డయాబెటిస్ ఉన్నా... | Importance of glycemic index in diabetes. | Sakshi
Sakshi News home page

డయాబెటిస్ ఉన్నా...

Published Sat, Sep 24 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

డయాబెటిస్ ఉన్నా...

డయాబెటిస్ ఉన్నా...

స్థూలకాయులకూ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మామిడిపండు పట్ల చాలానే ఆంక్షలు ఉన్నాయి. ఇది వారికి అంత మంచిది కాదని అందరూ అంటుంటారు. అయితే ఇది అపోహ మాత్రమేననీ, టైప్-2 డయాబెటిస్‌ను మామిడి సమర్థంగా నియంత్రిస్తుందని అంటున్నారు పరిశోధకులు. కొవ్వులను తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థలో ఏర్పడే కొన్ని బ్యాక్టీరియాను ఈ పండు నివారిస్తుందని పేర్కొంటున్నారు ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. ఎలుకలపై నిర్వహించిన పరీక్షల్లో ఇది తెలిసిందంటూ తమ పరిశోధనల వివరాలను వెల్లడించారు. దాదాపు 60 ఎలుకలపై 12 వారాలపాటు ఈ అధ్యయనం నిర్వహించారు.

అవి తీసుకునే ఆహారంలోని క్యాలరీలలో 10 శాతం జంతువుల కొవ్వునుంచి, 60 శాతం ఆహారాన్ని ఇతర కొవ్వుల నుంచి, మరో 10 శాతం మామిడి నుంచి లభ్యమయ్యేలా చూశారు. మిగతా క్యాలరీలు ఇతర ఆహారం నుంచి లభ్యమయ్యేలా చేశారు. ఈ తరహా ఆహారాన్ని ఇచ్చే ముందూ... ఆ తర్వాతా మామూలుగా ఆహారాన్ని ఇచ్చారు. ఈ మూడు సమయాల్లోనూ వచ్చిన ఫలితాలను విశ్లేషించారు. మామిడిని ఆహారంగా ఇచ్చే సమయంలో జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా తీరుతెన్నులను పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి.

మామిడి స్థూలకాయాన్ని నివారించేదిగా (యాంటీ-ఒబెసోజెనిక్), చక్కెరను తగ్గించేదిగా (హైపోగ్లైసీమిక్), వ్యాధి నిరోధకతను పెంచేందుకు తోడ్పడేదిగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంటున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ప్రొఫెసర్ ఎడ్రాలిన్ ల్యూకాస్. ‘‘జంతువుల్లో నిర్వహించిన అనేక పరిశోధనల ద్వారా మామిడిపండు జీర్ణవ్యవస్థలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పాళ్లను క్రమబద్ధంగా ఉంచుతుందని తేలింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇందులోని పీచుపదార్థం పేగులనూ, జీర్ణవ్యవస్థనూ మరింత ఆరోగ్యంగా ఉంచుతుందని వివరిస్తున్నారాయన. ఈ అధ్యయనం పూర్తి ఫలితాలూ, మానవుల్లోనూ అదే ప్రభావం ఉంటుందా అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు, స్థూలకాయంతో బాధపడేవారు మామిడిని పూర్తిగా దూరం చేసుకోనవసరం లేదని, పరిమిత మోతాదుల్లో తీసుకోచ్చనే మంచి విషయం త్వరలో సాధికారికంగా తెలియనుందనే సంకేతాలను ఈ పరిశోధన వెల్లడిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement