డే!
మారిన జీవన శైలితోనే..
ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదుపనీయడం లేదు. కూర్చున్న చోట నుంచి అన్ని పనులు చకచక పూర్తి చేసే అవకాశం వచ్చింది. సెల్‌ఫోన్ సంభాషణలు, ఇంటర్నెట్ చాటింగ్‌లు మనిషి జీవనశైలిని పూర్తిగా మార్చేశాయి. హోటళ్లలో రెడీమేడ్‌గా దొరికే బిర్యానీలు, పిజ్జాలు, బర్గలు, మద్యం కూడా అధిక బరువుకు కారణం అవుతున్నాయి. గ్రేటర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న స్థూలకాయానికి ఇదే కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మధ్య వయస్కులతో పోలిస్తే...యువకుల్లోనే ఈ సమస్య ఎక్కువ ఉంది. ఒత్తిడికి గురయ్యే వారు రెండు రకాలు. టైప్ ‘ఏ’ కోపంగా ఉండేవారు. టైప్ ‘బి’ తమలోని భావాలను చెప్పకుండా తక్కువ మాట్లాడే వారు. వీరిలో టైప్ ‘ఏ’ వారికే ఎక్కువ రిస్క్ ఉంటుంది.
అధిక రక్తపోటుతో హృద్రోగ సమస్యలు..
95 శాతం హైపర్ టెన్షన్‌కు మారిన జీవనశైలే కారణం. కేవలం ఐదు శాత ం మందిలో జన్యుపరంగా సంక్రమిస్తుంది. తరచు తల నొప్పి , కళ్లు బైర్లు కమ్మడం..ఛాతీ గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. చీటికిమాటికి చికాకు, పట్టలేని కోపం ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరూ విధిగా బీపీ చెకప్ చేయించుకోవాలి.ఆహారంలో ఉప్పు, పచ్చళ్ల వాడకాన్ని తగ్గించాలి. పప్పు, కాయకూరలు తీసుకోవాలి.
- డాక్టర్ సి.వెంకట ఎస్. రామ్, అపోలో ఆస్పత్రి
ఇలా అధిగమించవచ్చు..
ఒత్తిడికి లోనైనప్పుడు నిశబ్దంగా ఉన్న గదిలో కూర్చుని కళ్లుమూసుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని వదులుతుండాలి. పగటి కలలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపే వారిలో మానసిక ఒత్తిడి చాలా తక్కువ. 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఆటలకు కొంత సమయం కేటాయించాలి.
- డాక్టర్ ప్రవీణ్ కొప్పుల,
జనరల్ ఫిజిషియన్, గ్లోబల్ ఆస్పత్రి