∙చిన్ని కృష్ణుడిని తీర్చిదిద్దుతూ...
ఎంబిఏ చేసిన అరుణ్ యోగిరాజ్ కొన్నాళ్లు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు.కాని అనువంశికంగా వస్తున్న కళ అతనిలో ఉంది.నా చేతులున్నది శిల్పాలు చెక్కడానికిగాని కీబోర్డు నొక్కడానికి కాదని ఉద్యోగం మానేశాడు.2008 నుంచి అతను చేస్తున్న సాధన ఇవాళ దేశంలోనే గొప్ప శిల్పిగా మార్చింది. అంతే కాదు ‘బాల రాముడి’ విగ్రహాన్ని చెక్కి అయోధ్య ప్రతిష్ఠాపన వరకూ తీసుకెళ్లింది.తమలో ఏ ప్రతిభ ఉందో యువతా, తమ పిల్లల్లో ఏ నైపుణ్యం ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలనడానికి ఉదాహరణ అరుణ్.
జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో ఒక్కో విశేషం తెలుస్తూ వస్తోంది.ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహాల్లో ‘బాల రాముడి’ విగ్రహం సమర్పించే గొప్ప అవకాశం మైసూరుకు చెందిన 40 ఏళ్ల శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు దక్కింది. కర్ణాటకకు చెందిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలియచేసి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
అయోధ్య రామమందిరంలో ‘బాల రాముడి’ విగ్రహం ప్రతిష్ట కోసం శిల్పం తయారు చేయమని దేశంలో ముగ్గురు శిల్పులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్‌క్షేత్ర ట్రస్ట్ బాధ్యత అప్పజెప్పింది. వారిలో ఒకరు అరుణ్ యోగిరాజ్. ఇతని కుటుంబం ఐదు తరాలుగా శిల్ప కళలో పేరు గడించింది. అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవణ్ణ శిల్పులుగా కర్ణాటకలో పేరు గడించారు.
అయితే అరుణ్ ఈ కళను నేర్చుకున్నా అందరిలాగే కార్పొరేట్ ఉద్యోగం వైపు దృష్టి నిలిపాడు. కాని రక్తంలో ఉన్న శిల్పకళే మళ్లీ అతణ్ణి తనవైపు లాక్కుంది. 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తున్న అరుణ్ ఇప్పటికే అనేకచోట్ల శిల్పాలు స్థాపించి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అరుణ్ తయారు చేసిన శిల్పాల్లో కేదార్‌నాథ్‌లోని ఆది శంకరాచార్య విగ్రహంతో మొదలు మైసూరులోని ఆర్.కె.లక్ష్మణ్ విగ్రహం వరకూ ఉన్నాయి. మైసూర్ రైల్వే స్టేషన్‌లో ‘లైఫ్ ఈజ్ ఏ జర్నీ’ పేరుతో ఒక కుటుంబం లగేజ్‌తో ఉన్న శిల్పాలు ప్రతిష్టించి అందరి దృష్టినీ ఆకర్షించాడు అరుణ్. అలా రాముడి విగ్రహం చెక్కే అవకాశం ΄÷ందే వరకూ ఎదిగాడు.
51 అంగుళాల విగ్రహం
అరుణ్ చెక్కిన బాల రాముడి విగ్రహం శిరస్సు నుంచి పాదాల వరకు 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. అరుణ్ భార్య విజేత వివరాలు తెలియచేస్తూ ‘అరుణ్‌కి ఈ బాధ్యత అప్పజెప్పాక శిల్ప ఆకృతి గురించి అతడు ఎంతో పరిశోధించాల్సి వచ్చింది. దానికి కారణం బాల రాముడి విగ్రహం ఇలా ఉంటుందనడానికి ఎలాంటి రిఫరెన్స్ లేక΄ోవడమే. అందుకని అరుణ్ పురాణాల అధ్యయనంతో పాటు రాముడి వేషం కట్టిన దాదాపు 2000 మంది బాలల ఫొటోలు పరిశీలించాడు’ అని తెలిపింది.
ఈ విగ్రహం కోసం ట్రస్ట్ శిలను అందించింది అరుణ్‌కు. ‘మామూలు గ్రానైట్ కంటే ఈ శిల దృఢంగా ఉంది. చెక్కడం సవాలుగా మారింది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశం ఎంత విలువైనదో గ్రహించిన అరుణ్ రేయింబవళ్లు శిల్పాన్ని చెక్కి తన బాధ్యత నిర్వర్తించాడు’ అని తెలిపింది విజేత.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తల్లి ఆనందం
కుమారుడు చెక్కిన శిల్పం రామ మందిరంలోప్రాణప్రతిష్ఠ చేసుకోనుందన్న వార్త విన్న అరుణ్ తల్లి ఆనందంతో తబ్బిబ్బవుతోంది. మరణించిన భర్తను తలచుకొని ఉద్వేగపడుతోంది. ‘అరుణ్ వాళ్ల నాన్న దగ్గరే శిల్పం చెక్కడం నేర్చుకున్నాడు. వాళ్ల నాన్న పేరు నిలబెడుతున్నాడు’ అంది.
తల్లిదండ్రులు తెలుసుకోవాలి
తల్లిదండ్రులు పిల్లల బాగు కోరుతారు. అయితే అన్నీ తాము ఆదేశించినట్టుగా పిల్లలు నడుచుకోవాలన్న «ధోరణి కూడా సరి కాదు. పిల్లలు తమకు ఇష్టమైన చదువులు చదవాలనుకుంటే ఎందుకు ఆ కోరిక కోరుతున్నారో పరిశీలించాలి. కళాత్మక నైపుణ్యాలుండి ఆ వైపు శిక్షణ తీసుకుంటామంటే వాటి బాగోగుల గురించి కనీసం ఆలోచించాలి. కఠినమైన చదువులకు అందరు పిల్లలూ పనికి రారు. రాని చదువును తప్పక చదవాల్సిందేనని హాస్టళ్లల్లో వేసి బాధించి ఇవాళ చూస్తున్న కొన్ని దుర్ఘటనలకు కారణం కారాదు. ఐశ్వర్యంతో జీవించడానికి కొన్నే మార్గాలు ఉండొచ్చు. కాని ఆనందంగా జీవించడానికి లక్షమార్గాలు. పిల్లల ఆనందమయ జీవితం కోసం చిన్నారుల ఆలోచనలను కూడా వినక తప్పదు.
ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే..
Comments
Please login to add a commentAdd a comment