అయోధ్య రాముడు! దక్కన్ రాముడు !! | Ayodhya, Rama! He Deccan !! | Sakshi
Sakshi News home page

అయోధ్య రాముడు! దక్కన్ రాముడు !!

Published Tue, Jan 13 2015 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

అయోధ్య రాముడు! దక్కన్ రాముడు !!

అయోధ్య రాముడు! దక్కన్ రాముడు !!

అయోధ్య రాముడు వేరు ! దక్కన్ రాముళ్లు వేరు !! సీత కాళ్లపారాణి ఆరకముందే, నూనుగు మీసాల రాముడు అంతఃపుర కారణాలతో అడవిబాట పట్టాడు. ఒక మహాయుద్ధం చేసి సీతా సమేతుడై పట్టాభిషిక్తుడు అయ్యాడో లేదో వియోగ రాముడయ్యాడు ! రామాయణంలో భద్రాద్రి ప్రత్యేకమైనది. పద్నాలుగేళ్ల వనవాసకాలంలో పదేళ్లను పది నిమిషాలుగా సీతారాములు ఇక్కడ ఆహ్లాదంగా గడిపారు.
 
ముత్యాల బాట..

ఇతిహాస కాలానంతరం, చారిత్రక భద్రాచలం తహసీల్దార్ గోపన్న (రామదాసు)కు ఇక్కడ గుడి కట్టాలనిపించింది. కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాకు జమకట్టాల్సిన పన్నులతో ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత జైలుపాలైన రామదాసు రాములోరిపై  భక్తిపూర్వకంగా నిందాస్తుతి రాశాడు. రామలక్ష్మణులు గోల్కొండకు రాక తప్పలేదు. తానీషాను ‘నిద్ర’లేపి తమ దాసుడు కట్టాల్సిన డబ్బులను అణాపైసలతో సహా చెల్లించి రసీదు సైతం పొందారు. తానీషా పశ్చాత్తప్తుడై రామదాసును విడుదల చేశాడని గాథ ! ఏటా సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపుతానన్న తానీషా మాట నేటికీ అమలవుతోంది. కూచిపూడి భాగవతులకు తానీషా అగ్రహారాన్నివ్వడమూ మరొక సందర్భంలో స్మరణీయమే ! మరొక దక్కనీ రాముడికి సంబంధించిన చారిత్రక డాక్యుమెంట్లను తిప్పి చూద్దాం.
 
అసఫ్‌జాహీలు-కాయస్థులు

ఈ అపురూపమైన దక్కనీ చిత్రాన్ని తిలకించండి. 19వ శతాబ్దపు అజ్ఞాత చిత్రకారుడు కాగితంపై వాటర్ కలర్స్‌తో, బంగారుపూతతో చిత్రించాడు. ఇందులో ప్రస్తుత కథానాయకుడు మూడో నిజాం నవాబ్ సికిందర్ జా ఉద్యానవనంలో సుమసౌరభాన్ని ఆస్వాదిస్తూ విరాజమానుడై ఉన్నాడు. ఆయన ఎదురుగా నాలుగు సామాజిక సమూహాలకు ప్రతీకలైన నలుగురు ప్రధానులు.. ప్రభువు ఆనతిని ఆలకిస్తున్నారు. ఇంతకీ సికిందర్ జా ఎవరు ? ఔరంగజేబ్ పతనానంతరం అరాచకం తాండవించింది. కత్తి కింద ఒకటిగా మసలిన ప్రాంతీయ అస్తిత్వాలు తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నాయి. ఆ నేపథ్యంలో మహమ్మద్ షా (1719-48) ధోరణులు నచ్చక పాలకవర్గంలోని ప్రముఖుడు నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ వచ్చేశాడు. ఏడాదిలో (1724) పాత దక్కన్‌ను ఏకం చేశాడు. ఆయన ప్రత్యేకతను దక్కనీయులు, ఢిల్లీ పాలకులు సైతం గుర్తించి ‘అసఫ్ జాహీ’ బిరుదునిచ్చి గుర్తించారు ! ఆయన వెంట ఢిల్లీ నుంచి కాయస్థులు దక్కన్ వచ్చారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే ఢిల్లీ ఏలికల వైపరీత్యాలు చోటు చేసుకోకుండా ప్రజలకూ ప్రభుతకు వారధిగా వ్యవహరించారు. వివిధ పదవుల్లో, బాధ్యతల్లో రాజ ప్రముఖులుగా ఎదిగారు. ఆ క్రమంలో రాజపరివాపు జీతభత్యాలను చెల్లించే అధికారి భవానీ ప్రసాద్‌కు మూడో నిజాం ‘రాజా’ బిరుదునిచ్చారు. ఆ సందర్భంగా రామాలయం నిర్మించాలనుకున్నారు భవానీ ప్రసాద్. ప్రస్తుత నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాజేంద్రనగర్‌కు వెళ్లే దారిలో అత్తాపూర్ సమీపంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన రాముడి విగ్రహం వెనుక ఒక కథ ఉంది.
 
గద్వాల తర్వాత హైదరాబాదే..
 
పాత హైదరాబాద్ స్టేట్‌లోని రాయచూర్ జిల్లాలో నిజాంలకు అనుబంధంగా గద్వాల సంస్థానం ఉండేది. 1384 చ.కి.మీ విస్తీర్ణంలో గద్వాల పట్టణమూ, 214 గ్రామాల సంస్థానానికి రాజా సోమభూపాలుడు పాలకుడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో భాగమైన ఈ సంస్థానం హైదరాబాద్ స్టేట్ కంటే ముందే అస్తిత్వంలో ఉండేది. రాజా సోమభూపాలుడు తన పరివారం కోసం ఒక రామాలయాన్ని నిర్మించాలనుకున్నాడు. రాముడి శిల్పం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు ఒక కల వచ్చింది. ‘సమీపంలోని బావిలో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయంలో ప్రతిష్ఠించవలసినది’ అని రాముడు చెప్పాడట. అదే సమయంలో ‘రాజా’ భవానీ ప్రసాద్‌కూ సోమభూపాలుడికి రాముడు కలలో చెప్పిన వైనం కలగా వచ్చిందట. బావిలోని విగ్రహాన్ని గద్వాలాధీశుడు ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో ముందుగా శిల్పులకు పురమాయించగా రూపొందిన రాముడి విగ్రహం తనకు బహుమతిగా ఇవ్వవలసిందిగా కోరాడట భవానీ ప్రసాద్. సోమభూపాలుడు సంతోషంగా అంగీకరించి బహూకరించాడట.
 
ఫర్కుందా బునియాద్..

ఆలయ నిర్మాణం పూర్తయ్యాక, సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా భవానీప్రసాద్ మూడో నిజాం సికిందర్ జాను ఆహ్వానించాడు. 1812లో ఈ అపురూప దృశ్యాన్ని ఆబాలగోపాలం వీక్షించింది ! ఆలయ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న సికిందర్ జా మడులూ-మాన్యాలు ఆలయానికి రాశాడు. అర్చకులకు, సిబ్బందికి జీతభత్యాలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వమన్నాడు. ఏటా రామనవమి రోజు ప్రభుత్వం తరఫున ‘యాత్ర’ నిర్వహించాలని ఆదేశాలిచ్చాడు. 1816వ సంవత్సరపు ‘దఫ్తర్-ఎ-ఇస్తిఫా’ రికార్డుల ప్రకారం అర్చకులకు రోజుకు రెండు రూపాయల గ్రాంట్ మంజూరైంది. మూడో నిజాం ఉత్తర్వుల్లో హైదరాబాద్ పేరును ‘ఫర్కుందా బునియాద్’ అని పేర్కొన్నారు. భాగ్యనగర్ అనే పేరుకు ఫర్షియా పదం ‘ఫర్కుందా బునియాద్’ సమానార్థకం కావడం విశేషం !
 
దక్కన్ ముస్లింలు విగ్రహ ప్రతిష్ఠాపకులు

రామ్‌బాగ్ ఆలయంగా స్థానికులు వ్యవహరించే ఈ ఆలయం ప్రతిష్ఠాపనలో హిందూ-ముస్లింలు సాదరంగా పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనను స్వయంగా ముస్లిం పాలకుడు చేశాడు. ముస్లింలంటే విగ్రహ విధ్వంసుకులనే భావనలను పూర్వపక్షం చేశారు. మనవత్వాన్ని పరిమళించే ఈ మతసామరస్యానికి బీజాలు నగరానికి పునాదులు వేసిన కులీ కుతుబ్‌షాలో ఉన్నాయి. ఒక కవితలో అంటాడు..
 
కాఫిర్లు లేరు ముస్లింలు లేరు.. అన్ని మతాలు.. ప్రేమ కుదురులోనే పుష్పిస్తాయి.. హైదరాబాద్ తెహ్‌జీబ్ పరిమళాలను ఆస్వాదించేంతగా కాలుష్య ప్రపంచం ‘అభివృద్ధి’ చెందాలని ఆశిద్దాం!
 
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement